18, జూన్ 2023, ఆదివారం

యోగవాసిష్ఠ రత్నాకరము*

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము


2-5


సాధూపదిష్టమార్గేణ యన్మనోఙ్గవిచేష్టితమ్‌ 

తత్పౌరుషం తత్సఫలమన్యదున్మత్త చేష్టితమ్‌. 


మహాత్ములగు సాధువు లుపదేశించు మార్గము ననుసరించుచు గావించు మనోవాక్కాయ ఇంద్రియాదుల చేష్టయే పురుషప్రయత్న మనఁబడును. అట్టి ప్రయత్నమే సఫలమగును. తద్వ్యతిరిక్తమైనది ఉన్మత్తుని(పిచ్చివాని) చేష్టయే యగును. 


2-6


యో యమర్థం ప్రార్థయతే తదర్థం చేహతే క్రమాత్‌ 

అవశ్యం స తమవాప్నోతి న చేదర్ధాన్నివర్తతే.


ఎవ రే పదార్థమును గోరుదురో, వారు దానికొరకై శాస్త్రోక్త క్రమమున చేష్టలు సలుపుచు, మధ్య ప్రయత్నమును విరమింపకున్నచో క్రమముగ నద్దానిని తప్పక పొందుదురు. 


2-7


ప్రాక్తనం చైహికం చేతి ద్వివిధం విద్ధి పౌరుషమ్‌ 

ప్రాక్తనోఽ ద్యతనేనాశు పురుషార్థేన జీయతే.


ఓ రామచంద్రా! పూర్వజన్మకృతము, ఇహజన్మకృతము అని పురుషప్రయత్నమును రెండు విధములుగ నెఱుఁగుము. అందు పూర్వజన్మకృత పురుషప్రయత్నము ఈ జన్మయందు గావింపబడిన పురుషప్రయత్నముచే శీఘ్రముగ జయింపబడుచున్నది.


2-8


యత్నవద్భిర్ధృఢాభ్యాసైః ప్రజ్ఞోత్సాహ సమన్వితైః మేరవోఽ పి నిగీర్యన్తే కైవ ప్రాక్పౌరుషే కథా.


ప్రయత్నవంతులును, దృఢభ్యాసానిరతులును, ఉత్సాహవంతులును నగు వారు మేరువునుగూడ జీర్ణమొనరించుకొనగలరు. ఇక వారికి అదృష్ట మొక లెక్కలోనిదా?


2-9


శాస్త్రనియత్రిత పౌరుష పరమా పురుషస్య పురుషతా యా స్యాత్‌ 

అభిమతఫలభరసిద్ధ్యై భవతి హీ సైవాన్యథా త్వనర్థాయ. 


శాస్త్రానుశాసితములగు కర్మల నాచరించుటయే, శుభఫలప్రదమగు పురుష ప్రయత్నము; తదితరములు అనర్థదాయకములు; వ్యర్థములు అయియున్ననవి.


2-10


యథా సంయతతే యేన తథా తేనానుభూయతే స్వకర్మైవేతి చాస్తేఽ న్యా వ్యతిరిక్తా న దైవదృక్‌. 


ఎవడెట్లు ప్రయత్నించునో, ఆతడు దానిఫలము నట్లే యనుభవించును, పూర్వజన్మలందలి స్వకర్మయే (ఫలావస్థయందిపుడు) 'దైవ' మని, “ప్రారబ్ధ'మని చెప్పబడుచున్నది. అట్లు తన కర్మకంటె వేఱుగా 'దైవము' గాని, 'ప్రారబ్ధము' గాని యేమియు లేదు.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-11

ఉచ్ఛాస్త్రం శాస్త్రితం చేతి ద్వివిధం పౌరుషం స్మృతమ్‌ తత్రోచ్ఛాస్త్రమనర్థాయ పరమార్థాయ శాస్త్రితమ్‌.


పురుష ప్రయత్నము శాస్త్ర విరుద్ధమని శాస్త్రానుకూలమని రెండు విధములుగ చెప్పబడినది. అందు శాస్త్రవిరుద్ధ మైనది అనర్థము కొఱకును, శాస్త్రానుకూలమైనది పరమార్థము (మోక్షము) కొఱకునై యున్నది. 


2-12

ద్వౌ హుడావివ యుద్ధ్యేతే పురుషార్థౌ సమాసమౌ ప్రాక్తనశ్చైహికశ్చైవ శామ్యత్యత్రాల్పవీర్యవాన్‌.


పూర్వజన్మ యొక్కయు, ఈ జన్మయొక్కయు సమాన, అసమాన పురుష ప్రయత్నములు రెండు పొట్టేళ్ళవలె పరస్పరము యుద్ధము చేసికొనును. అందు అల్పబలము కలది ఓడిపోయి క్షయించును. 


2-13

అతః పురుషయత్నేన యతితవ్యం యథా తథా 

పుంసా తన్త్రేణ సద్యోగాద్యేనాశ్వద్యతనో జయేత్‌. 


కాబట్టి మనుజుడు శాస్త్రోక్తనియమ సత్సాంగత్యాది పురుష ప్రయత్నముచే, పూర్వజన్మ పురుష ప్రయత్నము జయింపబడులాగున యత్నింపవలయును.


2-14

పరం పౌరుషమాశ్రిత్య దన్తైర్దన్తాన్విచూర్ణయవ్‌ శుభేనాశుభముద్యుక్తం ప్రాక్తనం పౌరుషం జయేత్‌.


ప్రబల పురుషప్రయత్నము నాశ్రయించి పండ్లచే పండ్లను కొఱికి (ఏవిధముగనైనను) విఘ్నమొనర్ప నుద్యుక్తమగు పూర్వపు అశుభ పురుషప్రయత్నమును, ఇప్పటి శుభప్రయత్నములచే జయింపవలయును. 


2-15

తావత్తావత్ర్పయత్నేన యతితవ్యం సుపౌరుషమ్‌ ప్రాక్తనం పౌరుషం యావదశుభం శామ్యతి స్వయమ్‌. 


పూర్వపు అశుభయత్నము స్వయముగ శమించిపోనంతవరకు ఉత్తమ పురుషప్రయత్నము ద్వారా మనుజుడు యత్నించుచునే యుండవలెను. 


2-16

దోషః శామ్యత్యసందేహం ప్రాక్తనోఽ ద్యతనైర్గుణైః 

దృష్టాన్తోఽ త్ర హ్యస్తనస్య దోషస్యాద్యగుణైః క్షయః.


ఈ జన్మయందలి శుభపురుషప్రయత్నముచే పూర్వజన్మపు అశుభపురుషప్రయత్నము  నిస్సందేహముగ శమించిపోవును. గత దినమందలి అజీర్ణాది దోషములు నేటి ఔషధాది గుణములచే క్షయించుటయే ఇచట దృష్టాంతము.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-23

ప్రత్యక్షమావముత్సృజ్య యోఽ నుమానము పైత్యసౌ స్వభుజాభ్యామిమౌ సర్పావితి ప్రేక్ష్య పలాయతే. 


ప్రత్యక్ష శ్రుతి ప్రమాణమును, ప్రత్యక్షమగు ఇహజన్మ పురుష ప్రయత్నమును వీడి అనుమానసిద్ధమగు పూర్వజన్మపు “అదృష్టము” నెవడు ఆశ్రయించునో అట్టివాడు తన భుజములనే సర్పములని తలంచి పరుగిడువాడే యగును. (పిచ్చివాడని భావము). 


2-24

దైవం సంప్రేరయతి మామితి దగ్ధధియాం ముఖమ్‌ 

అదృష్టశ్రేష్ఠ దృష్టీనాం దృష్ట్వా లక్ష్మీర్నివర్తతే. 


పురుష ప్రయత్నము చేతనే తమయొక్క లక్ష్యమును బొందినట్టి (విశ్వామిత్రాది) శ్రేష్ఠపురుషులయొక్క దృష్టిని తెలిసికొననివారును, “అదృష్టము” నన్ను ప్రేరేపించుచున్నది, అని తలంచువారునగు బుద్ధిహీనుల ముఖమును జూచి లక్ష్మి (సంపద) పారిపోవుచున్నది. 


2-25

తస్మాత్పురుషయత్నేన వివేకం పూర్వమాశ్రయేత్‌ 

ఆత్మజ్ఞానమహార్థాని శాస్త్రాణి ప్రవిచారయేత్‌. 


కాబట్టి పురుషప్రయత్నముచే మొదటనే వివేకమును (సాధన చతుష్టయ సంపత్తి మున్నగువానిని) ఆశ్రయించవలెను. మఱియు ఆత్మజ్ఞాన (ప్రతిపాదకములును, గంభీరార్థ యుక్తములుగు శాస్త్రములను బాగుగ విచారింపవలయును.


2-26

చిత్తే చిన్తయతామర్థ యథాశాస్త్రం నిజేహితైః 

అసంసాధయతామేవ మూఢానాం ధిగ్దురీప్సితమ్‌. 


శాస్త్ర ప్రకారము శ్రవణ మననాది చేష్టలచే పరమార్థభూతమగు ఆత్మతత్త్వమును చింతింపనివారును, కావుననే అట్టి ఆత్మతత్త్వమును సాధింపనివారునగు మూఢులయొక్క మహా నరకాది ప్రదమగు దుష్టభోగేచ్ఛకు ధిక్కారమగుగాక! 


2-27

దైన్యదారిద్ర్యదుఃఖార్తా అప్యన్యే పురుషోత్తమాః పౌరుషేణైవ యత్నేన యాతా దేవేంద్రతుల్యతామ్‌. 


ఉత్తమ పురుషులు కొందఱు దైన్య దారిద్ర్యాది దుఃఖములచే పీడితులై యున్నను, తమయొక్క పురుషప్రయత్నము చేతనే దేవేంద్రునితో సమానులైరి.


2-28

ఆబాల్యాదలమభ్యస్తైః శాస్త్రసత్సఙ్గమాదిభిః 

గుణైః పురుషయత్నేవ స్వార్థః సంప్రాప్యతే యతః.


బాల్యకాలము నుండియు బాగుగ అభ్యసింపబడిన శాస్త్ర సత్సాంగత్యాది గుణములచేతను పురుషప్రయత్నముచేతను ఆత్మప్రాప్తి రూపఫలము సిద్ధించును.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-17

అసద్దైవమధః కృత్వా నిత్యముద్రిక్తయా ధియా 

సంసారోత్తరణం భూత్యై యతేతాఽ ధాతుమాత్మని. 


అసత్యమగు అదృష్టమును క్రిందకు త్రోచివైచి నిరంతరము అధికోత్సాహముతో గూడిన బుద్ధితో సంసారసాగరమును దాటు నిమిత్తము శమ దమ శ్రవణ మననాది సంపత్తి కొరకై పురుష ప్రయత్నము గావింపవలెను. 


2-18

న గన్తమమద్యోగైః సామ్యం పురుషగర్దభైః 

ఉద్యోగస్తు యథా శాస్త్రం లోకద్వితయసిద్ధయే. 


గర్దభ (గాడిద) సమానులగు ప్రయత్నరహితులైన మనుజులవలె ఎన్నటికిని ఉండరాదు. ఇహలోక పరలోక (మోక్ష) సిద్ధి కొరకై శాస్త్రానుసారము ప్రయత్నము సలుపుచుండవలెను. 


2-19

సంసార కుహరాదస్మాన్నిర్గన్తవ్యం స్వయం బలాత్‌ పౌరుషం యత్నమాశ్రిత్య హరిణేవారిపంజరాత్.


ఉత్తమ పురుషప్రయత్న మాశ్రయించి, ఈ సంసారమను గోతినుండి శత్రు (మనుష్యనిర్మిత) పంజరమునుండి సింహమువలె స్వయముగ బలపూర్వకముగ బయల్వెడలవలెను.


2-20

ప్రత్యహం ప్రత్యవేక్షేత దేహం నశ్వరమాత్మనః సంత్యజేత్పశుభిస్తుల్యం శ్రయేత్సత్పురుషోచితమ్‌.


ప్రతిదినము 'ఈ శరీరము నశ్వరమైనది' అను విషయమును చింతన చేయవలెను. కావుననే పశువులవలె విషయభోగములందాసక్తి గలిగియుండుటను త్యజించవలెను. మఱియు సత్పురుషోచితములగు సాధుజన సాంగత్య

సచ్ఛాస్త్రాదుల నాశ్రయించవలెను.


2-21


కించిత్కాన్తాన్నపానాదికలిలం కోమలం గృహే 

వ్రణే కీట ఇవాస్వాద్య వయః కార్యం న భస్మసాత్.

వ్రణమందు కీటకమువలె, ఇంటియందు అల్పములగు స్త్రీ, అన్నపానాది కోమల పదార్థములను ఆస్వాదించుచు ఆయువును నాశమొనర్పరాదు. 


2-22


శుభేన పౌరుషేణాశు శుభమాసాద్యతే ఫలమ్‌ అశుభేనాశుభం నిత్యం దైవం నామ న కించన. 

శుభపురుష ప్రయత్నముచే శుభఫలమున్ను, అశుభప్రయత్నముచే అశుభఫలమున్ను శీఘ్రముగ సదా లభించుచున్నది. అంతేగాని అదృష్టము అనునది మధ్య  ఒకింతైనను లేదు.

[18/06, 11:15 am] K Sudhakar Adv Br: *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-29

ఆలస్యం యది న భవేజ్జగత్యనర్థః 

కో న స్యాదృహుధనికో బహ్యశ్రుతో వా ఆలస్యాదియమవనిః ససాగరాన్తా  

సంపూర్ణా నరపశుభిశ్చ నిర్ధనైశ్చ


ఈ ప్రపంచమున అనర్థహేతువైనట్టి 'సోమరితనము' అనునది లేనిచో ఎవరు మహాధనికుడు, మహావిద్వాంసుడు కాకయుండును? సోమరితనమునలననే ఈ సముద్రపర్యంతమగు పృథివి ఆత్మజ్ఞానరహితులగు నరపశువులచేతను, ధనహీనులగు మనుజుల చేతను పూర్ణమై యున్నది.


2-30

బాల్యే గతేఽ విరతకల్పితకేలిలోలే 

దోర్దండ మండితవయః ప్రభృతి ప్రయత్నాత్ సత్సంగమైః పదపదార్థ విశుద్ధ బుద్ధిః 

కుర్యాన్నరః స్వగుణదోషవిచారణాని.  


కల్పిత క్రీడలతో నిరంతరము చంచలమై తనరు బాల్యము గడచినతోడనే, గురుశుశ్రూషాది సహితముగ నిత్యానిత్య వస్తువివేకాది సుగుణముల నలవరచు కొని, యౌవనమునుండియే సత్సంగ మొనర్చుచు స్వకీయ గుణదోషములను పరీక్షించుకొనుచుండవలెను. 


2-31

తస్మాత్ర్పాక్పౌరుషాద్దైవం నాన్యత్తత్ర్పోజ్ఝ్యదూరతః సాధుసంగమసచ్చా స్త్రైర్జీవ ముత్తారయేద్బలాత్‌. 


పూర్వజన్మయందలి పురుషప్రయత్నముకంటె వేఱుగ అదృష్టము అనునది లేదు. అద్దానిని దూరముగ తొలగించివైచి సాధుజన సాంగత్య, సచ్ఛాస్త్రాదులచే జీవుని సంసారసాగరము నుండి బలవంతముగ తరింపజేయవలెను.


2-32

ప్రాక్స్వకర్మేతరాకారం దైవం నామ న విద్యతే 

బాలః ప్రబలపుంసేవ తజ్ఞేతుమిహ శక్యతే.


పూర్వపు స్వకర్మలు కాక అదృష్ట మనునది వేరొకటి లేదు. బలశాలియగు పురుషుఁడు బాలుని లోబర్చుకొనఁ గలిగినట్లు అనాయాసముగా అదృష్టమును జయించవచ్చును. 


2-33

హ్యస్తనోదుష్ట ఆచార ఆచారేణాద్య చారుణా 

యథాశు శుభతామేతి ప్రాక్తనం కర్మ తత్తథా.  


నిన్నటి దుష్ట ఆచరణము నేటి ఉత్తమ ఆచరణద్వారా ఎట్లు శీఘ్రముగ శుభత్వమును బొందుచున్నదో, పూర్వకర్మయున్ను ఇప్పటికర్మచే శుద్ధత్వమును బొందుచున్నది. 


2-34

తజ్జయాయ యతన్తే యే న లోభలవలంపటాః

తే దీనాః ప్రాకృతా మూఢాః స్థితా దైవపరాయణాః. 


ఆ పూర్వజన్మకృతకర్మను జయించుటకొఱకు యత్నింపనివారును, 'అదృష్ట' పరాయణులు నగు విషయసుఖలేశ లంపటులైన మనుజులు దీనులును, పామరులును, మూఢులు నగుదురు.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-35

పౌరుషేణ కృతం కర్మ దైవాద్యదభినశ్యతి 

తత్ర నాశయితుర్‌జ్ఞేయం పౌరుషం బలవత్తరమ్‌. 


ఇప్పటి పురుష ప్రయత్నము విఫలమైనచో పూర్వజన్మమందలి పురుష ప్రయత్నము ప్రబలముగ నున్నదని గ్రహింపవలెను. 


2-36

తస్మాత్పౌరుషమాశ్రిత్య సచ్ఛా స్త్రై స్సత్సమాగమైః 

ప్రజ్ఞామమలతాం నీత్వా సంసారజలధిం తరేత్‌.


కాబట్టి పురుష ప్రయత్నము నాశ్రయించి, సచ్ఛాస్త్ర, సత్సాంగత్యాదుల ద్వారా బుద్ధిని నిర్మల మొనర్చి సంసార సాగరమును దాటి వేయవలెను. 


2-37

యస్తూదార చమత్కారః సదాచార విహారవాన్‌

స నిర్యాతి జగన్మోహాన్మృగేన్ద్రః సంసారజలధిం తరేత్


ప్రయత్న మొనర్చుటయందు కుశలుడును సజ్జనులగు జ్ఞానులైన మహాత్ముల యొక్క సదాచారములందు విహరించువాడునగు మనుజుడు పంజరము (బోను) నుండి సింహమువలె ఈ జగత్తు యొక్క మాయామోహము నుండి బయటకు వెలువడును.


2-38

కశ్చిన్మాం ప్రేరయత్యేవమిత్యనర్థకుకల్పనే 

యః స్థితో దృష్టముత్సృజ్య త్యాజ్యోఽ సౌ దూరతోఽ ధనుః.


పురుష ప్రయత్నమును విడచి, “ ఎవరో నన్ను ప్రేరేపించుచున్నారు” అని అనర్థకల్పనలందు ఊగులాడు అధముడగు వ్యక్తిని దూరముగ పరిత్యజించుటయే మేలు. 


2-39

వ్యవహార సహస్రాణి యాన్యుపాయాన్తి యాన్తి చ 

యథా శాస్త్రం విహర్తవ్యం తేషు త్యక్త్వా సుఖాసుఖే. 


ఏ అనేక వ్యవహారములు మనుజునియొద్దకు వచ్చుచు పోవుచు నున్నవో, వానియందు ప్రియ, అప్రియముల యెడల రాగ, ద్వేషములు లేనివాడై, సుఖదుఃఖ భావనను వీడి, సమబుద్ధి గల్గి శాస్త్రానుసారము ప్రవర్తింపవలెను. 


2-40

యథాశాస్త్రమనుచ్ఛిన్నాం మర్యాదాం స్వామనుజ్ఝతః 

ఉపతిష్ఠన్తి సర్వాణి రత్నాన్యంబునిధావివ.


శాస్త్రానుసారమగు అఖండితమైన తన మర్యాదను (ప్రయత్నమును) త్యజింపనివానికి, సమస్త అభీష్టములును సముద్రమునందు రత్నమువలె సంప్రాప్తించుచున్నవి.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-48

ప్రాప్య వ్యాధివినిర్ముక్తం దేహమల్పాధి వేదనమ్‌ తథాత్మని సమాదధ్యాద్యథా భూయో న జాయతే.  


రోగరహిత మైనట్టియు, స్వల్పమానసిక దుఃఖముతో గూడినట్టియు దేహమును బొంది జీవుడు మరల జన్మింపకుండులాగున ఆత్మజ్ఞానము కొఱకును, చిత్తసమాధానము కొఱకును యత్నింపవలెను.


2-49

దైన్యదారిద్ర్యదుఃఖార్తా అపి సాధో నరోత్తమాః 

పౌరుషేణైవ యత్నేవ యతా దేవేంద్రతుల్యతామ్‌.


సాధూ! రామచంద్రా! దైన్యదారిద్ర్య దుఃఖములచే పీడింపబడియు, ప్రయత్నశీలురగు మనుజు లనేకులు పురుష ప్రయత్న బలముచే ఇంద్రసములైరి. 


2-50

భావాభావ సహస్రేషు దశాసు వివిధాసు చ స్వపౌరుషవశాదేవ నివృత్తా భూతజాతయః. 


జీవులు, వేలకువేలుగ సంభవించు ఆపదలను, సంపదలను, ఇతరములగు దశలను తమ పురుషప్రయత్న బలమువలనే అవలీలగ దాటివైచిరి.


2-51

శాస్త్రతోగురుతశ్చైవ స్వతశ్చేతి త్రిసిద్ధయః 

సర్వత్ర పురుషార్థస్య న దైవస్య కదాచన.


శాస్త్రవిచారణ, గురూపదేశము, స్వప్రయత్నము అను ఈ మూడింటి సాయమువలననే పురుషార్థము సర్వత్ర సిద్ధించుచున్నది. దీనికి అదృష్టముతో సంబంధము లేదు. 


2-52

అశుభేషు సమావిష్టం శుభేష్వేవావతారయేత్‌ ప్రయత్నాచ్చిత్తమిత్యేష స్సర్వశాస్త్రర్థసంగ్రహః. 


అశుభకార్యములందు ప్రవేశించిన చిత్తమును ప్రయత్నముచే శుభకార్యములందే లగ్న మొనర్పజేయవలెను. ఇదియే సర్వశాస్త్రముల యొక్క సిద్ధాంత సంగ్రహము. 


2-53

యత్ శ్రేయో యదతుచ్ఛం చ యదపాయ వివర్జితమ్‌ 

తత్తదాచర యత్నేన పుత్రేతి గురవః స్థితాః. 


“ఓ పుత్రులారా! (శిష్యులారా!) ఏది శ్రేయోదాయక మైనదో, ఏది పరమార్థ సత్య మైనదో, ఏది నాశరహిత మైనదో, దానినే ప్రయత్నముచే నాచరింపుడు!” (అట్టి నిత్య, సత్య, శుద్ధ ఆత్మ కొరకే ప్రయత్నించుడు!) అని మహాత్ములగు గురుజనులు హెచ్చరిక చేయుచున్నారు.

[ *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-41

క్రియయా స్పన్దధర్మిణ్యా స్వార్థసాధకతా స్వయమ్‌ 

సాధుసంగమ సచ్ఛాస్త్రతీక్ష్ణ యోన్నీయతే ధియా. 


గురుశుశ్రూషా, శ్రవణాది క్రియలచేతను; సాధు సాంగత్య, సచ్ఛాస్త్రాదుల చేతను తీక్ష్ణ మొనర్పబడిన బుద్ధిచే స్వయముగ ఆత్మ ఉద్ధరింపబడుచున్నది. ఇదియే అద్దాని 'స్వార్థసాధకత్వము'. 


2-42

అనన్తం సమతానన్దం పరమార్థం విదుర్బుధాః 

స యేభ్యః ప్రాప్యతే నిత్యం తే సేవ్యాః శాస్త్రసాధవః. 


ఆత్మజ్ఞానముచే అజ్ఞానకృత వైషమ్యము నివృత్తి కాగా, ఏ అనంతమై, సమమై పరిపూర్ణమైనట్టి ఆనందము ప్రాప్తించుచున్నదో దానినే విజ్ఞులు పరమార్థమని చెప్పుదురు.అయ్యది యెవరి వలన పొందబడుచున్నదో,అట్టి శాస్త్రములను,సాధువులను నిరంతరము సేవించవలెను.


2-43

నిత్యం స్వపౌరుషాదేవ లోక ద్వయహితం భవేత్‌ 

హ్యస్తనీ దుష్క్రియాభ్యేతి శోభాం సత్క్రియయా యథా


2-44

అద్యైవం ప్రాక్తనీ తస్మాద్యత్నాద్యః కార్యవాన్‌ భవేత్ 

కరామలకవద్ధృష్టం పౌరుషాదేవ తత్ఫలం 

మూఢః ప్రత్యక్షముత్సృజ్య దైవమోహే నిమజ్జతి. 


నిజపురుష ప్రయత్నబలముననే ఇహపరలోకముల రెండిటియందు మంచి చేకూరును. పూర్వపు దుష్కర్మలు ఇప్పటి ప్రాయశ్చిత్తాది సత్కార్యములచే శుభములుగ మారి, శోభను గూర్చుకొనును. కాబట్టి మనుజుడు కార్యశీలుడు కావలెను; పురుష ప్రయత్న బలముచే ఫలము, అరచేతియందలి ఉసిరి కాయవలె లభించును. మూఢుడే ప్రత్యక్షమును బరిత్యజించి అదృష్టరూప మోహమున నిమగ్ను డగును.


2-45

బుద్ధైవ పౌరుషఫలం పురుషత్వమేత 

దాత్మప్రయత్నపరతైవ సదైవ కార్యా 

నేయా తతః సఫలతాం పరమామథాసౌ 

సచ్ఛాస్త్రసాధుజనపండితసేవనేన.


పురుష ప్రయత్నముచే ఆత్మజ్ఞానమను ఫలమును బొందుటయే ఈ పురుషజన్మ యొక్క ఫలము; లేనిచో ఈ పురుషజన్మ నిరర్థకము - అని యెఱింగి సదా ఆత్మజ్ఞానమును గూర్చిన ప్రయత్నమందే తత్పరుడై యుండి అట్టి ప్రయత్నమును సచ్ఛాస్త్ర, సాధుజన పండిత సేవనము ద్వారా ఆత్మజ్ఞానఫలలాభముచే పూర్ణముగా సఫల మొర్పవలెను. 


2-46

దైవపౌరుషవిచారచారుభి

శ్చేదమాచరిత మాత్మపౌరుషమ్‌ 

నిత్యమేవ జయతీతి భావితైః 

కార్య ఆర్యజనసేవయోద్యమః.


అదృష్ట పురుష ప్రయత్నముల రెండిటి బలముల నిట్లు విచారించి, పురుష ప్రయత్నము నాశ్రయించియే ఆర్యులు ఫలము నొందుచున్నారు. కనుక ఆర్యజన సేవితమగు ప్రయత్నరూప శ్రవణమననాదుల నాశ్రయించి జ్ఞానమును బడయనగును. 


2-47

జన్మ ప్రబన్ధమయమామయమేష జీవో 

బుద్ధ్యైహికం సహజపౌరుషమేవ సిద్ద్యై 

శాన్తిం నయత్వవితథేన వరౌషధేన 

మృష్టేన తుష్టపరపండిత సేవనేన.


జీవు డీ జన్మయందు గావింపబడిన శాస్త్రబోధితమగు పురుష ప్రయత్నమే మోక్షసిద్ధికి సాధనమని యెఱింగి; నిత్యసంతుష్టులును, సర్వోత్కృష్టులు నగు 

బ్రహ్మవేత్తలయొక్క సేవనమను అమోఘ, మధుర, ఉత్తమ ఔషధముచే జన్మపరంపరాయమగు సంసారరోగమును శమింపజేసుకొనునుగాక!

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-66

అశుభేషు సమావిష్టం శుభేష్వేవావతారయ 

స్వం మనః పురుషార్థేన బలేన బలినాం వర.


బలవంతులలో శ్రేష్ఠుఁడవగు ఓ రామచంద్రా! అశుభ కార్యములందు ప్రవేశించి నీ మనస్సును అటునుండి త్రిప్పి పురుష ప్రయత్న బలముచే శుభకార్యములందే ప్రవేశపెట్టుము.


2-67

అశుభాచ్చాలితం యాతి శుభం తస్మాదపీతరత్‌ జన్తోశ్చిత్తంతు శిశువత్తస్మాత్త చ్ఛాలయేద్బలాత్‌.


మనుజుని చిత్తము బాలుని చందమున అశుభమార్గము నుండి నివారింపబడినచో, శుభమార్గమున రెండింతలు వేగముగ జనును. అట్లే శుభమార్గము నుండి నివారింపబడిన, అశుభమార్గమున రెండింతలు వేగముగ జనును. కాబట్టి ఆ చిత్తమును బలాత్కారముగ అశుభమార్గమునుండి నివారించి శుభమార్గముననే ప్రవేశపెట్టవలెను. 


2-68

సమతా సాంత్వనేనాశు నద్రాగితి శనైః శనైః 

పౌరుషేణైవ యత్నేన పాలయేచ్చిత్త బాలకమ్‌. 


ఈ ప్రకారముగ చిత్తమను బాలకుని శీఘ్రముగ రాగద్వేషాది వైషమ్యు త్యాగముచే స్వాభావిక సమత్వమందు నియోగించి పురుష ప్రయత్నముచే మెల్లమెల్లగ దానిని ఓదార్చుచు ఆత్మస్వరూపమున లగ్న మొనర్పవలెనేగాని హఠముగా నిరోధింపరాదు.


2-69

ఇదానీమపి తే యాతి ఘనతాం వాసనానఘ అభ్యాసవశత స్తస్మాచ్ఛుభాభ్యాస ముపాహర. 


పాపరహితుడవగు రామచంద్రా! ఈ జన్మయందును అభ్యాసవశమున నీయొక్క వాసనలు గట్టిపడును. కాబట్టి శుభవాసనలనే మరల మరల అభ్యసింపుము. 


2-70

శుభవాసనయా యుక్తస్తదత్ర భవ భూతయే 

పరం పౌరుషమాశ్రిత్య విజిత్యేంద్రియపంచకమ్‌.


  కావున, నీవు మోక్షమను ఐశ్వర్యముకొరకై గొప్ప పురుష ప్రయత్నము నాశ్రయించి పంచేంద్రియములను జయించి యిట శుభవాసనలతోనే కూడి యుండుము.


2-71

అవ్యుత్పన్నమనా యావద్భవానజ్ఞాత తత్పదః 

గురుశాస్త్రప్రమాణైస్తు నిర్ణీతం తావదాచర.


ఎంతవఱకు నీకు బోధ కలుగకుండునో, ఎంతవఱకు నీవు ఆత్మపదము నెఱుఁగకుందువో, అంతవఱకు గురు, శాస్త్ర ప్రమాణముల (యుక్తి, అనుభవాదులచే) నిర్ణయింపబడినదానినే ఆచరింపుము. (శుభవాసనలనే అభ్యసింపుమని భావము.)

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-60

విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరతః పౌరుషేణైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామ నాన్యథా. 


(ఇటనున్న ఈ) విశ్వామిత్ర మునీంద్రుడు ఆదృష్టమును దూరముగ తొలగించివైచి తన పురుషప్రయత్నముచేతనే బ్రాహ్మణత్వమును బొందెనుగాని మఱియొక విధముగ కాదు. 


2-61

ద్వివిధో వాసనావ్యూహః: శుభశ్చైవాశుభశ్చ తే 

ప్రాక్తనో విద్యతే రామ ద్వయోరేకతరోఽథవా.


ఓ రామచంద్రా! వాసనాసమూహము శుభమని, అశుభమని రెండు విధములు. పూర్వజన్మపువాసనా

సమూహము ఈ రెండిటిలో ఏదియో యొకటై యుండును. 


2-62

వాననౌఘేన శుద్ధేన తత్ర చేదద్యనీయసే 

తత్క్రమేణ శుభేనైవ పదం ప్రాప్స్యపి శాశ్వతమ్‌.


అందు పూర్వపు శుద్ధవాసనా సమూహముచే నీవిపుడు ప్రేరితుడనగుచో, క్రమముగ ఇప్పటి శుభప్రయత్నముచేతనే నీవు శాశ్వతపదమగు మోక్షమును పొందగలవు.


2-63

అథచేదశుభో భావస్త్వాం యోజయతి సంకటే 

ప్రాక్తనస్తదసౌ యత్నాద్‌ జేతవ్యో భవతా బలాత్‌. 


ఒకవేళ పూర్వజన్మపు అశుభవాసన నిన్నిపుడు సంకటము వైపునకు ఈడ్చుచో, అద్దానిని నీవిపుడు ఇప్పటి అధిక శుభ పురుష ప్రయత్నముచే బలపూర్వకముగ జయించవలెను. 


2-64

ప్రాజ్ఞశ్చేతనమాత్రస్త్వం న దేహస్త్వం జడాత్మకః 

అన్యేన చేతసా తత్తే చేత్యత్వంక్వేవ విద్యతే.


ఓ రామచంద్రా! నీవు ప్రజ్ఞారూపుఁడవు, చైతన్యమాత్రుఁడవే కాని జడమగు దేహము కావు. నీవు స్వప్రకాశుఁడవు. అట్టి చిన్మాత్ర రూపుఁడవగు నీవు మఱియొక చైతన్యముచే ప్రకాశింపబడుటలేదు. 


2-65

శూభాశుభాభ్యాం మార్గాభ్యాం వహన్తీ వాసనాసరిత్‌ 

పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పథి.


వానన యనునది శుభ, అశుభ మార్గముల రెండిటియందును ప్రవహించుచున్నది. అద్దానిని పురుషప్రయత్నముచే శుభమార్గము నందే త్రిప్పవలెను.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము

 

2-54

భోక్తా తృప్యతి నాభోక్తా గన్తా గచ్ఛతి నాగతిః 

వక్తా వక్తి న చావక్తా పౌరుషం సఫలం నృణామ్‌.


భుజించినవానికే తృప్తి కలుగుచున్నది. భుజింపనివానికి తృప్తి ఎట్లు చేకూరగలదు? నడచుచున్నవాడే అరుగ గలడు; నడువనివాడెట్లు చనగలడు? వక్తయే చెప్పగలడు; మౌని కాదు గదా? కావున పురుషప్రయత్నమే జనులకు సిద్ధిదాయకమని స్పష్టమగుచున్నది. 


2-55

పౌరుషేణ దురన్తేభ్యః సంకటేభ్యః సుబుద్ధయః 

సముత్తరన్త్యయత్నేన న తు మోఘతయానయా. 


బుద్ధిమంతులగువారు పురుషప్రయత్నము నాశ్రయించియే అనాయాసముగా గొప్ప సంకటములనుండి విడివడుచున్నారు. అదృష్టమును నమ్మి ఊరక కూర్చుండిన వారిపట్ల నియ్యది సంభవ మగునది కాదు. 


2-56

క్రీయయా స్పందధర్మిణ్యా స్వార్థసాధకతా స్వయమ్‌ సాధుసంగమసచ్ఛాస్త్రతీక్ష్ణ యోన్నీయతే ధియా.


సత్సాంగత్యము, సచ్ఛాస్త్ర విచారణల వలన బుద్ధి తీక్షణము కాగ అట్టి బుద్ధితో గూడిన ప్రయత్నముచే మనుజునకు తానిచ్ఛగించినది లభించును.


2-57

అనంత సమతానందం పరమార్థం స్వకం విదుః 

స యేభ్యః ప్రాప్యతే యత్నాత్‌ సేవ్యాస్తే శాస్త్ర సాధవః.


అనంతమైన సమరూప మైనట్టి అఖండానంద ప్రాప్తియే పరమ పురుషార్థమని పెద్దలందురు. ఇట్టి పరమార్థము వేనివలన లభించునో అట్టి శాస్ర్తములను, సత్పురుషులను తప్పక సేవించవలెను. 


2-58

అబాల్యాదలమభ్యస్తైః శాస్త్ర సత్సంగమాదిభిః

గుణైః పురుషయత్నేన స్వార్థః సంప్రాప్యతే యతః


బాల్యకాలము నుండి సత్సాంగత్య సచ్ఛాస్త్రముల నభ్యసించినచో వీని వలననే అనగా పురుష ప్రయత్నము వలననే, హితకరమగు మోక్షము సంపాదింపబడును. 


2-59

హ్యస్తనీ దుష్క్రియాభ్యేతి శోభాం సత్క్రియయా యథా 

అద్యైవం ప్రాక్తనీ తస్మాద్యత్నాత్‌ సత్కార్యవాన్భనేత్‌.


నిన్న చేసిన చెడ్డపని నేటి సత్కార్యమువలన మంచిగ మారునట్లు పూర్వపు కర్మగూడ ఇప్పటి సత్ర్పయత్నముచే శుభప్రదము కాగలదు. కాబట్టి ప్రయత్నపూర్వకముగ సత్కార్యముల నాచరింపవలెను.

 *యోగవాసిష్ఠ రత్నాకరము*


ముముక్షు ప్రకరణము

రెండవ అధ్యాయము 

పురుషప్రయత్న వివరణము


2-72

అవాన్తరనిపాతీని స్వారూఢాని మనోరథమ్‌ పౌరుషేణేంద్రియాణ్యాశు సంయమ్య సమతాం నయ. 


ఇంద్రియములన్నియు విషయాభిలాషయందు మిగుల ఆరూఢములై, ఐహిక సుఖములందు విశేషముగ వ్రాలుచున్నవి. వానిని పురుషప్రయత్నముచే శీఘ్రముగ సంయమ మొనర్చి మనస్సును సమత్వ మొందింపుము. 


2-73

అపునర్గ్రహణాయాన్తస్త్యక్త్వా సంసారవాసనామ్‌ సంపూర్ణౌ శమ సంతోషావాదాయోదారయా ధియా.


మరల ఎన్నటికిని తిరిగి గ్రహించకుండులాగున సంసార వాసనలు త్యజించివైచి, ఉదారబుద్ధిచే శమ సంతోషములను పూర్ణముగ గ్రహింపుము. 


శ్రీ వాల్మీకీచే రచింపబడిన మోక్షోపాయమగు యోగవాసిష్ఠరత్నాకరంలో ముముక్షు ప్రకరణమున పురుషప్రయత్న వివరణమనే రెండవ అధ్యాయము సమాప్తము.

** 


ముముక్షు ప్రకరణము

*మూడవ అధ్యాయము*

మోక్షసాధనము


శ్రీ వసిష్ఠ ఉవాచ :- 


3-1

నిర్వాణం నామ పరమం సుఖం యేన పునర్జనః 

న జాయతే న మ్రియతే తజ్జ్ఞానాదేవ లభ్యతే.


శ్రీ వసిష్ఠుడు :- ఓ శ్రీరామచంద్రా! దేనిచే జీవుడు మరల ఈ సంసారమున జన్మింపడో, మరణింపడో, అట్టి పరమసుఖమే నిర్వాణము. అయ్యది కేవలము జ్ఞానముచేతనే లభించును. 


3-2

సంసారోత్తరణే జన్తోరూపాయో జ్ఞానమేవ హి 

తపో దానం తథా తీర్థమనుపాయాః ప్రకీర్తితాః.


జీవుడు సంసారమును తరించుటకు జ్ఞానమే ప్రధానమగు ఉపాయము; తపో, దాన, తీర్థాది ఉపాయములు పరంపరాసాధనములే యగునని చెప్పబడినది. 


3-3

రాజవిద్యా రాజగుహ్య మధ్యాత్మజ్ఞానముత్తమమ్‌ జ్ఞాత్వా రాఘవ రాజానః పరాం నిర్దుఃఖతాం గతాః.


మొట్టమొదట రాజుల కుపదేశింపబడుటచే, లేక విద్యలలో శ్రేష్ఠమైన దగుటచే రాజవిద్యయని పిలువబడిన ఈ ఉత్తమ మైనట్టియు, మహారహస్య మైనట్టియు, అధ్యాత్మజ్ఞానమును పూర్వము రాజు లెఱిఁగి పూర్ణముగ దుఃఖరాహిత్యము నొందిరి.


(రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ | 
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్।। భగవద్గీత 9-2


ఈ రాజ విద్య అన్ని రహస్యాలలో అత్యంత లోతైనది. అది విన్నవారిని శుద్ధి చేస్తుంది. ఇది నేరుగా గ్రహించదగినది, ధర్మానికి అనుగుణంగా, ఆచరణలో సులభం మరియు ప్రభావంలో శాశ్వతమైనది అని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పారు.)

కామెంట్‌లు లేవు: