18, జూన్ 2023, ఆదివారం

బాదరాయణసంబంధము

 *బాదరాయణ సంబంధము*


వెనకటికి ఒక పెద్దాయన తన ఊరునుండి పనిమీద మరొక ఊరు వెడుతూ ఉండగా.... మధ్యదారిలో సాయంసంధ్యా సమయము అయినది. సకాలసంధ్యావందనం అప్పట్లో కచ్చితంగా చేసేవారు కదా! త్వరగా ప్రయాణం చెయ్యగా ఒక ఊరు వచ్చింది. అక్కడ ఒక బ్రాహ్మణోత్తముని ఇల్లు చూచుకొని బండి దిగి ఆ ఇంటి తలుపు కొద్దిగా తెరచి లోపలకు తొంగిచూచి అయ్యా.! లోపల ఎవరు ఉన్నారు? అని గట్టిగా కేక పెట్టాడు ఆ బాటసారి బ్రాహ్మణుడు. ఆ కేకకు ఆ ఇంటి యజమాని బయటకు రాగా.... ఏమాత్రమూ మొగమాటం చూపించకుండా చాలా స్వతంత్రంగా యజమానితో కులాసా కబుర్లు మాట్లాడి... కాసేపు ఇక్కడ ఉండి సంధ్యావందనం చేసుకుంటాననగా...ఆ యజమాని సంధ్యావందనానికేమి భాగ్యం? రాత్రిభోజనం కూడా మాతోనే చేసి ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయం మీ ప్రయాణం సాగించవచ్చు. అని సెలవీయటం జరిగింది. దానికి ఈ బాటసారి బ్రాహ్మణుడు అంగికరించి సంధ్యావందనం తరువాత భోజనాలు కూడా వారు పూర్తిచేశారు. 


ఈ బాటసారి బ్రాహ్మణుడు చాలా చాలా స్వతంత్రంగా వ్యవహరించటం, మాట్లాడటం చూచి ఆ ఇంటి యజమాని పరిచయం లేని ఈ బ్రాహ్మణుడు ఇంత స్వతంత్రంగా ఉన్నాడు. ఇతడు ఎవరో కూడా తెలియలేదు. నేను ఇంతకు ముందు చూడని చుట్టమేమో అనుకొంటూ...  పలుకరించి చూద్దాం. బంధుత్వముంటే బయటపడుతుంది.అని అనుకొని... ఆ బాటసారి బ్రాహ్మణుడితో.... అయ్యా! తమరిని గతంలో ఎప్పుడూ చూచినట్లు లేదు. మీకూ మాకూ బంధుత్వము కూడా ఉన్నట్లు నాకు గుర్తుకు రావటం లేదు. ఇంతవరకూ మనం మాట్లాడుకున్నాము. మీరేమో అపరిచితులు వలె వ్యవహరించటంమూ లేదు. ఇంతకూ మనమధ్య నాకు తెలియని బంధుత్వమేమైనా ఉన్నదా? ఉంటే సెలవియ్యండి. అన్నాడు. 


దానికి ఆ బాటసారి బ్రాహ్మణుడు... అయ్యో! మనకు బంధుత్వము లేకపోవటమేమండీ? 

*అస్మాకం బదరీచక్రం యుష్మాకం బదరీ తరుః ౹*

*బాదరాయణ సంబంధం యూయం యూయం వయం వయం ॥*

నా బండి చక్రాలలో ఒకటి బదరీనృక్షపు కలపతో చేయబడినది. మీ ఇంటి ముందరేమో ఏకంగా బదరీవృక్షమే ఉన్నది. కనుక మనిద్దరిదీ ఈ బదరీ సంబంధమైన బంధుత్వము. కనుక ఇది బాదరాయణసంబంధము. అన్నాడు. దానితో ఆ ఇంటి యజమాని తెల్లముఖం వేశాడు. 


అప్పటి నుండి ఈ *బాదరాయణసంబంధము* ప్రచారంలోకి వచ్చింది.

కామెంట్‌లు లేవు: