7, మార్చి 2021, ఆదివారం

అమ్మ కోరిన కోరిక..*

 *అమ్మ కోరిన కోరిక..*


"అయ్యా..ఈ వర్షం తగ్గేతట్టు లేదు..ఇంకో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని రేడియో లో టీవీ లో చెపుతున్నారు..ఈసారి దత్తజయంతి కి ఏర్పాట్లు ఎలా చెయాలి..? అదీకాక వ్యవసాయ పనులు కూడా ముమ్మరంగా సాగుతాయి..పెద్దగా జనం రాకపోవొచ్చు..ఒకవేళ వచ్చినా ఇక్కడ నిలబడటానికి కూడా స్థలం లేదు..అంతా బురదగా ఉంది.." అని మా సిబ్బంది నాతో అన్నారు..నేను ధర్మకర్తగా బాధ్యత తీసుకున్న తొలినాళ్ళ నాటి సంఘటన ఇది.. అప్పటి పరిస్థితుల్లో మా సిబ్బంది చెప్పింది నిజమే..మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో స్వామివారి సమాధి మందిరం..దానిముందు ఒక మంటపం తప్ప మరేమీ లేవు..మందిరం ప్రాంగణంలో కనీసం పందిరి కూడా లేదు..ఇక మందిరం చుట్టూరా ప్రదక్షిణాలు చేయాలంటే..మామూలు మట్టి నేల మీద అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి..వర్షం వస్తే..మొత్తం ప్రాంగణం బురదగా మారిపోతుంది..అప్పటికి దత్తజయంతి సరిగ్గా వారం రోజుల్లో ఉంది..


స్వామివారి ప్రాంగణం లో కనీసం నాపరాళ్లు పరిపించే ఏర్పాటు చేసి..పైన ఒక తాటాకు పందిరి వేస్తే బాగుంటుంది అని అనిపించింది..స్వామివారి సమాధి దర్శించే భక్తులకు కొద్దిపాటి ఉపశమనం కలుగుతుంది అని నా భావన..ఇందుకు ఖర్చు అవుతుంది..పైగా అప్పటికప్పుడు ఈ పనిచేసే పనివాళ్ళు కూడా కావాలి..ఎలా చేయాలో పాలుపోలేదు..ఆ విషయమే ఆలోచిస్తూ..మొగిలిచెర్ల లోని మా ఇంటికి వెళ్ళాను..మా నాన్నగారు అనారోగ్యం తో వున్నారు..మా అమ్మగారు వాకర్ సహాయంతో నడవగలుగుతున్నారు..(పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి గార్లు )..ఇంటి లోపలికి వెళ్లి..మంచం మీద కూర్చున్నాను.."ఏమిటి నాయనా..ఏదో ఆలోచనలో ఉన్నావు..? " అని మా అమ్మ అడిగింది.."ఏదోలే అమ్మా..చిన్న సమస్య.." అన్నాను.."గుడి దగ్గర భక్తులు ప్రదక్షిణాలు చేయడానికి చుట్టూరా నాపరాళ్ల ను పరిపించాలని..అలాగే పందిరి వేయించాలి అని అనుకున్నాము అత్తయ్యా..అందుకు ఖర్చు అవుతుంది కదా..ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారు.." అని మా ఆవిడ మా అమ్మతో చెప్పింది..


"ఒరే ప్రసాదూ..నీకు ఏ సమస్య వచ్చినా..నేరుగా స్వామివారి సమాధి వద్ద చెప్పుకో అని చెప్పాను గుర్తుందా..ఇప్పుడు మీరిద్దరూ కారు లో స్వామివారి మందిరానికి బైలుదేరండి..మీతోపాటు నేనూ వస్తాను..స్వామివారికి మీరిద్దరూ సమస్యను విన్నవించండి..నేనూ చెప్పుకుంటాను..రండి గుడికి వెళదాము.." అన్నది..సరే అమ్మా..అన్నాను..మరో పదినిమిషాల్లో ముగ్గురమూ స్వామివారి మందిరానికి చేరుకున్నాము..


మా అమ్మగారు వాకర్ సహాయంతో మెల్లిగా స్వామివారి మందిరం లోకి వచ్చారు..మా దంపతులను పిలిచి.."మీరిద్దరూ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి ప్రార్ధించండి.." అన్నారు..అలాగే చేసాము..ఆ తరువాత ఆవిడ కొద్దిసేపు కళ్ళుమూసుకుని స్వామివారిని ప్రార్ధించి.."అన్నీ సవ్యంగా జరుగుతాయి..ఏమీ సంకోచం పెట్టుకోకండి.." అన్నది..అమ్మను తీసుకొని ఇంటికి వెళ్లేముందు..ముందున్న మంటపం లో ఉన్న భక్తులు..మా అమ్మగారి కి నమస్కారం చేయడానికి వచ్చారు..సుమారు ఇరువై మంది దాకా వున్నారు..ఒక్కొక్కరూ ముందుకు వస్తున్నారు..ఈలోపల మందిరం వెలుపల ఒక కారు వచ్చి ఆగింది..అందులోనుంచి ఒక మధ్యవయస్కుడు నేరుగా లోపలికి వచ్చాడు..అతను మంటపం లోకి రాగానే..మా అమ్మను చూసి..గబ గబా ముందుకు వచ్చి.."అమ్మా బాగున్నారా..నేను గుర్తున్నానా..వడ్డే కొండయ్యను.." అన్నాడు..మా తల్లిగారు ఒక్క క్షణం అతనిని నిశితంగా చూసి.."కొండయ్యా..నువ్వా..బాగున్నావా..హైదరాబాద్ వెళ్ళావని చెప్పారే..అక్కడ స్థిరపడ్డావట కదా.." అని పలకరించారు.."ఏదోలే అమ్మా..స్వామి దయ..మీ ఆశీర్వాదం..లక్షణంగావున్నాను.." అన్నాడు.."ఒక పని చేస్తావా..ఇట్లా అడుగుతున్నానని ఏమీ అనుకోకుండా..ఈ మందిరం చుట్టూరా నాపరాళ్లు పరిపించు..స్వామిదయవల్ల బాగుపడ్డానన్నావు కదా..నలుగురికి ఉపయోగంగా ఉంటుంది.." అన్నది.."అమ్మా నువ్వు చెపితే..ఆ స్వామివారు చెప్పినట్టే..రేపే రాళ్లు తెప్పిస్తా..వర్షం తగ్గగానే దగ్గరుండి పరిపిస్తాను..స్వామిదయ తలిస్తే..పందిరి కూడా వేయిస్తా..ఏదైనా వాతావరణం అనుకూలిస్తే..మొత్తం పని మూడురోజుల్లో చేయిస్తా తల్లీ.." అన్నాడు..

ఈ ప్రహసనం మొత్తం చూస్తున్న మా దంపతులకు స్వామివారి లీల ఏమిటో కళ్ళకు కట్టినట్లు తెలిసి వచ్చింది..


మాలకొండలో మొట్టమొదటిసారి స్వామివారిని మా తల్లిదండ్రులు కలిసిన రోజు..మా అమ్మగారిని..తన తల్లితో సమానం అని స్వయంగా చెప్పారు..ఇప్పుడు ఆవిడ మందిరం వద్దకు వచ్చి స్వామివారి సమాధి వద్ద ప్రార్ధించిందో..ఆ కోరిక క్షణాల్లో నెరవేరింది..అనుభవపూర్వకంగా చూసాము..ఆరోజు సాయంత్రం నుంచే వర్షం ఆగింది..దత్తజయంతికి ఒక రోజు ముందుగానే మొత్తం పని పూర్తి అయింది..


ఇటువంటి అనుభవాలు ఎన్నో మేము స్వయంగా చూసాము..అనుభూతి చెందాము..ఇన్నాళ్లకు మీలాటి దత్తభక్తులతో పంచుకునే అవకాశాన్ని..మొగిలిచెర్ల అవధూత ఆ దత్తాత్రేయ స్వామివారు కల్పించారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: