18, జూన్ 2023, ఆదివారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 94*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.         ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 94*


చంద్రగుప్తుని పట్టాభిషేక విశేషాలు తెల్సుకుని అజ్ఞాతంలో వున్న రాక్షసమాత్యుడు ఆగ్రహావేశాలతో రగిలిపోయాడు. 


"ఆహా ! ఏమా చాణక్యుని దుస్తంత్రము ...? తాను శ్రీకృష్ణ పరమాత్మునితో సమానుడా...? తాను ధర్మప్రతిష్టాపనార్థమే కుతంత్రాలు పన్ని ఇంతటి మారణ హోమాన్ని జరిపించాడా ? చంద్రగుప్తుని రాజ్యాధికార అర్హతను పదుగురిలో ఒప్పించడానికి ఎంత నాటకమాడాడు ? నందులను శిక్షించడం ధర్మసమ్మతమైతే.... మరి చంద్రగుప్తునికి సహాయంగా వచ్చిన పర్వతక, వైరోజనులు ఏం నేరం చేశారు ? విషకన్యని ప్రయోగించి అన్ననీ, విజయయాత్ర పేరుతో తమ్ముడిని దారుణంగా హతమార్చడం ధర్మ సమ్మతమా....?" అంటూ ఆవేశకావేశంతో ఉడికిపోయాడు రాక్షసుడు. 


"ధర్మమట ధర్మం .... చాణక్యా... నువ్వు చేసిందంతా ధర్మమైతే ... నీ ధర్మాన్ని నీకే తిప్పి కొడతాను... సహాయంగా వచ్చిన వారిని సంహరించడం నీ ధర్మమైతే.... అదే ధర్మమైతే... నేనూ నీ మార్గాన్నే అనుసరించి నీ వ్రేలితో నీ కంటినే పొడుపిస్తాను. ఆనాడు నాకు ప్రాణదానం చేసిన చంద్రుని ప్రాణాలు తీసి... నీ ధర్మపన్నాలు నీకే అప్పచెబుతాను. అంతవరకూ నేను ఈ పాటలీపుత్రంలో అడుగుపెట్టను" అని ప్రతిజ్ఞ చేశాడు రాక్షసామాత్యుడు. 


పాటలీపుత్రంలో ప్రముఖ వాణిజ్యవేత్త అయిన చందనదాసు శ్రేష్టి అమత్య రాక్షసునికి ప్రాణమిత్రుడు. రాక్షసుడు తన భార్యను, కుమారుడిని చందనదాసు రక్షణలో ఉంచి "మిత్రమా ! విధిలేని పరిస్థితుల్లో రాజ్యం విడిచి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేంతవరకూ నావారి సంరక్షణభారం నీదే" అని చెప్పాడు. 


చందనదాసు అతని చేతిలో చెయ్యి వేసి "నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ మీ వాళ్లకు ఏ హాని రానివ్వను. క్షేమంగా వెళ్లి విజయులై తిరిగి రండి అమాత్యా..." అంటూ ప్రమాణం చేశాడు. 


రాక్షసామాత్యుడు ఆనందాశ్రవులు విడుస్తూ చందనదాసుని ఆలింగనం చేసుకుని, భార్య పుత్రుల వద్ద వీడ్కోలు తీసుకుని ఆ రాత్రికి రాత్రే పాటలీపుత్రం విడిచి వెళ్లిపోయాడు. 


ఆ మన్నటి ఉదయమే రాక్షసుని పలాయన వార్త విని సాలోచనగా భృకుటి ముడిచాడు చాణక్యుడు. 

(ఇంకా ఉంది)...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: