☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(15వ రోజు)*
*(నిన్నటి భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడుల పుట్టుక*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*‘‘నీ మనోభీష్టం తప్పకుండా నెరవేరుస్తాను. అయితే ఇది మూడు సంధ్యలూ ముడిపడే వేళ. ఇది భయంకరులకు కూడా మహా భయంకరమయిన సమయం. రుద్రుడు భూతగణాలతో సంచరించే సమయం. ఈ సమయంలో సంగమించకూడదు. ఓ ఘడియసేపాగు. తర్వాత నీ కోరిక తీరుస్తాను.’’*
*వినలేదు దితి. మన్మథోద్రేకాన్ని తట్టుకోలేకపోయింది. ఒళ్ళు విరుచుకోసాగింది. కామం కళ్ళు కప్పడంతో కశ్యపుని గట్టిగా కౌగిలించుకుంది. విడిపించుకోజూసిన కశ్యపుణ్ణి కదలనీయక, అధరామృతాన్ని అందించింది.*
*‘అంతా దైవప్రేరణ. తప్పదిక.’ అనుకున్నాడు కశ్యపుడు. నిష్ఠని వదలి వేశాడు. దితిని ముద్దిడితూ తీసుకుని వెళ్ళి ఆమె కోరికను తీర్చాడు. తర్వాత నదికి చేరుకుని స్నానం చేసి శుచి అయినాడు. సంధ్యావందనాదులు పూర్తి చేశాడు. మౌనం దాల్చి, బ్రహ్మోపాసన చేయసాగాడు.కోరిక తీరడంతో శరీరం చల్లబడి, తాను చేసిన తప్పేమిటో గ్రహించింది దితి. చేసిన తప్పుకి సిగ్గుపడింది. ఎంతగానో బాధపడింది. భర్తని సమీపించి మన్నించమని వేడుకుంది.‘‘నాథా! నువ్వు చెబుతూనే ఉన్నావు, వినలేదు. పాపాన్ని చేశాను. రుద్రుడికి కోపం కలిగించానేమో! నా గర్భస్థ శిశివుని హింసిస్తాడేమో! దేవతలు ఏ అపకారాన్ని తలపెడతారో! నువ్వే నాకు దిక్కు.’’ అంది దితి.*
*మౌనాన్ని వీడాడు కశ్యపుడు. ఇలా అన్నాడప్పుడు.‘ ‘జరిగిందంతా విధికృతం. దీనిని తప్పించడం ఎవరితరమూ కాదు. అసురసంధ్య వేళ నన్ను కోరావు కనుక నీకందరూ రాక్షసులే జన్మిస్తారు. నీ కొడుకులిద్దరు మహారాక్షసులై లోక కంటకులవుతారు. దేవతలనూ, మునులనూ హింసించి, ముల్లోకాలనూ ఆక్రమించుకుంటారు. ఆఖరికి ఆ శ్రీహరి చేతిలో మరణిస్తారు.’’ దితి అందుకు చాలా దుఃఖించింది.*
*అయితే కొడుకులిద్దరూ భగవంతుని చేతిలో మరణిస్తారని తెలిసినందుకు కొంతలో కొంత మేలనుకుంది. ‘‘నా కడుపున పుట్టిన బిడ్డలంతా రాక్షసులై లోకకంటకులై నానా అల్లరీ చేసి నాకు అమర్యాద కలిగించడమేనా? అంతేనా నా బతుకు? గొప్పవాడు ఒక్కడు కూడా పుట్టే అవకాశమే లేదా?’’ కన్నీరు మున్నీరయింది దితి.*
*‘‘కొడుకుగా పుట్టే అవకాశం లేదు. గొప్పవాడు నీకు మనవడుగా పుడతాడు. రాక్షసుని కడుపున పుట్టినా అతగాడు గొప్ప హరిభక్తుడై పరమ భాగవతోత్తముడు అవుతాడు. సచ్చరిత్రుడై నీకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు కలిగిస్తాడు. వాడి కీర్తిని సమస్తలోకాలూ గానం చేస్తాయి. చాలా?’’*
*"చాలు’’ అంది దితి. చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయిందక్కణ్ణుంచి. గర్భవతి అయింది. నూరు సంవత్సరాలు గడిచాయి. అప్పుడామె గర్భంలో ఉన్న తేజస్సు దిక్కులన్నిటా అలుముకుంది. ఆ తేజస్సు ముందు సూర్యచంద్రులు వెలవెలబోయారు. ఏది పగలో ఏది రాత్రో తెలియని స్థితి. మునులకీ, దేవతలకీ అంతు చిక్కలేదేదీ.*
*బ్రహ్మని సమీపించారంతా. నమస్కరించారు. ‘‘ఏమిటి దేవా, ఏమిటిదంతా?’’ అడిగారు. ‘‘ఇదంతా దితి మహిమ. దీనంతటికీ దితి గర్భమే కారణం.’’ అన్నాడు బ్రహ్మ.*
*తర్వాత జయవిజయులిద్దరూ శాపవశాన ఆమె గర్భాన రాక్షసులుగా జన్మించనున్నారని తెలియజేశాడు.*
*భయపడిన మునులనూ, దేవతలనూ చూసి ఇలా చెప్పాడు.‘‘ఆ రాక్షసులిద్దరినీ శ్రీహరి సంహరిస్తాడు. లోకాల్ని కాపాడుతాడు. ’’*
*మునులూ, దేవతలూ అందుకు సంతోషించారు. నిష్క్రమించారక్కణ్ణుంచి.*
*నూరేళ్ళూనిండుకున్నాయి. దితికి ఇద్దరు కొడుకులు పుట్టారు. వారు పుట్టినప్పుడు ఇటు భూమి మీద, అటు అంతరిక్షంలో కూడా అనేక మహోత్పాతాలు సంభవించాయి. దిక్కులన్నీ మండిపోయాయి. చుక్కలు రాలిపోయాయి. పెనువేగంతో గాలి వీచింది. చెట్లు కూలిపోయాయి. పిడుగులు పడ్డాయి. తోకచుక్కలు పుట్టుకొచ్చాయి. సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. రక్తవర్షం కురిసింది. కుక్కులూ, నక్కలూ, గుడ్లగూబలూ భయంకరంగా అరవసాగాయి. ఆలయాల్లో దేవతాప్రతిమలన్నీ కన్నీరు పెట్టుకున్నాయి. ఆవుల పొదుగుల నుండి పాలు రాలేదు, పిండకనే రక్తం కారసాగింది. గ్రహాలన్నీ వక్రగతిలో తిరగసాగాయి. ఒకదాన్నొకటి డీకొన్నాయి. ఈ మహోత్పాతాలను గమనించి, మునులూ, దేవతలూ భయకంపితులయినారు. ఆందోళన చెందసాగారు.*
*కఠినంగా కర్కశంగా కనిపిస్తున్న కొడుకుల్ని చూశాడు కశ్యపుడు. పెద్దవాడికి హిరణ్యకశిపుడు అనీ, చిన్నవాడికి హిరణ్యాక్షుడు అనీ నామకరణం చేశాడు. వజ్రదేహులయిన ఆ ఇద్దరూ దినదిన ప్రవర్థమానమై పర్వతాకారులయినారు. వారు నడుస్తుంటే భూమి బద్దలయ్యేది. ఆకాశం అదిరిపడేది. వరప్రసాదులై, మదోన్మత్తులయిన ఆ ఇద్దరూ లోకాలను చీకాకు పరచసాగారు. దేవతలనూ, మునులనూ బాధించసాగారు. అజేయులయిన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను అష్ట దిక్పాలకులు కూడా అదలించ లేకపోయారు.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి