ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థాన కవులందరికీ ఒక పరీక్ష పెట్టాడు.
" మీరు ఐదు అక్షరాల పదం ఒకటి రూపొందించాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో పుండాలి. ఆ ఒక్కొక్క అక్షరానికి ఆ భాషలో ఏమి అర్థమో మిగిలిన నాలుగు భాషల్లో కూడా అదే అర్థం వుండాలి.
అంతేకాక ఆ ఐదక్షరాల పదంకూడాvఅర్థవంతంగా వుండాలి. దీనికి సమాధానం రేపు సభాముఖంగా నాకు చెప్పండి."
కవులలో కలకలం బయలుదేరింది.
విచిత్రమైన సమస్య అనుకుని ఎవరింటికి వారు బయల్దేరి వెళ్లారు.
మన తెనాలి రామకృష్ణకు నిద్రపట్టడం లేదు. తన బావమరిది ఇంటికెళ్ళి అక్కడ పశువుల పాకలో మంచంవేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు.
అర్థరాత్రి అయినది. ఆ సమయానికి పశువులశాలలో ఒక ఆవు దూడను ప్రసవించినది. వెంటనే రామ కృష్ణుడు " బావా! బావా! ఆవు ఈనింది" అని కేకలు వేశాడు. నిద్రమత్తులో నున్న బావమరిది ఆ మాటలు విని " ఏ ఆవ్ రా బా వా " అని అడిగాడు. రామకృష్ణకు వెంటనే ఏదో స్ఫురించింది. ఎగిరి గంతేసాడు.
మరునాడు మహారాజు సభ తీర్చాడు.
"అందరూ సిద్ధంగావున్నారా" రాయలవారి మాట విన్న కవులు ఏమీ మాట్లాడలేదు.
కాని రామకృష్ణుడు మాత్రం లేచి " నేను సిద్ధమే" అన్నాడు.
మహారాజు: ఏదీ ఆ పదం చెప్పు!
రామకృష్ణుడు: "ఏ ఆవ్ రా బా వా "
'ఏ' అనగా మరాఠీలో 'రా' అని అర్థము.*
'ఆవ్ ' అనగా హిందీలో ' రా' అని అర్థము.
'రా' అనగా తెలుగులో 'రా' అనే కదా అర్థము!
'బా' అనగా కన్నడ భాషలో 'రా' అని అర్థము.
' వా' అనగా తమిళంలో 'రా' అని అర్థము.
ఈ అయిదు అక్షరాలూ అయిదు భాషలకు చెందినవి. ఈ అయిదు అక్షరములు కలిసిన పదం " ఏ ఆవ్ రా బా వా" ఇదికూడా అర్థవంతమైన పదమే!
తెనాలి రామకృష్ణుడి వివరణతో మహారాజుకు మహదానందం కలిగింది.
రామకృష్ణునికి భూరి బహుమానాలు లభించాయని వేరే చెప్పాలా !😊😊
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి