సప్త పవిత్రాలు ఏవి?
ఆచార వ్యవహారాలు బాగా తెలిసిన, కర్మలు/అకర్మాలు చేయించే వైదికులు ఉన్న సభలో, ఒక పండితుడు తల్లి తండ్రులు మరణించిన పిదప చేయు పితృ శ్రాద్ధము/కర్మల యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి చెబుతున్నాడు.
“సప్త పవిత్రః అంటే అర్థం ఏమ”ని సభనుద్దేశించి ప్రశ్నించారు మహాస్వామివారు.
ఒక వైదికుడు శాస్త్రం చెప్పిన ఏడు పవిత్ర వస్తువుల గురించి ఇలా చెప్పాడు. “ఆవుపాలు, శివ నిర్మాల్యము లేదా గంగ, తేనె, తెల్లని పట్టు, కుమార్తె కొడుకు, సరైన సమయం(పితృ కార్యం చెయ్యడానికి) మరియు నువ్వులు అని చెబుతారు”
తరువాత పరమాచార్య స్వామివారు దాని గురించి ఇలా వివరణ ఇచ్చారు.
“అందులో ఉన్న ‘సవపర్పతమ్’ అంటే పట్టు పురుగులను చంపి దానినుండి సేకరించిన పట్టుతో తయారుచేసిన వస్త్రం అని అర్థం తీసుకోరాదు. ‘సవం’ అంటే సహజంగా చనిపోయిన పట్టుపురుగు. అంటే అలా సహజంగా చనిపోయిన పట్టుపురుగుల యొక్క దారంతో చేసిన పట్టు పంచె. అందుకే నేటికి కేరళలో శ్రాద్ధ కర్మలకు వచ్చిన వైదికులకు తెల్లని పట్టు పంచెలు ఇస్తారు. తరువాతి పదం ‘దౌహిత్యం’. ‘దౌహిత్రః’ అంటే కుమార్తె కుమారుడు అనే పదం నుండి ఉద్భవించింది. శ్రాద్దంలో కుమార్తె కొడుకు భోజనం చేయాలని తరచుగా చెప్పే అన్వయం. ‘దౌహిత్యం’ అంటే ఖడ్గమృగం కొమ్ముతో తయారుచేసిన పాత్ర. కొమ్ములున్న జంతువులన్నీ రెండేసి కొమ్ములతో ఉంటాయి. కాని ఖడ్గమృగానికి మాత్రం ఒక్క కొమ్ము ఉంటుంది. అందుకే దాన్ని ‘ఏక శృంగి’ అంటారు. దాని భాష్యం ‘దౌహిత్యం ఏకశృంగి పాత్ర విశేషః’ అని ఉంటుంది. అంటే ‘ఒక్క కొమ్ము పాత్ర ఉత్తమమైనది’ అని అర్థం”
పరమాచార్య స్వామివారు ఇటువంటి విషయాలను ఎంతో విపులంగా, సరళంగా విషదపరచేవారు.
--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, శ్రీమఠం విద్వాన్. మహా పెరియవళ్ దరిశన అనుభవంగళ్
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి