_*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 21 వ భాగము*_
🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗
*పట్టమహిషి అనుమానము:*
వివేకి, బుద్ధి కౌశలములు కలది పట్టపురాణి. తానెరిగిన అమరకునికీ చచ్చి బ్రదికిన ఇప్పటి రాజుకీ ఏ విధమైన సామ్యం లేకపోవడం. ప్రతిభలో గాని, శాస్త్ర వైదుష్యంలోకాని, వచనా చాతుర్యములో గాని, నడవడిక సొబగులో గాని, తేజస్సంపదలో గాని నేటి రాజుకు పూర్వపు రాజుకు అణు మాత్రం పోలిక లేదు. పైగా ఇతడు చూడగా చూడగా ఏ మహా మహితాత్ముడో, జగద్భాంధవుడనదగ్గ కారుణ్య నిధియో అనిపిస్తోంది.
తన అనుమానమును ప్రధానమంత్రితో విచారిం చ దలచుకొన్నది ఆ నిపుణురాలు. మహారాణి ఆజ్ఞ అందిన అమాత్య శేఖరుడు వచ్చి నమస్కరించి నిలబడి వేచియున్నాడు. మహారాణి అడుగుతోంది అతడిని: “అమాత్య వర్యా! దేశంలోని విశేషాలు ఏమిటి? మన రాజ్యపాలన గురించి ప్రజలు ఏమని తల పోస్తున్నారు?”
అమాత్యుడు “మహా రాణీ! దేశం ఎల్లవిధాలా పరమశోభాయ మానంగా మున్నెన్నడు జరుగని రీతిలో సుఖసంపదలకు ఆకరమై ఉన్నది. ఈ మధ్యనే మంత్రి మండలి లో సమీక్ష చేసినాము. ఒక వంక అత్యంత సమ్ముదము కలిగి ఉన్నా వేరొకవంక మమ్ములను అనుమానభావము పీడి స్తున్నది. మన రేడు ఆనాడు పునర్జీవితుడైన పిదపనే ఈ ఆనందకర మైన మార్పులు సంభ వించినవి కదా!"
మహారాణి: “ఆ భావము మిమ్ములను ఎందుకు పీడించాలి? మార్పుల వలన మేలు కలుగు తోంది కదా?”
మహామంత్రి : " అమ్మా! మహారాజు చనిపోయి మరల జీవించిన తరుణంలో ఏ మహనీ యుని దివ్యతేజమో రాజులో ప్రవేశించినదని మా ఊహ.
మహారాణి : "అగు గాక! దానికి చింతించనేల?”
మహామంత్రి: "మహారాణీ! మీరన్నట్లు మేలైన ఈ పరిణామం ఎప్పుడు మన చేయి జారి పోతుందోనన్న భీతియే మా బాధకు హేతువు”
మహారాణి: "మీ అభిప్రాయము శ్రేయోదా యకమైనది. పరిస్థితు లను కనిపెట్టి రాజ్య క్షేమంకోసం పాటుపడడం మీ బాధ్యత. అందుకు తాము సర్వ సమర్థులని మాకు విదితము.ఈవిషయములు పరమ రాజ రహస్యములని మీకు నేను వేరుగా చెప్ప నక్కర లేదు”
మహామంత్రి : “ముమ్మాటికీ ఇది పరమ రహస్యము. మహారాణి వారి ఆజ్ఞ శిరోధార్యము. నేను సదా ఆ యత్నం లోనే ఉండి నా విధి నిర్వహిస్తాను”.
పట్టపురాణితో మాట్లా డినతర్వాత ప్రధానామా త్యుడు సెలవు తీసికొని వెళ్ళాడు. వెను వెంటనే కార్యాచరణకు ఉపక్రమిం చాడు. అమరకుని దేహంలోనికి పరకాయ ప్రవేశము చేసిన మహా వ్యక్తి తిరిగి తన దేహంలోనికి ప్రవేశించగల అవకాశాన్ని అరికట్టాలి. అందుకు చేయవలసినది ఆ వ్యక్తి యొక్క పూర్వకాయాన్ని లేకుండా చేయడమే.అందుకై ఆజ్ఞలు జారీ చేశాడు. 'రాజ్యములో నున్న మృతదేహాల నన్నిటినీ స్వాధీనం చేసికొని ప్రభుత్వపు ఖర్చుతో వాటిని దహనం చేయండి' అని సమర్థులయిన సేవక బృందాన్ని ఈ పనిలో పెట్టాడు. 'ఈ మీ కర్తవ్యంలో ఏవిధంగా అవరోధము వచ్చినా లెక్కచేయవద్దు. రహస్య ముగానున్న శవములను కనిపెట్టి వాటిని కూడా ఆలస్యం లేకుండా దగ్ధం చేయండి’ అని వారికి స్పష్టమైన నిర్దుష్టమైన ఆజ్ఞ లిచ్చాడు.
జనులీ వార్తలు విని మనరాజు ఎంత దయా మయుడు! అనాథ ప్రేత సంస్కారం చేయిస్తున్నా డని మురిసి పోతున్నారు జనులు అసలు రహస్యం ఎరుగక.
*శంకరశిష్యుల అన్వేషణ:*
గుహలో భద్రపరచిన గురువు గారి శరీరాన్ని జాగరూకతతో కాపాడు తున్న శంకరాచార్యుల శిష్యులు 'రావలసిన గడువు దాటిపోతోంది. వచ్చే జాడలు కానరావు. ఏమయింది? ఎందులకీ విలంబనము?' అని పరి పరి విధాల ఆవేదన పడుతున్నారు. 'మన గురుడు మనకు తిరిగి ప్రాప్తించునా లేదా? మహోత్తముడైన గురు సాన్నిధ్యం దొరకినదని సంబరపడ్డాము. ఇప్పుడు మనకు ఏమి గతి?' 'స్వామీ! మా అవస్థ చూచి యైనా తిరిగి వచ్చి మమ్ము కాపాడు. నీకన్న కరుణాహృద యుడు ఎవరున్నారు? నీవే రక్ష!'. ఈ రీతిగా వేదన పడుతున్న సహశిష్యులను చూచి పద్మపాదుడు వారిని చూచి "మిత్రులారా! ఎందులకీ విలాపములు? మన గురుదేవుల ఉనికిని కనుగొని మన వంతు మన విధిని చేసే ప్రయత్నం చేద్దాము. హనుమంతుడు సీతా దేవి కోసం వెదకినట్లు మన గురువును మనము కనుగొనే యత్నం చేద్దాము. యత్నంతో సమకూడని పనులుండవు.
నా భావము ప్రకారము మనం గురుదేవుని ఉనికి తెలుసు కొనడానికి ఎక్కువ శ్రమపడ నవసరముండదు. అజ్ఞాత వాసంలోనున్న పాండవులను ఎలా తెలిసికొనగలం అన్న ప్రశ్నకు భీష్ముడు చెప్పిన రీతిగానే మనం మన గురుదేవుని సులువుగా తెలిసికోవచ్చునని నా అభిప్రాయం. గురువుల రూపురేఖలు కనిపించక పోయినా వారున్న ప్రదేశం వారి తేజోవైభ వాలతో ప్రభావితం కాక మానదు. అదే మనకు కావలసిన సంకేతం” అని చెప్పి మిగతా శిష్యులకు ధైర్యం నూరిపోశాడు.అప్పుడు పద్మపాదుడు కొందరు శిష్యులను శంకరుని శరీరాన్ని కాపాడ డానికినియమించి, మరి కొందరు సహాధ్యాయులతో కలిసి శంకరుల అన్వేషణలో బయలు దేరాడు. కొండ దిగి దగ్గర నున్న గ్రామాలు చూస్తూ వెదకడం మొదలు పెట్టారు. క్రమంగా అమరక మహారాజు నగరం చేరారు. వేళ అతిక్రమించకుండా ఒక బ్రాహ్మణుని ఇంటఅతిథు లుగావెళ్ళారు. గృహస్థు ఈ శంకర శిష్యులను చూచి "అయ్యలారా! మీరెవ్వరు? ఏ ఊరి నుండి వచ్చారు? మీ రాకకు కారణ మేమిటి? మీరు చూడగా విశిష్ట విప్రులులా ఉన్నారు” అని అడిగిన ప్రశ్నకు పద్మపాదుడు ఈ విధంగా సమాధాన మిచ్చాడు:
"మహాత్మా! మా నివాసం కాశి. గురుధనం కోసం వచ్చి ఉన్నాము.
ఈ దేశాన్ని పాలించే రాజు ఎవరు? ఆయన ఎట్టివాడు? పండితులను సన్మానించునా? ఆయన ఏయే విద్యలలో నిష్ణాతుడు? ఏ విద్య యందు ఆయనకు అభిరుచి మెండు?” అని తిరుగు ప్రశ్నలు వేసెను. అందులకు సమాధానం గా ఆ ఇంటి యజమాని ఇలా అన్నాడు: "మహాత్ములారా! మా రాజు మంచి వాడనే అనాలి. ఆయన పేరు అమరకమహారాజు. సకల విద్యలలోను ఆరితేరిన వాడు. రామ రాజ్యమునే మైమర పించు పరిపాలనము. ఇప్పుడు మా కెవరికీ ఏ కొరతా లేకుండా బ్రదుకుతున్నాము”.
"మీ రాజునకు వయస్సు ఎంత?” అని అడిగిన ప్రశ్నకు “వయస్సుచే పెద్దవాడైనను చూపరులకు చిన్నవాడి లాగునే కన్పట్టును” అని బదులు చెప్పాడు గృహస్థుడు. అప్పుడు పద్మపాదుని అనుమానము బలమై, మరల ఇలా అడిగాడు: “విప్రోత్తమా! మీ మాటలు కొంచెము సంశయాత్మకంగా ఉన్నాయి. మీ రాజు పాలన ఇదివరకు సరిగా లేదా? ముసలివాడై ఉండి యౌవనవంతు డిలా కనబడడ మేమిటి? దయతో నా అనుమానం నివారణ చేయండి స్వామీ!” అందుకు గృహస్థుడు ఇలా అన్నాడు. "తేజోనిధీ! నీ అనుమానానికి కారణం లేకపోలేదు. మా రాజుకు వేట అన్న పిచ్చి. క్రూరమృగాలను వేటా డడం రాజధర్మమే కదా! ఒకప్పుడు వేటకు వెళ్ళి పగలంతా వేటాడి రాత్రి అయ్యేసరికి అలసి ఒక చెట్టుమొదట జేర్లబడి కన్ను మూసాడు. తెల్ల వారిన తర్వాత వచ్చిన పరిజనం నిద్రలో ఉన్నా డనుకొని వేచి వేచి చివరకు తెలుసుకొన్నారు అది శాశ్వతనిద్ర యని. అందరూ దుఃఖంతో పరితపించినవారే. కడకు చితి పేర్చి కళేబరాన్ని దానిపై ఉంచారు దహనక్రియకు. ఇంతలో అందరూ చూస్తుండగనే ఆ దేహము కదలి లేచి కూర్చున్నాడు రాజు. నేనూ చూశాను ఆ దృశ్యం. పరమాద్భు తంగా మారాజు పునర్జీవితు డయ్యాడు. ఈ సంగతి రాజుకు విన్నవించగా సకల మర్యాదలతో పురికి వచ్చి తిరిగి తన కోరిక మేరకు పట్టాభిషిక్తు డయ్యాడు. అప్పటి నుండి పరిపాలనా విధానమే మారిపోయింది. రాజ్యపాలనా భారం అంతా ప్రధానామాత్యు నిపై పెట్టి రాజు అంతఃపుర రాణులతో శృంగారలీలలు సలుపుతూ ఉంటాడు. అందు వలన మీ వంటి వారికి రాజ దర్శనం దొరకడం బహుదుర్లభం. సంగీత విద్వాంసులకు మాత్రం దర్శనం సులభమని ప్రతీతి. ఈ కథనువిన్న పద్మపాదాదు లకు సందేహం పోయింది. రావలసిన చోటికే వచ్చామని తెలిసింది.
*గాయక వేషధారులు:*
పద్మపాదుడు, కూడా వచ్చిన శిష్యులు, గాయకుల్లా వేషాలు వేసికొని వీధిన బడి శ్రోత్ర మధురంగా పాటలు పాడుకొంటూ రాజవీధు లలో వెడలడం చూచిన కొందరు అంతఃపుర కాంతలు ఆ విషయం రాజు చెవిన వేసి గాయకులను రాజ భవనంలోనికి తీసికొని వచ్చారు. సింహాసనంపై కూర్చున్న మహారాజు చుట్టూ రాణులు పరివేష్టించగా తారల మధ్యనున్న చంద్రుడిలా వెలిగి పోతున్నాడు. నవరత్నఖచిత కిరీటము ధరించి శ్వేతచ్ఛత్రము క్రింద సుందరీమణులు వింజామరలు వీస్తుండగా మధురగానాలు వింటూ తన్మయుడై దివ్య కాంతులతో ప్రకాశిస్తు న్నాడు. చూచీ చూడగనే నమ్రులై నమస్కరించారు మన కపటగాయకులు. ఉచితాసనాలపై కూర్చుండ బెట్టిన తరువాత గానము వినిపించుటకు అనుమతి ఇచ్చాడు రాజు. మొదటగా గురుప్రార్థన చేశాక గానం ప్రారంభం చేశారు. ఒకమిథ్యాఘట్టాన్ని ఈ విధంగా సృష్టించారు. పరివారమును విడిచి పోయిన భ్రమరరాజము తోడి ఎడబాటు భరించలేక చిన్న భ్రమరములు మొరపెట్టు కొను ఘట్టము. "ఓ భ్రమర రాజమా! మన మధు వనంలో ఉండి మనందరికి విందు చేస్తూ మాతోబాటు అద్భుత సుఖాన్ని పంచుకొనే సమయాలు గుర్తు తెచ్చుకో. నీ ఎడబాటు సహించక వెదక రాని పొదలన్నీ వెదకి వెదకి కడకు నిన్ను కను గొన్నాము. మాతో ఇదివరకు పంచిన సౌఖ్యాన్ని మరచి ఈ క్రీకారణ్యంలో చెట్ల చిటారున నీ వాసం ఎన్నుకొన్నావు. మత్తెక్కించు మధువు గ్రోలుతూ ఝంకారాలు చేస్తూ ఇక్కడ స్థిర నివాసం చేసికొంటివా! నీవు ఏ కారణంగా ఈ చోటుకు వచ్చావో నీకే తెలుసును. వచ్చిన పని ముగియలేదా? గడువు దాటునన్న ధ్యాస లేదా! ఓ భ్రమరాగ్రణీ! నీ రాక కోసం నీ వారు ఎదురు తెన్నులు చూస్తున్నారని తెలిసికో. నీకు నిజానికి తెలియని వేమీ లేవు!"
గాయకులు వినిపించిన భ్రమర గీతం విని శంకరుడు పూర్వ స్మృతి తెచ్చుకొన్నాడు. అంతలో సింహాసనంపై ఒరిగి కన్ను మూసాడు.
గానమాధుర్యంలో మైమరచి పడ్డాడను కొన్నారు మొదట. తర్వాత తెలిసింది ఇక మహారాజు లేవడని.
శంకరుడు ఆ శరీరాన్ని విడచి పెట్టేశాడు. దేశ మంతా గాలించి దొరకిన శవాలనెల్లా దహనం చేసి వస్తున్నారు రాజభటులు. తిరుగు యానంలో వారి కంటబడింది శంకరుని శరీరం. శిష్యులెంత అడ్డుపడినా ప్రయోజన ము లేకపోయింది. శంకరుని శరీరాన్ని పట్టి చితి పేర్చి నిప్పు ముట్టించే తరుణానికి ఆకాశం నుండి దివ్య తేజస్సు ఆ శరీరంలో ప్రవేశించింది. లేచికూర్చు న్నారు గురులు! ఒక్క ఉరకలోవెళ్ళి గురువు లను దింపుకొన్నారు శిష్యులు. ఆసమయంలో శంకరాచార్యులు సంకట నాశన లక్ష్మీనృసింహ స్తోత్రం చెప్పారు.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము*
*21 వ భాగము సమాప్తము*
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి