18, జూన్ 2023, ఆదివారం

సంధ్యావందనం_ఆవశ్యకత

 #సంధ్యావందనం_ఆవశ్యకత


పూర్వం ఒకసారి బ్రాహ్మణ వటువు శృంగేరి జగద్గురువుల దర్శనానికి వచ్చినప్పుడు జగద్గురువులు మంత్రాక్షతలు ప్రసాదిస్తూ అలంకార ప్రాయంగా కనిపిస్తున్న యజ్ఞోపవీతం చూసి సంధ్యావందనం చేస్తున్నావా లేదా అని ఆయనను ప్రశ్నవేస్తే, యజ్ఞోపవీతం ధరించియున్నామే కానీ, సంధ్యావందనం చేయలేకపోతున్నామని ఆ వటువులు జవాబిస్తే జగద్గురువులు ప్రాయశ్చిత్తం చేయించి పునఃసంధ్యావందనం ఆచరించే విధంగా వారిని ఆశీర్వదించి పంపేవారు.


ఇప్పటి పరిస్థితి ఎలా ఉన్నదంటే తమ దర్శనానానికి వచ్చే ఉపనయనం అయిన వటువులు సంధ్యావందనం చేయడం మాట అటుంచి కనీసం యజ్ఞోపవీతం లేకుండా వస్తున్నారు. యజ్ఞోపవీతం ఏమైంది అని ప్రశ్నిస్తే చొక్కా తీసేటప్పుడు బయటకు వచ్చేసిందనో, లేక జీర్ణమయిందనో బదులిస్తున్నారు. ఆరునెలలనుండో, సంవత్సరంనుండో ఇలా యజ్ఞోపవీతం ఒంటిపై లేకుండా తిరుగుతున్న వాళ్ళ పరిస్థితిని చూసి ఆశ్చర్యం వేసింది. ఇప్పటికే ఒకసారి ఉపనయనం అయ్యి ఒంటిమీద యజ్ఞోపవీతం లేకుండా తిరుగుతున్న వటువునకు మరల యజ్ఞోపవీతం వేయించి పంపించే పరిస్థితి వచ్చింది.


ఈ విధంగా శాస్త్ర ధిక్కారం చేసి ధర్మభ్రష్టులై తిరుగుతున్నవారు తప్పకుండా దానికి తగిన ప్రతిఫలము అనుభవించి తీరవలసిందే. దాని ఫలితాలు అనుభవించే సమయములో చింతించవలసి వస్తే ఏ ప్రయోజనమూ ఉండదు. వెనువెంటనే ఆ దుష్ఫలితం కనిపించకపోయినా ఎప్పటికైనా తప్పదు. కాబట్టి జగద్గురువులు ఆదేశాన్ని శిరసావహించి ఉపవీతులందరూ సంధ్యావందనాదులు చేస్తు విధ్యుక్తధర్మాన్ని ఆచరించవలసిన ఆవశ్యకత మనపై ఎంతైనా ఉంది.


--- జగద్గురు శ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు.

కామెంట్‌లు లేవు: