23, ఆగస్టు 2022, మంగళవారం

ఏకాదశులు

 *ఏకాదశులు వాటి విశిష్టతలు*


ఏకాదశి అనగానే హిందువులకు గుర్తుకు వచ్చేవి తొలఏకాదశి ముక్కోటి ఏకాదశి. కొంతమంది ఏకాదశికి ఉపవాసం ఉంటారు. ప్రతి నెలలోనూ రెండు సార్లు ఏకాదశులు వస్తాయి. వీటిలో దేని ప్రత్యేకత దానిదే.  ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి. 1. శుక్లపక్షము 2. కృష్ణ పక్షము … పక్షానికొక ఏకాదశి చొప్పున్న .. ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులుంటాయి.


ప్రతి నెల పౌర్ణమికి,అమావాస్యకు ముందు ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఆషాడ శుక్ల ఏకాదశిని ప్రధమ ఏకాదశిగా పరిగణిస్తారు. సంవత్సరం మొత్తంలో ఇలాంటి శుద్ధ ఏకాదశులు 12 వస్తాయి. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తంలో ఇలాంటి బహుళ ఏకాదశులు 12 వస్తాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ…. హిందువులు ముఖ్యంగా నాలుగు ఏకాదశులను విశేషంగా పరిగణిస్తారు. అవే


1. ఆషాడ శుద్ధ ఏకాదశి ( తొలి ఏకాదశి / శయనేకాదశి )

2. కార్తీక శుద్ధ ఏకాదశి

3. పుష్య శుద్ధ ఏకాదశి ( వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి )

4. మాఘ శుద్ధ ఏకాదశి ( భీష్మ ఏకాదశి ) వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి.


చైత్రమాసం నుంచి వచ్చే ఏకాదశుల పేర్లు – వాటి ఫలాలు ఓసారి చూద్దాం

చైత్రశుద్ధ ఏకాదశి (పున్నమి ముందు వచ్చే ఏకాదశి) – ‘కామదా’ – కోర్కెలు తీరుస్తుంది.

చైత్ర బహుళ ఏకాదశి (అమావాస్య ముందు వచ్చే ఏకాదశి) – ‘వరూధిని’ – సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.

వైశాఖ శుద్ధ ఏకాదశి – ‘మోహిని’ – దరిద్రుడు ధనవంతుడు అవుతాడు.

వైశాఖ బహుళ ఏకాదశి – ‘అపరా’ – రాజ్యప్రాప్తి.

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి – ‘నిర్జల” – ఆహార సమృద్ధి.

జ్యేష్ఠ బహుళ ఏకాదశి – ‘యోగిని’ – పాపములను హరిస్తుంది.

ఆషాఢ శుద్ధ ఏకాదశి – ‘దేవశయనీ’ – సంపత్ ప్రాప్తి(విష్ణువు యోగనిద్రకు శయనించు రోజు- తొలిఏకాదశి).

ఆషాఢ బహుళ ఏకాదశి – ‘కామికా’ కోరిన కోర్కెలు ఫలిస్తాయి.

శ్రావణ శుద్ధ ఏకాదశి – ‘పుత్రదా’ – సత్సంతాన ప్రాప్తి.

శ్రావణ బహుళ ఏకాదశి – ‘ఆజా’ – రాజ్య పత్నీ పుత్ర ప్రాప్తి, ఆపన్నివారణ.

భాద్రపద శుద్ధ ఏకాదశి – ‘పరివర్తన’ (యోగనిద్రలో విష్ణువు పక్కకు పొర్లును, అందుకే పరివర్తన యోగసిద్ధి).

భాద్రపద బహుళ ఏకాదశి – ‘ఇందిరా’ – సంపదలు, రాజ్యము ప్రాప్తించును.

ఆశ్వయుజము శుక్ల ఏకాదశి – ‘పాపంకుశ’ – పుణ్యప్రదం.

ఆశ్వయుజము బహుళ ఏకాదశి – ‘రమా’ – స్వర్గప్రాప్తి.

కార్తీక శుద్ధ ఏకాదశి – ‘ప్రబోధిని’ – (యోగనిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు) జ్ఞానసిద్ధి.

కార్తీక బహుళ ఏకాదశి – ‘ఉత్పత్తి’ – దుష్టసంహారం (మురాసురుని సంహరించిన కన్య విష్ణుశరీరం నుండి జనించిన రోజు).

మార్గశిర శుద్ధ ఏకాదశి – ‘మోక్షదా’ – మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

మార్గశిర బహుళ ఏకాదశి – ‘విమలా’ -(సఫలా) – అజ్ఞాన నివృత్తి.

పుష్య శుద్ధ ఏకాదశి – ‘పుత్రదా’ – పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

పుష్య బహుళ ఏకాదశి – ‘కళ్యాణీ’ (షట్ తిలా) ఈతిబాధా నివారణం.

మాఘ శుద్ధ ఏకాదశి – ‘కామదా’ (జయా) – శాపవిముక్తి.

మాఘ బహుళ ఏకాదశి – ‘విజయా’ – సకలకార్య విజయం.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి – ‘ఆమలకీ’ – ఆరోగ్యప్రదం.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి – ‘సౌమ్య’ – పాపవిముక్తి

(కొన్నికొన్ని పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో కొన్ని బేధాలున్నాయి. వాటిని ఇక్కడ ప్రస్తావించట్లేదు)


24 ఏకాదశులలోనూ – సౌరమానంలో ప్రసస్తమైన ధనుర్మాసంలో (మార్గశిర/పుష్యమాసాల్లో) వచ్చే శుక్లపక్ష ఏకాదశిని “వైకుంఠ ఏకాదశి”గా కీర్తిస్తున్నాం. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు.  సౌరమానం ధనుర్మాసం కాగా, అందులో వచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానానుసారిణి, శ్రీమన్నారాయణునకు సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను. కన్నులు వేర్వేరు ఐనా దృష్టి మాత్రం ఒక్కటే అయినట్లుగా సూర్యచంద్రులు వేర్వేరు అయినా….. కాంతితత్త్వం ఒక్కటే అనే మహాతత్వాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది.


వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర, పుష్య మాసాల్లో వస్తుంది. రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకొని వైకుంఠము చేరి, హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశినాడు శ్రీహరిని ప్రార్థించి, తమ బాధను విన్నవించారు. స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి, అభయం ఇచ్చుట జరిగింది. దేవతల బాధా నివారణకి ఈ ఏకాదశియే మార్గం చూపింది.


🚩 * 🚩

కామెంట్‌లు లేవు: