🕉 మన గుడి :
⚜ కడప జిల్లా : గుండాలకొన
⚜ శ్రీ కర్కటేశ్వరస్వామి ఆలయం
💠అడవుల అందాలు చెప్పలేనివి. ఎందుకంటే చుట్టూరా విస్తరించిన పచ్చిక బయళ్లు, ప్రకృతి సోయగాలు వీటి సొంతం.వీటిని చూస్తేనే తెలీని ఆనందం ప్రతీ అణువులోనూ ప్రసరిస్తుంది.
💠 మన దగ్గర ఉన్న అడవుల విషయానికొస్తే శేషాచలం అడవులు, నల్లమల్ల అడవులు. శ్రీశైల మల్లికార్జునుడు నల్లమల్ల అడవులలో,
శ్రీ వెంకటేశ్వరుడు శేషాచలం అడవులలోనే కొలువై ఉన్నారు.
💠 అందమైన జలపాతాలకు నెలవైన కడప జిల్లాలో ప్రకృతి అందాలకు కొదవే లేదు.
ఎత్తైన కొండలు, లోతైన జలపాతాలు..ఇక అడవుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వీటితో పాటు దర్శనీయ రమణీయ స్థలాలు చాలా ఉన్నాయి.
దక్షిణ భారతదేశంలోనే పేరెన్నికగన్న దేవుని కడప ఆలయం కొలువైంది కడపలోనే.
అంతే కాదు, జిల్లాలోనే ఎత్తైన జలపాతం కూడా ఇక్కడే ఉంది. అదే పాలకొండ జలపాతం. అలాగే లంకమల జలపాతం. తౌలాంతపూరం జలపాతం, గుండాలకోన జలపాతం.
💠 ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని చిట్వేలి మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన గుండాలకోనలో గుండాలఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం..
💠 విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాలకోనగా ప్రసిద్ధి చెందింది.
ఈ గుండంలో మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని, దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ గుండం పక్కనే గుహ వుంది.
ఈ గుహలో గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు.
గుహ ద్వారంలో భక్తులు పూజలు, ఫలాలు ఉంచుతారు. వాటిని ఎండ్రకాయ లోనికి తీసుకుపోతే తమ కోర్కెలు నెరవేరినట్లుగా భక్తులు భావిస్తారు.
💠 ఈ కర్కాటకం ఒకొక్క సందర్భంలో ఒక్కొక్క సైజులో కూడా కనిపిస్తూ కోరిన వారి కోర్కెలు తీరుస్తాడు. ఇక్కడి గుండంలో మునిగి దేవున్ని దర్శించుకుంటే పాపాలు పోతాయని పూర్వీకులు నమ్మకం. ఒక్కసారి గుండాలలో స్నానమాచరిస్తే అప్పటి వరకు ఉన్న బడలిక మటుమాయమవుతుందని వైద్యులు సైతం అంటున్నారు.
💠 పార్వతీపరమేశ్వరుల నిలయమైన 'గుండాలకోన’ అత్యంత పవిత్రమైన స్థలంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో కర్కాటకం రూపంలో సజీవంగా దర్శనమిచ్చే స్వామిని దర్శించుకోవడానికి కార్తీక మాసంలోని సోమవారాల్లో అధిక సంఖ్యలో వెళుతుంటారు. ప్రత్యేకించి 3వ సోమవారం ఎక్కువ మంది వెళుతుంటారు.
💠 గుండాల కోనలో ఆ పరమేశ్వరుడు కర్కాటక రూపంలో ఎన్నో సంవత్సరాల నుండి ఉండటం ఒక పెద్ద విశేషం. తుంగా రాఘవయ్య మరియు మరికొందరు భక్తులు కలసి ఈ ప్రదేశంలో రాత్రుళ్ళు నిద్రచేయగా తెల్లవారు జామున స్వామివారి పుటు దగ్గర నుంచి మంగళ వాయిద్యాలు వినిపించాయని అంటారు.
⚜ స్థల పురాణం ⚜
💠 శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి మనుమరాలైన శ్రీ ఈశ్వరమ్మను వివాహం చేసుకోగోరి నిరాకరణకు గురైన రంగరాజు (నగరిపాడు రంగనాయకుల స్వామి) కొంతకాలం ఈ గుండాలకోనలోనే తపస్సు చేశారు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఎండ్రకాయరూపంలో భక్తులకు దర్శనమిస్తానని చెప్పాడని చెబుతారు. అయితే స్వామిని దర్శించుకోవాలంటే ఎన్నో ప్రయాసాలకోర్చి భక్తులు 9కిలోమీటర్లు అడవి బాటలో వెళ్ళాలి.
కాని దట్టమైన అడవుల్లో దారి తప్పి క్రూరజంతువులకు బలైన సంఘనటలు కొన్ని జరిగాయి చెబుతారు. అందుకే అటవీ అధికారుల అనుమతి, సహాయంతో ప్రయాణం సాగించటం మంచిదంటారు అధికారులు.
💠 ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని చిట్వేలి మండలంలోని చిట్వేలి మండలం వెంకటరాజు పల్లి,పెద్దూరు, అనుంపల్లె గ్రామాల నుంచి దాదాపు 9 కిమీ దూరంలో రిజర్వుఫారెస్టులో కొండ కోనల నడుమ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ గుండాలకోన ఉన్నది.
💠 వెంకటగిరి కొండలమీదుగా 6గుండాలను దాటుకుని 7వ గుండంలోనికి సుమారు 30 అడుగుల ఎత్తునుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తున్నది.
💠 గుండాలకోన సెలయేరు పైభాగాన ఆకారాన్ని బట్టి 7 గుండాలు ఉన్నాయి.
చదును గుండం,
బూడిద గుండం,
సమారాధన గుండం,
పసుపుగుండం,
గిన్నెగుండం,
అక్కదేవతల గుండం,
స్నాన గుండం... ఇలా 7గుండాలు కనిపిస్తాయి. సాధారణ గుండాల కంటే ఎక్కువ లోతుగా ఉండటం వీటి ప్రత్యేకత.
💠 చదునుగుండంగా చెప్పే చోట నుండి నీరు గిన్నె ఆకారంలో ఉన్న బండలపై పడుతుంది. దీనినే గిన్నె గుండంగా పిలుస్తున్నారు.
ఇక్కడే స్నాన గుండం కూడా ఉంది.
గిన్నె గుండంలోని నీరు ఇక్కడికి చేరుతుంది.
ఈ నీరు మరో గుండంలోకి పడగానే పసుపు రంగులోకి మారుతుంది. అందువల్లనే దీనికి పసుపు గుండం అని పిలుస్తారు.
ఆ తర్వాత ఈ నీరు మరో గుండంలో పడగానే బూడిదరంగుగా మారడంతో దాన్ని బూడిదగుండం అంటున్నారు.
ఈ నీరు సమారాధన గుండంలోకి వెళుతుంది. ఇక్కడే భక్తులు స్నానమాచరిస్తారు.
💠 శతాబ్దాలుగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయక్కడ. భక్తుల రద్దీ పెరిగాక ఆర్టీసీ అధికారులు ఆ ఒక్క రోజు మాత్రం రైల్వేకోడూరు నుంచి వై.కోట మీదుగా గుండాలకోనకు బస్సులు నడుపుతున్నారు. ఇక్కడి నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కూడా యేటా మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి