22, ఫిబ్రవరి 2023, బుధవారం

శంకరులవారి ఖండనమంతా మీమాంసమీద

 శంకరులవారి ఖండనమంతా మీమాంసమీద, సాంఖ్యం మీద, బౌద్ధంమీద కాదు పార్ట్ 1


టోక్యో విశ్వవిద్యాలయంలో భారతీయ వేదాంతాచార్యులుగా ఉద్యోగం చేస్తున్న హజ్మి నకముర అనేవారికి 1960, జాన్యువరి 22 శుక్రవారం రాత్రి కంచి కామకోటి పీఠ జగద్గురువులు చంద్రశేఖర యతీంద్రసరస్వతులవారు 'నంబాల్' గ్రామంలోని తమ విడిదిలో దర్శనం అనుగ్రహించారు. ఆచార్య నకమురతోపాటు టోక్యో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న మియమోటో అనే ఫ్రెంచి భాషాచార్యులు కూడా వెంట వచ్చారు.


వారి సమావేశం విడిదిలోగాక విడిగావున్న ఓ కుటీరంలో జరిగింది. డాక్టర్ టి.ఎం.పి. మహదేవన్, ప్రెసిడెన్సీ కళాశాల ప్రిన్సిపాల్ టి. బాలకృష్ణనాయర్, ఆచార్య ఎస్. రామస్వామి అతిథులను కుటీరంలోకి తీసుకువెళ్లారు. పూజానంతరం స్వామివారు పదిన్నర ప్రాంతాల కుటీరంలోనికి వచ్చేసరికి అందరూ భక్తితో లేచినిలబడి సాష్టాంగ ప్రణామం చేశారు. 


స్వామివారందరినీ కూర్చోండని సెలవిచ్చారు. బాలకృష్ణ నాయర్, రామస్వామి ఆ ఇద్దరు అతిథులనూ స్వామివారికి పరిచయం చేశారు. శంకరభగవత్పాదులు రచించిన బ్రహ్మసూత్ర భాష్యంతోసహా అనేక భారతీయ వేదాంత గ్రంథాలకు నకముర అనువాదాలు చేశారు. శంకరులకు పూర్వమున్న వేదాంతాన్ని గురించి విపులంగా వ్రాశారు. ఫ్రెంచి భాషనుండి శ్రీ రామకృష్ణ పరమహంస జీవితాన్ని, స్వామి వివేకానందుల జీవితాన్ని ఆచార్య మియమోటో జాపనీస్ భాషలోకి అనువదించారు.


సంస్కృత భాషలో నకముర సంభాషణ ప్రారంభించారు. స్వామి వారిని కలుసుకున్నందుకూ వారితో సంభాషిస్తున్నందుకు తాము ధన్యులమన్నారు.


సుప్రసిద్ధులైన గౌడ పాదాచార్యులవారు చేసిన రచనలతోనూ, మాండూక్యకారిక, వాక్యపదీయంవంటి గ్రంథాలతోనూ తనకున్న అభినివేశాన్ని గురించి నకముర చెప్పారు. అలాటి రచనలు చాలా వున్నాయని స్వామివారనగానే వారు బోధాయనుణ్ణీ, అలాటి మరికొందరు ప్రముఖులనూ పేర్కొన్నారు. 


“శంకరులకు పూర్వమున్న వేదాంతాన్ని గురించి సేకరించారు?” అని స్వామివారడిగారు.


“చైనీస్ భాషలోనూ, టిబెటన్ భాషలోనూ ప్రాచీన వేదాంతానికి సంబంధించిన వ్రాతప్రతుల భాగాలు కొన్ని దొరికాయి. దొరికినవన్నీ సేకరించి కాలక్రమంలో అమర్చితే నాలుగు గ్రంథాలయ్యాయి. అవి శంకరాత్పూర్య వేదాంత సమగ్ర చరిత్రను చెప్పగలవని నా విశ్వాసం” అని నకముర చెప్పారు.


"జపాన్ లో సంస్కృతాన్ని అధ్యయనం చేస్తున్నవారు చాలామంది వున్నారు. ప్రత్యేకించి శంకరతత్త్వాన్ని అధ్యయనం చేస్తున్నవారు కూడా చాలామందే వున్నారు. బ్రహ్మసూత్రాలకు శంకరులవారు రచించిన భాష్యాన్ని పూర్తిగా అనువదించాను. అయితే ఇలాటి గ్రంథాలను ప్రచురించటం చాలా కష్టం. నాలాటి విదేశీయునికి ఖండనఖాద్యంలాటి అనంతర గ్రంథాలు అర్థంచేసుకోవటమంటే మాటలుకాదు” అని కూడా అన్నారు.


“నేనొకటి రెండు ప్రశ్నలు తమరిని అడగవచ్చునాండి?” అని జపనీస్ ప్రొఫెసరు స్వామివారినడిగారు. సరే అనిపించుకుని “ఉపాసనకు కచ్చితమైన అర్థం ఏమిటో తెలుసుకోవాలని యెంతకాలంగానో ఆరాటం. ఈ పదం శంకరభగవత్పాదులవారి గ్రంథాల్లో చాలా చోట్ల కనబడుతుంది. ఉపాసన అంటే ఏదైనా ప్రత్యేకమైన సాధనా? అలాటి సాధన ప్రస్తుతం మీ మఠంలో జరుగుతోందా?” అని ప్రశ్నించారు.


“ధ్యానమేవ ఉపాసనా. ఉపాసనమంటే ధ్యానమే. మనస్సును ఏకాగ్రం చేయటమే తపమ్. మనస్సును కేంద్రీకరించాలంటే ఒకమూర్తి అవసరం. ఉదాహరణకు నీ మనస్సును రెండుచేతుల దేవుడి మీదైనా, ఎనిమిది చేతుల దేవునిమీదైనా కేంద్రీకరించవచ్చు. సత్యం ఒక్కటే. దానికి మార్పుండదు. భగవంతుడు పరమసత్యం కాబట్టి అవ్యయుడు. అంటే ఏ మార్పూ లేనివాడు. కాని ఉపాసన అనేది ఒక ప్రయోజనం కోసం, ఒక లాభం కోసం జరిగేది. రెండు చేతుల దేవుడి మీద మనస్సు లగ్నం చేయటం వల్ల కలిగే ప్రయోజనం వేరు. ఎనిమిది చేతుల దేవుడిమీద మనస్సు లగ్నం చేయటం వల్ల కలిగే ప్రయోజనం వేరు. ఏ దేవుణ్ణి ఎలా ఉపాసిస్తే ఎలాటి ఫలితం కలుగుతుందో శాస్త్రాలు చెప్పాయి. ఉపాసన చెయ్యాలంటే శాస్త్రాలననుసరించక తప్పదు. సత్యాన్ని గ్రహించటానికి - అంటే చరమ గమ్యం చేరుకోటానికి - రకరకాల ఉపాసనలన్ని సోపానాలూ, సాధనాలూ. మనస్సును ఒక శిక్షణలో పెట్టి ఏకాగ్రం చెయ్యటంకోసం శాస్త్రాలు ఈ ఉపాసనమార్గాన్ని నిర్దేశించాయి.” అని స్వామివారు వివరించారు.


మఠంవారు ఉపాసనలేవైనా చేస్తున్నారో లేదో, ఒకవేళ చేస్తుంటే అవి ఏయే ఉపాసనలో తెలుసుకోవాలనుందని నకముర అన్నారు.


“శాస్త్రాలు అనేకవిధాలైన ఉపాసనలను గురించి చెప్పాయి, వాటి నన్నింటిని అంచవలసిన అవసరం లేదు. అన్నిటినీ ఆచరించటం సాధ్యం కాదు కూడా. సాధారణంగా ఒకటి రెండు ఉపాసన పద్దతులు మాత్రం అందరూ అనుసరిస్తారు. పూజాకలాపం నిర్దిష్టకాలంలోనే జరగాలి. ఉపాసన కేవలం వైయక్తికం, సామూహికం కానేకాదు. ఉపాసన పద్ధతి అనేది కుటుంబ సంప్రదాయం మీదో, వ్యక్తి అభిరుచి మీదో, గురువుచేసిన ఉపదేశం మీదో ఆధారపడి వుంటుంది” అన్నారు స్వామివారు.


"అద్వైత వేదాంతాన్ని అర్థం చేసుకోవాలంటే పాశ్చాత్యులైన జిజ్ఞాసువులేం చేయాలో సెలవివ్వండి” అని నకముర అడిగారు. 


స్వామి : వివేకచూడామణి చదవవచ్చు.


వివేకచూడామణి సులభంగా బోధపడుతుందనీ, అది తన్ను చాలా కదిలించిందనీ నకముర అన్నారు.


“వివేకచూడామణి అద్వైతానికి మంచి ప్రవేశిక. 'అపరోక్షానుభూతి' చదవటం తరువాతి మెట్టు. ఈ రెండూ అధ్యయనం చేస్తే అద్వైత వేదాంతాన్ని గురించి ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది.”


మాధవాచార్య విద్యారణ్యులవారి గ్రంథాలు పంచదశితోసహా తాను అధ్యయనం చేశానని నకముర చెప్పారు.


ప్రొఫెసర్లను కలుసుకుని మాట్లాడినందుకు తనకు సంతోషంగా వుందనీ, జపనీస్ పండితులను మరికొందరిని కలుసుకోవాలని కుతూహలంగా వుందనీ నకమురకు చెప్పండని స్వామివారు డాక్టర్ మహదేవన్ ని కోరారు.


జగద్గురువులను కలిసి సంభాషించే భాగ్యం కలిగినందుకు మహానందంగా వుందని నకముర అన్నారు.


అద్వైత వేదాంతం అధ్యయనం చెయ్యటానికి భారతదేశంలో దొరుకుతున్న పుస్తకాల మీదికి చర్చ మళ్లింది.


‘సురేశ్వరాచార్యులవారి వార్తికం మరీ విస్తృతంగా వుంది' అన్నారు నకముర. “బృహదారణ్యకోపనిషతునూ, దాని శంకరభాష్యాన్ని చదువుతూ అప్పుడప్పుడూ సందేహనివృత్తికోసమో. అర్థ వివరణకోసమో వార్తికం చూడటం అలవాటు. ఇంచుమించు రెండు శతాబ్దాల క్రితం ధర్మరాజుల వారు వేదాంత పరిభాష వ్రాసేవరకూ సదానందులవారి ‘వేదాంతసారమే' అద్వైత వేదాంతం చదవటానికి ఆధారగ్రంథంగా ఉపయోగపడేది. 'వేదాంత పరిభాష' వచ్చాక - వేదాంతసారాన్ని అధ్యయనం చేయటం మానేశారు. వివరణం అవసరమయినప్పుడు మాత్రమే దాన్ని చూస్తారు” అన్నారు స్వామివారు.


(సశేషం)


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: