18, జూన్ 2023, ఆదివారం

ఫాదర్స్ డే

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*పితృ దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసా?*

             🌷🌷🌷

**జూన్ 3వ ఆదివారం అంతర్జాతీయ పితృ దినోత్సవం*(fathers day)


💝అంతర్జాతీయ పితృ దినోత్సవమును ప్రతీ సంవత్సరం జూన్ నెలలో మూడో ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం పాటిస్తున్నాయి. తల్లుల పట్ల గౌరవాన్ని చూపే మాతృవందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారుపేరుగా నిలిచే నాన్నలకూ ఒకరోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్  ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు అనుగుణంగా  1910లో ఫాదర్స్ డే జరుపుకున్నారు. ఆ తర్వాత ఆదరణ పెరుగుతూ రాగా ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృ వందన దినోత్సవముగా ప్రకటించి జరుపుతున్నాయి.


*💖18-06-2023 ఆదివారం అలా పితృ దినోత్సవమైంది.*


💓వేదం ‘పితృదేవోభవ’ అంటూ తండ్రిని దైవంగా చూడాలని చెబితే, శాస్త్రాలు ఆయనకి విష్ణు స్థానమిచ్చాయి. జగత్తును పాలించి పోషించేది విష్ణుమూర్తి. అందువల్ల కుటుంబాన్ని పోషించే తండ్రిని విష్ణు సమానుడిగా చెప్పాయి.


💖’నమో పిత్రే జన్మధాత్రే సర్వదేవమయాయచ। సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే।।

దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మయావపుః। సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః’ ఇలా సాగుతుంది “బృహద్ధర్మ పురాణంలో” “పితృస్తుతి”.


❤️కనీ, పెంచీ కడుపు చూసేది అమ్మైతే నడిపించి భవిష్యత్తుని చూసేవాడు నాన్న. అమ్మ కనిపించే వాస్తవమైతే, నాన్న ఓ నమ్మకం. లాలించేది అమ్మ ఒడి, నాన్న భుజం లోకాన్ని చూపే బడి. అమ్మ జోల పాట ఎలాగో.. నాన్న నీతి పాఠం కూడా అలాగ. తమకన్నామిన్నగా బిడ్డ తయారు కావాలని కలలు కనేది కన్నవారే.


💞నాన్న మనకోసం జీవితాన్ని త్యాగంచేసే త్యాగమూర్తి. మనం ఓడినప్పుడు నేనున్నా అంటూ ఓదార్చే ఎమోషన్ నాన్న. మనం గెలిచినప్పుడు పదిమందితో చెప్పుకునేవాడే నాన్న. మన నుంచి కృతజ్ఞతలు ఆశించని అమాయక చక్రవర్తి నాన్న. ప్రపంచంలో అమ్మకు ఎంత గొప్ప స్థానం ఉందో నాన్నకు కూడా అంతే గొప్ప స్థానం ఉంది. అటువంటి నాన్నకు ప్రతీఒక్కరు రుణపడి ఉండాలి.


💕టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పొస్టులు పెట్టి చేతులు దులుపుకోవడం, వాట్సాప్ లో స్టేటస్ పెట్టి ప్రపంచాన్ని జయించినట్టు ఫీలయ్యే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అయితే నాన్నకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి శుభాకాంక్షలు చెప్పడం కాకుండా మన పక్కనే ఉండే నాన్నతో కాసేపు మాట్లాడితే నాన్న ఎంతో సంతోషంగా ఫీలవుతారు.


💓మహిళలు పురుషులకు సరి సమానంగా ఉద్యోగాలకు వెళ్తున్న తరుణంలో కుటుంబ బాధ్యతలతోబాటు పిల్లల పెంపకం, ఇంటి పనుల్ని కూడా పురుషులీనాడు సమానంగా పంచుకుంటున్నారు. పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంలో తండ్రులే ప్రస్తుతం ముందు ఉంటున్నారు. ‘ఫాదర్స్ డే’ జరుపుకోవాలనే సంప్రదాయం మనదేశానికి కొత్తదే. పాశ్చాత్య దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ఈ పండుగ మన భారతీయుల్లో ఉన్న సహజ సెంటిమెంట్ రీత్యా విశేష ఆదరణను పొందింది.


💖చదువులూ, ఉద్యోగాలూ, వివాహాల్లో పిల్లల మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే తండ్రి మనస్సును నొప్పించక ప్రవర్తించాల్సిన బాధ్యత పిల్లలపై ఉందనేది గుర్తించాలి. నేటి నవ నాగరికత ముసుగులో పిల్లలు అమ్మానాన్నల్ని నిర్లక్ష్యం చేస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. ప్రేమలు, పెళ్లిళ్ల విషయాల్లో అమ్మానాన్నల మనోభావాలను పిల్లలు తప్పక గౌరవించాలి.


💖సక్రమమైన ఆలోచనల్లేక ప్రేమలూ పెళ్లిళ్ల విషయంలో సొంతనిర్ణయాలు తీసుకోక తల్లిదండ్రుల అభిప్రాయాలను గుర్తించాలి. కంటికిరెప్పలా భావించి పెంచి పోషించిన అమ్మానాన్నలను ప్రేమ కోసమో, పెళ్లి కోసమో విస్మరించడం ఆత్మహత్యా సదృశ్యం.


💖తలవెంట్రుకలంత మంది బంధు మిత్రులున్నప్పటికీ అమ్మానాన్నలు మాత్రమే నిజమైన శ్రేయోభిలాషులని పిల్లలందరూ గుర్తించి వారి మాటలకు గౌరవమిచ్చి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి.


💖ఉద్యోగాల నెపంతో ఇతర ప్రాంతాలకో, విదేశాలకో వెళ్లిపోయి అమ్మానాన్నలను విస్మరించడమంటే పిల్లలు తమ బాధ్యతల నుంచి మనస్పూర్తిగా తప్పుకున్నట్లే. అమ్మానాన్నలపై నిర్లక్ష్యంవహిస్తే…భవిష్యత్‌లో తమకూ ఇంతకంటే దుర్భరమైన పరిస్థితే తప్పదన్న కఠోర వాస్తవాన్ని గుర్తించాలి. “ఫాదర్స్ డే” అంటూ ఏడాదికోసారి హడావుడి చేయడం, గొప్ప కోసం బహుమతులు కొనివ్వడం వల్ల కృత్రిమత్వం కనబడ్డమే తప్ప నిజంగా ఒరిగేదేమీ ఉండదు.


💖ఈ ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపునిచ్చిన  తండ్రిని గౌరవించేందుకు ప్రత్యేకించిన ఈ పండుగ సందర్భంగా అందరికీ పితృదినోత్సవ శుభాకాంక్షలు.🙏

కామెంట్‌లు లేవు: