29, డిసెంబర్ 2024, ఆదివారం

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

            *(నాల్గవ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

   నారదుని జన్మ వృత్తాంతం 

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*నడచి నడచి ఆఖరికి ఓ నది ఒడ్డుకు చేరుకున్నాడు నారదుడు. ఇక నడవలేననుకున్నాడు. నదిలో స్నానం చేశాడు. భగవంతునికి అర్ఘ్యం ఇచ్చి, కడుపునిండా నీరు తాగాడు. దాహాన్ని తీర్చుకున్నాడు. తీరానికి చేరి, రావిచెట్టు కింద కూర్చున్నాడు. మనసులో మహావిష్ణువును తలచుకుంటూ హరినామస్మరణ చేయసాగాడు. ధ్యానించసాగాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే మరుక్షణంలోనే అదృశ్యమయ్యాడు. ఏకకాలంలో సంతోషం, దు:ఖం రెండూ కలిగాయి నారదునికి. అయినా హరినామస్మరణ మానలేదు.*


*అప్పుడు భగవంతుని గొంతు వినవచ్చిందిలా.‘‘బాలకా! నువ్వు నన్ను ఈ జన్మలో తనివితీరా చూడలేవు. నీ భక్తికి మెచ్చి ఒక్క క్షణం మాత్రమే నా దివ్య మంగళ రూపాన్ని చూపించాను. త్వరలోనే నువ్వు నీ దాసీపుత్ర దేహాన్ని త్యజిస్తావు. అప్పుడు నా చెంతనే ఉంటావు. నా పట్ల నీ భక్తి ఎప్పుడూ స్థిరంగా ఉండేట్లుగా వరమిస్తున్నాను, స్వీకరించు. అలాగే ప్రళయకాలంలో కూడా నీ స్మృతి పోదు’’. శ్రీహరి కరుణకు పొంగిపోయాడు నారదుడు.*


*కొంత కాలానికి దేహాన్ని విడిచాడు. కల్పాంతాన లోకాలన్నీ జలమయమయిపోయాయి. నీరంతా ఒకే సముద్రంగా ఉంది. ఆ సముద్రంలో శ్రీహరి శయనించి ఉన్నాడు. అప్పుడు శ్రీహరి గర్భంలోకి బ్రహ్మదేవుడు ప్రవేశిస్తున్నాడు. ప్రవేశిస్తూ నిశ్వసించాడతను. అలా ఊపిరి వదిలే వేళ బ్రహ్మదేవుని గర్భంలో జారుకున్నాడు నారదుడు. అనేక యుగాలు గడిచిపోయాయి. బ్రహ్మ మళ్ళీ సృష్టి ప్రారంభించాడు. బ్రహ్మదేవుని నుండి మరీచి మొదలయిన ప్రజాపతులు జన్మించారు. వారితో పాటు నారదుడు కూడా జన్మించాడు.*


*శ్రీహరి అనుగ్రహంతో నారదునికి దివ్యదేహం ప్రాప్తించింది. దేవదత్తం, మహతి అనే వీణ కూడా లభించాయతనికి. సర్వజ్ఞత్వం, చిరంజీవత్వం సంప్రాప్తించాయి. దాంతో నిరంతరం హరినామస్మరణ చేస్తూ ముల్లోకాలూ సంచరించసాగాడు నారదుడు.*


*అశ్వత్థామ :~*


పరీక్షిన్మహారాజు ఎందుకు ప్రాయోపవేశం చేయాల్సి వచ్చింది? శుకుడు అతనికి భాగవతం ఎందుకు వినిపించాల్సి వచ్చిందంటూ శౌనకాది మునులు సూతుణ్ణి ప్రశ్నించారు.


సమాధానంగా పరీక్షిన్మహారాజు జన్మ వృత్తాంతం తెలియ జేయడానికి ముందు సూతుడు మహాభారతంలోని చివరి ఘట్టాన్ని వారికి వివరించాడు. శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థానం మొదలయిన సంగతులు కొన్ని తప్పనిసరై చెప్పాల్సి వచ్చిందతనికి.  


పద్దెనిమిది రోజుల పాటు కురుక్షేత్రంలో కౌరవులకూ పాండవులకూ యుద్ధం జరిగింది. ఇరు పక్షాన మహావీరులు అనేకులు మరణించారు. గదా యుద్ధంలో భీముడు, తొడలు విరగగొట్టడంతో దుర్యోధనుడు నేల కూలాడు. 


ఆనాటికి కురురాజు పక్షాన మిగిలిన ఒకే ఒక్క వీరుడు అశ్వత్థామ. నూరుగురు కొడుకుల్నీ, బంధుబలగాన్నీ, చతురంగ బలాల్నీ కోల్పోయి జీవచ్ఛవంలా ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ మహారాజుకి సంతోషాన్ని కలిగించేందుకు అశ్వత్థామ ఘోరకృత్యానికి పూనుకున్నాడు. 


అర్ధరాత్రి వేళ నిద్రిస్తున్న ద్రౌపది కుమారులయిన ఉపపాండవుల తలలను నరికి వచ్చాడతను. తలలు తెగి, రక్తం మడుగులో ఉన్న కుమారులను చూసి కన్నీరు మున్నీరయింది ద్రౌపది. కంటికీ మంటికీ ఏకధారగా రోదించింది. ఎంత ఓదార్చజూసినా ద్రౌపది శాంతించలేదు. అప్పుడు అశ్వత్థామ తల నరికి తెస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞకు ద్రౌపది శాంతించింది. 


అక్షయతూణీరాన్ని, గాండీవాన్నీ అందుకుని రథాన్ని అధిరోహించాడు అర్జునుడు. 

శ్రీకృష్ణుడు సారథి అయ్యాడు. రథం పరుగందుకుంది. ‘‘అడుగో అశ్వత్థామ! నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో’’

అశ్వత్థామను చూపించి, రథాన్ని మరింత వేగంగా ముందుకు పోనిచ్చాడు కృష్ణుడు. 


తనని వెంట తరముతున్న కృష్ణార్జునులను చూసి, వారి చేతికి చిక్కరాదనుకుని, రథాన్ని అధిరోహించి పరుగందుకున్నాడు అశ్వత్థామ. ముందు అశ్వత్థామ రథం, ఆ వెనుక కృష్ణార్జునుల రథం. పరిగెత్తి పరిగెత్తి అశ్వత్థామ గుర్రాలు అలసిపోయాయి. ఆగిపోయాయి ఒకచోట. కృష్ణార్జునులు చేరుకున్నారక్కడకి. ఒక్కుదుటన కిందకు దిగుతున్న అర్జునుని చూశాడు అశ్వత్థామ. తన ప్రాణాలు పోతాయి. అందులో అనుమానం లేదు. అర్జునుడు తనని చంపేస్తాడనుకున్నాడు అశ్వత్థామ. 


అదే క్షణంలో పాండవుల అంతు చూడాలనుకున్నాడు కూడా. ఆలోచించాడు. బ్రహ్మశిరోనామ కాస్త్రం ప్రయోగించాలనుకున్నాడు. పర్యవసానాల్ని పట్టించుకోలేదు. ఆచమనం చేసి, శుచి అయ్యాడు అశ్వత్థామ. 

 

‘‘అపాండవమగుగాక’’ అన్నాడు. అనుకున్నట్టుగానే బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించాడు. ఉగ్రతేజస్సుతో ఆ మహాస్త్రం దశదిశలా వ్యాపించింది. సకల ప్రాణికోటి అంతం చూసే ఆ తేజస్సు చూసి అర్జునుడు కలవరం చెందాడు. ఏం చెయ్యాలో తోచలేదతనికి. చేతులు జోడించి కృష్ణునికి నమస్కరించాడు. కర్తవ్యాన్ని బోధించమని ప్రార్థించాడు. సాలోచనగా చూసి ఇలా అన్నాడు కృష్ణుడు. 


‘‘అర్జునా! అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. దానిని ప్రతిఘటించగలిగేది ఒక్కటే! బ్రహ్మశిరోనామకాస్త్రమే! దాన్నే నువ్వూ ప్రయోగించు.’’


‘‘మరో మార్గం లేదా?’’ అడిగాడు అర్జునుడు. 


‘‘లేదు.’’


కృష్ణునికి మళ్ళీ నమస్కరించి, ఆ పరమాత్మ చెప్పినట్టుగానే అర్జునుడు తాను కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. అస్త్రాలు రెండూ ఒకదాన్ని ఒకటి డీకొన్నాయి. ప్రళయాగ్ని జ్వాలలు చెలరేగాయి. సమస్త లోకాల్నీ ఆ జ్వాలలు దహించసాగాయి. ప్రాణికోటి సర్వం తల్లడిల్లింది. ప్రళయకాలం సమీపించి నట్టనిపించింది. ఆలోచించాడు కృష్ణుడు. ఆ అస్త్రాలు రెంటినీ ఉపసంహరించాల్సిందిగా అర్జునుని ఆజ్ఞాపించాడు. 


బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ద్రోణునికి అగస్త్యుడు ప్రసాదించాడు. ద్రోణుడు ఆ అస్త్రాన్ని అర్జునునికి బోధించాడు. తండ్రి ద్రోణున్ని ప్రార్థించి అశ్వత్థామ కూడా ఆ అస్త్రాన్ని అందుకున్నాడు. తనయుడికి అస్త్రాన్ని ప్రసాదించి, ఎంతటి ప్రాణభయం ఉన్నా ఎన్నడూ ఈ అస్త్రాన్ని ప్రయోగించ రాదన్నాడు ద్రోణుడు. అస్త్రాన్ని ప్రయోగించడమే తెలియజేశాడతడు. ఉపసంహరణ తెలియ జేయలేదు. ఆ కారణంగా అశ్వత్థామకు అస్త్ర ఉపసంహరణ తెలీదు. తెలియకపోయినా ఆ మహాస్త్రాన్ని ప్రయోగించి పొరపాటు చేశాడు అశ్వత్థామ. 

 

కృష్ణుని ఆజ్ఞానుసారం అర్జునుడు తను ప్రయోగించిన అస్త్రాన్నీ, అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్నీ రెంటినీ ఉపసంహరించాడు. 


తర్వాత అణచుకోలేని కోపంతో అశ్వత్థామ మీద దాడి చేశాడు. పట్టుకున్నాడతన్ని. పట్టుకుని రథ చక్రానికి కట్టాడు. ద్రౌపది దగ్గరకు తీసుకుని వెళ్ళేందుకు రథాన్ని అధిరోహిస్తుంటే వారించాడతన్ని కృష్ణుడు. ‘‘చక్రానికి కట్టి అశ్వత్థామని ప్రాణాలతో ఉంచడం పద్ధతి కాదు, ఇలాంటి దుర్మార్గుణ్ణి వెంటనే చంపేయాలి. చంపేయ్‌’’ అన్నాడు కృష్ణుడు. అర్జునుడు ఆలోచిస్తూ తలొంచుకుని నిల్చున్నాడు. ‘‘అర్జునా! ఆలోచించకు. ఈ అశ్వత్థామ అతి దారుణానికి ఒడిగట్టాడు. నిరపరాధుల్ని, ఉపపాండవుల్ని చంపాడు. నిద్రించేవాణ్ణి, బాలుణ్ణి, విరథుణ్ణి, శరణాగతుణ్ణి, జడుణ్ణి, ఉన్మత్తుణ్ణి, భయపడినవాణ్ణి చంపకూడదంటుంది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని చదువుకుని కూడా ఈ అశ్వత్థామ చేయరాని పని చేశాడు. ఇలాంటి వాణ్ణి క్షమించకూడదు. నీ ప్రతిజ్ఞ నువ్వు నెరవేర్చుకో! చంపేయ్‌.’’ రెచ్చగొట్టాడు కృష్ణుడు. అయినా అర్జునుడు అందుకు సిద్ధపడలేదు.


అంతుచిక్కక చూస్తున్న కృష్ణునితో అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు. ‘‘కృష్ణా! ఎంత చెడ్డా ఈ అశ్వత్థామ నా గురుపుత్రుడు. గురుపుత్రుడు గురువుతో సమానం అంటారు. అందుకని చంపలేకపోతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో.’’ 


విననన్నట్టుగా ఉన్న కృష్ణుణ్ణి ప్రార్థించి ఆఖరికి రథానికి కట్టిన అశ్వత్థామతో పాటుగా ద్రౌపదిని చేరుకున్నాడు అర్జునుడు. శవాన్ని కట్టినట్టుగా రథ చక్రానికి కట్టి ఉన్న అశ్వత్థామను చూసింది ద్రౌపది. 


జాలి చెందింది. తన కుమారులను చంపాడు. కడుపుశోకాన్ని రగిల్చాడు. అయినా అశ్వత్థామ పట్ల ఆ క్షణం ద్రౌపదికి చెప్పలేనంత దయ కలిగింది. నమస్కరించిందతనికి. అర్జునునితో ఇలా అంది. 

‘‘దయచేసి గురుపుత్రుణ్ణి వదలిపెట్టండి.’’ ద్రౌపది మాటకి అక్కడ ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజాదులంతా ఆశ్చర్యపోయారు.

 

‘‘అశ్వత్థామ బ్రాహ్మణుడు. పైగా ధనుర్వేదాన్ని పాండవులకు సంపూర్ణంగా నేర్పిన మహాత్ముడు ద్రోణాచార్యుని కొడుకు. అతన్ని చూస్తూంటే ద్రోణాచార్యుణ్ణి చూస్తున్నట్టుగానే ఉంది. అతన్ని సంహరించడం గురువుని సంహరించడం లాంటిది. వద్దు, అతన్ని విడిచి పెట్టండి’’ అంది ద్రౌపది. 


వినలేదెవరూ. అర్జునుడు కూడా ముఖాన్ని పక్కకి తిప్పుకుని నిల్చున్నాడు. ‘‘స్వామీ’’ అర్జునుని పిలిచింది ద్రౌపది. ‘‘నా మాట విను. అశ్వత్థామను విడిచిపెట్టు. నువ్వు అతన్ని సంహరిస్తే పుత్రశోకంతో అతని తల్లి “కృపి”మరణిస్తుంది. ఆ పాపం మనకి వద్దు. బ్రాహ్మణ శోకం ఎవరికీ మంచిది కాదు’’ అంది ద్రౌపది. 


అయినా అర్జునుడు అందుకు అంగీకరించలేదనిపించడంతో కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది. 

‘‘అన్నా! నువ్వయినా చెప్పు, బ్రాహ్మణవధ కూడదు కదా’’ అంది. అవునన్నట్టుగా తలూపాడు కృష్ణుడు. అర్జునుని సమీపించాడు. 


‘‘అశ్వత్థామ తలలో విలువ కట్టలేని మణి ఒకటి ఉంది. అది కేశాలతో పాటు పుట్టిన శిరోమణి. గొప్ప మహిమ కలది. శిరోజాలు కోసి, ఆ మణి తీసుకో.’’ చెప్పాడు కృష్ణుడు. అర్థం కానట్టుగా చూశాడు అర్జునుడు. 


‘‘తలగొరిగి అవమానించడం, అతని సర్వస్వాన్నీ హరించడం, అతన్ని దేశం నుండి వెళ్ళగొట్టడం... బ్రాహ్మణుల దండనలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆలోచించకు. చెప్పిన పని చెయ్యి’’ అన్నాడు కృష్ణుడు. 


అర్జునుడు అందుకు సిద్ధమయ్యాడు. కృపాణంతో అశ్వత్థామ శిరోజాలు కోశాడు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న అతని తలలోని దివ్యమణిని చేజిక్కించుకున్నాడు. తృప్తి చెందాడు. గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు. అశ్వత్థామ కట్లు విప్పి, విడిచి పెట్టాడతన్ని. శిరోమణిని పోగొట్టుకుని, తీవ్ర అవమాన భారంతో క్షీణతేజుడై అశ్వత్థామ అక్కణ్ణుంచి దీనంగా వెళ్ళిపోయాడు. 


ఎంత ఉపసంహరించినా అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రభావం మాత్రం పోలేదు. 

‘అపాండవమగుగాక’ అన్నాడు అశ్వత్థామ. అంటే పాండవుల వంశం నశించాలని అతను ఆశించాడు. బ్రహ్మశిరోనామకాస్త్రం అందుకే ప్రయోగించాడు. అయితే ఆనాటికి యుద్ధంలో పోయినవారు పోగా మిగిలింది ధర్మజ భీమార్జున నకుల సహదేవులు అయిదుగురే! పంచపాండవులే మిగిలారు. ఆ అయిదుగురూ దేవతల వరప్రభావంతో వర్థిల్లుతున్నారు. అందువల్ల వారిని ఆ అస్త్రం ఏమీ చేయలేకపోయింది. 


అయితే ఆ సమయానికి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతిగా ఉన్నది. ఆమెకు పుట్టబోయే బిడ్డే పాండవ వంశాంకురం. ఆ కారణంగా అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం ఉత్తర గర్భంలోని పిండాన్ని శత విధాల వేధించసాగింది. ఆ బాధను తట్టుకోలేకపోయింది ఉత్తర. గగ్గోలుగా ఏడుస్తూ శ్రీకృష్ణుని ఆశ్రయించింది. అతని పాదాల మీద పడింది. అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రం నుండి తన గర్భస్థ శిశువుని కాపాడమని పలువిధాల వేడుకుంది. అభయాన్ని అందించాడు కృష్ణుడు. యోగమాయను ఉత్తర గర్భంలో ప్రవేశపెట్టాడు. ఆమె గర్భస్థ శిశువుని కాపాడాడు. తన చక్రాయుధంతో బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని తుత్తునియలు చేశాడు. అప్పుడు పుట్టిన బాలుడే పరీక్షిత్తు. 


కురువంశాంకురంగా నిలిచి అతను అనేక కార్యాలు చేశాడు. ప్రసిద్ధుడయినాడు. 

తన వంశాన్ని కాపాడినందుకు కుంతి, శ్రీకృష్ణుణ్ణి వేయి విధాల స్తోత్రం చేసింది. అనంతరం ద్రౌపదీసమేతులై పాండవులు శ్రీకృష్ణుణ్ణి వెంటబెట్టుకుని గంగాతీరానికి చేరుకున్నారు. అశౌచస్నానాలు ఆచరించారు. యుద్ధంలో మరణించిన జ్ఞాతులకూ, బంధువులకూ, అంద రికీ ఉత్తర క్రియలు నిర్వహించారు. తిలతర్పణాలూ, జలతర్పణాలూ, పిండప్రదానాలన్నీ నిర్వర్తించి పరిశుద్ధులయినారు.


*(తిరిగి రేపు చదువుదాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: