రాసలీల ఘట్టము విన్నంత మాత్రం చేత మన పాపములన్నిటిని దహించగల శక్తి కలిగినది. రాసలీలను సామాన్యమయిన స్థాయిలో విని, మనస్సును పరిశుద్ధంగా ఉంచుకొని అది ఈశ్వరుని లీల అని విన్నంత మాత్రం చేత గొప్ప ఫలితమును ఇస్తుంది. దాని లోపల ఉండే అసలయిన రహస్యమును తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తే అది ఒక దివ్యాతిదివ్యమయిన లీల. అంతకన్న గొప్పలీల సృష్టిలో ఉండదు. రాసలీల అనేసరికి కృష్ణుడు చాలామంది కాంతలతో భోగము అనుభవించుట అని అనుకుంటారు. దాని ఉద్దేశము అది కాదు.
శరత్కాలములో పౌర్ణమి వచ్చింది. మంచి వెన్నెలతో కూడిన రాత్రి. ఆ రాత్రి కృష్ణ భగవానుడు యమునానదీ సైకతమునందు ఒడ్డున నిలబడి వేణువు మీద ఒక గొప్ప మోహనగీతము నొకదానిని ఆలాపన చేశారు. అక్కడ అనేకమంది గోపాలురు ఉన్నారు గోపకాంతలు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది పాలు తీయడానికి దూడలను విడిచి పెడుతున్నారు. మరికొంతమంది పాలు పితుకుతున్నారు. మరికొంతమంది పితికిన పాలను అగ్నిహోత్రం మీద పెడుతున్నారు. వేరొక ఇంట్లో చల్ల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పని జరుగుతోంది. ఈలోగా కృష్ణ భగవానుడు ఊదిన వంశీరవము వినపడగానే ఇక్కడే మనస్సులో కృష్ణ భగవానుని దర్శనం చేసి, ఇంత గొప్ప వంశీరవమును చేస్తున్న ఆ మోహనరాగము పలుకుతున్న రూపమును చిత్రించుకుని గాఢాలింగనము చేసుకుని ఆ మైమరపుచే పరవశులై ఇక్కడే కొందరు గోపకాంతలు శరీరమును వదిలిపెట్టేశారు. మరికొంతమంది భర్తలు అడ్డుపడుతున్నా, మామలు అడ్డుపడుతున్నా కృష్ణుడితో రాసలీల చేయాలని ఆయనతో ఆనందం అనుభవించాలని వీళ్ళనందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ రాగాలాపన చేస్తున్నాడో అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కృష్ణుడు వీరందరినీ చూసి వేళకాని వేళలో పర పురుషుడి దగ్గరకు స్త్రీలు పరుగెట్టుకు వస్తే మానం మర్యాదలు మంట కలిసిపోవా? ఈ రాత్రివేళ మీరు ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. వారు కన్నులవెంట నీరు కారుస్తూ ‘కృష్ణా! మేము రావడానికి కారణం నీకు తెలుసు. ఇక్కడవరకు వచ్చిన తరువాత నీవలన సుఖమును పొందాలని మేము వస్తే ఎందుకు వచ్చారు అని అడుగుతావా?’ అని అడిగారు.
ఈవిషయం వినేసరికి పరీక్షిత్తుకు ఆశ్చర్యం వేసింది. కొన్ని సందేహములు కలిగాయి. కృష్ణుని అడగటమేమిటి? భగవానుడు ఈ పనులు చేయవచ్చునా? ధర్మమును ఆవిష్కరించవలసిన వాడు, ధర్మమును స్థాపించవలసిన వాడు పరకాంతలయందు ఇటువంటి మోహబుద్ధిని జనింపచేయవచ్చునా?’ అని శుకమహర్షిని అడిగాడు. శుకబ్రహ్మ ‘పరీక్షిత్తూ! నీవు తొందర పడకు. రాసలీలను జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యి. దానిని నీవు తెలుసుకుంటావు’ అన్నారు.
రాసలీల ఈశ్వరుని లీల. ఈశ్వరుడు చేసే పనియందు యుక్తాయుక్తములను విచారించే అధికారం మనకు ఉండదు. ఆయన జగత్ప్రభువు. ఆయన జగత్తునందు ఏది చేసినా అడిగే అధికారం, దానిని గురించి విమర్శ చేసే అధికారం మనకి లేదు. శుకుడు కూడా ఇదే మాట చెప్పాడు. యమునానది ఒడ్డునే వేణువును ఎందుకు ఊదాలి? సూర్యునికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు యముడు, కూతురు యమున. యమున ప్రవహించి వెళ్ళిపోయే కాలము స్వరూపము. కాలము ప్రవహించి వెళ్ళిపోతున్నప్పుడు ఉన్నామని ఈ శరీరమును చూపించిన జీవులు పడిపోతూ ఉంటారు. ఎంతమంది పడిపోతుంటారో ఎవ్వరికీ తెలియదు. ఆ లెక్కపెట్ట గలిగిన వాడు ప్రపంచమునందు ఎవ్వడూ ఉండడు. ఒక్క ఈశ్వరుడికే తెలుస్తుంది. ఎందుకనగా ఆయనే కాలస్వరూపమయి ఉన్నాడు. యమున కాలప్రవాహమునకు గుర్తు. ఎప్పుడు ఆయన తన నిర్హేతుకమయిన కృపతో కొంతమందిని ఉద్ధరించాలని అనుకున్నారు. భావనయందు ఎలా పెట్టుకున్నా సరే వస్తువు అటువంటిది. ఆయనయందు భక్తితో గుండెల్లో గూడు కట్టుకున్న వాళ్ళని ఆయన ఉద్ధరించాలని అనుకున్నారు. దీనినే ఈశ్వర సంకల్పము అంటారు. ఇలా ఎందుకు ఈశ్వరుడు సంకల్పించాలి? అలా సంకల్పించడమును ‘నిర్హేతుక కృప’ అని శాస్త్రము పేర్కొంది. శరత్కాలములో ఎందుకు ఊదాలి అంటే శరత్కాలములో ఆకాశములో మబ్బులు ఉండవు. ఆకాశమంతా నిర్మలంగా తెల్లటి వెన్నెలతో కూడి ఉంటుంది. అలాగే జీవి అంతరమునందు రజోగుణము, తమోగుణము బాగా తగ్గిపోయి సత్త్వగుణ ప్రకాశముతో ఉంటాయి. సత్త్వ గుణ ప్రకాశముతో ఉన్న మనస్సులు ఏవి వున్నాయో, ఏవి నిరంతరము కృష్ణ భావన చేస్తున్నాయో అవి ఈ వేణునాదమును విని పరుగెట్టగలవు.శబ్దము అందరికీ వినపడుతుంది. ఆ శబ్దము ఉత్తేజితము చేయవలసి వస్తే అది స్త్రీ పురుషులనందరినీ చేస్తుంది తప్ప కేవలము స్త్రీలను మాత్రమే ఉత్తేజితులను చేయడమో, కేవలము పురుషులను ఉత్తేజితులను చేయడమో ఉండదు. కృష్ణుని వేణుగానము కేవలము గోపకాంతలను మాత్రమే ఎందుకు ఉత్తేజితులను చేసింది? వాళ్లకు కేవలము ఉన్నది కామోద్రేకమే అయితే వేణునాదము విన్న తరువాత మాత్రమే కామోద్రేకముతో ఎందుకు పరుగెత్తాలి? వేరొక సందర్భములో పరుగెత్తవచ్చు కదా! కామాతురత కలిగిన వాడు అందునా పర పురుష సంగమము కోరుతున్న స్త్రీ గుప్తంగా వ్యవహరిస్తుంది తప్ప తన భర్త ఎదురువస్తే త్రోసి అవతలపారేసి పరుగెడుతుందా? అది సాధ్యమయే విషయం కాదు. కానీ ఇక్కడ కొన్ని వేలమంది గోపకాంతలు పరుగెడుతున్నారు. మరి గోపాలురు పరుగెత్తరా? వారిని అడ్డుకోరా? అలా రాసలీలలో ఎందుకు జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే మనం వేణునాదమును వింటే గోపకాంతలకు ఏమయినదో తెలుసుకోవాలి. వేణు నాదమును వింటే గోపకాంతలకు ‘అనంగవర్ధనము” అయినదని చెప్పారు. అనంగవర్ధనమనే మాటను వాడి వ్యాసుల వారు మనందరి మీద సమ్మోహనాస్త్రమును వేసారు. కృష్ణుడు వేయలేదు ఆయన వేశారు. అనంగుడు అనగా శరీరము లేనివాడు - మన్మథుడు. మన్మథవర్ధనం జరిగినది అంటే లోపల కామోద్రేకము కలిగినదన్నది బాహ్యార్థము. రాసలీలనే శీర్షికను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే ‘అనంగ’ అనగా శరీరము కానిది అనగా ఆత్మ. అనగా అనంగవర్ధనము అనగా ఆత్మవర్ధనము. జీవి ఆత్మాభిముఖుడయినాడు. ఈశ్వరుని పిలుపునకు ఎవడు యోగ్యుడో వాడికి అందినది.
ఆత్మోన్ముఖులు అయ్యారని గోపకాంతలకు మాత్రమే చెపుతారు. పురుషులకు ఎందుకు చెప్పరు? ప్రపంచమునందు మనం అందరం కూడా బాహ్యంలో భార్యభర్త అంటాం. శాస్త్రమునందు మాత్రము భార్య భర్త ఉండరు. పురుషుడు ఒక్కడే ఉంటాడు ఆయనే పరమాత్మ. ప్రపంచంలో పరమాత్మ ఒక్కడు మాత్రమే పురుషుడు. మిగిలిన వారు అందరూ స్త్రీలే. అందరికీ ఒకడే భర్త జగద్భర్త. ఆయనే పరమాత్మ. అందరూ ఆయననే పొందాలి.
పతిం విశ్వశ్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం’
వాడు విశ్వేశ్వరుడు లేదా నారాయణుడు. ఏ పేరు పెట్టి పిలిచినా అభ్యంతరం లేదు. అటువంటి వాడిని పొందాలి. ఇపుడు స్త్రీయా పురుషుడా? పురుషుడిని పొందాలి కాబట్టి స్త్రీగా చెప్తారు. పరమాత్మ పురుషునిగా ఉన్నాడు. మారని వాడు మారుతున్నది శరీరము. మారుతున్న శరీరమునందు మీరు ఉండి మారని తత్త్వమయిన భగవంతుడిని అందుకోవాలి. ఇది ఎవరికో లోపల ప్రచోదనం అవుతుంది. అలా ఎవరికీ ప్రచోదనం అయిందో వారికి కృష్ణ పరమాత్మ వేణునాదము వినపడింది. వారికి అనంగవర్ధనం అయినది. పైకి కథ కామోద్రేకము కలిగినట్లు ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నది కామమా లేక మోక్షమా? వారు మోక్షమును అడుగుతున్నారు. వీరందరూ ఆత్మసుఖమును అభిలషిస్తున్నారు. ఆత్మానందమును వాక్కు చేత చెప్పడం కుదరదు. దీనిని మధురభక్తితో చెప్పాలి. మధురభక్తిని నాయిక నాయకుల వలన చెపుతారు. జీవ బ్రహ్మైక్య సిద్ధిని ప్రేయసీ ప్రియుల సమాగమముగా చెప్తారు. అందుకే జీవ బ్రహ్మైక్య సిద్ధియే కళ్యాణం. మధురభక్తిని ఆధారంగా తీసుకొని రాసలీలను వర్ణిస్తున్నారు. వ్యాసుల వారు మహాపురుషుల స్థితిని చూపిస్తున్నారు. పైకి కథ గోపికలు ఒళ్ళు తెలియని కామంతో ప్రవర్తిస్తున్న జారిణుల కథలా ఉంటుంది రాసలీల. అంతే అర్థం అయినట్లుగా మాట్లాడితే భగవంతుడి పట్ల భాగవతుల పట్ల, ముక్త పురుషుల పట్ల భయంకర అపరాధము చేశారన్నమాట. రాసలీల గురించి తెలిస్తే మాట్లాడాలి. తెలియకపోతే ఊరుకోవాలి. అంతేకాని అందులోని పరమార్థం గ్రహించలేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు.
గోపికలు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని అన్నారు. ‘ఎవరు నీ పాదములు పట్టుకుంటున్నారో వాళ్లకి సంసారం భయం పోతోంది’ అన్నారు. కృష్ణ పరమాత్మ – ‘అలా మీరు రానూ కూడదు. నన్ను అడుగనూ కూడదు. ఇంతరాత్రి వేళ నేను వంశీరవము చేస్తే మీరు మీరు పరుగెట్టుకు వచ్చి నాతో సుఖము అభిలషించి నాతో ఉంటానంటున్నారు అది చాలా తప్పు. మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి’ అన్నారు. వాళ్ళు ‘ఎన్నో జన్మల తరువాత మేము చేసిన తపస్సు పండితే ఈశ్వరా! నీ పాదముల దగ్గరకు చేరుకున్నాము. మమ్మలి తిరిగి వెళ్ళిపొమ్మంటావా? వాళ్ళు లౌకికమయిన పతులు. అది సంసారమునకు హేతువు మాకు అది వద్దు. మేము జగత్పతివయిన నిన్ను చేరాలని వచ్చాము. అందుకని మాకు సంసారము వద్దు. మేము తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరకు రాలేదు. మాకు తిరిగి రావలసిన అవసరం లేని మోక్ష పదవినీయవలసినది’ అని అన్నారు.
వాళ్ళ మాటలకు పరమాత్మ ప్రీతి చెందాడు వెళ్ళడం ఒక ఎత్తు. వెళ్ళి నిలబడడం ఒక ఎత్తు. దీనికి చాలా తేడా ఉంటుంది. రాసలీల పైకి అనేకమంది గోపకాంతలు కృష్ణుడు కలిసి ఆడుతున్నట్లు కనపడుతుంది. అది నిజం కాదు సంకేతిస్తున్నారు. అలా ఆడడంలో బ్రహ్మానందమును వారు అనుభవిస్తున్నారు. మేఘము మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతున్నారు.
అంగనామంగనామంతరే మాధవో మాధవమ్
మాధవం మాధవం చాంతరే నాంగనా
ఇత్థ మాకల్పితే మండలేమధగః
సంజగౌ వేణునా దేవకీ నందనః
గోపిక గోపిక మధ్యలో కృష్ణుడు. కృష్ణుడు కృష్ణుడు మధ్యలో గోపిక. ఎంతమందయినా ఏకకాలమునందు మోక్షమును పొందుతారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు రాసక్రీడ ఆడుతున్నాడు. మోక్షమును పొందుతున్న వారిని చూసి ఇన్ని జన్మల తరువాత ఈశ్వరునితో ఐక్యమవుతున్నారని దేవతలంతా పొంగిపోతున్నారు. దేవతలు ఈ శరీరంలోనే ఉంటారు. ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క దేవత ఉంటాడు. లోపలున్న భావ పరంపరలన్నీ అణిగి పోయి, వాసనలన్నీ అణిగిపోయి, కేవలము తాను ఆత్మస్వరూపిగా నిలబడిపోయి, ఇంద్రియములన్నీ పనిచేయడం మానివేసి, సమాదియందు లోపల ఉన్న జ్యోతి స్వరూపమేదో అదే తానుగా ఉండిపోతాడు. అలా ఉండిపోయినపుడు జీవి అపరిమితమయిన ఆనందమును పొందేస్తాడు. ఆ ఆనందము చేత ఈ శరీరము పోషింపబడుతుంది. తినడం కాని, త్రాగడం కానీ ఉండవు. ఆ ఆనందము ఈ శరీరమును కాపాడుతూ ఉండడం వలన బ్రతికి ఉంటాడు. అలా ఆనందమగ్నుడయిపోయి ఉండిపోతాడు. అలా ఉండిపోయిన సమాధిస్థితిని వర్ణన చేస్తున్నారు. ఇది గోపకాంతలు కృష్ణుడితో కలిసి అనుభవించిన రాసలీల.
యమున ఒడ్డున రాసలీల జరిగింది. వాళ్లకి పట్టిన చమటను పోగొట్టడానికి వాళ్ళు పొందుతున్న ఆనందములో శరీరమునకు పట్టిన బడలికను తీర్చడానికి యమునానది నుండి చల్లటి గాలులు వీచాయి. ఆ చల్లటి గాలులచేత వారు బహిర్ముఖులయ్యారు. ‘నేను ఆత్మ దర్శనమును పొందాను’ అని ప్రతి గోపికా అనుకుంది. ఆత్మ దర్శనమును పొందిన తరువాత మళ్ళీ ఈ ‘నేను ఎక్కడి నుండి వచ్చింది’ ఆత్మగా ఉన్నాను అనాలి. నేను అనుకుంటే మరల జారుడు మెట్లు ఎక్కినట్లే లెక్క. వారందూ మేము అందరమూ కృష్ణునితో ఆనందమును అనుభవిస్తున్నాము అన్నారు. వారు అలా అనీ అనడంతోనే కృష్ణుడు అదృశ్యం అయిపోయాడు. అనగా వారు తపస్సులో కూర్చున్నప్పుడు సమాధిస్థితి యందు కుదురుకోవడం కుదరడం లేదు. ఇపుడు వీళ్ళకి కృష్ణుడు కావాలి. ఎక్కడ ఉన్నాడని మనుష్యులను అడగడం లేదు వీళ్ళు. రకరకాల చెట్ల దగ్గరకు వెళ్ళి నీవు చూశావా? అని అడుగుతున్నారు.
నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై
జల్లెడు వాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చె నో
మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ చెప్పరే ?
వీళ్ళందరూ మల్లెపొదలను అడుగుతున్నారు. నల్లగా ఉంటాడు, చక్కటి నవ్వు నవ్వుతుంటాడు. పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు, నెమలి పింఛము ధరించిన వాడు, ఆయన అస్ఖలిత బ్రహ్మచర్యమును నిరూపించడానికే నెమలి ఈకను పెట్టుకుంటాడు. సృష్టి మొత్తం మీద స్త్రీపురుషుల సంభోగం లేకుండా పిల్లలను కనే ఏకైక ప్రాణి నెమలి. దానికి భౌతికమైన సంపర్కం లేదు. ఇదే రాసలీల. అందుకే కృష్ణుడు నెమలి ఈకను ధరిస్తాడు. కృష్ణుడు ఆడవారందరితో కలిసి జులాయిగా తిరిగిన వాడు కాదు. ఆయన పరబ్రహ్మయై జీవ బ్రహ్మైక్య సిద్ధిని ఇస్తున్నాడు. వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ అనుగ్రహమును పొందారు. జలక్రీడలు ఆడారు. దానిని రాసలీలని పిలుస్తారు.
రాసలీల అనేది ధ్యానము చేత తెలుసుకోవలసిన రహస్యము. నీవు ఎంత చెప్పినా నాకు అర్థం కావడం లేదు. ఇలా పరకాంతలతో కలిసి కృష్ణుడు ఎలా ఆడినాడని పరీక్షిత్తు పలుమార్లు శుకమహర్షిని ప్రశ్నిస్తాడు. శుకుడు ‘ఈశ్వరుడి లీల లోపల ఉండే జ్ఞానమును నీవు అందుకోలేని స్థితి ఆయినే ఒక విషయమును నీవు జ్ఞాపకం పెట్టుకో. అగ్నిహోత్రమును తీసుకువెళ్ళి శవం మీద పెట్టినట్లయితే అది శవమును కాల్చేస్తుంది. శవమును కాల్చిన అగ్నిహోత్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడయినా తలస్నానం చేస్తుందా? చెయ్యదు. శవమును కాల్చిన అగ్నిహోత్రమునకు అపవిత్రత లేదు. అగ్నిహోత్రం నీకు వంట చేసి పెట్టింది. అగ్నిహోత్రమునకు పుణ్యం రాలేదు. యజ్ఞంలో అగ్నిహోత్రం ఉన్నది. మీరు స్వాహా అంటూ హవిస్సును దేవతలకు ఇచ్చారు. అందువలన అగ్నిహోత్రమునకు గొప్పతనం ఏమీ రాలేదు. శవమును కాల్చినా అగ్నిహోత్రమునకు అపవిత్రత లేదు. ఏ పనులు చేసినా అగ్ని మాత్రం అగ్నిగానే నిలబడుతుంది. వస్తుసంపర్కం అగ్నికి లేదు. కృష్ణుని కూడా అలా భావించగలిగితే రాసలీల నీకు ఏమి ఇబ్బంది?’ అని అడిగాడు. ఆ స్థాయిలో నువ్వు ఆలోచించు. కృష్ణుడు అనగా అగ్నిహోత్రము. ఎవరిని ఉద్ధరించాలని అనుకున్నాడో వారిని అలా ఉద్ధరించాడు. ఈశ్వరునికి ఏ సంపర్కము లేదు. అందుకే నెమలి ఈక పెట్టుకున్నాడు. అగ్నిహోత్రమై ఉన్నాడు. నీ కంటికి అగ్నిహోత్రం పవిత్రత పాడవకుండా కనపడుతోంది. కృష్ణుడి విషయంలో నీకు అలా ఎందుకు కనపడదు? కనపడకపోతే అది నీ దృష్టిదోషం తప్ప కృష్ణ దోషం కాదు. నీవు అలా విను. రాసలీల నిన్ను ఉద్ధరిస్తుంది’ అని చెప్పాడు. ఆ రాసలీల అంత పరమ పావనమయిన ఘట్టం. రాసలీల పూర్తయిపోయిన పిమ్మట కృష్ణ పరమాత్మ మరల బృందావనం చేరుకుంటాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి