మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...
*పులిచర్మం..ప్రలోభం... మొదటి భాగం.*
*(నలభై ఎనిమిదవ రోజు)*
శ్రీ స్వామివారి సాధన నిరంతరంగా నిరాఘాటంగ సాగిపోతోంది..మోక్షసాధనే ధ్యేయంగా చేస్తున్న కఠోర తపస్సు క్రమంగా ముగింపుకు వస్తోందని స్వామివారికి అనుభవపూర్వకంగా అర్ధమవుతోంది.. శ్రీ స్వామివారు తీసుకుంటున్న మిత ఆహారం కూడా ఇంకా తగ్గించుకొని..మరీ అల్పపరిమాణంలో స్వీకరించసాగారు..దేహం కూడ శుష్కించిపోతున్నది.
ఒకరోజు శ్రీధరరావు ప్రభావతి గార్లు శ్రీ స్వామివారిని కలవడానికి ఆశ్రమానికి వెళ్లారు..శ్రీ స్వామివారు వారితో తన తపస్సు గురించి కొన్ని విషయాలు మాట్లాడి.."పులిచర్మం మీద కూర్చుని తపస్సు లోని చివరి సాధన చేస్తే ఫలితం విశేషంగా ఉంటుంది..అది ముక్తికి చివరి మెట్టు!..వ్యాఘ్ర చర్మం ధరించే పరమశివుడు నిరంతర విరాగి గా ఉండటం లోని పరమ రహస్యం అదే!.." అన్నారు..
ప్రభావతి గారి మనస్సులో ఈ మాటలు బాగా నాటుకొని పోయాయి..ఎలాగైనా పులిచర్మం సంపాదించి..శ్రీ స్వామివారికి అందచేయాలి..శ్రీ స్వామివారి తపస్సుకు తన వంతు సహాయం చేశానన్న తృప్తి ఉండాలని ఆవిడ బలంగా కోరుకున్నారు..
ఆ ప్రక్కరోజే..కందుకూరు మహిళామండలి అధ్యక్షురాలు..(ఆవిడ ప్రభావతి గారికి బాబాయి గారి కూతురు) తమ మహిళామండలి లో సాహిత్యోపన్యాసం చేయమని ప్రభావతి గారిని కోరారు..ప్రభావతి గారూ ఒప్పుకొని..శ్రీధరరావు గారితో సహా కందుకూరు చేరారు..బంధువులే కనుక, నేరుగా వాళ్ళింటికి తీసుకెళ్లారు..ప్రభావతి గారు వారింట్లో అడుగుపెట్టేసరికి.. ఆ ఇంటి హాలులో గోడకు ఒక పులిచర్మం తగిలించి ఉంది..బాబాయి గారి పెద్ద కుమారుడు ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు..అతను కూడా వచ్చి ఉన్నాడారోజు..
అందరూ భోజనానికి కూర్చున్నారు..ప్రభావతి గారి మనసంతా ఎదురుగ్గా గోడకు తగిలించి ఉన్న పులిచర్మం మీదే ఉంది..తాను నోరు తెరచి అడిగితే..వీళ్ళు కాదని అనలేరు..కాబట్టి అడిగి ఆ పులిచర్మం తీసుకొని..శ్రీ స్వామివారి కి అందచేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు..
ప్రభావతి గారి మనసులోని ఆలోచనను శ్రీధరరావు గారు పసిగట్టేశారు..ప్రభావతి గారి మనసులోని భావాలను ఆయన చదవగలరు..లో గొంతుకతో.."ప్రభావతీ..నువ్వు ఆ పులిచర్మాన్ని ఇమ్మని అడగకు..పద్ధతి కాదు..వాళ్ళు ముచ్చటబడి దానిని అలా ఉంచుకున్నారు..నువ్వు ప్రలోభపడకు.." అన్నారు..ప్రభావతి గారు చివ్వున చూస్తూ.."ఇదేమన్నా నా కోసమా?..శ్రీ స్వామివారి తపస్సు కోసం కదా!..వాళ్లకు కూడా పుణ్యం వస్తుంది..మీరూరుకోండి..అన్నిటికీ అడ్డం పడకండి!.." అన్నారు.."ఒద్దు ప్రభావతీ..నామాట విను..ఇలా అడగటం తప్పని నీకూ తెలుసు!.." అన్నారు శ్రీధరరావు గారు..
ఆ క్షణంలో సరే అన్నట్లు తలూపిన ప్రభావతి గారు..మరి కొద్దిసేపటికే భోజనాలు తినడం పూర్తి అయిన మరుక్షణం..."బాబాయ్..పిన్నమ్మా..తమ్ముడూ.. చెల్లాయ్.." అంటూ పేరు పేరు నా అందరినీ పిలిచారు..అందరూ ప్రభావతి గారి దగ్గరకు వచ్చారు..శ్రీధరరావు గారు వారిస్తున్నా వినకుండా..
"నాకు ఆ పులిచర్మం కావాలి.." అన్నారు..
వింటున్న వాళ్ళు ఒక్కక్షణం నిర్ఘాంతపోయారు..
"అక్కయ్యా..అది నాకు బహుమానంగా ఒక ఆప్తుడు ఇచ్చాడు..వాళ్ళ జ్ఞాపకార్ధం ఇక్కడ ఉంచుకున్నాను..పైగా నాకు అదంటే ఇష్టం కూడానూ.." అన్నాడు నెమ్మదిగా..
"ఏం ఫర్లేదు తమ్ముడూ..ఒక మహానుభావుడి తపస్సుకు మీరు సహకరిస్తున్నారని తెలుసుకోండి..ఎంత పుణ్యమో మీకు తెలీక ఇలా అంటున్నారు.." అంటూ.."నేను మామూలుగా ఇటువంటి సాహిత్య సభలకు రాను..అదే గొప్ప గొప్ప రచయిత్రులు..కవులు..వస్తే..వారికి సన్మాన సత్కారాలు చేయాలి..నేను అలాకాదే!..నాకు భగవంతుడు వాక్కు ఇస్తేనే మాట్లాడతాను సభల్లో..నేను షరతులేవీ పెట్టను.. అటువంటిది ఈరోజు నేను అడుగుతున్నానని మీరు భావించినా పర్లేదు..నాకు ఆ పులిచర్మం కావాలి..అంతే!." అని గబ గబా అక్కడున్న కుర్చీ లాక్కొని..దానిమీదకు ఎక్కి..గోడకు తగిలించి ఉన్న పులిచర్మాన్ని మెల్లిగా మేకులనుంచి ఊడతీయడం మొదలెట్టారు..
ఈ పరిణామానికి బిత్తరపోయిన ఆ తమ్ముడు కాస్తా..తానే పులిచర్మాన్ని ఊడదీసి..ప్రభావతి గారికి ఇచ్చేసాడు..వాళ్ళ కళ్ళల్లో కనబడ్డ నిరాశ ప్రభావతి గారు, చూసికూడా చూడనట్లే నటించి..ఆ పులిచర్మాన్ని చుట్ట చుట్టుకొని పట్టుకున్నారు..శ్రీధరరావు గారి వైపు చూసే సాహసం ఆవిడ చెయ్యలేదు..ఆయన చూపుల్లోని కోపాగ్నికి భస్మం అవుతానని భయం!..ఆ ఇంట్లో ఎవరూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బైటకు వచ్చేసి రిక్షా ఎక్కి బస్టాండ్ కు వచ్చేసారు..దారిపొడుగునా శ్రీధరరావు గారు చీవాట్లు పెడుతున్నా లెక్కచేయలేదు ఆవిడ!..
ఆ పులిచర్మం తీసుకొని మొగలిచెర్ల కు చేరారా దంపతులు..
పులిచర్మం..శ్రీ స్వామివారి లీల..రెండవభాగం..రేపు..
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి