*సీతారాములకళ్యాణము* (4/4)
పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణము బాలకాండము నుండి….
* మాండవీ శ్రుతకీర్తులను భరతశత్రుఘ్నులకు ఇవ్వగోరుట*
విదేహాధివతియగు జనకమహారాజు పలికిన మాటలు విని వసిష్టవిశ్వామిత్రులు ఆతనితో ఇట్లు పలికిరి.
“జనకమహారాజా! ఇక్షాకువిదేహవంశములు ఊహింపరాని, ఇంత అని చెప్పుటకు శక్యముకాని ప్రభావము కలవి. అట్టి వంశీయులతో సమాను లెవ్వరును లేరు. సీతాఊర్మిళలను రామలక్ష్మణులకిచ్చి వివాహము చేయుట అనునది పరస్పర వంశగొరవాదులకును, (వధూవరుల) రూపసంపదకును తగిన సంబంధము.
మేము చెప్పదలచిన మాటలను వినుము.
నీ తమ్ముడైన ఈ కుశధ్వజుడు ధర్మము నెరిగినవాడు. భూలోకమునందు సాటిలేని రూపము గలవాడగు ఈ ధర్మాత్ముని ఇరువురు పుత్రికలను భరతశత్రుఘ్నులకు భార్యలనుగా వరించమనుచున్నాము.
భరతకుమారుని కొరకును, ధీమంతుడైన శత్రుఘ్నుని కొరకును నీ తమ్ముని కుమార్తెలను కోరుచున్నాము.
ఈ దశరథకుమారు లందరును రూపయౌవనములతో ప్రకాశించుచున్నవారు. లోకపాలులతో సమానులు. దేవతలవంటి పరాక్రమము గలవారు. పుణ్యకర్మలుగల నీవంశమునకును, ఇక్షాకువంశమునకును ఈ వివాహసంబింధముచే దృఢమైన బంధము ఏర్పడుగాక!”
వసిష్టుని అనుమతి ననుసరించి విశ్వామిత్రుడు పలికిన ఈ మాటలు విని, జనకమహారాజు అంజలి ఘటించి, ఆ వసిష్టవిశ్వామిత్రులతో ఇట్లనెను.
“మునిశ్రేష్టులైన మీరు మాకు తగిన కులసంబంధమును గూర్చి స్వయముగ ఆజ్ఞాపించుచున్నారు. అందుచే మా వంశము ధన్యమైనది. మీరు చెప్పినట్లే అగుగాక! ఈ కుశధ్వజుని కుమార్తెలగు మాండవీ శ్రుతకీర్తులు, కలిసి సంచరించెడు ఈ భరతశత్రుఘ్నులకు(వరుసగ) భార్యలై వారిని సేవింతురుగాక!
మహామునీ! మహాబలశాలులగు నలుగురు రాజపుత్రులును ఒకే దివసమున నలుగురు రాజపుత్రికలను వివాహమాడుదురుగాక! సంతానదాతయగు భగుడు దేవతగా గల ఉత్తరనక్ష్మత్రముతో కూడిన దివసమున వివాహకృత్యము శ్రేష్టమని బుద్ధిమంతులు చెప్పుదురుకదా?”
జనకమహారాజు ఈవిధముగ సౌమ్యమగు వాక్యము పలికి, లేచి, దోసిలి కట్టి, ఆ మహామును లిరువురితో మరల ఇట్లనెను.
“మీరు నాకు గొప్ప ధర్మకార్యమును నెరవేర్చినారు. నేను ఎల్లప్పుడును మీ శిష్యుడనే. మునిపుంగవులైన మీ రిరువురును ఈ మూడు సింహాసనములను (జనక -దశరథ -కుశధ్వజుల సింహాసనములను,) అధిష్టింతురుగాక! దశరథునకు మిథిలపై అధికారమున్నట్లే నాకును అయోధ్యపై అధికారమున్నది. అందుచేతనే దశరథుని రాజ్యముపై కూడ మీకు అధికారము నిచ్చుచున్నాను. ప్రభుత్వ విషయమున సందేహములేదు. తగు విధముగ కార్యము నిర్వహింపుడు.”
దశరథమవోరాజు జనకుని మాటలకు సంతసించి ఆతనితో, “మిథిలాధిపతులైన మీ సోదరు లిరువురును ఇన్ని అని చెప్పలేని సద్గుణములు గలవారు. మీ రెందరో బుషులను, రాజులను పూజించి వారినుండి సద్దుణములను అలవరచుకొనినారు. మీకు మేలగుగాక! నేను నా నివాసమునకు వెళ్ళి నాందీముఖశ్రాద్ధాదికర్మలు చేసెదను.” అని పలికెను.
*వివాహ మహోత్సవము*
_స్నాతకము_
మహాయశఃశాలియగు దశరథమహారాజు అపుడు, జనకునివద్ద సెలవు గైకొని వసిష్టవిశ్వామిత్రులతో నిజనివాసమునకు వెళ్లెను. అతడు తన నివాసగృహము చేరి యథాశాస్త్రముగ శ్రాద్ధము చేసి, మరునాడు ప్రాతఃకాలముననే లేచి అపుడు చేయవలసిన స్నాతకవ్రతమును జరిపించెను. ఒక్కొక్కకుమారు నుద్దేశించి ఒక్కొక్క లక్షచొప్పున గోవులను బ్రాహ్మణులకు దానము చేసెను.
_గోదానవ్రతము_
పురుష శ్రేష్టుడు, పుత్రులయందు అత్యధిక ప్రేమ కలవాడును అగు దశరథమహారాజు లేగదూడలతో కూడినవి, క్షీరసమృద్ధములు అయిన నాలుగు లక్షల గోవులను కొమ్ములకు బంగారు తొడుగులు వేయించి, (పాలు పితుకుటకు) కంచుపాత్రలతో కూడ దానము చేసెను. ఇంకను అత్యధికమైన ఇతర ద్రవ్యమును, పుత్రుల గోదానవ్రతసమయమున బ్రాహ్మణులకు దానము చేసెను.
గోదానవ్రతము పూర్తిచేసికొనిన కుమారులు చుట్టును నిలచియుండగా ఆ దశరథమవోరాజు లోకపాలుల మధ్య నున్న బ్రహ్మవలె ప్రకాశించెను.
_యుధాజిత్తు_
దశరథమహారాజు కుమారులకు గోదానవ్రతము జరిపించిన దివసముననే భరతుని మేనమామ యగు యుధాజిత్తు మిథిలకు వచ్చెను. కేకయరాజకుమారుడును, భరతుని మేనమామయు అగు ఆ యుధాజిత్తు రాజును చూచి, కుశలప్రశ్న మడిగి ఇట్లు చెప్పెను.
“మహారాజా! కేకయదేశప్రభు వైన మా తండ్రి స్నేహపూర్వకముగ నిన్ను కుశలప్రశ్న చేసినాడు. నీవు ఎవరి కుశలమును కోరుచుందువో వారందరును ఇపుడు ఆరోగ్యముగ నున్నారు.
మా తండ్రి మా మేనల్లుని చూడవలెనని కోరుటచే అందుకొరకై నేను అయోధ్యానగరమునకు వెళ్లి యుంటిని. నీ కుమారులు వివాహముకొరకై నీతో కలిసి మిథిలకు వెళ్లినారని అయోధ్యలో తెలిసినది. వెంటనే నేను నా సోదరిపుత్రుని చూచుటకై శీఘ్రముగా ఇచటికి వచ్చినాను.”
దశరథుడు పూజార్హుడైన ఆ ప్రియాతిథిని చూచి ఆతనిని అధికసత్కారములతో పూజించెను.
కర్మవేత్త యైన దశరథుడు మహాత్ములైన పుత్రులతో ఆ రాత్రి గడపి, ప్రాతః కాలమున లేచి, కర్మ లాచరించి, బుషులను ముందిడుకొని యజ్ఞవాటికను చేరెను.
సర్వాలంకారములచే అలంకృతులైన సోదరులతో కూడిన రాముడు విజయ మనెడు యుక్తమైన ముహూర్తమునందు తోరము, బాసికము కట్టుట మొదలగు వివాహమంగళములు జరుపుకొని, వసివ్టాదిమహర్షులను ముందిడుకొని, సోదరసహితుడై తండ్రివద్దకు చేరెను.
వసిష్ట మహాముని జనకుని వద్దకు వెళ్లి “జనకమహారాజా! దశరథమహారాజు కుమారుల కౌతుకమంగళము పూర్తిచేసి కన్యాదాతవైన నీకొరకు ఎదురు చూచుచున్నాడు. ఇట్టి పనులు దాత, ప్రతిగ్రహీత ఇరువురు కలిసినప్పుడే జరుగును. ఉత్తమమైన వివాహమును చేసి స్వధర్మము నాచరించుము.” అని చెప్పెను.
-కన్యాదానము_
పరమౌదార్యవంతుడు, మహాజేజఃశాలి, పరమధర్శవేత్త అయిన జనకుడు వసిష్టుని మాటలు విని, “వసిష్టమునీంద్రా! దశరథుడు లోనికి ఎందుకు రాలేదు? ద్వారమువద్ద ఎవరైనా అడ్డగించినారా? దశరథ మహారాజును అడ్డగించగల ద్వారపాలకుడు ఎవడైనా ఉన్నాడా? లోనికి ఏల రాలేదు? ఎవరి ఆజ్జకై ఎదురుజూచుచున్నారు? స్వగ్భృహములో సంకోచమెందుకు? ఈ రాజ్యము కూడ నీ రాజ్యమువంటిదే కదా!
నా కన్యలు కౌతుకమంగళములు పూర్తిచేసికొని, ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె వేదికసమీపమున చేరియున్నారు. నేను సిద్ధుడనై వేదిదగ్గర ఉండి మీకొరకు ఎదురుచూచుచున్నాను. దశరథమహారాజు విఘ్నము లేవియు లేకుండ శుభకార్యము జరుపుగాక! ఆలస్యమెందులకు?” అనెను.
దశరథుడప్పుడు జనకుని వాక్యము విని, కుమారులను, సకలబుషులను కూడ లోనికి తీసికొనివెళ్లిను.
పిమ్మట జనకుడు వసిష్టుని, “ధార్మికుడవైన వసిష్టమహామునీ! ఇతర బుషుల సహాయముతో, లోకాభిరాముదైన రాముని వివాహక్రియను జరిపింపుము.” అని (ప్రార్ధించెను.
_అగ్నివేదిక_
వసిష్టమహర్షి “అటులనే చేసెదను.” అని జనకునకు చెప్పి, విశ్వామిత్ర శతానందులను ముందిడుకొని, మండపము మధ్య యథాశాస్త్రముగ అగ్నివేదికను నిర్మించెను. దాని చుట్టును గంధపుష్పములు, బంగారు పాలికలు, అంకురములు గల రంధ్రములతో కూడిన కుంభములు, అంకురములతో నిండిన మూకుళ్లు, ధూపముతో కూడిన ధూపపాత్రలు, శంఖభాకారములైన పాత్రలు, స్రుక్కులు, ్రువములు, అర్హోదకము నింపిన పాత్రలు, పేలాలు నింపిన పాత్రలు, సంస్కరించిన అక్షతలు ఉంచి అలంకరించెను.
మహాతేజశ్శాలి, పూజ్యుడు అయిన వసిష్టుడు వేదిచుట్టు, యథాశాస్తముగ, మంటత్రపూర్వకముగ, సమములైన దర్భలను పరిచెను. పిమ్మట యథాశాస్త్రముగా, మంత్రపూర్వకముగా వేదియందు అగ్నిని ఉంచి, అగ్నిలో హోమము చేసెను.
_సీతారామకల్యాణమహోత్సవఘట్టము_
పిమ్మట జనకమహారాజు, సర్వాభరణభూషితురా లగు సీతను తీసికొనివచ్చి, అగ్ని సమక్షమున, రామునకు ఎదురుగా నిలబెట్టి, కౌసల్యానందవర్ధనుడగు ఆ రామునితో, “రామా! ఇదిగో ఈమె నా కుమార్తె సీత. ఈమె నీకు సహధర్మచారిణి కాగలదు. ఈమెను స్వీకరింపుము. నీ హస్తముతో ఈమె హస్తమును పట్టుకొనుము (పాణిగ్రహణము చేయుము). మహాభాగ్యవంతురాలగు ఈమె పతివ్రతయై నీడపలె సర్వదా నిన్ను అనుసరించి యుండగలదు.” అని పలికి, మంత్రపూతమైన జలము వదలెను.
ఆ సమయమున దేవరలును, బుషులును “బాగు బాగు.” అని పలికిరి, దేవదుందుభులు మ్రోగినవి. పుష్పవర్షము కురిసినది.
జనకమహారాజు మంత్రోదకపూర్వకముగా సీతను ఇచ్చిన పిమ్మట ఆనందముతో నిండినవాడై,
“లక్ష్మణా! రమ్ము. నీకు క్షేమమగుగాక! _ (నా కుమార్తె) ఊర్శిళను న్వీకరింపుము. ఈమె హస్తమును నీహస్తముతో గ్రహింపుము. ఆలస్యము చేయకుము”.
లక్ష్మణునితో ఇట్లు పలికి పిదప భరతునితో, “భరతా! మాండవి హస్తమును నీహస్తముతో గ్రహించుము.” అనెను.
అతడు శత్రుఘ్నునితో కూడ, “ఓ మహాబాహూ! శ్రుతకీర్తి హస్తమును నీహస్తముతో పట్టుకొనుము” అని పలికి,
“ఓ రామలక్ష్మణభరతశత్రుఘ్నులారా! మీరందరును సౌమ్యులు. అందరును మంచినడవడిక, నియమములు కలవారు. మీ భార్యలను స్వీకరింపుడు. ఆలస్యము చేయవద్దు” అనెను.
జనకుని వాక్యము విని ఆ నలుగురు రాజకుమారులును, వసిష్టుని అనుమతి పొంది, తమ హస్తములతో ఆ నలుగురు కన్యల హస్తములను గ్రహించిరి.
మహాత్ములైన ఆ రఘువంశకుమారులు, భార్యాసమేతులై, అగ్నికిని, వేదికకి, జనకమహారాజునకును, బుషులకును, ప్రదక్షిణము చేసి, వసిష్టాదులు చెప్పిన విధమున, యథావిధిగ వివాహము చేసికొనిరి.
రామలక్ష్మణభరతశత్రుఘ్నులు, సీతా-ఊర్మిళా-మాండవీ - శ్రుతకీర్తుల సుకుమారములైన హస్తములు గ్రహించగనే ఆకాశమునుండి మిక్కిలి ప్రకాశించుచున్న గొప్ప పుష్పవృష్టి కురిసినది.
రాఘవుల వివాహసమయమున స్వర్గమునందు దుందుభులు మోగినవి. గీతమంగళవాద్యధ్వనులతో అప్సరసలు నాట్యము చేసిరి, గంధర్వులు మధురముగా గానము చేసిది. ఇది అంతయు ఆశ్చర్యకరముగా కనబదెను. ఈవిధముగ తూర్యాదిధ్వని ప్రవర్తిల్లుచుండగా రామలక్ష్మణ భరతశటతుఘ్నులు మూడు పర్యాయములు అగ్నిప్రదక్షిణము చేసి, భార్యలను వివాహమాడిరి.
పిమ్మట రామలక్ష్మణభరతశత్రుఘ్నులు భార్యలతో గూడి తమ విడిదికి వెళ్లిరి బుషులతోను, బంధువులతోను, కూడిన దశరథుడుకూడ భార్యాసమేతులైన పుత్రులను చూచుకొనుచు వెనుకనే వెళ్లెను.
రాత్రి గడచిన పిదప విశ్వామిత్ర మహాముని ఆ రాజకుమారులకు అనేకాశీర్వాదముల నిచ్చి, జనకదశరథమహారాజులవద్ద సెలవు గైకొని హీమవత్పర్వతమునకు వెళ్లిపోయెను.
విశ్వామిత్రుడు వెళ్లిన పిమ్మట దశరథమహరాజు జనకమహారాజు వద్ద సెలవు గైకొని శీఘ్రముగ అయోధ్యకు బయలుదేరెను.
జనకమహారాజు, ప్రయాణమై వెళ్లుచున్న దశరథమహారాజును అనుసరించి వెళ్లి సాగనంపెను. ఆతడు కుమార్తెలకు అరణముగా అత్యధికమగు ధనము నిచ్చెను.
ఆ మిథిలేశ్వరుడు లక్షలకొలది ఆవులను, శ్రేష్టమైన కంబళీలను, కోట్లకొలది పట్టువస్తములను, ఏనుగులు, అశ్వములు, రథములు, కాలిబంటులును గల చతురంగసైన్యమును, మంచి సౌందర్యము కలవారు, బాగుగా అలంకరించుకున్నవారు, శ్రేష్టులును అయిన దాసీదాసులను కుమార్తెలకు అరణముగా పంపెను. ఆతడు సంతోషముతో వెండి, బంగారము, ముత్యములు, పగడములు, వీటి రూపములో నున్న అత్యధికమగు కన్యాధనమును ఇచ్చెను. కుమార్తెలకు అత్యధికమైన ధనమునిచ్చి, దశరథమహారాజు వద్ద అనుజ్జ గైకొని తన నివాసస్థాన మగు మిథిలాపురిని ప్రవేశించెను.
దశరథమహారాజు మహాత్ములైన కుమారులతో కూడి, బుషు లందరిని ముందు ఉంచుకొని, సైన్యము, అనుచరులు వెంట రాగా, అయోధ్యకు బయలుదేరెను.
🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి