25, ఆగస్టు 2024, ఆదివారం

సంకల్ప బలం

 సంకల్ప బలం



రామానుజుల వారు జీవించి ఉన్నకాలంలో, విజయనగరంలో ఒక ముసలి బిచ్చగత్తె ఉండేది. ఆమె అసలు పేరు ఏంటో ఎవ్వరికీ తెలీదు కానీ, ఆమె ఎప్పుడూ సంతోషంగాఉండటం చూసి అందరూ ఆమెను ‘కళావతి’ అని పిలిచేవాళ్ళు.


ఒకనాడు కళావతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే వినబడింది- "భగవానుడైన రామానుజుల వారు త్వరలోనే నగరానికి రానున్నాడు" అని. ఆమె పెద్దగా చదువుకున్నదీ కాదు, ఏమంత తెలివితేటలు ఉన్నదీ కాదు. రామానుజుల గురించి ఆమె అంతవరకూ ఏనాడు విని ఉండలేదు కూడా. అయినా 'రామానుజులు రావటం' అనే సంగతి మటుకు ఆమెకు ఎందుకో చాలా నచ్చింది.


తర్వాతి రోజుల్లో‌ ఆమె రామానుజుల గురించి అనేక విషయాలు విన్నది- నగర పెద్దల నుండి, పెద్ద పెద్ద వర్తకులనుండి, అతి సామాన్యుల వరకూ- అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు! ఆయన కోసం ఎవరి తాహతుకు తగినట్లు వాళ్ళు ఏవేవో‌ బహుమతులు తీసుకు వెళ్తారు. ఆయన మటుకు ఎవ్వరు ఏది ఇచ్చినా తీసుకుంటాడు. అసలైతే ఆయనకు భక్తి తప్ప మరేమీ అక్కర్లేదట.." ఇట్లా ఏవేవో చెప్పుకుంటున్నారు జనం.


కళావతి తనకు తెలియకుండానే రామానుజుల రాక కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది.ప్రతిరోజూ అడుక్కుంటూ నగర శివార్ల వరకూ పోయి, అక్కడే సాయంత్రం వరకూ ఉండి, వెనక్కి తిరిగి వచ్చేది. 

కొన్ని రోజుల తర్వాత రామానుజులు వచ్చాడు. కళావతి ఆ సమయానికి నగరం శివారులోనే ఉన్నది. రామానుజుని వెంట అనేకమంది భక్తులు- అందరూ చకచకా నడచుకొంటూ కళావతిని దాటుకొని పోయారు. రామానుజుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు, "నా వెంట రా" అని చెప్పినట్లు అనిపించింది కళావతికి. ఆమె మనసు పులకరించి, ఆయన వెంటే పోయింది. ఆమె కాళ్ళు మటుకు ఆయన్ని అనుసరించలేక వెనుక పడ్డాయి.


తెలివి వచ్చి చూసుకునేసరికి కళావతి నగరంలో ఉన్నది. సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్నాయి. రామానుజుని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్ళతో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి.


ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, సందడి. అందరి చేతుల్లోనూ పూలు, పళ్ళు, ధూపాలు, వస్త్రాలు, రక రకాల తినుబండారాలు- అన్నీ‌అతని అనుచరులకు బహుమానంగా ఇచ్చేందుకు!


వాటిని చూసేసరికి కళావతికి అకస్మాత్తుగా తను ఏమీ తేలేదని గుర్తుకొచ్చింది. 'అంత గొప్ప భగవానుడిని ఒట్టి చేతుల్తో దర్శించటం ఏం బాగుంటుంది' అనిపించింది. తన దగ్గర ఏమున్నదో వెతుక్కున్నది. ఒక చిన్న నాణెం మాత్రం ఉంది. ఆ నాణాన్ని పట్టుకొని ప్రక్కనే కనబడ్డ శెట్టి దుకాణానికి పోయింది. నాణానికి సరిపడ నూనె ఇమ్మన్నది.


ఆ నాణెం ధరకు అసలు ఏ కొంచెం‌ నూనె కూడా రాదు. కళావతి తన కొంగును కొంచెం చింపి ఇచ్చింది- "ఇదిగో, ఈ పీలిక తడిసేంత నూనె ఇవ్వు చాలు. భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను" అని ప్రాధేయపడ్డది.


'భగవానుడికోసం' అనేటప్పటికి శెట్టి మెత్తబడ్డాడు. పీలికని నూనెలో తడిపి ఇచ్చాడు. కళావతి దాన్నిపట్టుకొని పోయి, రామానుజుడు బస చేసిన మందిరానికి చేరుకున్నది. అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం. అక్కడ ఓ మూలగా మట్టి ప్రమిద ఒకటి కనబడితే, దానిలో ఈ ఒత్తిని వేసి వెలిగించింది ఈమె.


దానిముందు మోకరిల్లి, "స్వామి! నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏదీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లను ప్రారద్రోలాలి. ఇక్కడున్న వీళ్లందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సాయపడాలి. అజ్ఞానపు పొరలన్నీ నశించి, అంతటా వెలుగు పరచుకోవాలి" అనుకున్నది.


ఆరోజు రాత్రి ఆలయంలోని దీపాలన్నీ ఒక్కటొక్కటిగా కొడిగట్టాయి. కానీ బిక్షగత్తె వెలిగించిన దీపం మటుకు తెల్లవారవచ్చినా ఇంకా వెలుగుతూనే ఉన్నది.


తెల్లవారు జామున దీపపు ప్రమిదలనన్నిటినీ సేకరించి ఒకచోట పేర్చేందుకు వచ్చిన ఒక శిష్యుడు దాన్ని చూసి "దీపంలో‌ఒత్తి ఇంకా కొత్తగానే ఉన్నది. ఉదయంపూట దీనితో పనిలేదు. ఇవాల్టి రాత్రికి మళ్ళీ వెలిగించుకోవచ్చు" అని దాన్ని ఆర్పివేయబోయాడు. అతను ఎన్ని సార్లు ఆర్పివేసినా ఆ దీపం మళ్ళీ మళ్ళీ వెలుగు అంటుకున్నది! దీన్ని గమనించిన స్వామి నవ్వి, అతన్ని వారిస్తూ "ఇది ఇప్పట్లో ఆరదు. కళావతి వెలిగించిన ఈ జ్ఞాన దీపం ఆమెకే కాదు, అనేకమందికి ఆసరా అవుతుంది. ఈ జ్ఞానాగ్నిలో అనేక జీవుల కర్మలు సమూలంగా నశించనున్నాయి. పవిత్రమైన హృదయంతో, బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపంవల్ల ఆమె ఈ సరికే పరిశుద్ధురాలైంది. తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో 'దీపకాంతి' అనే పేరు గల మహా భక్తురాలు అవుతుంది" అన్నాడు.


మనం చేసే పనులకు బలాన్ని చేకూర్చేది మన మనసులోని పవిత్రతే!


from భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, పురాణాలు

కామెంట్‌లు లేవు: