10, జూన్ 2023, శనివారం

సీతారాములకళ్యాణము* (3/4)

 *సీతారాములకళ్యాణము* (3/4)


పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణము బాలకాండము నుండి….


*కుశధ్వజునకు కబురు*

ప్రాతఃకాలమున మహర్షులు కర్తవ్యకర్మ లన్నియు చేయించిన పిమ్మట వాక్యకుశలుడైన జనకుడు పురోహితుడైన శతానందునితో, “మహాతేజశ్చాలి, అతిధార్మికుడు అయిన నా తమ్ముడు కుశధ్వజుడు, ఇక్షుమతీనదీతీరమున నీటిలో పాత ఇనుప శూలములు సరిహద్దుగా గలది, పరిశుద్ధమైనది, పుష్పక విమానమువంటిది అయిన శుభమైన సాంకాశ్యనగరములో నివసించుచున్నాడు. 


అతడు సంభారములను సమకూర్చుట మొదలగు పనుల ద్వారా నాకు యజ్ఞసంరక్షణ చేసినవాడు. అతనిని చూడవలెనని అనుకొనుచున్నాను. ఆ మహాతేజస్వికూడ నాతో ఈ ఆనందమును అనుభవించవలెను. ” అని పలికెను. 

జనకుడు శతానందునితో ఇట్లు చెప్పగా అచటికి శతానందుడు పిలువనంపగా వచ్చిన కొందరు ఉత్సాహవంతు లగు దూతలను జనకు డాజ్ఞుపించెను. ఆ దూతలు జనకుని ఆజ్ఞ ప్రకారము కుశధ్వజుని తీసికొనివచ్చుటకై వేగముగా పరుగెత్తు అశ్వములను అధిరోహించి వెళ్లిరి. 

వారు సాంకాశ్యమునకు వెళ్లి కుశధ్వజుని చూచి, జరిగిన విషయము నంతను తెలిపి జనకుని అభిప్రాయమును నివేదించిరి. కుశధ్వజుడు, ఆ దూతలు చెప్పిన వృత్తాంతమును విని జనకుని ఆజ్ఞ ననుసరించి మిథిలానగరమునకు వచ్చెను. 


* దశరథుని వంశ పూర్వపురుషుల పరిచయము*

ఆ కుశధ్వజుడు, ధర్మనిరతుడును, మహాత్ముడును అగు జనకుని చూచెను. శతానందునకును, ధార్మికుదైన జనకునకును అభివాదనము చేసి, రాజోచితమగు శ్రేష్టమైన ఆసనమును అధిష్టించెను. 

మహాతేజఃశాలులును, వీరులును అగు ఆ సోదరు లిరువురును కూర్చుండి మంత్రులలో శ్రేష్టుడైన సుదామనుని, “మహామంత్రీ! అమితమైన తేజస్సు కల దశరథుని వద్దకు వెళ్లి, పుత్రమంత్రిసమేతముగ అతనిని తీసికొనిరమ్ము.” అని చెప్పి దశరథుని వద్దకు పంపిరి.

ఆతడు విడిదికి వెళ్ళి, అచట రఘువంశవర్ధనుడైన దశరథుని చూచి, తలవంచి నమస్కరించి, “దశరథమహారాజా! మిథిలాధిపతియైన జనకమహారాజు, ఉపాధ్యాయ పురోహితసమేతుడవైన నిన్ను చూడవలెనని అనుకొనుచున్నాడు.” అని చెప్పెను. 

దశరథమహారాజు ఆ మంత్రి మాటలు విని, ఋషులతోను, బంధువులతోను కలిసి జనకుడున్న చోటికి వెళ్లెను. బంధువులతోడను, ఉపాధ్యాయులతోడను కూడినవాడు, మాటలలో నేర్పరి అయిన దశరథుడు జనకునితో,

“మహారాజా! పూజ్యుడైన వసిష్టమహర్షి మా వంశమువారి కందరికిని దేవత అనియు, అన్ని పనులందును మా పక్షమున మాటలాడువా దనియు నీకు తెలియునుగదా? విశ్వామిత్రుని అనుజ్జను, సకలమహర్షుల అనుజ్జ్ఞను పొంది ధర్మాత్ముడైన వసిష్టుడు నా వంశములోని పూర్వపురుషులను గూర్చి యథాక్రమముగా చెప్పగలడు.” అని పలికెను.

అపుడు మాటలలో నేర్చరియగు పూజ్యుడైన వసిష్టమహర్షి పురోహితులతో గూడిన జనకమహారాజుతో ఇట్లనెను.

“అవ్యక్తమునుండి పుట్టినవాడును, ఎల్లప్పుడు ఉండువాడును, నిత్యుడును, వినాశరహితుడును అగు బ్రహ్మదేవునినుండి మరీచియు, మరీచినుండి కాశ్యపు దడనెడు కుమారుడును పుట్టెను. కాశ్యపునకు సూర్యుడు జనించెను. సూర్యుని కుమారుడు మనువు. పూర్వము ప్రజాపతిగ ఉన్న మనువునకు ఇక్ష్వాకువు జనించెను.

ఆ ఇక్షాకువు అయోధ్యలో మొదటి రాజుగా ఉండెను. శ్రీమంతుదగు కుక్షి ఇక్ష్వాకుని పుత్రుడు. పిమ్మట కుక్షికి వికుక్షి అను నతడు కుమారుడుగా పుట్టెను.


వికుక్షి కుమారుడు, మహాలేజఃశాలియు, ప్రతాపవంతుడును అగు బాణుడు. మహాతేజస్వి, ప్రతాపవంతుడు అయిన అనరణ్యుడు బాణుని కుమారుడు. అనరణ్యునకు పృథువు, పృథువునకు త్రిశంకువు కుమారులుగా జన్మించిరి. 

త్రిశంకువునకు దుందుమారుడను గొప్ప కీర్తిగల కుమారుడు పుట్టెను. ఆతనికి యువనాశ్వు దని కూడ పేరు. మాంధాత చక్రవర్తి యువనాశ్వుని కుమారుడు. మాంధాతకు సుసంధియను శ్రీమంతుడగు కుమారుడు జనించెను. ఆతనికి ఢ్రువసంధి, ప్రసేనజిత్‌ అను ఇరువురు కుమారులు జనించిరి. ధ్రువసంధికి కీర్తిమంతుడగు భరతు డను కుమారుడు పుట్టెను. భరతునకు గొప్ప తేజస్సుగల అసితు దను కుమారుడు పుట్టెను. 

హైహయ - తాలజంఘ - శశిబిందు వంశములకు చెందిన రాజులు ఈ అసితునకు శత్రువులైరి. ఆ అసితమహారాజు శత్రువులతో యుద్ధము చేసి, పరాజితుడై రాజ్యభ్రష్టు డయ్యెను. అల్బమైన సైన్యముతోడను, మంత్రులతోడను కలిసి హిమవత్పర్వతమునకు వెళ్లి అచట భృగుప్రస్రవణ మను ప్రదేశమున నివసించెను. 


ఆ సమయమున అతని భార్యలలో ఇద్దరు గర్భవతులై యుండిరి. వారిలో ఒకతె సవతి గర్భము నష్టమగుటకై ఆమెకు విషముతో కూడిన ఆహార మిచ్చినదట. ఆ దివసములలో రమ్యమైన పర్వతశ్రేష్టమునందు అభిరుచి గల భృగువంశ సంజాతుడగు చ్యవనుడు హిమవత్పర్వతమునకు వచ్చెను.

రాజభార్యలలో గొప్ప భాగ్యము కలదియు, పద్మపత్రాక్షియు అగు ఒకతె తనకు కుమారుడు కావలెనని కోరుచు, దేవతలవంటి కాంతిగల ఆ చ్యవనునికి నమస్కరించెను. ఆ సవతికిి విషము పెట్టిన కాళింది కూడ ఆ మునివద్దకు వెళ్లి నమస్కరించెను. చ్యవనుడు పుత్రాభిలాషిణి యగు రాజభార్యతో,

“మహాభాగ్యవంతురాలా! మహాబలుడు, మహావీర్యుడు, మహాతేజస్వియు అగు సుపుత్రుడు నీ గర్భములో ఉన్నాడు. ఐశ్వర్యవంతుడైన ఆ కుమారుడు కొలది కాలములో విషముతో కూడ పుట్టగలడు; దుఃఖింపకుము.” అని పలికెను. 


రాజపుత్రియు, పతివ్రతయు, భర్తమరణముచే దుఃఖితురాలును అగు ఆ రాజమహిషి ఈవిధముగ చ్యవనుని అనుగ్రహముచే పుత్రుని కనెను. గర్భమును నశింపచేయవలెనను అభిప్రాయముతో సవతి ఆమెకు ఇచ్చిన గరళముతో పాటు పుట్టుటచే ఆ పుత్రుడు “సగరుడు” అయ్యెను. 


సగరుని కుమారుడు అసమంజుడు, ఆతని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని పుత్రుడు దిలీపుడు. అతని కుమారుడు భగీరథుడు. భగీరథునకు కకుళ్హుడును, ఆతనికి రఘువును పుట్టిరి. తేజశ్శాలియగు ప్రవృద్ధుడు రఘువుయొక్క కుమారుడు. ఆతడు వసిష్టుని శాపముచే పురుషాదకుడు (మనుష్యమాంసము తినువాడు) అయ్యెను. అతడు వసిష్టునకు ప్రతిశాప మిచ్చుటకై జలము గ్రహించెను. అపుడు ఆతని భార్య నివారించుటచే ఆ శాపోదకమును తన పాదములపైననే విడచుటచే కల్మాషపాదుడు (కల్మషముతో కూడిన పాదములు కలవాడు) అయ్యెను. 

అతనికి శంఖణుడు పుట్టెను. శంఖణుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్దుడు. ఆతని కుమారుడు శీఘ్రగుడు. ఆతని కుమారుడు మరువు. ఆతని కుమారుడు ప్రశుశ్రుకుడు. ప్రశుశ్రుకుని కుమారుడు అంబరీషుడు. 

అంబరీషుని పుత్రుడు నహుషమహారాజు. నహుషునకు యయాతి యను పుత్రుడు జనించెను. ఆతని కుమారుడు నాభాగుడు. 

నాభాగునకు అజుడను కుమారుడు కలిగెను, అజుని కుమారుడు దశరథుడు. ఈ దశరథుని కుమారులే ఈ రామలక్ష్మణులు. 


నరశ్రేష్టుడవైన జనకమహారాజా! ఆదినుండియు పరిశుద్ధమైన వంశము కలవారు, పరమధార్శికులు, వీరులు, సత్యవాదులు అయిన ఇక్ష్వాకుల వంశములో జన్మించిన ఈ రామలక్ష్మణులకొరకై నీ కుమార్తెలను వరించుచున్నారు. ఈ రామలక్ష్మణులు నీ కుమార్తెలకు తగిన వరులు. వీరికి తగిన వధువులైన నీ కుమార్తెలను ఇచ్చి వివాహము చేయుము.” అని ఊరకుండెను.


* జనకుని వంశ పూర్వపురుషుల పరిచయము*

ఈవిధముగ దశరథుని వంశమును వర్ణించి చెప్పిన వసిష్టునితో జనకుడు, చేతులు జోడించి ఇట్లు పలికెను.

“మహామునీ! నీకు మంగళమగుగాక! నా వంశమును గూర్చి చెప్పుచున్నాను. వినుము. సత్కులములో పుట్టినవారు కన్యాదానసమయమున తమ వంశమును గూర్చి పూర్తిగా చెప్పవలెను. అందుచే నేను నా వంశమును గూర్చి చెప్పుచున్నాను. వినుము.

మూడు లోకములందును ప్రసిద్దుడును, పరమధర్శ్మాత్ముడును, బలము కలవా రందరిలోను శ్రేష్టుడును అగు నిమి అను చక్రవర్తి ఉండెను. మిథిలను నిర్మించిన మిథి ఆ నిమిచక్రవర్తి కుమారుడు. ఇతదే మొట్టమొదటి జనకుడు. ఆతని కుమారుడు ఉదావసువు. ఉదావసువుకు నందివర్ధనుడను కుమారుడు కలిగెను. ఆతని కుమారుడు సుకేతువు.

సుకేతువునకు ధర్మాత్ముడును, మహాబలుడును అగు దేవరాతుడు పుట్టెను, రాజర్నియైన దేవరాతునకు బృహద్రథు డను పుత్రుడు జనించెను. బృహద్రథునకు శూరుడును ప్రతాపవంతుడును అగు మహావీరుడు పుట్టెను. మహావీరునకు ధైర్యవంతుడు, సత్యమైన పరాక్రమము కలవాడు అయిన సుధృతి జన్మించెను. 

ధర్మబుద్ధి కలవాడును, ధర్మాచరణశీలుడును అగు దృష్టకేతువు సుధృతికి కుమారుడుగ జన్మించెను. రాజర్నియెన దృష్టకేతువునకు హర్యశ్వుదడని ప్రసిద్ధుడైన పుత్రుడు జనించెను. హర్యశ్వునకు మరుడు అను పుత్రుడు జనించెను. మరుని పుత్రుడు ప్రతింధకుడు. ధర్మాత్ముడైన కీర్తిరథమహారాజు ప్రతింధకుని కుమారుడు. కీర్తిరథునికి దేవమీధుడు, దేవమీఢునకు విబుధుడు, ఆతనికి మహీధ్రకుడును పుట్టెను. మహీధ్రకునకు మహాబలుడైన కీర్తిరాతు డను కుమారుడు జనించెను. రాజర్నియెన కీర్తిరాతునకు మహారోముడు పుట్టెను. మహారోమునకు ధర్మాత్ముడైన స్వర్హరోముడు పుట్టెను. 


రాజర్షియైన స్వర్ణరోమునకు హ్రస్వరోముడు పుట్టెను. ధర్మము నెరిగిన ఆ మహాత్మునకు ఇద్దరు పుత్రులు జనించిరి. నేను పెద్దవాడను. వీరుడైన కుశధ్వజుడు నా తమ్ముడు.


మా తండ్రియైన హ్రస్వరోమమహారాజు జ్యేష్టుడ నైన నన్ను రాజ్యాభిషిక్తుని చేసి, కుశధ్వజుని పోషణభారమును నాపై ఉంచి వనమునకు పోయెను. వృద్దుదైన తండ్రి స్వర్గస్థుడైన పిమ్మట, దేవసదృ్భశుడైన నా తమ్ముడు కుశధ్వజుని స్నేహముతో చూచుకొనుచు, ధర్మానుసారముగా రాజ్యభారము వపించితిని. 

కొంతకొలమునకు, పరాక్రమవంతుడగు సుధన్వుడను రాజు

సాంకాశ్యపురమునుండి మిథిలపైకి దందెత్తివచ్చెను. 'శ్రేష్టమగు శివధనుస్సును, పద్మపత్రాక్షియగు సీతను నా కిమ్ము.! అని ఆతడు నాకు వార్త పంపెను. 


సీతను, శివధనుస్సును ఇవ్వకపోవుటచే ఆతనికిని నాకును యుద్ధము జరుగగా, రణరంగమున నేనాతనిని వధించితిని. ఆ సుధన్వుని సంహరించి, నా సోదరుడైన ఈ కుశధ్వజుని సాంకాశ్యపురమున రాజ్యాభిషిక్తుని చేసితిని.


*సీత ఊర్మిళలను ఇచ్చెదనని ప్రమాణము*

సోదరులలో నేను పెద్దవాడను. ఇతడు చిన్నవాడు. నా కన్యలిద్దరిని దశరథనందనులకు ఆనందపూర్వకముగ ఇచ్చెదను. సీతను రామునకును, ఊర్మిళను లక్ష్మణునకును ఇచ్చెదను. వీర్యశుల్కయు, దేవకన్యతో సమానురాలును అగు నా పుత్రికయైన సీతను, రెండవ కుమార్తెయైన ఊర్మిళను ఇచ్చెదనని మూడు పర్యాయములు నొక్కి వక్కాణించుచున్నాను. ఈ విషయమున సందేహము లేదు. 


దశరథమహారాజా! ఈ కన్యలను ఆనందపూర్వకముగా ఇచ్చుచున్నాను. రామలక్ష్మణులకు గోదానమును (సమావర్తనవతమును) చేయించుము, నాందీశ్రాద్ధము చేసిన పిమ్మట వివాహము జరిపించుము. 

ఈ దివసమున మఘానక్షత్రము కదా. నేటికి మూడవరోజున, ఉత్తరఫల్లునీ నక్షత్రమునందు వివాహము చేయుము. ముందుగా రామలక్ష్మణుల భావిసుఖ హేతువు అగు గోహిరణ్యభూమ్యాదిదానము కూడ చేయింపవలెను.

కామెంట్‌లు లేవు: