20, జనవరి 2023, శుక్రవారం

*జ్ఞాన, మోక్ష ప్రదాత*

 🙏 *ఓం నారాయణ- ఆదినారాయణ* 🙏


*గ్రంథం:* ధర్మమూర్తి , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య చరిత్ర

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*జ్ఞాన, మోక్ష ప్రదాత*


*"మీరు నన్ను వదిలినా నేను మిమ్ములను వదలనయ్యా!, వాళ్ళుండే దాన్ని బట్టి గదయ్యా మనముండేది!"* ఈ రెండు అభయాలూ ఈ ధర్మమూర్తితో పరిచయమున్న ప్రతి వారికీ అనుభవమే.


మనం అజ్ఞానాంధకారంలో మునిగి సాధన చేసి మన మాలిన్యం పోగొట్టుకోలేక పోయినప్పటికీ ఆ ధర్మ ప్రభువును హృదయ పూర్వకంగా ప్రేమించి సేవించినట్లయిన ఆ మహనీయుడే మనలను సంస్కరించి మనకు తెలియకుండానే మనం మన దుష్ట సంస్కారాల నుండి బయటపడేటట్లు చేస్తారు.


శ్రీ స్వామి వారి సేవలో ఉన్న నరసమ్మకు ఇంటికి వెళ్ళి అందరినీ చూచి రావాలని కోరిక కలిగినది. అలా పోసాగితే మనం మమకార బంధంలో తగుల్కుంటామని శ్రీ స్వామి వారికి తెలుసు. ఒక నెల రోజుల పాటు ప్రతి నిత్యం ఇంటికి పోయి రావాలని శ్రీ స్వామి వారిని అడిగినప్పుడంతా వారంగీకరించక ఆమె తనను వదిలి పెట్టి ఇంటికి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వలేదు. ఒక నెల తర్వాత ఆమె గుండంనకు సాంబ్రాణి, నవధాన్యములు సమర్పించేందుకు రాగానే శ్రీ స్వామివారు . *నరసమ్మ చచ్చిపోయిందను కున్నానే!"* అన్నారు.


 అందరూ ఆ మాట విని నవ్వుకున్నారు. కొందరు సేవలకులు ఆమె త్వరలోనే స్వర్గస్తురాలు కానున్నదని భాష్యం చెప్పారు. కానిచిత్రంగా తెల్లవారి నుండి ఆమెకు ఇంటికి పోవాలనే తలంపే రాలేదు.ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు శ్రీ స్వామి వారి సేవలోనే ఒక్క రోజు కూడా ఏమారకుండా ఉంది. ఇంతటి గొప్ప సహాయం శ్రీ స్వామి వారి నుండి ఎలా పొందింది? అది *ఆమె శ్రీ స్వామి వారిని హృదయ పూర్వకంగా సేవించినందువలననే సాధ్యమయ్యింది.*


ఈమె సేవకు నేను (రచయిత) చూచిన రెండు ఉదాహరణలు : కుండ పోత వర్షము, చిమ్మ చీకటిలో రెండు కిలో మీటర్లు నడిచి, గుడ్డలు తడిచిపోయి, చలికి వణికి పోతూ శ్రీ స్వామి వారి సేవకులకు పదిమందికి సరిపోయే అన్నం కూరలు నెత్తిన పెట్టి మోసుకొచ్చింది..


మరొక రోజు ఐదు కిలోల సజ్జలు విసిరి కుడుములు చేసి అందులోకి మిరప్పొడి తెచ్చి శ్రీ స్వామి సన్నిధిలో అందరికీ తృప్తిగా పెట్టింది. ఐదు కిలోల సజ్జలు తిరగలిలో విసరడం ఎంత కష్టమో వాటిని కుడుములు చేసేందుకు ఎన్ని కట్టెలు కావాలో యోచించండి. అది *శ్రీ స్వామి అన్ని జీవులలో ఉన్నాడు* అన్న ఆమె విశ్వాసానికి నిదర్శనం. నిత్యమూ ఆమె తులసమ్మ వలె చీమలకు నూకలు అగ్నిహోత్రమునకు నవధాన్యములు శ్రద్ధా భక్తులతో సమకూరుస్తుంది. విశ్వాసము గలవారు శ్రీ స్వామి వారి నుండి పొందలేనిదే లేదు.


*"చచ్చి బూడిదైనా రమ్మంటే వచ్చేదే గదయ్యా!", "వాళ్ళుండే దాన్ని బట్టి గదయ్యా మనముండేది!"* అన్న శ్రీ స్వామివారి మాటలు అక్షర సత్యాలు.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

కామెంట్‌లు లేవు: