8, జులై 2021, గురువారం

బ్రహ్మమొక్కటే

 బ్రహ్మమొక్కటే...పరబ్రహ్మమొక్కటే... 


🌷🌹🌷🌹🌷🌹🌷🌹


మాట్లాడే మాటకు, స్పృశించే శరీరానికి, భావించే మనసుకు అందిన విషయాలను లోకంలో మానవులు సామాన్య విషయాలుగానే భావిస్తారు. మాటకు దొరకకుండా, శరీరానికి అందకుండా, మనసుకు కూడా భావించే శక్తి చాలకుండా ఉండే అద్వితీయశక్తి ఉన్నదా అంటే అదే 'పరబ్రహ్మ' అనే సమాధానం వస్తుంది. పరబ్రహ్మ ఎప్పుడూ అసాధారణ విషయమే. అద్భుతవృత్తమే. అమృతస్వరూపమే.

అందినవాటిని సునాయాసంగా పొందడం, అందనివాటికోసం అర్రులు చాచడం మానవ స్వభావం. ఈ స్వభావమే మనిషిని పరబ్రహ్మతత్వాన్వేషణకు పురిగొల్పింది. కానీ పరబ్రహ్మ ఎప్పుడూ అందినట్లే అనిపిస్తూ, ఎంతకూ దొరకని చరమగమ్యమే. ఈ తత్వాన్ని చర్చించడానికి పూనుకొని సమస్త వాఞ్మయాలూ అలసిపోయాయేగాని, పరతత్వం సంపూర్ణంగా ఇంకా అందనే లేదు. అందుకే ఎవరికి తోచినట్లు వారు నిర్వచించడం ప్రారంభించారు. నిర్వచించడానికి మాటలు చాలని గంభీర విషయం పరబ్రహ్మతత్వం.


తెలిసినంత వరకు పరబ్రహ్మను వర్ణించడానికి అందమైన పదబంధాలను ప్రయోగించారు కవులు. సుందరంగా ఉన్న చెవికమ్మలోని బంగారంలా, సముద్రంలో మమేకమైన నీటిబొట్టులా, భేదంలో అభేదంలా పరబ్రహ్మ భాసిస్తోందని విశ్లేషించారు. ఏ చోటనైనా, ఏ విధంగానైనా పూజకు అనుగుణంగా ఉండేదే పరబ్రహ్మ అనీ, ఆ స్వరూపం ఎలా ఉన్నా సరే ఆరాధనకు యోగ్యమని పెద్దల మాట. పుట్టడం, జీవించడం, మరణించడం అనే ప్రక్రియలు కళ్లముందే కనబడుతున్నాయి. నిలబడేందుకు, సంచరించేందుకు ప్రదేశాలు విశాలంగా ఉన్నాయి. కాలమూ అనంతంగా సాగిపోతోంది. చరాచరాలూ ప్రత్యక్షాలే. ఇవన్నీ పరబ్రహ్మమూర్తులు కాదా? మండుటెండలో ఎడారి ఇసుకపై నీటిజాడలా కనబడుతూ, ఆ తరవాత అది నీరు కాదనీ, ఎండమావి అనీ తెలిసే సత్యం పరబ్రహ్మ స్వరూపమే! మసక చీకటిలో పాములా కనబడి భయపెట్టిన వస్తువు, తాడు అని తెలిసినప్పుడు అనుభవంలోకి వచ్చిన జ్ఞానం పరబ్రహ్మ స్వరూపమే!


ఈ విశ్వమంతా దేనినుంచి పుడుతున్నదో, దేనిలో నిలుస్తున్నదో, కాలం మూడినప్పుడు దేనిలో లయిస్తున్నదో ఆ పరంజ్యోతి వెలుగులోనే ఈ లోకమంతా కళ్లకు కనబడుతుంది. ఆ వెలుగే వెలగకపోతే భౌతికంగా ఏర్పరచుకొన్న దీపాలేవీ వెలగవు. ఆ వెలుగే పరబ్రహ్మస్వరూపం.


జీవుడు వేరనీ, దేవుడు వేరనీ మనుషులు భావిస్తారు- పరమార్థం మాత్రం అంతా ఒకటే. బ్రహ్మ అనీ, విష్ణువు అనీ, శివుడు అనీ, ఇంద్రుడు అనీ, సూర్యుడు అనీ చంద్రుడు అనీ, ఎన్ని పేర్లతోనైనా, ఎన్ని రూపాలతోనైనా పరబ్రహ్మను దర్శించవచ్చు కానీ- అవన్నీ పరబ్రహ్మలోని అంశాలే కానీ వేరు కావు. అసలు 'వేరే' అనే పదార్థమే లేదు.


పరబ్రహ్మ విశ్వరూపం సామాన్యుల కన్నులకు సంపూర్ణంగా కనబడటం అసాధ్యం. అందుకే ఒక కవి- 'బ్రహ్మ, దక్షుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, వాయువు, అగ్ని, చంద్రుడు, ఇంద్రుడు, రుద్రుడు, పర్వతాలు, నదులు, సముద్రాలు, గ్రహ సముదాయాలు, మనుషులు, దైత్యులు, గంధర్వులు, నాగులు, ద్వీపాలు, నక్షత్రాలు, సూర్యుడు, మునులు, ఆకాశం, భూమి, అశ్వినులు... ఇలా అన్నీ ఏ తనువులో లీనమై ఉంటాయో అదే విశ్వరూప'మని వర్ణిస్తాడు.


పుష్పదంతుడు అనే గంధర్వుడు తన శివమహిమ్న స్తోత్రంలో- మనుషులు తమ తమ అభిరుచులను అనుసరించి పరబ్రహ్మను వివిధ రూపాల్లో ఆరాధిస్తున్నారనీ, ఏ మూర్తిని ఆరాధించినా చివరికి ఆ పూజ చేరేది ఒకే పరబ్రహ్మలోనే అని అంటాడు.


భవబంధాలు, రాగద్వేషాలు, ఎక్కడ నశించిపోతాయో... అదే పరబ్రహ్మ స్వరూపం. అది వివరించడానికి సాధ్యంకాదు. ప్రేమతో చూసినప్పుడు అలరింపజేసే సుందరి ముఖం అనే చంద్రబింబంలా హృదయంలో అమందానందాన్ని అందించగలదు. దాన్ని తలచుకుంటే చాలు- ఎంత కాలంగానో పెనవేసుకొని ఉన్న చిక్కుముడులన్నీ తొలగిపోతాయి. నిరాశలు, నిస్పృహలు ఉండవు. ఎటు చూసినా వెలుగులే కనబడతాయి. మనసులో సైతం చీకట్లు ఉండవు. ఆహ్లాదం పరిపూర్ణమే కాదు, శాశ్వతం అవుతుంది.


జై శ్రీమన్నారాయణ🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: