*భస్మధారణ వర్ణనము*
🙏🔥🚩🇮🇳✍️👉
సూత ఉవాచ |
ద్వివిధం భస్మ సంప్రోక్తం సర్వ మంగలదం పరమ్ | తత్ర్ప కారమహం వక్ష్యే సావధానతయా శృణు || 1
ఏకం జ్ఞేయం మహాభస్మ ద్వితీయం స్వల్పసంజ్ఞకమ్ | మహాభస్మ ఇతి ప్రోక్తం భస్మ నానా విధం పరమ్ || 2
తద్భస్మ త్రివిధం ప్రోక్తం శ్రౌతం స్మార్తం చ లౌకికమ్ | భస్మైవ స్వల్ప సంజ్ఞో వై బహుధా పరికీర్తితమ్ || 3
శ్రౌతం భస్మ తథా స్మార్తం ద్విజానామేవ కీర్తితమ్ | అన్వేషా మపి సర్వేషా మపరం భస్మ లౌకికమ్ || 4
సూతుడిట్లు పలికెను -
భస్మ మంగళములనన్నిటినీ కలిగించును, ఉత్తమమైనది . అను రెండు విధములుగానున్నది. ఆ వివరములను చెప్పెదను శ్రద్ధగా వినుము (1). భస్మ మహాభస్మ, స్వల్ప భస్మ అని రెండు రకములుగా నున్నది. మహాభస్మ యందు మరల భేదములు గలవు (2). మహాభస్మ శ్రౌతము, స్మార్తము, లౌకికము అని మూడు విధములుగా నున్నది. స్వల్ప భస్మయందు కూడ అనేక భేదములు గలవు (3). శ్రౌత, స్మార్త, భస్మలను ద్విజులు మాత్రమే ధరించవలెననియు, ఇతరులందరు లౌకిక భస్మను ధరించవలెననియు చెప్పబడినది (4).
ధారణం మంత్రతః ప్రోక్తం ద్విజానాం మునిపుంగవైః కేవలం ధారణం జ్ఞేయమన్యేషాం మంత్రవర్జితమ్ || 5
ఆగ్నేయ ముచ్యతే భస్మ దగ్ధ గోమయ సంభవమ్ | తదపి ద్రవ్యమిత్యుక్తం త్రిపుండ్రస్య మహామునే || 6
అగ్ని హోత్రోత్థితం భస్మ సంగ్రాహ్యం వా మనీషిభిః | అన్య యజ్ఞోత్థితం వాపి త్రింపుండ్రస్య చ ధారణ || 7
అగ్నిరిత్యాదిభిర్మంత్రై ర్జాబాలో పనిషద్గతైః | సప్త భిర్దూలనం కార్యం భస్మనా సజలేన చ || 8
వర్ణానామాశ్రమాణాం చ మంత్రతోs మంత్రతోsపి చ | త్రిపుండ్రోద్దూలనం ప్రోక్తం జాబాలై రాదరేణ చ || 9
భస్మనోద్ధూలనం చైవ యథా తిర్యక్ త్రిపుండ్రకమ్ | ప్రమాదాదపి మోక్షార్ధీ న త్యజేదితి విశ్రుతిః || 10
ద్విజులు మంత్ర పూర్వకముగను, ఇతరులు మంత్రము లేకుండా భస్మను ధరించవలెనని మహర్షులు చెప్పిరి (5).ఓమహర్షీ! గోమయమును కాల్చగా లభించిన భస్మకు ఆగ్నేయ భస్మయని పేరు. అది త్రిపుండ్రమునకు యోగ్యమగు భస్మయని చెప్పబడినది (6). విద్వాంసులు అగ్ని హోత్రములోని భస్మను గాని, ఇతర యజ్ఞములలో లభించు భస్మను గాని భద్రము చేసుకొని, దానిని త్రిపుండ్ర ధారణమునకు వినియోగించవలెను (7). జాబాలో పనిషత్తు నందలి 'అగ్నిః' ఇత్యాది ఏడు మంత్రములను ఉచ్చరిస్తూ, భస్మను నీటితో కలిపి, శరీరావయవములయందు ధరించవలెను (8). అన్ని వర్ణముల వారు, ఆశ్రమముల వారు మంత్రముతో గాని, మంత్రము లేకుండా గాని, భస్మను శరీరావయవముల యందు, త్రిపుండ్రముగా లలాటమునందు శ్రద్ధతో ధరించవలెనని జాబాల ఋషి యొక్క అనుయాయులు చెప్పిరి (9). మోక్షమును కోరువాడు శరీరావయములయందు భస్మధారణమును, లలాటము నందు అడ్డముగా భస్మతో త్రిపుండ ధారణమును పొరపాటునైననూ విడువరాదని వేదములు చెప్పుచున్నవి (10).
శివేన విష్ణునా చైవ తథా తిర్యక్ త్రిపుండ్రకమ్ | ఉమా దేవీ చ లక్ష్మీశ్చ వాచాన్యాభిశ్చ నిత్యశః || 11
బ్రాహ్మణౖః క్షత్రియైర్వైశ్యై శ్శూద్రైరపి చ సంకరైః | అపభ్రంశైర్ధృతం భస్మ త్రిపుండ్రో ద్దూలనాత్మనా || 12
ఉద్దూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరన్తి యే | తేషాం నాస్తి సమాచారో వర్ణాశ్రమ సమన్వితః || 13
ఉద్దూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి యే | తేషాం నాస్తి వినిర్ముక్తి సస్సంసారాజ్ఞన్మ కోటి భిః || 14
ఉద్ధూలనం త్రింపుండ్ర చ శ్రద్ధయా నాచరంతి యే | తేషాం నాస్తి శివజ్ఞానం కల్పకోటి శతైరపి || 15
శివుడు, విష్ణువు, ఉమాదేవి, లక్ష్మీ, సరస్వతి మరియు ఇతర దేవతలు నిత్యము లలాటమునందు అడ్డముగా త్రిపుండ్రమును ధరింతురు (11). బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులే గాక, సర్వ మానవులు భస్మను శరీరావయవముల యందు, లలాటమునందు త్రిపుండ్రముగను ధరించవలెను (12). ఉద్ధూలన (శరీరావయవముల యందు భస్మను ధరించుట), త్రిపుండ్రములను శ్రద్ధగా ధరించని వారికి వర్ణాశ్రమధర్మములు సిద్ధించవు (13). అట్టి వారికి కోటి జన్మలెత్తిననూ సంసారమునుండి విముక్తి కలగదు (14). వందల కోట్ల కల్పముల తరువాత కూడ వారికి శివజ్ఞానము కలుగదు (15).
ఉద్ధూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నా చరంతి యే | తే మహాపాతకైర్యుక్తా ఇతి శాస్త్రీ య నిర్ణయః || 16
ఉద్ధూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి యో | తేషామా చరితం సర్వం విపరీత ఫలాయ హే || 17
మహా పాతక యుక్తానాం జంతూనాం శర్వ విద్విషామ్ | త్రిపుండ్రోద్ధూలన ద్వేషో జాయతే సుదృఢం మునే || 18
శివాగ్ని కార్యం యః కృత్వా కుర్యాత్త్రియాయుషాత్మ విత్ | ముచ్యతే సర్వపాపైస్తు స్పృష్టేన భస్మనా నరః || 19
ఉద్దూలన త్రిపుండ్రములను ఎవరైతే శ్రద్ధతో ఆచరించరో, వారు మహా పాపులని శాస్త్రముల నిర్ణయము (16). వారు చేయు కర్మలన్నియు విపరీత ఫలముల నిచ్చును (17). ఓ మహర్షీ! శివుని ద్వేషించే మహా పాపులకు భస్మతో ఉద్ధూలన, త్రిపుండ్రముల ననుష్ఠించుటయందు ధృఢమగు ద్వేషము కలుగును (18). ఆత్మవేత్తయగు భక్తుడు త్రియాయుషాది మంత్రములతో శివాగ్ని కార్యమును చేసి సర్వపాపముల నుండి విముక్తుడగుటయేగాక, ఆ అగ్ని యొక్క భస్మను స్పృశించిన మానవుడు పాపవిముక్తుడగును (19).
సితేన భస్మనా కుర్యాత్ త్రిసంధ్యం యస్త్రిపుండ్రకమ్ | సర్వపాప వినిర్ముక్తః శివేన సహ మోదతే || 20
సితేన భస్మనా కుర్యాల్లలాటే తు త్రిపుండ్రకమ్ | యోసావనాది భూతాన్ హి లోకానాప్తో మృతో భవేత్ || 21
ఆకృత్వా భస్మనా స్నానం జపేద్వై షడక్షరమ్ | త్రిపుండ్రం చ రచిత్వా తు విధినా భస్మనా జపేత్ || 22
ఆదయో వాధమో వాపి సర్వపాపాన్వితోsపివా | ఉషః పాపాన్వితో వాపి మూర్ఖో వా పతితోsపివా || 23
యస్మిన్ దేశే వసేన్నిత్యం భూతి శాసన సంయుతః | సర్వతీర్థైశ్చ క్రతుభిః సాన్నిధ్యం క్రియతే సదా || 24
త్రిసంధ్యల యందు తెల్లని భస్మతో త్రిపుండ్రమును ధరించు భక్తుడు పాపములన్నింటి నుండి విముక్తుడై, శివునితో కూడి యానందించు (20). తెల్లని భస్మతో లలాటమునందు త్రిపుండ్రమును ధరించు భక్తుడు మరణించినతరువాత శాశ్వత లోకములను పొందును (21). భస్మ స్నానము (భస్మను దరించుట ) చేయకుండగా 'ఓం నమశ్శివాయ' అను మంత్రమును జపించరాదు. భస్మతో త్రిపుండ్రమును యథావిధిగా ధరించి, మంత్రమును జపించవలెను(22).దయలేని వాడు, అధముడు, పాపుములనన్నిటినీ చేసిన వాడు, సూర్యోదయ కాలమునందు నిద్రించువాడు, మూర్ఖుడు, పతితుడు అయిననూ (23), విభూతిని ధరించి ఏ స్థానములో నివసించునో, అచట అన్ని తీర్థములు, క్రతువులు అతని సన్నిధిలో నుండును (24).
త్రిపుండ్ర సహితో జీవః పూజ్యస్సర్వై స్సురాసురైః పాపాన్వితోsపి శుద్ధాత్మా కిం పునః శ్రధ్ధయా యుతః || 25
యస్మిన్ దేశే శివజ్ఞానీ భూతిశాసన సంయుతః | గతో యదృచ్ఛయాద్యాపి తస్మింస్తీర్థాస్సమాగతాః || 26
బహునాత్ర కిముక్తేన ధార్యం భస్మ సదా బుధైః | లింగార్చనం సదా కార్యం జప్యో మంత్రః షడక్షరః || 27
బ్రహ్మణా విష్ణునా వాపి రుద్రేణ మునిభిస్సురైః | భస్మధారణ మహాత్మ్యం న శక్యం పరిభాషితుమ్ || 28
త్రిపుండ్రమును ధరించు జీవుడు పాపాత్ముడైననూ, దేవతలచే, రాక్షసులచే, సర్వులచే పూజనీయుడు. శ్రద్ధతో గూడిన ధర్మాత్ముని గురించి చెప్పునదేమున్నది? (25).విభూతిని ధరించు శివజ్ఞాని అనుకోకుండానైననూ ఏ స్థానమునకు వెళ్లునో, అచట తీర్థములన్నియూ సమకూడును (26). ఈ విషయములో అధికముగా చెప్పనేల? విద్వాంసులు సదా భస్మను ధరించవలెను. లింగార్చనను చేయవలెను. 'ఓం నమశ్శివాయ' మంత్రమును జపించవలెను (27). బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మునులు మరియు దేవతలు కూడా భస్మధారణ మహిమను వర్ణింపజాలరు (28).
ఇతి వర్ణాశ్రమాచారో లుప్త వర్ణ క్రియోsపి చ | పాపాత్స కృత్త్రిపుండ్రస్య ధారణాత్సోsపి ముచ్యతే || 29
యే భస్మధారణం త్యక్త్వా కర్మ కుర్వన్తి మానవాః | తేషాం నాస్తి వినిర్మోక్ష స్సంసారాజ్ఞన్మ కోటి భిః || 30
తేనాధీతం గురోస్సర్వం తేన సర్వమనుష్ఠితమ్ |యేన విప్రేణ శిరసి త్రిపుండ్రం భస్మ నా కృతమ్ || 31
యే భస్మధారిణం దృష్ట్వా నరాః కుర్వంతి తాడనమ్ | తేషాం చండాలతో జన్మ బ్రహ్మన్నూహ్యం విపశ్చితా || 32
వర్ణాశ్రమాచారములను పాటించువాడు గాని, పాటించని వాడు గాని ఒక్కసారి త్రిపుండ్రమును ధరించినచో, పాపము నుండి విముక్తుడగును (29). భస్మ ధారణను వీడి కర్మను చేయు మానవులకు కోటి జన్మలెత్తిననూ సంసారము నుండి విముక్తి లభించదు. (30). ఏ విప్రుడైతే లలాటము నందు భస్మతో త్రిపుండ్రమును ధరించునో, అతడే గురువు వద్ద సర్వమును అధ్యయనము చేసినట్లు, సర్వకర్మలను అనుష్ఠించినట్లు అగును (31). ఓ మహర్షీ! భస్మమును ధరించు వ్యక్తిని అవమానించు మానవులకు అతి నీచమగు జన్మ లభించునని తెలియవలెను (32).
మానస్తోకేన మంత్రేణ మంత్రితం భస్మ ధారయేత్ | బ్రాహ్మణః క్షత్రియశ్చైవ ప్రోక్తేష్వంగేషు భక్తిమాన్ || 33
వైశ్య స్త్రి యంబకేనైవ శూద్రః పంచాక్ష రేణు తు | అన్యేషాం విధవాస్త్రీణాం విధిః ప్రోక్తశ్చ శూద్రవత్ || 34
పంచ బ్రహ్మాది మనుభిర్గృహస్థస్య విధీయతే | త్రియంబకేన మనునా విధిర్వై బ్రహ్మ చారిణః || 35
అఘోరేణాథ మనునా విపినస్థవిధిః స్మృతః | యతిస్తు ప్రణవేనైవ త్రిపుండ్రా దీని కారయేత్ || 36
బ్రాహ్మణ క్షత్రియులు 'మానస్తోకే తనయే' అను మంత్రముతో భస్మను మంత్రించి, భక్తితో, నిర్దిష్టములైన అవయవముల యందు ధరించవలెను (33). వైశ్యుడు త్ర్యం బక మంత్రముతోను, శూద్రుడు పంచాక్షర మంత్రముతోను, భస్మను ధరించవలెను. ఇతరులు, భర్తృహీనలగు స్త్రీలు పంచాక్షరితో ధరించవలెనని విధింపబడినది (34).గృహస్థుడు బ్రహ్మాది అయిదు మంత్రములతో, బ్రహ్మచారి త్ర్యం బక మంత్రముతో (35), వానప్రస్థుడు అఘోరమంత్రముతో, సన్న్యాసి ఓంకారముతో త్రిపుండ్రమును ధరించవలెనని ఋషులు వాక్రుచ్చిరి (36).
అతి వర్ణాశ్రమీ నిత్యం శివోsహం భావనాత్పరాత్ | శివయోగీ చ నియత మీ శానేనాపి ధారయేత్ || 37
న త్యాజ్యం సర్వ వర్ణైశ్చ భస్మధారణ ముత్తమమ్ | అన్యైరపి యథా జీవైస్సదేతి శివశాసనమ్ || 38
భస్మస్నానేన యావంతః కణాస్స్వాంగే ప్రతిష్ఠితాః | తావంతి శివలింగాని తనౌ ధత్తే హి ధారకః || 39
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శ్శూద్రాశ్చాపి చ సంకరాః | స్త్రియోsథ విధవా బాలాః ప్రాప్తాః పాఖండిన స్తథా || 40
బ్రహ్మచారీ గృహీ వన్యః సన్న్యాసీ వా వ్రతీ తథా | నార్యో భస్మ త్రిపుండ్రాంకా ముక్తా ఏవ న సంశయః || 41
సర్వకాలములయందు 'శివుడను నేనే' అను పరమభావన వలన వర్ణాశ్రమములకు అతీతుడైన శివయోగి తప్పనిసరిగా ఈశానమంత్రముతో భస్మను దరించవలెను (37). సర్వ వర్ణముల వారేగాక, సర్వ మానవులు ఏనాడూ ఉత్తమమగు భస్మధారణను మానరాదని శివుని యాజ్ఞ (38). భస్మస్నానముచే ఎన్ని భస్మకణములు దేహమునందు ధరింపబడునో, అన్ని శివలింగములను ఆ భక్తుడు తన దేహమునందు ధరించుచున్నట్లు అగును (39). బ్రాహ్మణ క్షత్రియ వేశ్య శూద్రులు, ఇతరులు, స్త్రీలు, భర్తృహీనలు, కన్యలు, పాపాత్ములు (40), మరియు బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్న్యా సి, వ్రతదీక్షయందున్నవాడు మొదలగు వారందరు భస్మతో త్రింపుడ్రమును ధరించినచో, ముక్తులగుదురనుటలో సంశయము లేదు (41).
జ్ఞానతోsజ్ఞానతో వాపి వహ్నిదాహసమం యథా | జ్ఞానా జ్ఞానధృతం భస్మ పావయేత్సకలం నరమ్ || 42
నాశ్నీ యజ్ఞలమన్న మల్ప మపి వా భస్మాక్ష ధృత్యా వినా
భుక్త్వా వాథ గృహీ వనీ పతి యతిర్వర్ణీ తథా సంకరః |
ఏనో భుజ్ నరకం ప్రయాతి స తదా గాయత్రి జాపేన తత్
వర్ణానాం తు యతేస్తు ముఖ్య ప్రణవా జాపేన ముక్తం భవేత్ || 43
త్రిపుండ్రం యే వినిందంతి నిందంతి శివమేవ తే | ధారయంతి చ యే భక్త్యా ధారయంతి తమేవ తే || 44
ధిగ్భస్మ రహితం భాలం ధిగ్గ్రామమ శివాలయమ్ | ధిగనీశార్చనం జన్మ ధిగ్విద్యా మశివాశ్రయమ్ || 45
తెలిసి స్పృశించినా, తెలియక స్పృశించినా, నిప్పు సమానముగా కాల్చును. అటులనే, తెలిసి గాని, తెలియకుండా గాని, భస్మను ధరించినచో, అది ఆ వ్యక్తిని పూర్ణ పవిత్రుని చేయును (42). భస్మను రుద్రాక్షలను ధరించుకుండా నీరు త్రాగరాదు. కొద్దిగానైననూ భుజించరాదు. గృహస్థుడు, వాన ప్రస్థుడు, సన్న్యాసి, చతుర్వర్ణములవారు, లేక ఇతరులు ఎవరైనా గాని, అట్లు చేసినచో పాపమును భుజించినట్లగును. అట్టివాడు నరకమును పొందును. గాయత్రీ జపముచే ఆ పాపము తొలగును. సన్న్యాసియైనచో ప్రణవమును జపించవలెను (43). త్రిపుండ్రమును నిందించువారు శివుని నిందించినట్లగును. దానిని భక్తితో ధరించువారు శివుని ధరించినట్లగును (44). భస్మలేని లలాటము, శివాలయములేని గ్రామము, శివుని పూజించని జన్మ, మరియు శివ సంబంధములేని విద్య నిందనీయములు (45).
యే నిందంతి మహేశ్వరం త్రిజగతా మాధారభూతం హరం యే నిందంతి త్రిపుండ్రధారణకరం దోషస్తు తద్దర్శనే |
తే వై సంకర సూకరా సుర ఖరశ్వక్రోష్టు కీటోపమా జాతా ఏవ భవంతి పాపపరమాస్తే నారకాః కేవలమ్ || 46
తే దృష్ట్వా శశిభాస్కరౌ నిశి దినే స్వప్నేsపి నో కేవలం పశ్యంతు శ్రుతి రుద్రసూక్త జపతో ముచ్యేత తేనాదృతాః |
సత్సం భాషణ భవేద్ధి నరకం నిస్తారవానాస్థితం యే భస్మాది విధారణం హి పురుషం నిందంతి మందాహి తే || 47
న తాంత్రికస్తధికృతో నోర్థ్వపుండ్రధరో మునే| సంతప్త చక్ర చిహ్నోsత్ర శివయజ్ఞే బహిష్కృతః || 48
తత్రైతే బహవో లోకా బృహజ్ఞాబాల చోదితాః | తే విచార్యాః ప్రయత్నేన తతో భస్మరతో భవేత్ || 49
ముల్లోకములకు ఆధారమైన, పాపహరుడగు మహేశ్వరుని, త్రిపుండ్రమును ధరించువానిని ఎవరు దూషిస్తారో, అట్టి వారిని చూచినచో దోషము కలుగును. ఆ పాపాత్ములు నరకము ననుభవించి, పంది, రాక్షసుడు, గాడిద, కుక్క, నక్క, కీటకము మొదలగు జన్మలను పొందెదరు (46). వారు పగలు సూర్యుని, రాత్రి చంద్రుని చూడలేని అంధుల వంటివారు. వారు స్వప్నములో నైననూ వేదమునందలి రుద్రసూక్తమును జపించినచో అది వానిని రక్షించి మోక్షమునొసంగును. సత్పురుషులతో సంభాషించు మానవుడు నరకమును దాటివేయును. భస్మను ధరించు వ్యక్తిని నిందించువారు మూర్ఖులు(47). ఓ మహర్షీ! తాంత్రికునకు, ఊర్థ్వ పుండ్రమును ధరించువానికి, కాల్చిన ఇనుముతో శరీరముపై చక్రాంకితము వేసుకున్న వారికి శివయజ్ఞము నందు అధికారము లేదుగాన, వారు బహిష్కరింపబడుదురు (48). మానవుడు బృహజ్ఞాబాలో పనిషత్ లోని వివిధ మంత్రములను శ్రద్ధతో విచారణ చేసినచో, భస్మధారణ యందు అనురక్తి కలుగును (49).
యచ్చందనైశ్చందనకేsపి మిశ్రం ధార్యం హి భస్మైవ త్రిపుండ్ర భస్మనా |
విభూతి భాలోపరి కించ నా పి ధార్యం సదా నో యది సంతి బుద్ధయః || 50
స్త్రీ భిస్త్రి పుండ్ర మలకావధి ధారణీయం భస్మ ద్విజాదిభిరథో విధవా భిరేవమ్ |
తద్వత్సదాశ్రమవతాం విశదా విభూతిః ధార్యాపవర్గ ఫలదా సకలాఘహంత్రీ || 51
త్రిపుండ్రం కురుతే యస్తు భస్మనా విధిపూర్వకమ్ | మహాపాతక సంఘూతైర్ముచ్యతే చోపపాతకైః || 52
బ్రహ్మచారీ గృహస్థో వా వానప్రస్థోsథవా యతిః | బ్రహ్మక్షత్రాశ్చ విట్ శూద్రాస్తథాన్యే పతితాధమాః || 53
ఉద్ధూలనం త్రిపుండ్రం చ ధృత్వా శుద్ధా భవంతి చ | భస్మనో విధినా సమ్యక్ పాపరాశిం విహాయ చ || 54
గంధమును ధరించ గోరు వారు దానిని భస్మయందు కలిపి త్రిపుండ్రమును ధరించవలెను. విభూతిని లలాటమునందు ధరించి, దానిపైన మరియొక పదార్ధమును ధరించరాదు. అట్లు ధరించువారు మూర్ఖులు (50). స్త్రీలు ముంగురులు ఉండు స్థానము వరకు లలాటము నందు త్రిపుండ్రమును ధరించవలెను. ద్విజులు, ఇతరులు, మరియు భర్తృహీనలగు స్త్రీలు ఇదే తీరున భస్మను ధరించవలెను. భస్మ పాపములనన్నిటినీ పోగొట్టి మోక్షఫలమునిచ్చును (51). భస్మతో యథావిధిగా త్రిపుండ్రమును ధరించు మానవుడు మహా పాతకముల సమూహముల నుండియు, మరియు ఉపపాతకముల నుండియు విముక్తిని పొందును (52). బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, మరియు యతి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు, మరియు పతితులు, అధములు (53) భస్మతో శరీరావయవముల యందు లేపమును, లలాటము నందు త్రిపుండ్రమును ధరించినచోపరిశుద్ధులగుదురు. భస్మధారణ విధి పాపరాశులను పూర్తిగా తొలగించును (54).
భస్మధారీ విశేషేణ స్త్రీ గోహత్యాదిపాతకైః | వీరహత్యాశ్వహత్యాభ్యాం ముచ్యతే నాత్ర సంశయః || 55
పరద్రవ్యాపహరణం పరదారాభి మర్శనమ్ | పరనిందా పరక్షేత్రహరణం పరపీడనమ్ || 56
సస్యారామాదిహరణం గృహదాహాది కర్మ చ | గో హిరణ్య మహిష్యాది తిలకంబల వాససామ్ || 57
అన్నధ్యాన్య జలాదీనాం నీ చేభ్యశ్చ పరిగ్రహః | దశవేశ్యా మతంగీషు వృషలీషు నటీషు చ || 58
రజస్వలాసు కన్యాసు విధవాసు చ మైథునమ్ | మాంస చర్మరసాదీనాం లవణస్య చ విక్రయః || 59
పైశున్యం కూటవాదశ్చ సాక్షి మిథ్యా భిలాషిణామ్ | ఏవమాదీన్య సంఖ్యాని పాపాని వివిధాని చ || 60
సద్య ఏవ వినశ్యంతి త్రిపుండ్రస్య చ ధారణాత్ |
భస్మమును ధరించు భక్తుడు స్త్రీహత్య, గోహత్య, వీరపురుష హత్య, అశ్వహత్య ఇత్యాది పాతకముల నుండి విముక్తుడగును. సందేహము లేదు (55). ఇతరుల ధనమును అపహరించుట, పరుని భార్యను కామించుట, ఇతరులను నిందించుట, ఇతరుల భూమిని అపహరించుట, ఇతరులను పీడించుట (56), పంట, గృహము ఇత్యాదుల నపహరించుట, ఇళ్లను తగులబెట్టుట, నీచుల నుండి గోవు, బంగారము, గేదె, నువ్వులు, కంబళి, వస్త్రము (57), అన్నము, ధాన్యము, నీరు మొదలగు వాటిన స్వీకరించుట, వేశ్యలు, అవివాహితలు, నాట్యకత్తెలు (58), రజస్వలలు, భర్తృహీనలు అగు స్త్రీలతో సంభోగించుట, మాంసము, చర్మము, పాదరసము, ఉప్పు మొదలగు వాటిని అమ్ముట (59), కొండెములను చెప్పుట, కూట సాక్ష్యమును చెప్పుట, చెప్పించుట మొదలగు వివిధములైన లెక్కలేనన్ని పాపములు (60) త్రిపుండ్రమును ధరించిన వెనువెంటనే నశించును.
శివద్రవ్యాపహరణం శివనిందా చ కుత్రచిత్ || 61
నిందా చ శివభక్తానాం ప్రాయశ్చిత్తైర్న శుధ్యతి | రుద్రాక్షం యస్య గాత్రేషు లలాటే చ త్రిపుండ్రకమ్ || 62
స చాండాలేsపి సంపూజ్య స్సర్వ వర్ణోతత్తమోత్తమః | యాని తీర్థాని లోకేsస్మిన్ గంగాద్యా స్సరితశ్చ యాః || 63
స్నాతో భవతి సర్వత్ర లలాటే యస్త్రి పుండ్రకమ్ | సప్తకోటి మహామంత్రాః పంచాక్షర పురస్సరాః || 64
తథాన్యే కోటిశో మంత్రాశ్శైవకైవల్య హేతవః | అన్యే మంత్రా శ్చ దేవానాం సర్వ సౌఖ్య కరా మునే || 65
తే సర్వే తస్య వశ్యాస్స్యు ర్యో బిభర్తి త్రిపుండ్రకమ్ |
శివ ధనమును అపహరించుట, శివుని నిందించుట (61), శివభక్తులను నిందించుట అను పాపములకు పాయశ్చిత్తము లేదు.ఎవని లలాటమునందు త్రిపుండ్రము ఉండునో (62), వానిని, ఏ వర్ణమువాడైననూ, అన్ని వర్ణములలో శ్రేష్ఠమైన వానినిగా పూజింపవలెను. లలాటమునందు త్రిపుండ్రమును ధరించు భక్తుడు ఈ లోకములో గల గంగాది తీర్థములన్నిటియందు (63) స్నానము చేసిన ఫలమును పొందును. ఓ మహర్షీ! పంచాక్షరి ఇత్యాది ఏడు కోట్ల మహామంత్రములు (64), మోక్షదాయకములగు కోట్లాది ఇతర మంత్రములు, మరియు సుఖములనన్నిటినీ ఒసంగు ఇతర దేవతా మంత్రములు (65), త్రిపుండ్రకమును ధరించువానికి వశమగును.
సహస్రం పూర్వజాతానాం సహస్రం జనయిష్యతామ్ || 66
స్వ వంశ జానం జ్ఞాతీనా ముద్ధరేద్యస్త్రి పుండ్రకృత్ | ఇహ భుక్త్వా ఖిలాన్ భోగాన్ దీర్ఘాయుర్వ్యాధివర్జితః || 67
జీవితాంతే చ మరణం సుఖేనైవ ప్రపద్యతే | అష్టైశ్వర్య గుణోపేతం ప్రాప్య దివ్యవపుశ్శివమ్ || 68
దివ్యం విమానమారుహ్య దివ్య త్రిదశసేవితమ్ | విద్యాధరాణాం సర్వేషాం గంధర్వాణాం మహౌజసామ్ || 69
ఇంద్రాదిలోకపాలానాం లోకేషు చ యథాక్రమమ్ | భుక్త్వా భోగాన్ సువిపులాన్ ప్రజేశానాం పదేషు చ || 70
త్రిపుండ్రమును ధరించువాడు తన వంశములో వేయి పూర్వ తరములకు, వేయి రాబోవు తరములకు చెందు (66) జ్ఞాతులను ఉద్ధరించును. అట్టివాడు ఈ లోకములో దీర్ఘాయుర్దాయమును కలిగి, వ్యాధులు లేనివాడై, భోగములనన్నిటినీ అనుభవించి (67), ఆయుర్దాయము పూర్తి అయిన తరువాత అనాయాస మరణమును పొందును. తరువాత ఆ భక్తుడు అష్టైశ్వర్యములతో, గుణములతో కూడిన మంగళకరమగు దివ్యదేహమును పొంది (68), దేవతా విమానమునధిరోహించి, దేవతలచే సేవింపబడుచున్నవాడై, విద్యాధరులు, తేజశ్శాలురగు గంధర్వులు, ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు మొదలగు దేవతల లోకములలో వరుసగా విస్తృతమగు భోగములననుభవించి, ప్రజాపతుల లోకములను పొందును (70).
బ్రహ్మాణః పదమాసాద్య తత్ర కన్యాశతం రమేత్ | తత్ర బ్రహ్మాయుషో మానం భుక్త్వా భోగాననే కశః || 71
విష్ణోర్లోకే లభేద్భోగం యావద్బ్రహ్మ శతాత్యయః | శివలోకం తతః ప్రాప్య లభ్ద్వేష్టం కామమక్షయమ్ || 72
శివసాయుజ్యమాప్నోతి సంశయో నాత్ర జాయతే | సర్వోప నిషదాం సారం సమాలోక్య ముహుర్ముహుః || 73
ఇదమేవ హి నిర్ణీతం పరం శ్రేయస్త్రిపుండ్రకమ్ |
అతడు బ్రహ్మలోకమును పొంది వందమంది కన్యలతో రమించును. అచట బ్రహ్మ యొక్క ఆయుర్దాయమునకు సమమగు కాలము అనేక భోగములననుభవించి (71), విష్ణులోకమును పొంది, వంద బ్రహ్మలు గతించు వరకు భోగములను పొందును. తరువాత శివలోకమును పొంది, క్షయము లేని అభీష్టములననుభవించి (72), శివసాయుజ్యమును పొందును. దీనిలో సందేహము లేదు. ఉపనిషత్తులనన్నింటినీ అనేక పర్యాయములు పరిశీలించగా (73), త్రిపుండ్రము సర్వ శ్రేష్ఠమగు శ్రేయస్సాధనమని వాటి సారముగా నిర్ణయింపబడినది.
విభూతిం నిందతే యో వై బ్రాహ్మణస్సోsన్య జాతకః || 74
యాతి చ నరకే ఘోరే యావద్బ్రహ్మా చతుర్ముఖః | శ్రాద్ధే యజ్ఞే జపే హోమే వైశ్వదేవే సురార్చనే || 75
ధృత త్రిపుండ్రః పూతాత్మ మృత్యం జయతి మానవః | జలస్నానం మలత్యాగే భస్మ స్నానం సదా శుచి || 76
మంత్ర స్నానం హరేత్పాపం జ్ఞానస్నానే పరం పదమ్ | సర్వ తీర్థేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ ఫలమ్ || 77
తత్ఫలం సమవాప్నోతి భస్మస్నానకరో నరః | భస్మస్నానం పరం తీర్థం గంగాస్నానం దినే దినే || 78
భస్మరూపీ శివస్సాక్షాద్భస్మ త్రైలోక్య పావనమ్ |
బ్రాహ్మణుడు గాని, ఇతరుడుగాని విభూతిని నిందించినచో (74), చతుర్ముఖ బ్రహ్మ ఉన్నంత వరకు ఘోరనరకములో నుండును. శ్రాద్ధము, యజ్ఞము, జపము హోమము, వైశ్వదేవము, దేవపూజ అను వాటియందు (75) త్రిపుండ్రమును ధరించు మానవుడు పవిత్రమగు అంతఃకరణము గలవాడై, మృత్యువును జయించును. కాలకృత్యముల తరువాత నీటితో స్నానమును చేయవలెను. భస్మస్నానము (భస్మను ధరించుట)ను చేయు వ్యక్తి సదా శుచి గలవాడగును (76). మంత్రస్నానము (మంత్రజపము) పాపమును పోగొట్టును. జ్ఞాన స్నానము (జ్ఞాన ప్రాప్తి) వలన మోక్షము లభించును. భస్మ స్నానమును చేయు వ్యక్తి సర్వ తీర్థముల యందు గల పుణ్యమును, ఫలమును (77) పొందగల్గును. భస్మ స్నానము పవిత్ర తీర్థస్నానముతో సమానమైనది. నిత్యము భస్మను ధరించుట వలన నిత్యము గంగా స్నానమును చేసిన ఫలము లభించును (78). శివుడు స్వయముగా భస్మరూపమును ధరించి యుండును. భస్మ ముల్లోకములను పవిత్రము జేయును.
న తత్ స్నానం న తద్ధ్యానం తద్ధ్యానం జపో న సః || 79
త్రిపుండ్రేణ వినా యేన విప్రేణ యుదనుష్ఠితమ్ | వానప్రస్థస్య కన్యానాం దీక్షాహీన నృణాం తథా || 80
మధ్యాహ్నా త్ర్పాగ్జలైర్యుక్తం పరతో జలవర్జితమ్ | ఏవం త్రిపుండ్రం యః కుర్యాన్నిత్యం నియత మానసః || 81
శివభక్తస్స విజ్ఞేయో భుక్తిం ముక్తిం చ విందతి | యస్యాంగే నైవ రుద్రాక్ష ఏకేsపి బహుపుణ్యదః || 82
తస్య జన్మ నిరర్థ స్స్యాత్ త్రిపుండ్రరహితో యది |
త్రిపుండ్రమును ధరించకుండగా విప్రుడు చేయు తీర్ధ స్నానము స్నానము కాదు, ధ్యానము ధ్యానము కాదు, దానము దానము కాదు, జపము జపము కాదు (79). వానప్రస్థుడు, కన్యలు, దీక్షలేని మానవులు (80) మధ్యాహ్నమునకు ముందు జలముతో కలిపి, తరువాత జలము లేకుండగా భస్మను ధరించవలెను. ఈ విధముగా మనస్సును నియమించి నిత్యము త్రిపుండ్రమును ధరించు మానవుడే (81)శివభక్తుడని తెలియవలెను. అతడు భుక్తిని, ముక్తిని, పొందును. గొప్ప పుణ్యమునిచ్చే రుద్రాక్ష ఒక్కటియైననూ దేహము నందు లేని వానికి (82), త్రిపుండ్రమును ధరించని వానికి జన్మ వ్యర్థము.
ఏవం త్రిపుండ్రమాహాత్య్మం సమాసాత్కథితం మయా || 83
రహస్యం సర్వజంతూనాం గో పనీయమిదం త్వయా | తిస్రో రేఖా భవంత్యేవ స్థనేషు ముని పుంగవాః || 84
లలాటాదిషు సర్వేషు యథోక్తేషు బుధైర్ముననే | భ్రువోర్మధ్యం సమారభ్య యావదంతో భవేద్ర్భువోః || 85
తావత్ర్పమాణం సంధార్యం లలాటే చ త్రిపుండ్రకమ్ | మధ్య మానామికాంగుల్యా మధ్యే తు ప్రతిలోమతః || 86
అంగుష్ఠేన కృతా రేఖా త్రిపుండ్రాఖ్యాsభిధీయతే | మధ్యేంsగులిభిరాదాయ తిసృభిర్భస్మ యత్నతః || 87
త్రిపుండ్రం ధారయేద్భక్త్యా భుక్తి ముక్తి ప్రదం పరమ్ |
ఇంతవరకు నేను త్రిపుండ్ర మహిమను సంగ్రహముగా చెప్పితిని (83). ఇది అందరికీ తెలిసేది కాదు. దీనిని నీవు రహస్యముగా నుంచవలెను. ఓ మునిశ్రేష్ఠులారా! మహర్షులచే నిర్దిష్టమైన లలాటము మొదలగు స్థానములన్నింటిలో మూడు రేఖలు ఉండునట్లు భస్మను ధరించవలెను (84). లలాటమునందు కనుబొమ్మల మధ్య నుండి కనుబొమ్మల అంతము వరకు త్రిపుండ్రమును ధరించవలెను. మధ్యవ్రేలు, మరియు అనామికతో భస్మమును ధరించి, ఆరేఖల మధ్యలో విలోమముగా (86) బొటన వ్రేలితో మరియొక రేఖను ధరించినచో, దానికి త్రిపుండ్రమని పేరు. లేదా, మూడు వ్రేళ్ళతో భస్మను త్రింపుండ్ర రూపముగా ధరించవచ్చును (87). భక్తితో త్రిపుండ్రమును ధరించువానికి భుక్తి, ముక్తి లభించును.
తిసౄణామపి రేఖానాం ప్రత్యేకం నవ దేవతాః || 88
సర్వత్రాంగే షు తా వక్ష్యే సావధానతయా శృణు | అకారో గార్హపత్యాగ్ని ర్భూర్దర్మశ్చ రజో గుణః || 89
ఋగ్వేదశ్చ క్రియాశక్తిః ప్రాతస్సవనమేవ చ |
మహాదేవశ్చ రేఖయాః ప్రథమాయాశ్చ దేవతాః | విజ్ఞేయా ముని శార్దూలాశ్శివ దీక్షా పరాయణౖః || 90
ఉకారో దక్షిణాగ్నిశ్చ నభస్తత్వం యజుస్తథా | మధ్యందినం చ సవనమిచ్ఛా శక్త్యంతరాత్మ కౌ || 91
మహేశ్వరశ్చ రేఖాయా ద్వితీయాయాశ్చ దేవతా | విజ్ఞేయా ముని శార్దూల శివదీక్షాపరాయణౖః || 92
శరీరమంతటా ఉండే ఈ మూడు రేఖలలో ప్రతి రేఖకు తొమ్మిది దేవతలు గలరు (88). ఆ వివరములను చెప్పెదను. శ్రద్ధగా వినుడు. ఓ మునిశ్రేష్ఠులారా!అకారము,గార్హపత్యాగ్ని, భూమి, ధర్మము, రజోగుణము (89), ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతస్సవనము, మరియు మహా దేవుడు మొదటి రేఖకు దేవతలు అని శివదీక్షా పరాయణులు తెలియవలెను (90). ఓ మునిశ్రేష్ఠా! ఉకారము, దక్షిణాగ్ని, ఆకాశతత్త్వము, యజుర్వేదము, మాధ్యందిన సవనము, ఇచ్ఛాశక్తి, అంతరాత్మ (91) మరియు మహేశ్వరుడు రెండవ రేఖకు దేవతలని శివదీక్షా పరాయణులు తెలియవలెను (92).
మకారాహావనీ¸చ పరమాత్మ తమోదివౌ | జ్ఞానశక్తి స్సామవేద స్తృతీయం సవనం తథా || 93
శివశ్చైవ చ రేఖాయాస్తృతీయాయాశ్చ దేవతా | విజ్ఞేయా మునిశార్దూల శివదీక్షా పరాయణౖః || 94
ఏవం నిత్యం నమస్కృత్య సద్భక్త్యా స్థానదేవతాః | త్రిపుండ్రం దారయేచ్ఛుద్దో భుక్తిం ముక్తిం చ విందతి || 95
ఇత్యుక్తాః స్థానదేవాశ్చ సర్వాంగేషు మునీశ్వర | తేషాం సంబంధినో భక్త్యా స్థానాని శృణు సాంప్రతమ్ || 96
ఓ మునిశ్రేష్ఠా! మకారము, ఆహవనీయము, పరమాత్మ తమోగుణము, ద్యులోకము, జ్ఞానశక్తి, సామవేదము, తృతీయ సవనము (93), మరియు శివుడు మూడవ రేఖకు దేవతలని శివ దీక్షా పరాయణులు తెలుసుకొనవలెను (94). ఈ విధముగా స్థాన దేవతలకు నిత్యము భక్తితో నమస్కరించి, శుద్ధుడై త్రిపుండ్రమును ధరించు భక్తుడు భుక్తిని, ముక్తిని కూడ పొందును (95). ఓ మునిశ్రేష్ఠా!నేను ఇంతవరకు వివిధ అవయవముల స్థాన దేవతలను గురించి చెప్పితిని. ఆ స్థానముల వివరముల నిప్పుడు చెప్పెదను. భక్తితో వినుము (96).
ద్రాత్వింశత్ స్థానకే వార్థం షోడశస్థానకేపి చ | అష్టస్థానే తథా చైవ పంచస్థానేSపి వా న్యసేత్ || 97
ఉత్తమాంగే లలాటే చ కర్ణయోర్నేత్రయోస్తథా | నాసా వక్త్ర గ లేష్వేవం హస్తద్వయ అతః పరమ్ || 98
కూర్పరే మణి బంధే చ హృదయే పార్శ్వయోర్ద్వయోః | నాభౌ ముష్కద్వయే చైవ మూర్వో ర్గుల్ఫే చ జానుని || 99
జంఘాద్వయే పదద్వంద్వే ద్రాత్రింశత్ స్థానముత్తమమ్ |
ముప్పది రెండు, పదునారు, ఎనిమిది, లేదా ఐదు స్థానములలో భస్మను ధరించవలెను (97). శిరస్సు లలాటము, చెవులు, కన్నులు, ముక్కు, నోరు ,కంఠము, రెండు చేతులు (98), మోచేతులు, మణికట్టు, హృదయము, రెండు పార్శ్వములు, నాభి, గుహ్యము, ఊరువులు, మోకాళ్ళు, పిక్కలు (99) మోకాలి క్రింది భాగము, రెండు పాదములు వెలసి ముప్పది రెండు ఉత్తమ స్థానములలో భస్మను ధరించవలెను.
అగ్న్యబ్ భూవాయుదిగ్దేశ దిక్పాలాన్ వసుభిస్సహ | 100
ధరా ధ్రువశ్చ సోమశ్చ ఆపశ్చై వానిలోSనలః | ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవోSష్ట ప్రకీర్తితాః || 101
ఏతేషాం నామమాత్రేణ త్రిపుండ్రం ధారయేద్బుధాః | కుర్యాద్వా షోడశస్థానే త్రిపుండ్రంతు సమాహితః || 102
అగ్ని, జలము, భూమి, వాయువు, దిక్కులు, దిక్పాలకులు మరియు ఎనమండుగురు వసువులను (100) ఆయా నామములతో స్మరించి, విద్వాంసులు త్రిపుండ్రమును ధరించవలెను. ధర, ధ్రువుడు, సోముడు, జలాధిష్ఠాన దేవత, అగ్ని, వాయువు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనువారు అష్టవసువవులనబడుదురు (101). భక్తుడు శ్రద్ధతో త్రిపుండ్రమును పదునారు స్థానములలో ధరించవలెను (102).
శీర్షకే చ లలాటే చ కంఠే చాంసద్వయే భుజే | కూర్పరే మణి బంధే చ హృదయే నాభిపార్శ్వకే || 103
పృష్ఠే చైవం ప్రతిష్ఠాయం యజేత్తత్రాశ్వి దైవతే | శివం శక్తిం తథా రుద్రమీశం నారదమేవ చ || 104
వామాదినవశక్తీశ్చ ఏతాః షోడశదేవతాః | నాస్యతో దస్రకశ్చైవ అశ్వినౌ ద్వౌ ప్రకీర్తితే || 105
తల, లలాటము, కంఠము, రెండు భుజస్కంధములు, రెండు భుజములు, రెండు మోచేతులు, రెండు మణికట్టులు, హృదయము, నాభి, రెండు పార్శ్వములు (103), వెనుక భాగము అను స్థానములలో భస్మను ధరించవలెను. ఆ స్థానములలో అశ్వినీ దేవతలు, శివుడు, శక్తి, రుద్రుడు, ఈశుడు, నారదుడు (104), వామా మొదలగు నవశక్తులు వెరసి పదునారు దేవతలను భావన చేయవలెను. నాసత్యుడు, దస్రుడు అను దేవతలకు అశ్వినీ దేవతలని పేరు (105).
అథవా మూర్ధ్ని కేశే చ కర్ణయోర్వదనే తథా | బాహుద్వయే చ హృదయే నాభ్యామూరుయగే తథా || 106
జానుద్వయే చ పదయోః పృష్ఠభాగే చ షోడశ | శివశ్చంద్రశ్చ రుద్రః కో విఘ్నేశో విష్ణురేవ వా || 107
శ్రీశ్చైవ హృదయే శంభు స్తథా నాభౌ ప్రజాపతిః | నాగశ్చ నాగకన్యాశ్చ ఉభయోర్ ఋషి కన్యకాః || 108
పాదయోశ్చ సముద్రాశ్చ తీర్థాః పృష్ఠే విశాలతః | ఇత్యేవ షోడశస్థాన మథోచ్యతే || 109
పదునారు స్థానములను, దేవతలను మరియొక విధముగా చెప్పవచ్చును. శిరస్సు, కేశములు, రెండు చెవులు, ముఖము, రెండు బాహువులు, హృదయము, నాభి, రెండు ఊరువులు (106),
రెండు మోకాళ్లు, రెండు పాదములు, వెనుక భాగము అను పదునారు స్థానములలో భస్మను ధరించవలెను. ఈ స్థానముల యందు క్రమముగా శివుడు, చంద్రుడు, రుద్రుడు, బ్రహ్మ, విఘ్నేశ్వరుడు, విష్ణువు (107), లక్ష్మి, శంభువు, ప్రజాపతి, నాగదేవత, ఇద్దరు నాగకన్యలు, ఇద్దరు ఋషికన్యలు (108),
సముద్రము, తీర్థములు గలవు (109).
గుహ్యస్థానం లలాటశ్చ కర్ణద్వయమనుత్తమమ్ | అంసయుగ్మం చ హృదయం నా భిరిత్యేవమష్టకమ్ || 110
బ్రహ్మాచ ఋషయస్సప్త దేవతాశ్చ ప్రకీర్తితాః | ఇత్యేవం తు సముద్దిష్టం భస్మవిద్భిర్మునీశ్వరాః || 111
అథవా మస్తకం బాహూ హృదయం నాభిరేవ చ | పంచస్థానాన్యమూన్యాహుర్ధారణే భస్మవిజ్జవాః || 112
యథా సంభవనం కుర్యాద్దేశ కాలాద్యపేక్షయా | ఉద్ధూలనే ప్యశక్తశ్చేత్త్రిపుండ్రాదీని కారయేత్ || 113
గుహ్యము, లలాటము, రెండు చెవులు, రెండు భుజములు, హృదయము, నాభి అనే ఎనిమిది స్థానములలో భస్మను ధరించవలెను (110)
ఓ మహర్షులారా! ఆ స్థానములకు బ్రహ్మ, సప్తర్షులు దేవతలని భస్మజ్ఞానము గల ఋషులు చెప్పియున్నారు(111).
లేదా, శిరస్సు, రెండు బాహువులు, హృదయము, నాభి అను అయిదు స్థానములలో భస్మను ధరించవచ్చును (112).
దేశకాలముల ననుసరించి భక్తుడు యథాసంభవముగా భస్మను దరించవచ్చును. భస్మతో అంగలేపనము చేయుటలో అశక్తుడైన భక్తుడు త్రిపుండ్రమును ధరించవలెను (113).
త్రినేత్రం త్రిగుణాధారం త్రిదేవ జనకం శివమ్ | స్మరన్నమశ్శివాయేతి లలాటే తు త్రిపుండ్రకమ్ || 114
ఈ శాభ్యాం నమ ఇత్యుక్త్వా పార్శ్వయోశ్చ త్రిపుండ్రకమ్ | బీజాభ్యాం నమ ఇత్యుక్త్వా ధారయేత్తు ప్రకోష్ఠయోః || 115
కుర్యాదధః పితృభ్యాం చ ఉమేశాభ్యాం తథోపరి | భీమాయేతి తతః పృష్ఠే శిరసః పశ్చిమే తథా || 116
ఇతి శ్రీ శివ మహా పురాణే విద్వేశ్వర సంహితాయాం భస్మధారణవర్ణనం నామ చతుర్వింశోSధ్యాయః (24)
ముక్కంటి, త్రిగుణాత్మక ప్రకృతికి ఆశ్రయము, బ్రహ్మ, విష్ణు రుద్రులకు తండ్రియగు శివుని 'నమశ్శివాయ' అని స్మరించి, లలాటమునందు త్రిపుండ్రమును ధరించవలెను 'ఈశాభ్యాం నమః' అని ఉచ్చరించి పార్శ్వములయందు, 'బీజాభ్యాం నమః'అని ముంజేతులయందు 'పితృభ్యాం నమః' అని శరీరములోని క్రింది అవయముల యందు, 'ఉమేశాభ్యాం నమః' అని శరీరము యొక్క పైభాగము నందు , 'భీమాయ నమః' అని పలికి శిరస్సునకు వెనక భాగమునందు భస్మను ధరించవలెను!!
శ్రీశివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు భస్మధారణ వర్ణనము అనే ఇరువది నాలుగవ అధ్యాయము సమాప్తము (24)
🙏💖🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి