29, డిసెంబర్ 2024, ఆదివారం

అభిజ్ఞానశాకుంతలమ్ నామౌచిత్యం

 🙏అభిజ్ఞానశాకుంతలమ్ నామౌచిత్యం 🙏

                  మొదటి భాగం 



.అభిజ్ఞానశాకుంతలము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకములన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యము నొందిన నాటకము. ఇందు ఏడు అంకములు గలవు. వసంత ఋతు వర్ణన చేయబడింది.శాకుంతలము ఒక గొప్ప శృంగార రస భరిత నాటకము

అభిజ్ఞానశాకుంతలమ్ అనేది సంస్కృతం పేరు. తెలుగులో అభిజ్ఞానశాకుంతలము అవుతుంది. దీనిని ఒక్క పదంగానే వ్రాయాలి. విడదీసి రెండు పదాలుగా (అభిజ్ఞాన శాకుంతలము అని వ్రాయకూడదు).

కవికుల గురువు కాళిదాసు తన నాటకానికి శాకుంతలం అని పేరు పెట్టవచ్చు కదా అభిజ్ఞానశాకుంతలమ్ అని ఎందుకు పేరు పెట్టినారు 

అభి అంటే మొగ్గు చూపడం అని అర్థం 

అభిమానం అంటే మానం మీద మొగ్గు చూపడం

అభిజ్ఞానం అంటే జ్ఞానం మీద మొగ్గు చూపడం


శకుంతలకు సంబంధించిన ఈ నాటకానికి కీలకమైన అంశం అంగుళీయము (అంగులీయకము / అంగుళీయకము) రూపంలో ఉన్న గుర్తింపు ముద్ర ద్వారా మరచిపోయినది గుర్తుకురావడం.


దుష్యంతమహారాజు దుర్వాసుని శాపంతో మరచిపోయిన శకుంతలను అంగుళీయము ద్వారా గుర్తుతెచ్చుకుంటాడు. అంగుళీయము ద్వారా గుర్తింపబడి స్వీకరింపబడిన శకుంతలకు సంబంధించిన (శంకుంతల వృత్తాంతాన్ని వర్ణించే) నాటకం కాబట్టి అభిజ్ఞానశాకుంతలమ్ అని పేరు పెట్టబడినది.

శాకుంతలం అంటే శకుంతలకు సంబంధించినది.

ఇది పాణిని రచించిన అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణంలో "తస్యేదమ్"’ అనే సూత్రం ద్వారా ‘సంబంధించిన’ అనే అర్థాన్ని సూచించడానికి శ-మీద ఉన్న హ్రస్వ అకారమునకు దీర్ఘం వచ్చి శా .అయింది ఎలాగంటే, గంగ యొక్క పుత్రుడు గాంగేయుడు అయినట్లుగా.


‘జ్ఞాపకం’ అనే అర్థాన్నిసూచించే ‘జ్ఞా’ అనే ధాతువుకు ‘చెయ్యడం’ అనే అర్థంలో ‘అభి’ అనే ప్రత్యయం చేరి ‘అభిజ్ఞానం’ అనే పదం ఏర్పడింది. అభిజ్ఞాన ప్రధానమైన శకుంతల విషయకమైనది కథ కాబట్టి ‘అభిజ్ఞానశాకుంతలమ్’ అని పేరు పెట్టడం జరిగింది.

దేవలోకములో నర్తకి అయిన మేనక, విశ్వామిత్రుడు చేయుచున్న ఘోర తపస్సును భగ్నము చేయుటకు దేవేంద్రునిచే పంపబడి, ఆ కార్యము సాధించు క్రమములో విశ్వామిత్రుని వలన ఒక బాలికకు జన్మనిచ్చి, ఆ బాలికను అడవిలో వదలి దేవలోకమునకు వెడలిపోవును. ఆ బాలిక అడవిలోని ఆకులపై పడిన నీటి బిందువులను ఆహారముగా ఒక హంస ద్వారా గ్రహించి ప్రాణము నిలుపుకొనును. అటుపై, ఆ బాలికను మహర్షి కణ్వుడు మార్గమధ్యమున చూసి జాలితో పెంచుకొనుటకు తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళి, ఆమెకు శకుంతల అని నామకరణము చేయును. శాకుంతలములచే కాపాడబడి, పెంచబడినది కావున శకుంతల అయినది

.

భరతుడి జననానికి సంబంధించిన కథ అత్యంత ప్రాచుర్యం పొందింది.నాటక లక్షణాలలో ఇతివృత్తం ప్రసిద్ధమైయుండాలి. మహాభారతంలోని కథ. ఈ ఇతివృత్తం వ్యాసుడు మహాభారతంలో వ్రాయగా, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలములో మరింత విపులీకరించి దృశ్య కావ్యంగా రచించారు.

దుర్వాస శాప వృత్తాంతం ఎందుకు కల్పించాడో అనకూడదు. ఆయన ఋషి కనుక.ఎందుకు ప్రవేశ పెట్టేడో అనాలి. దానికి కారణం తెలుసుకునే ముందు 

మహాభారతంలోని కథను పరిశీలించాలి. కథ పరిశీలిద్దాం. చూడండి 


 విశ్వామిత్రుడు మేనక వల్ల జన్మించిన శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమములో పెరుగుచుండగా ఒకరోజు ఆ మార్గములో అప్పటి రాజు దుష్యంతుడు వెళ్తుండగా, దుష్యంతుడు శకుంతలని చూసి ఆకర్షితుడై ఆమెని గాంధర్వ వివాహం చేసుకొని ఆమెను రాజ్యానికి వెళ్ళి రాజ్యసంస్కారాలతో ఆహ్వానిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో శకుంతల భరతుడిని ప్రసవిస్తుంది. కణ్వ మహర్షి దివ్య దృష్టితో జరిగింది గ్రహించి శకుంతలని దుష్యంతుని రాజ్యానికి పంపుతాడు. మొదట శకుంతల తన భార్య కాదు భరతుడు తన కుమారుడు కాదు అని అన్న దుష్యంతుడు, ఆకాశవాణి పలుకులతో జరిగిన వృత్తంతం గుర్తు తెచ్చుకొని భరతుడిని కుమారుడిగా అంగీకరిస్తాడు.

మహాభారతంలోని ఆది పర్వము-చతుర్థాశ్వాసము

ఒక్కసారి పరిశీలిద్దాము.

కణ్వ మహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట 

అనఘుఁడు వంశకరు డై , పెనుపున నీ సుతుఁడు వాజపెయంబులు నూ

ఱొనరించు నని సరస్వతి, వినిచె మునులు వినఁగ నాకు వినువీది దెసన్. 


యీ నీ కొడుకు పుణ్యాత్ము ఢై వంశోద్దరకుడు అగునని, నూఱశ్వమేధాల్ని చేస్తాడనీ సరస్వతి మునుపు మునులందరూ వింటూండగా నాకు ఆకాశవాణి ద్వారా చెప్పినది.

గొప్ప గుణవంతుడు, కులాన్ని విస్తరించేవాడూ, బాలుడూ, ఉదారుడు, ధర్మప్రియుడు ఐన ఈ బాలుడిని ఆనాటి నీ సత్యవాక్యమును పాటించకుండా తప్పచూడటం , ఓ సారమతీ! నీకు చెల్లునా?

చ.

నుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత

వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.


తియ్యటి నీటితో నిండివున్న నూఱు నూతులకంటె ఒక దిగుడుబావి మేలు, అట్టి బావులు నూఱిటికంటె ఒక సత్క్రతువు మేలు, అట్టి నూఱు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు, అట్టి నూర్గురు కుమారులకంటె కూడా, ఓ సూనృతవ్రతుడ వైన రాజా ! ఒక సత్యమైన మాట మేలయ్యా. అని అంటూ ఇంకా సత్యాన్ని గురించిన గొప్పదనాన్ని ఇలా వర్ణన చేసి చెబుతుంది 

వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్నిఒకవేపు, సత్యవాక్యాన్ని ఇంకోవేపు త్రాసులో ఉంచి తూస్తే త్రాసు యొక్క ముల్లు సత్యం వైపే మొగ్గును చూపిస్తుంది సత్యము యొక్క భారాతిశయము చేత.

అన్ని తీర్థాలను సేవించగా వచ్చే ఫలితం, సర్వవేదాల్ని పొందుట కూడా సత్యముతో సరిగావు. అన్ని ధర్మాలలోకెల్లా సత్యమే పెద్ద అని ధర్మజ్ఞులైనవారు చెప్తారు, తెలుసుకో.

క్షత్త్రియు డైన విశ్వామిత్త్రునకు పవిత్రమైన మేనకకు పుట్టినదానను, అలాంటి దానిని - ఓ రాజా! అబద్ధమాడటానికి అంత ధర్మేతరనా? అని అంటపొడుస్తుంది.


అనిన శకుంతలపలుకులు అంగీకరించక దుష్యంతుం డిట్లనియెను 

ఏ నెట నీ వెటసుతుఁ డెట, యే నెన్నఁడుఁ దొల్లి చూచియెఱుఁగను నిన్నున్

మానిను లసత్యవచనలు, నా నిట్టు లసత్యభాషణం బుచితంబే. 


నే నెక్కడ? నీ వెక్కడ? సుతు డెక్కడ? నే నెప్పుడూ నిన్ను చూడనే లేదు. ఆడవారు అబద్ధాలాడేవారు అనేలా ఈ విధంగా నీ వబద్ధం చెప్పటం న్యాయమేనా?

క.

వనకన్యకయఁట నే నఁట; వనమున గాంధర్వమున వివాహంబఁట నం,

దనుఁ గనెనఁట మఱచితినఁట; వినఁగూడునె యిట్టి భంగి విపరీతోక్తుల్ --(పాఠాంతరము)


ఈవిడ వనకన్యక యట! నేనట వనంలో కలిసానట! గాంధర్వ వివాహం కూడా చేసుకొన్నానట!! కొడుకును కూడా కన్నానట! మఱచిపోయానట! ఇలాంటి విపరీతములైన మాటలు వినతగినవేనా?


పొడవుగా వయసులో ఉండి బలవంతు డైన వానిని నీ కొడుకని వ్యత్యాసముగ యిందరూ నవ్వేట్లుగా చూపించటానికి తీసుకువచ్చావా?


ఇటువంటి లోకవిరుద్ధమైన పలుకులకు మేమెలా అంగీకరిస్తాం. అందుచేత యుక్తంకాని పలుకులు పలుకక నీ ఆశ్రమమునకు పొమ్మనిన శకుంతల అత్యంత దుఃఖితయై

తడయక పుట్టిననాఁడ తల్లి చే దండ్రి చే విడువఁ

బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ

నుడువులు వేయు నిం కేల యిప్పాటినోములు దొల్లి

కడఁగి నోఁచితిని గా కేమి యనుచును గందె డెందమున. 


పుట్టినప్పుడే తల్లి చేతను తండ్రి చేతను విడిచిపెట్ట బడ్డాను. ఇప్పుడు భర్త చేతను కూడా విడిచిపెట్ట బడ్డానుకదా ఇంక వేయి మాటలనుకోనేల యీపాటి నోములే తొల్లిటి జన్మలో నోచుకొన్నానేమో లేకపొతే ఇలా గెందుకవుతుంది అంటూ ఆ మహా సాధ్వి హృదయంలో తల్లడిల్లిపోయింది.

ఈ మధ్యాక్కర పద్యాన్ని చదువుతున్నా వ్రాస్తున్నా కండ్లనుంచి ధారాపాతంగా ఆగకుండా కన్నీళ్ళు కారుతూనే ఉంటున్నాయి. ఆడకూతురికి ఎంత రాకూడని కష్టం. ఈ ఘట్టాన్ని ఇంత బాగా వ్రాసిన నన్నయ్య గారికి శత సహస్ర కోటి వందనాలందించకుండా వుండలేము కదా. నన్నయ్యగారు స్త్రీ మనస్సును ఆవాహన చేసుకొన్నవారై ఆమె దుఃఖాన్ని పూర్తిగా ఆవిష్కరించారు. ఇటువంచి రమ్యాతి రమ్యమైన కథలకోసం మనందరం భారతాన్ని పఠించాలి.

వ.

ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశయై బోరనఁ దొరఁగు బాష్పజలంబు లందంద యొత్తికొనుచు నింక దైవంబ కాని యొండు శరణంబు లే దని యప్పరమపతివ్రత తనయుం దోడ్కొని క్రమ్మఱి పోవ నున్న యవసరంబున. 

చ.

గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే

కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి స

ద్వినుత మహాపతివ్రత వివేకముతో నని దివ్యవాణి దా

వినిచె ధరాధినాధునకు విస్మయమందఁగఁ దత్సభాసదుల్. 

ఆకాశవాణి భరతుడు శకుంతలకూ దుష్యంతునకు కలిగిన సంతానమని శకుంతల మహా సాధ్వి అని సభాసదులందరూ వినుచుండగా పలికి కథకు ముగింపును పలుకుతుంది. ఇది భారతములోని కథ. దీనిని యథాతథముగా నాటకంగా వ్రాస్తే నాటక లక్షణాలకు విరుద్ధం.నాయకుడు అసత్యవాది అవుతాడు. సత్యమునే నాయకుడు పలకాలి.

                        సశేషం

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: