12, డిసెంబర్ 2022, సోమవారం

Srimadhandhra Bhagavatham -- 99

 Srimadhandhra Bhagavatham -- 99 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


శ్రీకృష్ణుడు మృతులయిన విప్రసుతులను తెచ్చుట

శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఘట్టంలోను ఆయన చేసిన లీలలచేత లోకమునంతటిని తరింపచేయడము కొరకు, మనకందరికీ కూడా పాఠం నేర్పడం కోసమని, మనం పరమేశ్వరుని చేరుకోవడానికి మార్గములను సుగమం చేయడం కోసమని ప్రాకృతికమయిన శరీరంతో వచ్చి కర్మ ఫలితం అనుభవించడం కోసమని పొందే కష్ట నష్టముల వంటివి కాకుండా హేలగా కొన్ని లీలలు చేసి వాటికి అంతమునందు జ్ఞానమును ప్రతిపాదించి మనస్సుకు ఒక ఆలంబనమును ఇవ్వకపోతే అది సరియైన ఆలంబనను పట్టుకోకుండా విషయ సుఖముల వైపు మనలను తిప్పుతుంది. ఒకవేళ ఆ జ్ఞానమునకు సంబంధించిన విషయము మనకు అవగతము కాకపోయినా బాహ్యమునందు లీల సంతోషంగా విని కృష్ణ పరమాత్మను మనసులో నిలబెట్టుకున్నా కూడా ఆ వస్తువు స్వరూపం అటువంటిది కాబట్టి అది భక్తివైపు నడిపించే విధానమును భాగవతమునందు ఆవిష్కరించారు.

పూర్వం ద్వారకానగరమును కృష్ణ భగవానుడు పరిపాలిస్తున్న రోజులలో ఒక బ్రాహ్మణుడు తన భార్యయందు ఒక కుమారుడిని కన్నాడు. ఆ పిల్లవాడు పుట్టగానే మరణించాడు. బ్రాహ్మణుడు ఆ పిల్లవానిని తీసుకువచ్చి రాజద్వారం దగ్గర పడుకోపెట్టి ‘నేను ఏ పాపమూ ఎరుగని వాడను ధర్మబద్ధమయిన నడవడి ఉన్న వాడను. అయినా సరే నా కుమారుడు మరణించాడు, అంటే దేశానికి ఆధిపత్యం వహించిన రాజు దోషం వలన ఇటువంటి పని జరిగి ఉండాలి. రాజుకు ధర్మబద్ధమయిన నడవడి లేదు’ అని ఉగ్రసేనుని నింద చేసి ఆ శవమును అక్కడ విడిచిపెట్టి కొంతసేపు తల కొట్టుకుని ఏడ్చి తరువాత ఆ పిల్లవాని శవమును తీసుకుని వెళ్ళిపోయాడు. మరల కొంతకాలము పోయిన తరువాత ఇంకొక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు కూడా పుట్టగానే మరణించాడు. మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకు వచ్చి రాజద్వారం దగ్గర పడుకోబెట్టాడు. ఇలా ఎనమండుగురు కుమారులు కలిగారు. అందరూ పుట్టగానే మరణించారు. ఎనిమిదవ సారి బ్రాహ్మణుడు రాజును నిందజేస్తుండగా అర్జునుడు ద్వారకా నగరంలో ఉన్నాడు. బ్రాహ్మణుడు తనకి పుట్టిన బిడ్డలందరూ కేవలం రాజు అధర్మం వల్లనే మడిసిపోతున్నారని ఏడుస్తున్న సమయంలో అర్జునుడు చూసి

'నీవు బ్రాహ్మణుడవు నీ ఏడుపులను బట్టి ఇప్పటికి నీకు ఎనమండుగురు కొడుకులు మరణించారని నాకు అర్థం అవుతున్నది. అలా మరణించిన కొడుకులను పెట్టుకుని నీవు రాజద్వారం దగ్గర ఏడుస్తుంటే నీ ఏడుపు పట్టించుకున్న వాడు ఊళ్ళో లేడు. ఈ ఏడుపు నుంచి ఉద్ధరించి నీకు పుత్రశోకము కలుగకుండా చేయగలిగిన విలుకాడు ఈ ఊళ్ళో లేడా?' అని అడిగాడు. అర్జునుడు ఈ ప్రశ్నను కృష్ణ భగవానుడు ఉన్న ఊళ్ళో అడుగుతున్నాడు. ఒక్కొక్క సారి ఎటువంటి భావనలు మనస్సులోంచి వస్తాయో చూడండి. తాను గొప్ప విలుకాడననే అతిశయం చేత ఈ మాట వచ్చింది. ఆ బ్రాహ్మణుడు ‘మాకిక్కడ కృష్ణుడు ఉన్నాడు. అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు ఉన్నారు. బలదేవుడు, ఉగ్రసేనుడు ఉన్నారు. ఇటువంటి వాళ్ళే రక్షించలేకపోయారు. నీవెవరివయ్యా ఇన్ని మాటలు అడిగావు’ అన్నాడు. ఆ మాటలకు అర్జునునికి కోపం వచ్చింది. అర్జునుడు నేనెవరినో తెలుసా! ఏ మహానుభావుడు తన గాండీవము పట్టుకుని రెండుచేతులతో బాణములను తీసి సంధించి విడిచి పెట్టి శత్రువుల మూకలను చెండాడుతాడో సవ్యసాచి అయిన పార్థుడను. నేను ఉండగా నీకు భయం లేదు. ఈసారి నీ కుమారుడు మరణించడు. నేను ఇక్కడే ఉండి నీ కుమారుడి ప్రాణములు పోకుండా కాపాడతాను. నీకు అభయం ఇస్తున్నాను. అలా నీ కొడుకును నేను కాపాడలేకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ’ అని ద్వారకలో ఉండిపోయాడు. బ్రాహ్మణుని భార్య గర్భం దాల్చి ప్రసవ వేదన ప్రారంభం అవుతున్నదనగా అర్జునునకు కబురు చేసారు. ఆయన శుచియై ఒక పవిత్రమయిన ప్రదేశమునందు వెళ్లి నిలబడి పరమశివుని ఒకసారి తలచుకుని నమస్కారం చేసి ఆయన వలన పాశుపతాస్త్రమును పొందినవాడు కనుక అక్షయ బాణ తూణీరములను రెండు భుజములకు కట్టుకుని శరవేగంతో బాణ పరంపర ప్రయోగం చేశాడు. మంత్రపూరితములయిన బాణములతో ప్రసూతి గృహం చుట్టూ పంజరం అల్లినాడు. అందులోకి సూక్ష్మమయిన అణువు కూడా ప్రవేశించలేదు. ఒక అణువు కూడా బయటికి వెళ్ళలేదు. మృత్యుదేవత వచ్చి పిల్లవాడి ప్రాణములు తీసుకువెళ్ళడానికి వీలులేదు. దుర్భేధ్యమయిన రక్షణ కవచమును నిర్మాణం చేశాడు.

లోపల ఒక పిల్లవాని కేర్ మన్న ఏడుపు వినపడింది. ప్రసవం అయి బిడ్డడు జన్మించాడు అనుకున్నాడు. మరుక్షణంలో బిడ్డడు చనిపోయాడని ఏడుపులు వినపడ్డాయి. ఆశ్చర్యపోయి ‘ఏడి పిల్లవాడు’ అని అర్జునుడు లోపలికి వెళ్ళాడు. తీరా చూసేసరికి చనిపోయిన పిల్లవాడు మాయం అయిపోయాడు. అర్జునుడి చేత నిర్మింపబడిన దుర్భేద్యమయిన బాణ కవచము ఉన్న చోటునుండి ఈసారి శరీరం కూడా అదృశ్యం అయిపోయింది. ప్రాణములను తీసుకు వెళ్ళడం అనే విధి యమధర్మరాజు గారు చేస్తారు. తన యోగశక్తి చేత బయలుదేరి యమలోకమునకు వెళ్ళి ‘బ్రాహ్మణ కుమారుని తీసుకు వచ్చి ఎక్కడ పెట్టావు’ అని యమధర్మరాజు గారిని అడిగాడు. ఆయన నేను తీసుకురాలేదని చెప్పారు. ఆయన ధర్మరాజు అబద్ధం ఆడడు. ఆయన మాటలు విని అర్జునుడు ఆశ్చర్య పోయాడు. అక్కడి నుండి దిక్పాలకుల లోకములకు వెళ్ళాడు. అన్ని లోకములలో వెతికాడు. అందరూ కూడా తాము పిల్లవాడిని తీసుకురాలేదు అని చెప్పారు. పిల్లవాడు కనపడలేదు. తల వాల్చుకుని భూలోకమునకు ద్వారకా నగరమునకు తిరిగి వచ్చాడు. బ్రాహ్మణుడు కోసం చూస్తుంటే ఆయన కృష్ణుడి మందిరం దగ్గర ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు

'వీడు పార్థుడట! వీనికి ఒక గాండీవమట. అక్షయబాణ తూణీరములట. మంత్రపూరితమయిన బాణములట. నా కొడుకును రక్షిస్తాడట. ఇన్ని చెప్పాడు. పిల్లవాడు మాయం అయిపోయాడు. నేను పట్టుకు వస్తాను అని వెళ్ళి దిగులు మొహం వేసుకుని వస్తున్నాడు. కృష్ణుడు, బలదేవుడు ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఉన్నారని ముందరే చెప్పాను. వాళ్ళు చెయ్యని పని నీవెక్కడ చేస్తావన్నాను. గాండీవం చూపించాడు. తనపాటి విలుగాండ్రు ఊళ్ళో లేరా అన్నాడు. ఈ మాటలను అర్జునుడు విన్నాడు. బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. క్షత్రియునిగా ఇంతమంది మధ్యలో అధిక్షేపించబడ్డాడు. ఇంకా ఈ బ్రతుకు ఎందుకు అని భావించి చితి పేర్పించుకుని అగ్నిహోత్రుని ప్రార్థన చేసి చితిలో ప్రవేశించ బోయాడు. కృష్ణ పరమాత్మ వచ్చి అర్జునుడి చేయి పట్టుకుని ‘బావా! ఏమిటి ఈ అగ్నిప్రవేశం? ’ అన్నాడు. అర్జునుడు ‘నేను నామాట నిలబెట్టుకోలేక పోయాను. అందుకని ప్రతిజ్ఞా పరిపాలన కోసం అగ్ని ప్రవేశం చేస్తున్నాను’ అని చెప్పాడు. అంత కృష్ణుడు ‘అంత పని చేయవద్దు. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో నాతోరా నేను చూపిస్తాను’ అన్నాడు. కృష్ణ పరమాత్మ రథమును ఇరువురు అధిరోహించి బయలుదేరారు. కృష్ణుని రథం సప్త సముద్రములను, మేరు పర్వతమును దాటి చీకట్లోకి వెళ్ళిపోయింది ఆ చీకటికి అర్జునుడికి భయం వేసింది. ‘ఏమిటి బావా నాకు భయం వేస్తోంది. మనం ఎక్కడికి వెళ్ళాలి’ అని అర్జునుడు అడిగాడు. నీవు భయపడకని కృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రమును స్మరించి విడిచిపెట్టాడు. అది ఆ చీకట్లో ప్రయాణం చేస్తూ సహస్ర సూర్యుల పగిది వెలుతురును సృష్టించింది. ముందు సుదర్శన చక్రం వెళుతుంటే వెనుక కృష్ణ పరమాత్మ రథం వెడుతోంది. రథంలో కూర్చున్న అర్జునుడు సుదర్శనమును అనుసరిస్తూ వెళ్ళాడు. చాలా దూరం వెళ్లిన తరువాత కోటి సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తున్నారేమో అన్నంత తేజోమండలం కనపడింది. అపారమయిన మనశ్శాంతి కలిగింది. పాలసముద్రంలో తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడు అనంతుడు, నల్లటి వస్త్రమును కట్టుకుని ఉంటే ఆ ఆదిశేషుడి మీద తన కుడిచేతిని హేలగా శిరస్సు క్రింద పెట్టుకుని పడుకుని ఉండగా ఆదిలక్ష్మి పాదములు ఒత్తుతున్నది. అటువంటి స్వరూపమును కృష్ణార్జునులు దర్శనం చేశారు. అటువంటి మూర్తి దర్శనం అప్పటి వరకు అర్జునుడు చెయ్యలేదు. అది శ్రీమన్నారాయణుని దర్శనం ఆయనే శ్రీమహావిష్ణువు. ఆయన అంశగా శ్రీకృష్ణభగవానుడు వచ్చాడు. ఆ శ్రీమహా విష్ణువును దర్శనం చేసి పొంగిపోయి నమస్కరించారు. ఆ మహానుభావుడిని ఋషులందరూ చుట్టూ నిలబడి స్తోత్రం చేస్తున్నారు.

అటువంటి మూర్తిని దర్శించిన తర్వాత ఆయన ‘నరనారాయణులారా! రండి’ అన్నారు. వీళ్ళిద్దరూ దగ్గరకు వెళ్లి స్వామి పాదములకు శిరస్సు తాటించి నమస్కరించి నిలబడ్డారు. మీరు నాలోంచి అంశగా బయలుదేరి భూమండలం మీద రాక్షస సంహారం చేయడానికి నరనారాయణులుగా అవతరించారు. ఈ ఋషులు నా దగ్గరకు వచ్చి నా అంశ అయిన మీరు నా దగ్గర నిలబడి ఉండగా చూడాలని కోరుకున్నారు. ఈ కోర్కె తీర్చాలి. అర్జునునకు కలిగిన కించిత్ గర్వమును అణచాలి. అందుకని బ్రాహ్మణ పిల్లలందరినీ తీసుకువచ్చాను. ఇదిగో వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని చూపించాడు. వారి అదృష్టమేమిటో గానీ ఆ బ్రాహ్మణ పిల్లలందరూ శ్రీమన్నారాయణుని పాదముల దగ్గర కూర్చుని స్తోత్రము చేసుకుంటూ ఆయన పాదములకు నమస్కారం చేసుకుంటూ కూర్చున్నారు. పిమ్మట శ్రీమహావిష్ణువు మునుల వైపు తిరిగి ‘మునులారా మీ కోర్కె తీరిందా’ అని అడిగాడు. ఆ బ్రాహ్మణకుమారులనందరినీ కృష్ణుడి చేతికి ఇచ్చి ఈ పిల్లలను తీసుకుని నీవు భూమండలమునకు వెళ్లి ఆ బ్రాహ్మణునకు అప్పజెప్పు’ అన్నాడు. ఏ మహానుభావుడి దర్శనమును యోగీంద్రులయిన వారు కూడా తమ మాంస నేత్రముతో చూడలేరో అటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పుట్టింది మొదలు హాయిగా ఆయన దగ్గర కూర్చుని ఆయనను చూస్తూ ఆయనను సేవిస్తూ లక్ష్మీ దేవి పెట్టిన అన్నం తింటూ ఆయనను భజించిన మహా పురుషులయిన బ్రాహ్మణ పిల్లలను తన రథంమీద కూర్చో పెట్టుకుని తిరిగి భూమండలమునకు కృష్ణ భగవానుడు తీసుకువచ్చాడు. ఆ నాడు అర్జునునకు కలిగిన కించిత్ ఆవేశము తగ్గింది. ‘నా అంత గొప్పవాడు లేడు’ అనే భావన తగ్గింది.

మనం ఒక్కొక్కసారి మనలను నిరంతరం రక్షించే పరమేశ్వరుడిని కూడా మర్చిపోతాము. ఆయనకన్నా నేనే గొప్పవాడినన్న భావన వచ్చేస్తుంది. యథార్థమునకు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ కృష్ణుడిని చిన్నబుచ్చేదిగా ఉన్నది. కృష్ణుడు అర్జునుని ఏమీ అడగలేదు. అడగకుండా అర్జునుడు అగ్నిప్రవేశం చేసేటంత స్థితికి వచ్చేవరకు ఊరుకున్నాడు. ఆ స్థితికి వచ్చేశాడు అంటే అహంకారం పోయిందన్నమాట. అతిశయం పోయిన తర్వాత తనవాడిని తాను రక్షించుకోవాలి. అపుడు గబగబా పరుగెత్తుకు వచ్చి రక్షించుకుని అర్జునునకు మరల సత్కారమును చేయించి బ్రాహ్మణ పిల్లలందరినీ తీసుకువచ్చి బ్రాహ్మణునకు అప్పచెప్పాడు. ఆ భగవానుడిని నమ్ముకున్న వాళ్ళకు లోటేమి ఉంటుంది. మనం ఆ స్వామిని నమ్మి ‘నా స్వామి ఉన్నాడు’ అనే పూనికతో ఉంటే ఎప్పుడయినా తెలియక మనవల్ల ఏదయినా పొరపాటు జరిగినా బిడ్డడి తప్పును తండ్రి దిద్దుకున్నట్లు ఆయనే దిద్దుకుని మనను రక్షించుకుని తన వస్తువుగా మనలను మిగుల్చుకుంటాడని చెప్పగలిగిన పరమ పవిత్రమయిన లీల.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

కామెంట్‌లు లేవు: