పంచ భ్రమలు
మనము ఏదైనా బస్సు లేక రైలు ఎక్కినప్పుడు ఒక సీటు దొరకాలని ఎంతో తాపత్రయపడతాము. సీటు దొరికిందా అది పూర్తిగా నా సొంతం అన్నట్లు భావిస్తాము. నిజానికి మనం ఆ సీటుమీద ఒక గంట లేక రెండుగంటలు మన ప్రయాణం అయ్యేవరకు మాత్రమే కూర్చుంటాము. మన గమ్యం రాగానే మనం దిగి వెళ్ళిపోతాము. మనం అప్పటిదాకా కూర్చున్న సీటులో ఎవరు కుర్చున్నారో కూడా చూడము. ఇది నిత్యం మన అనుభవంలో వున్న విషయం. సాధారణ మానవుల భ్రమ ఈ రీతిన ఉంటే నిత్యం భగవంతునితో అనుసందానం అయి వుండే భక్తునికి కూడా ఇలాంటి భ్రమలే ఉంటాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ భ్రమలు ఐదు రకాలుగా ఉంటాయి అందుకే వీటిని పంచ భ్రమలు అని అన్నారు. ఈ భ్రమలనుంచి బయట పడితేకాని సాధకుడు నిత్యమూ శాశ్వితము అయినా బ్రహ్మ పదాన్నిచేరలేడు.
1) ఆత్మ దైవ భేద
భ్రమ : నేను భగవంతుడిని ఆరాధిస్తున్నాను. పూలతో దేవదేవుని
అలంకరిస్తున్నాను. గంగా జలంతో లింగాభిషేకం చేస్తున్నాను. సత్యనారాయణ
స్వామిని నేను వివిధ పూలతో అలంకరిస్తున్నాను. అని అనేకమంది భక్తులు తరచూ
అనటం మనం చూస్తూ వున్నాము. భక్తుడి భక్తిలో తోలి దశలో తనకన్నా బిన్నంగా
భగవంతుడు ఉంటాడని భావించి భగవంతుని పూజించటం, ఆరాధించటం, అభిషేకించడం
చేస్తూ ఉంటాడు. ఇది భక్తిలో తోలి దశ. నిజానికి జీవ దైవ భేదం లేదు. జీవుడు
దేవుడు ఒక్కరే ఇద్దరు కాదు బేధం లేదు. ఈ సత్యం కొంత సాధన చేసిన తరువాత
భక్తుడు తెలుసుకుంటాడు. అందుకే దీనిని ఒక భ్రమగా మన మహర్షులు తెలిపారు.
2)
జీవ దైవ భేద భ్రమ: ఈ రకమైన భ్రమ ఏరకంగా ఉంటుందంటే సాధకుని ముందు
కనిపించే జీవులు కనిపించని దైవము వేరు అనే భావన దీనివలన సాధకుడు దేముడిని,
ఇతర జీవులను వేరుగా గుర్తించి వేరుగా భావించి వేరుగా తలుస్తాడు.
3) జీవ, జీవ భేద భ్రమ: ఈ రకమైన భ్రమ ఏమిటంటే ఒక జీవి ఇంకొక జీవికన్నా బిన్నంగా వున్నదనే బేధ భావం. ఈ రకమైన బ్రాన్తి నేను వేరు, నీవు వేరు అనే భావం మనుషులలో ఉండటం కాక నేను వేరు ఇతర జీవులు వేరు అంటే నేను వేరు ఆ ఆవు వేరు, ఆ కుక్క వేరు ఈ పావురం వేరు అని ఇతర జంతువులను తనకన్నా వేరుగా చూడటం. ఇది ఒక భ్రమ అని సాధకుడు తెలుసుకోవలెను.
4) జీవ జడ భేద భ్రమ: ఈ రకమైన భ్రమ సాధకునికి ఎలా ఉంటుంది అంటే జీవత్వం వున్న జీవులు వేరు జీవం లేని నిర్జీవ పదార్ధాలు అంటే జడపదార్ధాలు వేరుగా గోచరించటం
5) జడ దైవ భేద భ్రమ:ఈ జగత్తులో కనిపించే జడపదార్ధాలు వేరు దేముడు వేరుగా సాధకుడు గుర్తించటాన్ని ఈ రకమైన భ్రమగా పేర్కొనవచ్చును.
ఈ రకంగా ప్రతిసాధకుడు భావిస్తూవుంటాడు. దాని వలన పరబ్రహ్మ తత్వానికి దూరంగా ఉంటాడు. నిజానికి ఈ ఐదురకాల భ్రమలను బ్రమలుగా సాధకుడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఈ జగత్తు మొత్తం జగదీశ్వరునిదిగా గుర్తిస్తాడు. జగత్తు వేరు జగదీశ్వరుడు వేరు కాదనే సత్ భావనకు వస్తాడు. అప్పుడు సాధకునికి ఈ జగత్తు కానీ జగదీశ్వరుడు కానీ తనకన్నా బిన్నంగా లేదని తాను కూడా జగత్తులో భాగమని అంటే ఆ జగదీశ్వరునిలో తాను కూడా అంతర్గతంగా వున్నానని తాను భగవంతుని అంశగా తెలుసుకొని " అహం బ్రహ్మస్మి" అనే భావనలోకి వచ్చి సత్య దర్శనం చేసుకొని బ్రహ్మ పదాన్ని (మోక్షాన్ని) పొందుతాడు. అనితర సాధ్యమైన ఈ జ్ఞానామ్ పొందటానికి నిరంతర సాధన ఎంతో అవసరం. దేహ వ్యామోహాన్ని వదిలి అహంకారాన్ని త్యజించి నిరంతరం ఈశ్వర ధ్యాసలో ఉండి ఐహిక సుఖాలను తృణప్రాయంగా భావించి తన జీవిత లక్ష్యం కేవలం అంటే కేవలం మోక్ష సాధనే అని తలిస్తే తప్పకుండ మోక్షం కరతలామలకం అవుతుంది.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
ఇట్లు మీ
భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి