10, జూన్ 2023, శనివారం

♦️ *ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 86*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 86*


పర్వతకుడు మరణించాడు. 


విషకన్య పొందు అనుభవించిన పర్వతకుడు తెల్లవారేసరికి శయనమందిరంలో శవమై కనిపించాడు. అతడితో పాటు విషకన్య మదుశాలిని కూడా మరణించింది. 


రాజలోకంలో ఈ దుర్వార్త కారుచిచ్చులా వ్యాపించింది. పర్వతకుని భటులు ప్రతీకారంతో రగిలిపోతూ విధ్వంసాలకి పూనుకున్నారు. అందుకు ప్రతిగా రాక్షసామాత్యుని అభిమానులమని చెప్పుకుంటూ కొందరు సైనికులు పర్వతక భటులను ముందు, వెనకాలనుంచి దాడి చేసి రెప్పపాటులో ఊతకోతకోశారు. మిగిలివున్న పర్వతకసైన్యాలు ఆ విధంగా నాశనమయ్యాయి. 


భద్రతా కారణాల సాకుతో పర్వతకుని సోదరుడు వైరోచనుడు, కుమారుడు మలయకేతు వారివారి అతిథి గృహాల్లోనే గృహనిర్బంధంలో ఉంచబడ్డారు. తాము గృహ నిర్బంధంలో ఉన్నామని తెలుసుకున్న వాళ్ళిద్దరూ ఒకరినొకరు సంప్రదించుకునే అవకాశం లేక, ఆ నిర్బంధంలోంచి బయటపడే మార్గం కానక లోలోపలే పగతో రగిలిపోసాగారు. 'పర్వతకుని మరణానికి రాక్షసామాత్యుడే కారకుడు' అన్న వార్త క్షణాల్లో నగరం అంతటా వ్యాపించింది. ఆవేశపరులు కొందరు రాక్షసుని నివాసం మీద దాడి చేశారు. కానీ, అప్పటికే అమాత్యుడు భార్యబిడ్డలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 


"పర్వతకునిది అదృష్టమో, దురదృష్టమో... ఇప్పుడు తెలిసిందా ?" నవ్వుతూ ప్రశ్నించాడు చాణక్యుడు. 


ఆయనే అడ్డుపడక పోయి ఉంటే పర్వతకునికి పట్టిన దుర్గతి తనకే పట్టి ఉండేదని అర్థం చేసుకున్న చంద్రుడు కృతజ్ఞతతో ఆర్యునికి నమస్కరించాడు. అంతలో సేనాని బాగురాయణుడు వచ్చి పరిస్థితులను వివరించాడు. చాణక్యుడు అతనితో కాసేపు గుసగుసలాడాడు. బాగురాయణుడి మొహంలో ఆశ్చర్యంతో రంగులు మారిపోయాయి. ఆర్యుని ఆలోచనా పటిమకు అచ్చెరువొందుతూ, ఆయనకి నమస్కరించి, కార్యార్థియై బయలుదేరాడు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని చంద్రుడు అడగలేదు. చెప్పవలసిన విషయాన్ని చెప్పవలసిన తరుణంలో ఆర్యుడే చెబుతాడని చంద్రుడికి చాణక్యునిపై గట్టి నమ్మకం. అందుకే మౌనం వహించాడు. 


బాగురాయణుడు సరాసరి వెళ్లి గృహనిర్బంధంలో ఉన్న పర్వతక కుమారుడు మలయకేతుని దర్శించాడు. అతడు ఆగ్రహావేశాలతో మండిపడుతూ "భద్రతా కారణాలు సాకుగా చూపుతూ మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వడం లేదు. బయట అసలేం జరుగుతున్నదో మాకు తెలియడం లేదు. కనీసం మా తండ్రిగారి శవాన్ని చూసే అవకాశం కూడా మాకు లేకుండా చేశారు. ఇది నిజంగా భద్రతా కారణమా ? లేక గృహ నిర్బంధమా ?" అని అరిచాడు ఆగ్రహావేశాలతో. 


"మీరు ఎలా అనుకుంటే అలా....?" అన్నాడు బాగురాయణుడు నెమ్మదిగా. 


మలయకేతు అదిరిపడుతూ "అంటే....? రాక్షసామాత్యుడు స్నేహధర్మాన్ని విస్మరించి మా మీద ఇంత కుట్ర చేస్తాడా ?" అడిగాడు విస్మయంగా. 


బాగురాయణుడు నవ్వి "పాపం అమాత్యుడు అమాయకుడు. నల్లనివన్నీ నీళ్లు తెల్లని వన్నీ పాలు అని నమ్మే మహానుభావుడు. చాణక్యుడు నమ్మించాడు. నమ్మి, విషకన్య అని తెలియక ఆమెని చంద్రగుప్తునికి సమర్పించాడు. చాణక్యుడు తెలివిగా తాననుకున్న పథకం ప్రకారం ఆ విషకన్యని మీ తండ్రిగారికి సమర్పించి ఆయన ప్రాణాలు హరించాడు. పాపం చెడ్డపేరు రాక్షసునికి.... ప్రతిఫలం చాణక్యునికి..." చెప్పాడు తగ్గు స్వరంతో. 


ఆ కథ విని నిర్ధాంతపోయాడు మలయకేతు. తనంత దూరం ఆలోచించలేకపోయినందుకు తిట్టుకున్నాడు. 'నిజమే ! తన తండ్రిని హత్య చేయిస్తే రాక్షసునికి ఏం వొరుగుతుంది ? అర్ధరాజ్యం ఇవ్వకుండా ఎగగొట్టడానికి చాణక్యుడు ఈ నాటకం ఆడి ఉంటాడు. దుష్టపన్నాగంతో తన తండ్రిని తనకి లేకుండా చేశాడు. దుర్మార్గుడు.' 


"ఆ చాణక్యుడిని...." అంటున్నాడు మలయకేతు ఆవేశంతో. 


"ఏమీ చెయ్యలేరు...." అంటూ బాగురాయణుడు అడ్డుపడి "రాక్షస అనుచరుల పేరుతో చాణక్యుడే మీ మిగిలిన సైనికులనందరినీ ఊచకోత కోయించాడు. ఇక్కడ మిమ్మల్ని, అక్కడ మీ పినతండ్రి వైరోచనుల వారిని భద్రత పేరుతో గృహనిర్బంధంలో ఇరికించాడు. ఇక ఏ నిమిషంలోనైనా 'తిరుగుబాటు దార్లు' అన్న పేరు ఎవరికో అంటగట్టి మిమ్మల్ని కూడా...." అని అసంపూర్తిగా వాక్యాన్ని వదిలేశాడు. 


మలయకేతు గొంతులో తడారిపోయింది. ఆవేశం చప్పగా చల్లారిపోయింది. ఎలాగైనా ప్రాణాలతో అక్కడినుంచి పారిపోతే చాలనిపించింది. 


"ఇప్పుడెలా....?" దీనంగా బాగురాయణుడిని ప్రశ్నించాడు మలయకేతు. 


బాగురాయణుడు అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ "చాణక్యుడితో నాకు సరిపడదు. అందుకే నిజం చెప్పి ఎలాగైనా మిమ్మల్ని తప్పించాలన్న ఉద్దేశ్యంతో ఇక్కడికొచ్చాను. ఇక్కడి కాపలాదారులు కొందరు నాకు నమ్మకస్తులు, మీరు మీ దుస్తులు వదిలేసి సాధారణ సైనికుడి దుస్తులు ధరించండి. నా మనుషులు మిమ్మల్ని తీసుకెళ్లి ఎలాగోలా కోట దాటిస్తారు. కోట బయట మీ కోసం ఒక అశ్వం సిద్ధంగా ఉంటుంది. పారిపోండి. సురక్షితంగా మీ రాజ్యానికి చేరుకోండి. అదృష్టం బాగుంటే మళ్ళీ కలుసుకుందాం..." అని చెప్పాడు. 


బాగురాయణుడి సలహాలు పాటించి సైనిక దుస్తుల్లో కోటదాటి ప్రాణభీతితో పారిపోయాడు మలయకేతు.


మలయకేతు పలాయన వార్త విన్న పర్వతక సోదరుడు వైరోచనుడికి కావాలి భటుల ద్వారా తెలిసింది. అయితే అతడు మలయకేతులాగా భయపడి పారిపోయే ప్రయత్నం గురించి ఏమాత్రం యోచించలేదు. ఆ విషయం చారుల ద్వారా చాణక్యునికి తెలియజేయబడింది. 


ఇక పట్టాభిషేకమునకు శుభముహూర్తం నిర్ణయం చేయించిన చాణక్యుడు స్వయంగా వచ్చి వైరోచనుడిని కలుసుకున్నాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్యా ముభావం చోటుచేసుకుంది. 


చాణక్యుడే కల్పించుకుని "విషకన్యను బహిరంగంగా సమర్పించిన వాడు రాక్షసుడు. అందులో నా ప్రమేయం ఏముంది ? కుమార మలయకేతు అపార్థం చేసుకుని మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అయినా మేము మాటంటే మాటే ! మీ అన్నగారికి వాగ్దానం చేసిన అర్థరాజ్యాన్ని మీకు కట్టబెట్టాలని నిశ్చయించాం. పట్టాభిషేకానికి రేపే ముహూర్తం..." అని చెప్పాడు. 


అర్ధ రాజ్యాభిషేకం తనకి చేస్తారనగానే వైరోచనుడు సంబరపడిపోతూ "అయ్యో..! మీ మంచితనం నాకు తెలియదా ? మీ అభీష్ట ప్రకారం కానివ్వండి" అని చెప్పాడు. 


చాణక్యుని అభ్యర్థన మేరకు వైరోచనుడే పర్వతకునికి అంత్యక్రియలు జరిపించాడు. ఆ చర్యతో అతనికి చాణక్యుని మీద మరింత నమ్మకం ఏర్పడింది. 


చంద్రగుప్తుని పట్టాభిషేక మహోత్సవం గురించి పాటలీపుత్ర నగరం అంతటా దండోరా వెయ్యబడింది. 


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: