🙏ప్రపంచ భాషలలో సంస్కృత భాష స్థానం 🙏
మొదటి భాగం
సంస్కృతము పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మాహేశ్వర సూత్రములందురు. సంస్కృతం హిందూ, బౌద్ధ, జైన మతాలకు ప్రధాన భాష. నేపాలు లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే ఉంది.
. కర్ణాటకలోని మత్తూరు అనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష. సంస్కృతం అంటే '"సంస్కరించబడిన" అంటే ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన' అని అర్థం .ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం జీవం పోసింది . సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు ఉన్నాయి. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు ఉన్నాయి. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియును, క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులనియును వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారుట.కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది
ఏదృష్టితో చూచినను సంస్కృతము ప్రపంచ భాషలలో విశిష్టస్ధానము నలంకరించుచున్నది. అయ్యది సకల భాషలలోను ప్రాచీనతమమై, సర్వలోక సన్మానితమై, వివిధ భాషలకు మాతయై యలరారు చున్నది; భారత జాతీయతకు జీవగఱ్ఱయై, భారతీయభాషలకు ఉచ్ఛ్వాస ప్రాయమై, సరససాహిత్య జ్ఞానవిజ్ఞాన రత్నమంజూషయై యొప్పారుచున్నది. పురాతనమైన యీభాష అధునాతన నాగరికతలో కూడా ప్రధానభూమికను నిర్వహింపగల్గియుండుట పరమ విశేషము.
సంస్కతభాష సమస్త భాషలకు మాతయైనట్లే, సంస్కృతభాషాఘటితమైన విజ్ఞానముకూడ సమస్తదేశ ప్రాచీన విజ్ఞానమునకు మూలమైయున్నది. విజ్ఞాన ప్రవాహము భారతదేశమునుండి బయలుదేరి యేరీతిగా పర్షియా, అరేబియా, గ్రీసు మున్నగు దేశములకు వ్యాపించినదో విపులముగా వివరించుచు పోకాక్ అను ఆంగ్లేయుడు India in Greece అను గ్రంథములో నిరూపణచేసియున్నాడు. బాబిలోనియా, ఈజిప్టు మున్నగు దేశములలో అతిప్రాచీననాగరికత యని భావింపబడుచున్నది భారతదేశసంస్కృతియొక్క విస్తారమే యని ఆ గ్రంథములో వివరముగా తెలుపబడింది. ఈ గ్రంథము రచింపబడి నూరు సంవత్సరములగుచున్నది. ఇంత సహేతుకముగా సప్రమాణముగా ప్రపంచనాగరికత భారతీయనాగరికతా విస్తారమేయని నిరూపించిన గ్రంథమునకు దేశములో వ్యాప్తిలేకుండుట ఆశ్చర్యముగానున్నది. ఆ గ్రంథము వ్యాప్తిలోనికి వచ్చునచో భారతీయవిజ్ఞానముపట్ల భారతీయులయొక్కయు, ప్రపంచవాసులయొక్కయు దృక్పథములో మూలమట్టమైన మార్పువచ్చును.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి