18, జూన్ 2023, ఆదివారం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం

 🕉 మన గుడి : 







⚜ కడప జిల్లా : వెయ్యినూతుల కోన


⚜ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం


💠 వెయ్యి నూతులు (బావులు) ఉన్న ప్రదేశం కావడంతో వెయ్యినూతుల కోన అనే పేరు వచ్చింది. క్రమంగా నూతుల కాస్తా నూతల అయింది.

వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం చిన్నదాసరిపల్లె గ్రామంలో వెయ్యినూతలకోన క్షేత్రం ఉంది. 


💠 హిరణ్యకశిపుడిని ఆసాధరాణమైన రీతిలో సంహరించి అహోబిల క్షేత్రం నుంచి మొట్టమొదటిగా విచ్చేసింది ఇక్కడికే. 

 శ్రీ మహాలక్ష్మీ రూపమైన చెంచులక్ష్మీతో విహరించింది ఈ మనోహర క్షేత్రంలోనే. అంతేకాదు హిరణ్యకశిపుని వధ సందర్భంగా తాను ప్రదర్శించిన 32 ఛాయల్లో రెండింటిని శాశ్వతంగా నిలిపింది ఈ మహిమాన్విత క్షేత్రంలోనే. 

అందువల్ల ఇది మన రాష్ట్రంలోనే గాక యావద్భారతంలోని నరసింహ క్షేత్రాల్లోనే అగ్రశ్రేణి క్షేత్రంగా అలరారుతోంది. 


💠 వివాహాలు కుదిర్చే స్వామిగా, అపర ధన్వంతరిగా పూజలు అందుకుంటున్నాడు వెయ్యినూతుల కోనలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి. 

శాంత రూపంలో దర్శనమిచ్చే ఈ స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయనేది భక్తుల నమ్మకం. 

వివాహ దోషాలనూ తొలిగించే ఈ స్వామి ఆలయం చుట్టుపక్కల కాకులూ గద్దలూ తిరగవనీ చెబుతారు.


⚜ స్థలపురాణం ⚜


💠 నుయ్యి అంటే బావి. 

ఈ ప్రాంతంలో సుమారు వెయ్యి బావులు ఉండటం వల్లే ఆలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.

 వాల్మీకి మహర్షి ఈ స్వామిని దర్శించుకుని ఆలయానికి సమీపంలోని ఓ పర్వతం పైన ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేశాడనీ, రామాయణంలో కొంత భాగాన్ని ఇక్కడే రాశాడనీ చెబుతారు. 


💠 హిరణ్యకశిపుడిని సంహరించిన స్వామి తరువాత ఉగ్రరూపంలో అడవుల్లో సంచరిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడట. అప్పటికే ఇక్కడ తపస్సు చేసుకుంటున్న కొందరు మహర్షులు స్వామిని పూజించి ప్రసన్న రూపం దాల్చమని కోరారట. అయినా ఫలితం లేకపోవడంతో అంతా కలిసి ఇక్కడున్న వెయ్యినూతుల నుంచి నీటిని తెచ్చి స్వామికి అభిషేకం చేశారట. 

ఆ తరవాత స్వామి ఇక్కడ కొలువు దీరమంటూ వేడుకున్నారట.


💠 ఈ ఆలయం దగ్గరికి చేరుకోగానే

శాంతించడంతో మహర్షుల కోరికను మన్నించిన స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని కథనం. ఈ క్షేత్రంలో కాకులూ, గద్దలూ సంచరించకపోవడం వెనకా మరో ఆసక్తికరమైన కథనం ఉంది. 


💠 రాముడు సీతాసమేతంగా ఈ క్షేత్రానికి వచ్చి సేద తీరుతున్న సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు వచ్చి తన ముక్కుతో సీతాదేవిని పొడిచి నిద్రాభంగం కలిగించాడట.

దాంతో రాముడు ఆగ్రహించి కాకాసురుడిపైన బ్రహ్మాస్త్రం సంధించాడట. దాన్నుంచి తప్పించుకునేందుకు దేవతలందరి దగ్గరకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఆ అసురుడు చివరకు రాముడినే శరణు కోరాడట. అప్పుడు రాముడు ఈ క్షేత్రం చుట్టూ గిరిగీసి.. లోపలికి ప్రవేశించవద్దంటూ ఆజ్ఞాపించాడట. అప్పటినుంచీ ఇక్కడ కాకులు తిరగవని అంటారు.


💠 గర్భాలయంలో స్వామి శంఖచక్రాలూ, అభయముద్రతో లక్ష్మీసమేతంగా దర్శనమిచ్చినా ఈ ఆలయానికి కొద్ది దూరంలో లక్ష్మీదేవికి ప్రత్యేక ఆలయం కూడా ఉంటుంది. స్వామిపైన అలిగిన లక్ష్మీదేవి ఆలయానికి కొద్దిగా దూరం జరిగి శిలగా మారడంతో అక్కడే ఆమెకు ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.


💠ఈ ఆలయంలో అర్ధరాత్రి మహర్షులూ, దేవతలూ స్వామిని దర్శించుకుంటారనీ.. అందుకే ఆ సమయంలో గంటలు వాటంతట అవే మోగుతాయనీ చెబుతుంటారు స్థానికులు. 

ఈ కోనలో నేటికీ మహసిద్ధులు ప్రతి నిత్యం ఏకాంత సమయంలో అదృశ్యరూపంలో స్నానంచేసి తపమాచరించి స్వామిని దర్శిస్తారని ఇక్కడ చెపుతుంటారు. 

ఇందుకు నిద్శనంగా లక్ష్మీదేవి స్వామి వారి పాదాల చెంత అర్చక ద్రవ్యాలు కనిపిస్తాయి. 


💠 40 రోజులు స్వామిని పూజించి ఈ ప్రాంగణంలో నిద్రిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయనేది భక్తుల విశ్వాసం. 

అదే విధంగా కుజదోషం ఉన్నవారు ఇక్కడున్న అమ్మవారికి కుంకుమపూజలు చేస్తే త్వరగా వివాహం జరుగుతుందట. 


💠 ఇక్కడి స్వామికి రోజువారీ చేసే పూజలతోపాటు వైశాఖ మాసంలో వచ్చే నృసింహ జయంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలను జరిపిస్తారు. 


💠 తాళ్ళపాక అన్నమాచార్యులు స్వామి వారిమీద 10 కీర్తలను రచించారు. 

ఈ దేవాలయానికి ఏక్కడాలేని మరో.ప్రత్యేకత కూడా వుంది. 

సాధారణంగా ఏ గుడిలోనైనా విగ్రహలు ఉత్తరం లేదా తూర్పు ముఖం వుంటారు.

 కానీ మహలక్ష్మీ ఆలయంలో విగ్రహం మాత్రం పడమర ముఖంగా వుంటుంది. 

దీని కారణంగా ఎక్కువ సంఖ్యలో మహలక్ష్మి అమ్మవారిని మహిళలు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 


💠 ఈ పుణ్య క్షేత్రంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు రాత్రికి గరుడ సేవ, మరుసటి రోజు కల్యాణం జరపడం అనవాయితీ.

 

💠 ఈ ఆలయం కడప నుంచి 25 కిమీ దూరం.

కామెంట్‌లు లేవు: