*🌹కాశీ ఖండం - 3*
🌈🌈🌈🌈🌈🌈🌈🌈
*అగస్త్య ప్రస్థానం*
అగస్త్య మహర్షి కాశీవిశ్వేశ్వరుని ప్రార్ధించి, భార్య లోపాముద్రతో ఇలా అన్నాడు....
‘’మన పై ఎంత భారాన్ని దేవతలు పెట్టారో చూశావా? ముని వృత్తి లో ఉండే మనం ఎక్కడ? ఈ కార్యభారం ఎక్కడ? పర్వతాల రెక్కలను ఛేదించిన ఇంద్రునికి, ఇది అసాధ్య మైనదా? ఈ వింధ్యాద్రి అతనినే
జయించిందా? కల్ప వృక్షం, కామధేనువు, చింతామణి కలిగిఉన్న దేవేంద్రుడు, ముక్కు మూసుకొని తపస్సు చేసుకొనే ఈ బ్రాహ్మణుడిని, ప్రార్ధించటానికి వచ్చాడు. అన్నిటిని దహించగల శక్తి ఉన్న అగ్ని దేవుడికి, ఈ పని అసాధ్యమైందా? దండం ధరించి ప్రాణులను శాసించే యముడు ఈ పని చేయలేడా ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వేదేవులు ఈ స్వల్ప కార్యాన్ని చేయలేక పోయారా? ఇంత మందికి సాధ్యం కాని వింధ్యాద్రి గర్వాపహరణం, నేను చేయగలనని వారు నమ్మారంటే, ఆశ్చర్యంగా ఉంది’’.
‘’కాశీ క్షేత్రాన్ని గురించి మహాత్ములు చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకానికి వస్తున్నాయి. "కాశీలో నివశించే వారికి, అనేక విఘ్నాలు కలుగుతుంటాయి. అలాంటి విఘ్నమే మనకిప్పుడు వచ్చింది.
విశ్వేశ్వరుడు విముఖంగా ఉన్నప్పుడే వ్యతిరేకంగా ప్రవర్తించాలి. కాశీని వదలుట చేతిలోని మోక్షాన్ని వలటమే. పుణ్యం నశిస్తేనే కాశీ నుండి వెళ్ళాలని పిస్తుంది. ఉత్తమ పురుషార్ధమైన మోక్షం కాశీలోనే లభిస్తుంది. ఇది అతి పుణ్య క్షేత్రమని, శ్రుతులు చెబుతున్నాయి. జాబాలి, అరుణి, వరుణ, పింగళ, నాడీ మధ్య ఉన్న అవిముక్త క్షేత్రం కాశి. వాటి మధ్య ఉన్న సుషుమ్నా నాడియే కాశి. ఇక్కడ ప్రాణం ఉత్క్రమణం జరిగితే, విశ్వనాధుడు మోక్షమిస్తాడు. ఆయనే తారకమంత్రోపదేశం చేస్తాడు. దానితో బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. కాశితో సమానమైన క్షేత్రం, విశ్వేశ్వరునికి సమానమైన దైవం లేవు. ఇలాంటి పుణ్యరాశి
కాశిని, ఇప్పుడు మనం విడిచి పెట్టి వెళ్ళాల్సి వస్తోంది. మనసు స్వాధీనంలో ఉండటం లేదు‘’ అని, మహర్షి దుఃఖాశ్రువులను, ధారాపాతం గా కార్చాడు.
దంపతులిద్దరూ విశ్వేశ్వరుని దర్శించారు. స్వామికి
విన్నవించుకుంటు, ముని....
‘’నువ్వు కాశీ విభుడవు .కనుక నీకు విన్న వించుకోవటానికి వచ్చాను. నేనేమి అపరాధం చేశాను? అన్నపూర్ణా దేవిని వదిలి పెట్టాల్సి వచ్చింది? కాలభైరవా? నువ్వైనా అభయం ఇవ్వవా ?దండ పాణీ ! నువ్వైనా మేము వెళ్ళకుండా చేయలేవా? డుండి వినాయకా! విఘ్నాలకు అదధిరాజువు. నీకు మా మీద ఎందుకు కోపం కలిగింది? పంచ వినాయకులారా! చింతామణి గణపతీ!కపర్దీ ! ఆశా గజాశ్యా !సిద్ధి వినాయకా ! నేనేమీ కాశీ వదిలి వెళ్ళేంత తప్పుచేయలేదు. ఇతరుల తప్పు ఎంచలేదు. పరులకు అపకారం చేయలేదు. త్రికాలాలో గంగా స్నానంచేసి విశ్వేశ్వరుడిని సందర్శిస్తూ, నా జీవితాన్ని చరితార్ధం చేసుకొంటున్నాను. ప్రతి పర్వంలోను, పంచగంగా యాత్ర చేస్తున్నాను. తల్లీ విశాలాక్షీ !భవానీ ! శివ రంజనీ ! నువ్వైనా కనికరించవా? కాశీ పట్టణ దేవత లారా! నేనేమీ నా స్వార్ధం కోసం కాశీని వదిలి పెట్టి వెళ్లటం లేదు. దేవతల అభ్యర్ధన మేరకు, పరోపకారం కోసమే వెడుతున్నాను. పూర్వం దధీచి, తన ఎముకను ఇంద్రుడికి ఇవ్వ లేదా? బలి తన సర్వస్వాన్ని పోగొట్టుకో లేదా?’ ’అని అందరికి విన్న వించుకొంటూ, మునులను, ఆబాల వృధ్ధులను, వృక్ష జంతు కోటికి మ్రొక్కి, అందరికి వీడ్కోలు చెప్పి, ధర్మపత్ని లోపాముద్ర వ్రేలు పట్టుకొని, ‘’పుణ్య రాశి అయిన కాశిని వదిలి పెట్టి వెళ్తున్నాను.‘’ అని కన్నీరు కారుస్తూ.. చప్పట్లు చరుస్తూ... "అయ్యో కాశీ, కాశీ
అని అరుస్తూ.." "శివ, శివ" అని ప్రలాపిస్తూ, కింద పడిపోయాడు మహర్షి. మళ్ళీ కొంచెం స్థిమితపడి, భార్య చేయి ఊతగా తీసుకొని, ‘’నాకు వినాశం దగ్గర పడింది" అని పలవరిస్తూ ముందుకు కదిలాడు.
కొద్ది కాలానికే, ఆకాశ మంత ఎత్తు పెరిగి, సూర్య గమనానికి నిరోధంగా ఉన్న, వింధ్యాద్రి వద్దకు చేరుకొన్నారు దంపతులు.
వింధ్యాద్రి భయంతో, ‘’స్వామీ ! నేను మీ సేవకుడిని. ఏమి ఆజ్ఞ?’’ అని వినయంగా వంగి అడిగాడు. దానికి మహర్షి ‘’వింధ్యరాజా! నువ్వు చాలా ప్రాజ్ఞుడవు. నా శక్తి సామర్ధ్యాలు తెలిసిన వాడివి. నేను దక్షిణదేశానికి వెళ్తున్నాను. తిరిగి వచ్చే దాకా ఇలాగే ఉండు‘’ అని చెప్పాడు. మహర్షి కోపపడనందుకు, సుముఖంగా మాట్లాడి నందుకు, శపించనందుకు వింధ్య పర్వతం సంతోషపడి, అలాగే వినమ్రంగా కిందికి వంగి ఉండిపోయింది. మహర్షి వింధ్యను దాటి వచ్చాడు. సూర్యుడు మళ్ళీ తన గమనాన్ని నిరాటంకంగా కొన సాగించాడు. ’’నేడోరేపో అగస్త్య మహర్షి తిరిగి వస్తాడు" అని ఎదురు చూస్తూ, అలానే ఉండి పోయాడు. వింధ్యరాజు.
అగస్త్యుడు మళ్ళీ తిరిగి రాడు, వింధ్య ఇక పైకి లేవడు అనే సంతృప్తితో సూర్యుడు, మరీ ప్రచండంగా, తన దినయాత్ర సాగించాడు. దుష్టుల సంకల్పాలను, ఇలానే, మహాత్ములు నీరు గార్చుతారని, అందరు అనుకొన్నారు.
అగస్త్యుడు గోదావరి తీరానికి చేరి సంచరిస్తున్నా... ఇంకా మనసులో, కాశి భావం తొలగిపోలేదు. పదే పదే తలుచుకొంటునే ఉన్నాడు. పిచ్చివారి వలె ఇద్దరూ గాలిని చూసి, ‘’కాశీ పట్నం కుశలమేనా ?ఎప్పుడు మళ్ళీ కాశీకి వేడతాము!? అని ప్రశ్నిస్తున్నారు. అంత అవినాభావ సంబంధంతో, వారు కాశీ లో మెలిగారు. కొల్హాపురం చేరి, అక్కడి మహాలక్ష్మి అమ్మ వారిని దర్శించారు. ముల్లోకాలను అడవిపందిగా భయపెట్టిన కోలాసురుడిని సంహరించిన లక్ష్మీదేవి, ఇక్కడ కొలువై ఉంది. మహాలక్ష్మిని, ఇద్దరు, మనసారా స్తోత్రం చేసి ప్రార్ధించారు. ‘’అమ్మా లక్ష్మీ దేవీ ! నువ్వు ఎక్కడ ఉంటె అక్కడ, సమస్త మంగళాలు ఉంటాయి. నువ్వు అనుగ్రహిస్తే అన్నీ చేకూరుతాయి.‘’ అని ప్రార్థించారు.
అమ్మవారు ప్రత్యక్షమై, ‘’మిత్రావరుణ సంభవా! అగస్త్యమునీ ! పతివ్రతా శిరోమణీ లోపాముద్రా !’’ అని సంబోధించి, లోపాముద్రాదేవిని, తన సమీపంలో కూర్చోబెట్టుకొని, ఆమె శరీరాన్ని స్పర్శించింది మహాలక్ష్మి అమ్మ వారు. ’’కోలాహల రాక్షసుని అస్త్రం చేత బాధింపబడ్డ నా శరీరాన్ని, నీ స్పర్శతో, స్వాస్థ్యo పొందుతున్నాను." ‘అని పలికి , లోపాముద్రను కౌగిలించుకొని, సౌభాగ్యాలకు కారణాలైన ఆభరణాలతో ఆమెను అలంకరించింది.
మహర్షితో, ‘’ఋషి సత్తమా !నీ తాప కారణం తెలిసింది. కాశీ ని వదిలినందుకు, నీ మనసు అమిత బాధ పడుతోంది. ఏదైనా వరం ఇవ్వాలని ఉంది" ‘అన్నది. దానికి ముని, ‘’అమ్మా మహాలక్ష్మీ ! వరం ఇవ్వ దలిస్తే, మళ్ళీ మాకు కాశి సందర్శన భాగ్యం అనే వరమే ఇవ్వు. ఇంకేమి వద్దు" అన్నాడు. లక్ష్మీదేవి ‘’తధాస్తు" ‘అని దీవించి, స్వస్థత కలిగించింది.
’’మహర్షీ !రాబోయే ద్వాపర యుగంలో పందొమ్మిదవ బ్రహ్మ కాలంలో నువ్వు వ్యాసుడవు అవుతావు. మళ్ళీ వారణాసికి వెళ్లి, వేద శాస్త్రాలను పరిష్కరించి, ధర్మ బోధ చేస్తావు. ప్రస్తుతం ఇక్కడి నుండి నువ్వు బయల్దేరి వెళ్లి స్కందుని దర్శనం చేసుకో. అతడు నీకు వారణాసి రహస్యమంతా వివరంగా చెబుతాడు." అని చెప్పి, ఇద్దరినీ దీవించి, పంపించింది.
*కాశీఖండం సశేషం..*
🌈🌈🌈🌈🌈🌈🌈🌈
*🅰️🅿️SRINU*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి