బమ్మెఱపోతన రూప చిత్రణము
--------------------------------------------------
సీ: కుప్పించి యెగసిన కుండలమ్ముల కాంతి
గగన భాగంబెల్ల గప్పి కొనఁగ ;
నుఱికిన నోర్వక యుదరంబు లోనున్న
జగముల వ్రేగున జగతి గదుల ;
చక్రంబుఁ జేపట్టి ద చనుదెంచు రయమున
పైనున్న పచ్చని పటము జార;
నమ్మితి నాలావు నగుబాటు సేయకు
మన్నింపు మని క్రీడి మరలఁ బిలువఁ ;
గీ: గరికి లఘించు సింహంబు కరణి మెఱసి ,
నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు,
విడువు మర్జున! యంచు , మద్విశిఖ వృత్తిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు .
శ్రీ: ఆం: భాగవతము- ప్రథమస్కంథము- 40 వ: పద్యము;
తెలుగు వారి పుణ్యాలపేటి,యైన, భాగవత గ్రంధంలో పోతన రూపచిత్రణం అత్యద్భుతం! ఆయాపాత్రల యథాతధ స్థితిని కన్నులకు గట్టించటం పోతన కవితలోని ప్రత్యేకత! భాగవత ప్రధమ స్కంధంలోని భీష్మ స్తుతి యిందుకు చక్కని యుదాహరణ.
నాఁడు కురుక్షేత్ర రణరంగంలో ప్రచండంగా యుధ్ధం చేస్తున్నప్పుడు, అర్జునుఁడా బాణాఘాతములకు నొచ్చి, కలత పడువేళ చక్రధారియై కృష్ణుఁడు భీష్ముని పైకి నురుకు దృశ్యము ను ఈపద్యమునందు కన్ను లముందు నిలిపినాఁడు.
అలతి యలతి సుందర పద భాసితమైన యీపద్యానికి అర్ధవివరణ మక్కరలేదు. అయినను భావార్ధ దర్శన మొనరింతముగాక!
" చక్ర ధారియై కృష్ణుఁడు రథమునుండి యురికినపుడు కుప్పించి యెగసినాడట .(ఒకింతశరీరమును పైకి
లేపుట)అపుడాతని కర్ణాభరణముల కాంతి మెఱపు మెరసినట్లయి ఆదివ్యకాంతి నలుఁగడలవిస్తరించినదట, అట్లు ఉరుకుచే తనలోనున్న 14 భువనముల భారము కదలినట్లయి ఉదరము క్రిందికి పైకినూగెనట., చక్రధారియై యురకు నపుడు పైనున్న పీతాంబరము జాినదట.అట్టిస్థితిలో అర్జునుడు ముకుళిత హస్తుడై
" కష్ణా! నాపరాక్రమమును శంకింపకుము, నాశక్తి నే నెఱుంగుదును ,భీష్ముని నీవువధించి నాకు నలుగురిలో నవమానమును ఘటింపకుము మరలుమని " వేడుచున్నాడట.అతనిమొరవిని,
" ఏనుఁగు పై నురుకు సింహమువలె గర్జించుచు, " నేడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడెదను.నన్ను విడువుము"- అనిపలుకుచు నాబాణములకు తాళలేక నాపై లఘించు చక్రధారియే నాకు దిక్కగుగాక!
అనిభీష్ముని ప్రార్ధన! ఇదీ పోతన గారి రూపచిత్రణం!
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి