మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దత్తోపదేశాలు - పద్దెనిమదవ భాగం - జ్ఞాన ప్రసాదాలు
మానవ చరిత్ర మొదటి నుంచి కూడా దూరాక్రమణలు జరుగుతూనే ఉండేవి. ఒకరికి సంబంధించిన దేశాన్నో, లేక రాజ్యన్నో లేక స్థలాన్నో బలవంతంగా కానీ యుద్ధం చేసి కానీ హస్తగతం చేసుకోవడం అన్నది కొన్ని వందల ఏళ్ళుగా విచ్చలవిడిగా జరిగింది. దీనికి ఏ ఒక్క దేశం మినహాయింపు కాదు. అందుకనే అన్ని దేశాలలో ఎక్కువగానో లేక తక్కువగానో అన్ని జాతులకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలానే మన దేశంలో కూడా అనేక దురాక్రమణలు జరిగాయి, అయినా కానీ మన సంస్కృతిని అన్నిటినుంచి తప్పించి మనం నిలబెట్టుకోగలిగాము అంటే దానికి ముఖ్య కారణం గురు పరంపర. మన దేశములో దైవ ప్రజ్ఞ ఉన్న ప్రతీ గురువు, వారిలోని జ్ఞానాన్ని తరువాత తరానికి ఖచ్చితంగా అందేలా పాటుపడ్డారు. అందుకనే మన దేవాలయాలు కూలగొట్టినా, మన సంపదలు కొట్టేసినా కానీ, మన సంస్కృతి మాత్రం నిలబడింది. ఒక కోటను కూలగొట్టినప్పుడు పరదేశీయుడు బంగారం, వజ్రాలు, నాణేలు మాత్రమే నిజమైన ఆస్తిగా భావించి వాటిన ఎత్తుకు పోయారు కానీ, ఆకుల మీద వ్రాసిన గీతలే మన నిజమైన సంపద అని తెలుసుకోలేక ఏంతో విలువైన గ్రంధాలను ఇక్కడ వదిలేశారు. అవే మన సంస్కృతిని నిలబెట్టాయి.
ఎందరో మహానుభావులు వారి గురువులు చెప్పిన అమృతతుల్యమైన వాక్కులను వల్లె వేసి, గ్రంధస్థం చేసి తరువాతి తరాలకు అందించారు కాబట్టే ఇప్పటికి ఈ నేల పై సంప్రదాయం, సంస్కృతి నిలబడ్డాయి. మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జీవనాన్ని బాహ్యంగా చుస్తే అసలు వారికి శిష్యులు లేరు కదా, కాబట్టి సంప్రదాయబద్ధంగా గురోపదేశం చెయ్యలేదు కాబట్టి, వారి జ్ఞానాన్ని వారితోటే తీసుకొని వెళ్లిపోయారు అని అనుకోవచ్చు. కానీ అది పొరపాటు.
ఒక్కసారి ఆ మహానుభావుడి చర్యలను దగ్గరగా గమనిస్తే, శ్రీ స్వామి వారు అలా వారి జీవితములో నడుస్తూనే ఎంతో మంది నడవడికను మార్చేసారు. అసలు మన శ్రీ స్వామి వారిది ఎంతటి ప్రజ్ఞ అంటే, మనకి విద్యను వ్యక్తితత్త్వం చేసుకోవడంలో ఉన్న వ్యధను గమనించి, మనకి అస్సలు ఎటువంటి బాధ లేకుండానే ఎన్నో కఠిన బోధలను మనకు నేర్పించారు.
• శ్రీ స్వామి వారు, చెక్కా కేశవులు గారు అమ్మవారి సాక్షాత్కారం అడిగితే, అది ఎంతటి కఠినమో ఒకసారి రుచి చూపించే, స్వర్గము అనేది ఎగిరితే దొరికే పండు కాదని బోధ చేశారు.
• ప్రభావతి గారి తొలి పరిచయములోనే ఆదిత్య హృదయం చెప్పమని అడిగి, వారు చెప్పలేక పోయినప్పుడు అహంకారం, మనకు ఆ పరమాత్మకు మధ్య దూరం ఎంత పెంచుతుందో బోధ చేశారు.
• అదే ఆదిత్య హృదయం ప్రభావతి గారు గబగబ చదవగా, సక్రమమైన మంత్రోచ్ఛారణ ఎంతటి ముఖ్యమో బోధ చేశారు.
• రామ నామం వల్ల కష్టాలు వస్తాయి కదా అని సందేహం అడిగితే, భాగవన్నామం అనేది అగ్నిహోత్రము వంటిది అని, అది మన పాపల్ని బూడిద చేసే ప్రక్రియే మనకి ఆ సమయములో ఎదురయ్యే కష్టాలు అని బోధ చేశారు.
• అహంకారంతో శ్రీ స్వామి వారి జ్ఞానాన్నే బేరీజు వేద్దామని వచ్చిన పండితునికి, అసలు శ్రీ స్వామి వారి జ్ఞానాన్ని అంచనా వేయడానికి ఆ పండితునికి ఉన్నది ఏపాటి జ్ఞానం అని ప్రశ్నించి బోధన చేశారు.
• ప్రభావతి గారు బలవంతంగా పులి చర్మాన్ని తీసుకొని వస్తే అది తగదు అని దానికి గల కారణాన్ని చెప్పి బోధ చేశారు.
• అదే ప్రభావతి గారు స్వామి వారి జటాఝాటంను కోరుకోగా ఆర్తి చెందిన వారికి గురుకృప అండగా ఉంటే, వారు కోరుకున్నది నిస్సందేహంగా అంది తీరుతుంది అని బోధ చేశారు.
• అంతేకాదు, ఇప్పటికి కూడా జ్ఞానం పంచడానికి గురువు శరీరంతో ఉండవలసిన అవసరం లేదని వారి బృందావనం ముందు మోకరిల్లిన ప్రతి భక్తునికి బోధ చేస్తూనే ఉన్నారు.
అందుకనే శ్రీ స్వామి వారి చరిత్రను ఆమూలాగ్రంగా అర్థం చేసుకొని, ఇటువంటి జ్ఞాన ప్రసాదాలను మనం తరువాత తరాలకు అందించడమే మనం చేసే గురు సేవ, అలానే మన సంస్కృతిని నిలబెట్టేందుకు మనం చేసే నిర్విరామ ప్రయత్నం.
సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి
పవని శ్రీ విష్ణు కౌశిక్
(మందిర వివరముల కొరకు :
పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699
----
ఇంతటి మహానుభావుని దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును :
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ
-----
*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :
Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
---
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి