2, ఆగస్టు 2021, సోమవారం

ప్రకృతి పరిరక్షణ

 " ప్రకృతి పరిరక్షణ విశ్వ మానవాళి బాధ్యత " సృష్టాదిగ విశాల విశ్వంలో ప్రత్యేకతనొందిన ప్రకృతి వైశిష్ట్యం ! సమస్త జీవజాలంలో మానవాళి సృష్టి, " బ్రహ్మ దేవుని " మహోన్నత దూర దృష్టి ! వసుధపై వసించెడి చరాచర జీవరాసులలో మానవాళి శక్తి అత్యున్నతం ! రానున్న కాలానికి అనువైన రీతిలో ఈ భువిపై వలసిన వనరుల సమృద్ధికై, బ్రహ్మ చేసిన దివ్య భావనాత్మకత సమ్మళితమై యున్న అద్భుత రచన ! విశ్వ మానవాళి తమదైన శైలిలో సకల జీవ ప్రశాంత మనుగడకు చేయాల్సిన కృషి, బ్రహ్మ రచనలో అంతర్భాగం ! బ్రహ్మ యొక్క సుదూర యోచనలో విశ్వ మానవాళి, తమ నిత్య జీవన పథంలో స్నేహ మాధుర్యానికి ప్రతీకయై నిలవాలన్న సత్య చైతన్య దృక్పథం ! తల్లి ఒడిలో ప్రప్రథమ జీవన పాఠం నేర్చే మానవాళి, ప్రకృతి ఆసరాతో తమలో సన్మైత్రీ యోచన పరిపుష్టమై భావితరాలకు మార్గగామి కావాలన్న బ్రహ్మదేవుని సదాలోచన ! విద్వేషాలు కానరాని, వైషమ్యాలు లేని నిత్య సమున్నత సమైక్య స్నేహ దివ్య జీవన గమనం వారి నిత్య సత్య ప్రశాంత జీవన పథం కావాలన్న బ్రహ్మ దృక్పథం ! ప్రకృతి ప్రసాదించే అత్యంత విలువైన ఓషధుల పరిరక్షణ, సక్రమ వినియోగం విశ్వ మానవాళి కనీస కర్తవ్యం ! " బ్రతుకు, బ్రతకనివ్వు అనే జీవకారుణ్యతా వికాసం ", బ్రహ్మ సృష్టిలో అంతర్లీన సహృదయ, సుహృద్భావ చైతన్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం ! రచన : గుళ్లపల్లి ఆంజనేయులు

కామెంట్‌లు లేవు: