2, ఆగస్టు 2021, సోమవారం

సాత్వికకర్త

 చేసే పని మీద ఆసక్తి, సంగము లేనివాడు, ఈ పని నేను చేస్తున్నాను అనే అహంకారము లేని వాడు, ఏ పని అయినా ధైర్యము, ఉత్సాహముతో చేసేవాడు. తాను చేసిన కార్యము సిద్ధించినా, సిద్ధించకపోయినా ఎటువంటి వికారము చెందని వాడు, ఇటువంటి కర్తను సాత్వికకర్త అని చెప్పబడతాడు.


చేసేది సాత్త్విక కర్మ కావచ్చు, కాని ఆ కర్మ చేసే కర్త కూడా సాత్త్వికుడు అయి ఉండాలి. లేకపోతే అది సాత్త్విక కర్మ అనిపించుకోదు. ఉదాహరణకు శరీరంతో సాత్త్విక కర్మలు చేస్తూ, మనసులో రాజస భావాలు, తామస భావాలు కలిగి ఉంటే, దాని వలన లాభం ఏమిటి.

   కర్మలు సాత్విక, రాజసిక, తామసిక కర్మలుగా ఉన్నట్టే, ఎవరు ఏపని చేసినా, ఆ పని చేసే కర్త కూడా మూడు విధాలుగా ఉంటాడు. సాత్విక కర్త, రాజసికకర్త, తామసిక కర్త. ఇప్పుడు సాత్విక కర్త అంటే ఎవరో తెలుసుకుందాము. ఎవరు ఏ కర్మ చేసినా దానిని నుండి ఫలితం ఆశించి చేయకూడదు. ఆ కర్మకు పూర్తిగా అంకితం అయి పోకూడదు. ఆ కర్మ అలవాటుగా మారకూడదు. ఆ కర్మచేయడం తన విద్యుక్త ధర్మం కాబట్టి ఆ కర్మ చేస్తున్నాను అని అనుకోవాలి. అప్పుడే విహిత కర్మలు చేయగలుగుతాడు. ఆ కర్మ నేనే చేస్తున్నాను, నేను కాబట్టి ఈ పని చేయగలుగుతున్నాను, నేను చేసాను కాబట్టి ఇంత మంచి ఫలితం వచ్చింది అనే అహంకారము కరత్వభావన ఉండకూడదు. ఇటువంటి వాడు, ఏ కర్మచేసినా ధైర్యంగా పట్టుదలతో చేస్తాడు. ఏపనిలో అయినా ముందుకు దూసుకుపోతాడు. చేస్తానో చేయలేనేమో అనే అధైర్యం మనసులోకి రానీయడు. కొన్ని కార్యాలు ఫలిస్తాయి. మరి కొన్ని ఫలించవు. చేసిన అన్ని కర్మలు ఫలించాలని లేదు. దేశ,కాల,విధినిర్ణయాన్ని బట్టి ఫలితాలు వస్తుంటాయి. కాబట్టి తాను చేసిన కర్మ ఫలించినపుడు ఎగిరి గంతేయడం, ఫలించనపుడు కుంగిపోవడం వంటి వికారములకు సాత్త్విక కర్త లోనుకాడు. తాను చేసినపని ఫలించినా, ఫలించకపోయినా, చలించడు. నిర్వికారంగా సంతోషంగా ఉంటాడు. ఇటువంటి వారిని సాత్వికకర్తలు అని అంటారు.


కాబట్టి ఎవరు ఏ కర్మ చేసినా దానితో అనుబంధం పెంచుకోకపోవడం, అహంభావము, కర్తృత్వ భావన లేకుండ చేయడం, ధైర్యంగా చేయడం, ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా చలించకుండా ఉండటం, నిరుత్సాహపడకకుండా ఉండటం, ఆఖరుగా ఏ ఫలితం వచ్చినా ఆనందంతో స్వీకరించడం. వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పించడం సాత్త్విక కర్త చేసే పనులు.


   🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩

కామెంట్‌లు లేవు: