_*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 22 భాగము*_
🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄
*యకులు బందీకృతులగుట:*
రాజు హఠాత్తుగా ఏ హేతువు లేకుండా మృతి చెందడం చాలా అనుమానాలకు దారి తీసి మంత్రులు గాయ కులను బంధించి తెమ్మని ఆనతిచ్చారు.
ఆ బందీకృతులైన గాయకులనిలా ప్రశ్నించాడు మంత్రి:
మంత్రి : మీరు లోనికి పోవుటకు ఎవరి అనుమతి పొందారు?
గాయకులు : అయ్యా! మహారాజు గారే మమ్మల్ని పిలిపించు కొన్నారు.
మంత్రి : మీరు పాడిన పాట లేమి?
గాయకులు: భ్రమరగీతలండి.
మంత్రి : ఈ పాట లోని భావ మేమిటి?
గాయకులు: మాకు తెలియదండి. మేము తెలివిగల వాళ్ళం కామండి.
మంత్రి : మీరు నిజంగానే తెలివిలేని వారే! నిజం చెప్పండి.
గాయకులు : ప్రభో! లోకమే నిజం కాదు. ఇంక మా మాటలు నిజమని ఎలా చెప్పగలం?
మంత్రి: గాయకులారా! ఒకటి మాత్రం నిశ్చయం. పాటలు పాడి మా రాజు ప్రాణాలు తీశారు.
గాయకులు: స్వామీ! మేము పాటలు పాడినపుడు రాజు గారికి చాలా దూరంలో ఉన్నామే! రాజుగారి ప్రాణాలు తీయడం ఎలా సాధ్యం?
భటులతో గాయకులను కట్టడిలోనే ఉంచి జాగ్రత్తగా చూడమని చెప్పి మంత్రి నిస్పృహ తో నిష్క్రమించాడు. ఇంతలో రాజభటులు వచ్చి శంకరాచార్యుడు తమకు దొరకిన మృతదేహంలో ప్రవేశిం చిన ఉదంతం భయకంపిత గాత్రులై మంత్రులకు తెలిపారు. మంత్రి కూడ భయంతో తిరిగి గాయకుల దగ్గరకు వచ్చి క్షమించు డని ప్రార్థించాడు.
పద్మపాదాదులు జరిగిన వృత్తాంతం మిగిలిన శిష్యులు వచ్చి చెప్పగా విని ఆనందం తో పరుగు పరుగున గురుసన్నిధి చేరు కున్నారు.
*‘జితాస్మి’:*
శంకరాచార్యస్వామి గగనమార్గంలో మండనమిశ్రుని గృహం
చేరుకొన్నారు గడువు పూర్తి అయ్యేసరికి. మండనమిశ్రుడు అత్యంత గౌరవంతో శంకరునికి ఎదురేగి వందనములాచరించి షోడషోపచారములతో పూజించి గురువులను ఉద్దేశించి “జగద్గురు దేవా! తమ కరుణా కటాక్షము వలన పరమేశ్వర తత్త్వం తెలిసికో గలిగాను. నా ఇల్లూ, వాకిలీ, నా ధనమూ, నా సర్వస్వం మీ అధీనం. తమరే నా గతి. వేరొండు గతి లేదు. ఈ దీనుని శాసించుడు. తమ ఆజ్ఞకు సర్వదా బద్ధుణ్ణి” అని వేడుకొన్నాడు మండన మిశ్రుడు.
నగరంలోని వారందరూ శంకరుడు వచ్చిన వార్త విని ఒకరొకరే వచ్చి పాదాభివందనం చేసి కొంటున్నారు. ఇంతలో ఉభయభారతి వచ్చి “సకల విద్యలకు ఆలవాలమైన శ్రీభగవానుడా! సర్వభూతములకు ఆధారమైన పరబ్రహ్మ స్వరూపా! ఆచార్య దేవా! అనుకొన్నటుల నాతో వాదించ వలదు. సర్వశాస్త్రములలో పూర్ణుడవై యున్న నీతో మానవులు వాదించ నుద్యుక్తులగుట వెర్రితనము!
మీ తోటి వాదము మీ కొఱకు నా కొఱకు కాదు గదా! భాస్కర ప్రభ ముందు దివిటీల వలె మా ప్రతిభ వెలవెలబోతుంది. మీతో అపజయమే మాకు ధన్యతనిస్తుంది. జితాస్మి!" అని పలికెను. దానికి బదులుగా శంకరుడు ఉభయభారతితో "తల్లీ! నీవు ఆదిజుడైన బ్రహ్మ ఇల్లాలివి. విద్యలకు సామ్రాజ్ఞివి. నీకు తెలియనిది విశ్వంలో లేదు. నీ కరుణతోనే ఎవరైనా తెలివి నార్జించేది. నీవు బ్రహ్మలోకానికి తిరిగి వెళ్ళినా ఈ లోకంలో జ్ఞానరూపంలో ఉండా లని నా ప్రార్థన.” అని అడగగా ఉభయభారతి సరేనని వరమిచ్చి బ్రహ్మలోకానికి చేరుకొంది.
*మండనమిశ్రుని సన్న్యాసాశ్రమము:*
అటు ఉభయభారతి నిజలోకానికి తిరిగి వెడలగానే మండన మిశ్రుడు తను చేయవలసిన కర్మలను ముగించుకొని, నిత్య కర్మాచరణలను మనస్సులో విడనాడి అగ్నిని తనలో ఐక్యం చేసికొని, తనకున్న ధన భాగ్యాలను బ్రాహ్మణు లకు, పేదలకు పంచి పెట్టివేశాడు. ఇంక తన కనేదేదీ ప్రాపంచిక పరమైన వస్తువులు లేకుండా త్యజించాడు. ఒకప్పుడు తాను నిరసించిన సన్న్యాస ధర్మాన్ని శంకరుల కరుణతో చేపట్ట నున్నాడు. ముందుగా ఆ తురీయాశ్రమ ధర్మాలను పరిశీలించు కొన్నాడు. వాటిని నిరవశేషంగా ఆకళిం చుకొని, శంకరాచార్య స్వామిని సన్న్యాస ఆశ్రమము నిప్పించ మని మనఃపూర్వక ముగా వేడుకొన్నాడు. ఆచార్యస్వామిముందు శాస్త్రీయముగా శిఖా యజ్ఞోపవీతములు విసర్జించి, కాషాయ వస్త్రధారియై, దండ కమండలములు చేకొని గురుదేవునికి సాష్టాంగ ప్రణామము చేసి శిష్యుడయ్యాడు. ఈ పరిణామము కేవలము వాదపరీక్షలో ఏర్పరచు కొన్న కట్టడినను సరించి కాక నిష్కల్మష బుద్ధితో మనశ్శుద్ధితో కోరుకొని నిశ్చయించు కొన్న నిర్ణయం. ఆ క్షణంలో ఆయనకు పూర్వాశ్రమం ఒక కలలా అనిపించింది. ఇన్నాళ్ళుఅంధకారంలో ఉండి నేడు ఆచార్యుల తేజస్సులో వెలుగు లోనికి వచ్చినట్ల యింది. మండనుని పూర్వపు శిష్యులు కూడా శంకరుని శరణుజొచ్చారు. క్రొత్త ఆశ్రమంలో మండన మిశ్రుడు ‘సురేశ్వరాచా ర్యుడు' అయ్యాడు.
*మహావాక్యోపదేశము:*
శిష్యుని తనంత వానిగా చేయాలని గురువులనుకుంటారు. మోక్షమార్గమును చూపువాడు గురువు. సురేశ్వరాచార్యునికి శంకరులు ఈ విధంగా బోధించారు.
“నాయనా! మనం నిద్రలో కలలు కంటాము. మెలకువ రానంతవరకు అవి నిజముగానే తోచును. మెలకువ రాగానే అవి అసత్యములని తెలు స్తుంది. ఈ సంసారం కూడా ఒక పెద్ద కల. తెరపై బొమ్మలు వస్తాయి. అవి రకరకాలుగా ఆడుతాయి. నిన్ను నవ్విస్తాయి, ఏడిపి స్తాయి. అంతా అయిన పిమ్మట ఏమీ ఉండదు. బొమ్మలను ఆడించే వాడు మనకు కనబడడు. తెరవెనుక ఉంటాడు. మొదట గాని, మధ్యలో గాని, చివర గాని నీకు కన్పట్టడు. అట్టిదే ఈ జనన మరణ క్రీడ. ఇదంతా ఉన్నది ఉన్నట్లు తెలిసికొనడమే తెలివికి సార్థక్యం. ఈ చూచుచున్నదీ లేదు. ఈ శరీరమూ లేదు.
జననమూ లేదు. మరణమూ లేదు. అన్ని కాలములలో ఉన్నది ఒకటే. అది సద్వస్తువు. అదే నీవు. దానినే ఆత్మ అంటారు. అదిఅంతటా నిండి ఉంటుంది. జీవుడు వేరు, ఆత్మ వేరు అనుకోవడం అవివేకం. అజ్ఞానంతో ఈ శరీరాన్ని 'నేను' అని తలుస్తున్నావు. వస్త్రం చిరిగినపుడు పారవేసి క్రొత్త బట్ట కట్టుకొన్నట్లుగానే ఈ శరీరం నశించిన తర్వాత మరో శరీరాన్ని ఆశ్రయిస్తావు. కనిపించే వన్నీ నశ్వరాలే. శరీరం కూడా కనిపించేదే కాబట్టి అది కూడ నశ్వరమే. 'నేను చిక్కాను, బలిశాను, మగవాణ్ణి, ఆడదాన్ని, ముసలివాడనయ్యాను.ఇత్యాదులు అన్నీ శారీరకములే కాని, 'నీకు' చెందవు. ఆత్మకు ఆదిమధ్యాంతములు లేవు. 'దేహమే ఆత్మ, ఇంద్రియాలే ఆత్మ, ప్రాణమే ఆత్మ, మనస్సే ఆత్మ, బుద్ధియే ఆత్మ,.' ఈ విధంగా ఆత్మను ఎన్నిటి యందో ఆరోపించే మతములు ఉన్నవి. దేహము, ఇంద్రియములు, బుద్ధి, ప్రాణము, మనస్సు, ఇవి జడపదార్థములు. అందువల్ల ఇవి ఏవీ ఆత్మ కానేరవు. ఆత్మ వీటికి అన్నింటికీ అతీతముగా సాక్షీ భూతముగా ఉంటుంది. ఆత్మకు వికారములు ఉండవు. చైతన్యముతో స్వయంప్రకాశముగా ఉంటుంది. అదియే 'నీవు'. సర్వజగత్తుకూ ఆత్మయే కారణమై ఉన్నది. అది పరిపూర్ణము. పరిపూర్ణ మైన వస్తువు ఒకటియే గాని రెండుగా ఉండదు.
ఈ సంగతులు ఉపనిష త్తులలో కలవు. తెలియని వారు వేర్వేరు విధములుగా వచిస్తారు. ఆ పలుకులు నమ్మిన మూలాననే నాస్తిక భావనలుమొలకెత్తాయి. పరమాత్మకు నిర్దిష్టమైన గుణములు లేవు. అందువలననే నిర్గుణుడన్నారు.
సురేశ్వరా! నీకు అనుమానములు మెండుగా ఉన్నవి. 'సంశయాత్మా వినశ్యతి' అన్నట్లు సంశయం గలవానికి నాశనం తప్పదు. కాబట్టి నీ సంశయాల నన్నిటినీ తక్షణమే విడనాడుము. తెలిసి కొనే తెలివే ఆత్మ. ఆత్మవస్తువును నేనే అని నమ్మినవారలు అరుదు.
శ్రీకృష్ణభగవానుడు తానే ఆత్మగా లోకానికి వెల్లడి చేశాడు. ముత్యాలహారంలో సూత్రమున్నది. సూత్రములో ముత్యాలు ఉండవు. సూత్రం తెగినచో ముత్యాలు వేరవు తాయి. జగత్తు ముత్యాల వంటిది. ఆత్మ సూత్రము. 'తత్ - త్వం' అనే ఈ రెండు పదములే జీవేశ్వరులు. పదములు వేరయినా అందులోనున్న చైతన్య మొక్కటే! ఉపాధులకు అదిష్టానంలో ఏకత్వా న్ని చూచుకోవాలి. కుండకూ మట్టికీ అధిష్ఠానం ఒక్కటే. అట్లుగానే 'తత్ - త్వం' లోని వాచ్యార్థాన్ని విడచి లక్ష్యార్థాన్నే గ్రహించ వలెను”.
అప్పుడు సురేశ్వరునికి ఒక సందేహం పొడ చూపింది: "గురుదేవా! బ్రహ్మపదార్థం ఉంది కాని మనకందరికీ కనిపించే ఈ జగత్తే లేదంటున్నారు. అది ఎట్లా? ఉన్నది తెలియబడుచున్న దానిని లేదు అంటు న్నారు. కనిపించని
ఆత్మపదార్థమే ఉన్నది అంటున్నారు. ఇది ఎలాగ? దయతో సెలవిస్తారా?”
శంకరాచార్యులు ఈ విధంగా ఆ శంకకు ఉత్తర మిచ్చారు: “సురేశ్వరా! భావాభావాలు, ఉనికి లేములు వ్యవహారదశ లోనివి మాత్రమే. పరమార్థంలో ఇది వర్తించదు. లేనిది అనుకొన్నది తెలియ బడవచ్చును. ఉన్నది తెలియబడాలనే నియమం లేదు. జగత్తు లేకపోయినా తోచవచ్చు చున్నది. ఈ తోచబడేది అంతా ఆత్మయే. 'రజ్జు సర్ప భ్రాంతి' వలె సర్పభ్రాంతికి కారణము త్రాడే. ఈ మాట చాలా చోట్ల విశదంగా కనిపిస్తుంది. బంగారం తో తయారైనది ఉంగరం. మట్టితో తయారయినది కుండ. నీటి స్వరూపమే మంచు గడ్డ. ఇలాంటి వస్తువులలో నీకు పూర్వరూపం కనిపి స్తుందా? కాని వాటికి వీటికి తేడా మృగ్యం. ఆ పూర్వావస్థ ప్రచ్ఛన్నంగానే ఉంటున్నది. 'సర్వభూతేషు ఆత్మని’ అని శ్రుతి. ఆత్మ యందు జగత్తు ఉన్నది. సర్వశరీరాలలో ఉన్న ఆత్మ ఒక్కటే! ఇన్ని శరీరాలలో పెక్కు ఆత్మలు లేవు. సూర్యుని ప్రతిబింబం జలాలలో చూచినపు డు అనేకంగా గోచరించి నా సూర్యుడొక్కడే కదా! జీవులను ప్రకాశింప జేసేది ఆత్మ ఒక్కటే. అది బుద్ధినీ, ఆ బుద్ధి ఇంద్రియా లనూ ప్రకాశింప జేస్తున్నాయి. ఈ మూడింటికీ సాక్షి ఆత్మ ఒక్కటే. ఇంకొక మాట. ఆత్మతత్త్వం తెలిసి కొనాలనే సంకల్పం అందరికీ కలగదు. బహు పుణ్యం చేసు కొన్నవానికి గాని కలుగదు. 'సర్వం బ్రహ్మ' అని ప్రతి వానికి చెప్పరాదు” మరొక సంశయం లేవనెత్తాడు సురేశ్వరుడు: "స్వామీ! బ్రహ్మము మారి జగత్తు అయిందా?”
శంకరాచార్యుడు: “నీ వన్నట్లు అట్లనేవారు లేకపోలేదు. కాని నిజం వేరుగా నున్నది. పెరుగు వెనుతిరిగి పాలు అవుతుందా? ఎన్నటికీ కాదు. ఇది సాంఖ్యుల మతం. మట్టి కుండ అయినట్టు, నూలు పోగులు వస్త్రమయి నట్లు, బంగారం నగ అయినట్లు ఆత్మ జగత్తుగా అయినది. కాని జగత్తు వలె కన్పట్టును. కాని జగత్తుగా పరిణామం పొందలేదు. జగత్తు రూపంలో మిథ్య, ఆత్మరూపంలో సత్యము. త్రాడు రూపం సత్యం. సర్పరూపం మిథ్య. బ్రహ్మం ఉన్నదని, తానే ఆత్మ అని గ్రహించడం పరోక్ష జ్ఞానం. 'తానే పరమాత్మ' అనుకోవ డం అపరోక్షజ్ఞానం. దీనినే పరమానందస్థితి లేక స్వస్వరూపస్థితి అంటారు. జగద్భావన విడచి బ్రహ్మభావననే చేయుము”
కాలడి శంకర
కైలాస శంకర
*
శ్రీ ఆది శంకరాచార్య
చరిత్రము
22 వ భాగము
సమాప్తము
आ*☘️🌸☘️🌸☘️
🪔🪔 గృహస్థుడు🪔🪔
🌹మన సనాతన ధర్మం మానవ జీవితాన్ని నాలుగు దశలుగా విభజించింది. ఏ దశలో ఏ విధి నిర్వహించాలో నిర్దేశించింది. ప్రతివ్యక్తీ తన జీవితాన్ని తాను చక్కగా అనుభవిస్తూనే సమాజానికి సేవ చేయడానికి ఉపయోగపడేలా ఒక మంచి వ్యవస్థను ఊహించింది. దాని ప్రకారం మనిషి జీవితాన్ని వయోధర్మాన్ని బట్టి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలనే నాలుగు దశలుగా విభజించింది. ప్రతిదశలోనూ వ్యక్తి తన వ్యక్తిగత, సామాజిక బాధ్యతల్ని నిర్వహిస్తూనే జీవిత ధ్యేయాన్ని సాధించుకోవడానికి కృషిచేసే అవకాశం ఉంది.
🌹సన్యాసాశ్రమం అందరికీ సాధ్యం కాదు. బ్రహ్మచర్యం తరవాత సన్యాసాశ్రమం తీసుకున్నవారూ అరుదుగా ఉన్నారు. ఆధునిక కాలంలో వానప్రస్థాశ్రమం ఉనికిని కోల్పోయింది. పూర్వకాలంలో రుషులు, రాజర్షులు ఉండేవారు. కొన్ని మతాలు, భావనలు సన్యాస జీవితాన్ని ప్రోత్సహిస్తాయి. సంసార జీవితాన్ని అంతగా అంగీకరించవు. భార్యాబిడ్డలు ఆధ్యాత్మిక జీవితానికి అడ్డంకి అని భావించేవారు అన్ని కాలాల్లోనూ ఉంటారని చరిత్ర గతిని చూసినప్పుడు బోధపడుతుంది.
🌹వివాహం చేసుకున్నవారు యోగసాధనకు పనికిరారని భావించేవారూ ఉన్నారు. గృహస్థ జీవితానికి, ఆధ్యాత్మిక సాధనకు పొంతన కుదరదనేవారు ఉన్నారు. కానీ, సనాతన సంప్రదాయాన్ని పరిశీలించినప్పుడు ఈ అభిప్రాయం ఆధారం లేనిదని తెలుస్తుంది.
🌹వేదమార్గాన్ని దర్శించిన రుషుల్లో పవిత్రమైన గృహస్థ జీవితాన్ని గడిపిన వారెందరో ఉన్నారు. వేద ధర్మాన్ని అనుసరించిన రుషులు చాలా మంది నాలుగు ఆశ్రమాల నిర్వహణలో జీవితం పరిపూర్ణత చెందాలని దర్శించి నిర్దేశించినవారే. కొందరు మాత్రం తమ స్వభావాలను బట్టి గృహస్థాశ్రమాన్ని స్వీకరించక ఆజన్మ బ్రహ్మచారులుగా ఉండేవారు. అయితే వారు తమ ప్రణాళికకు తగిన మార్గాన్ని అనుసరించారుగాని, గృహస్థాశ్రమ స్వీకరణ దోషమని చెప్పలేదు.
🌹 గృహస్థాశ్రమం మనిషి జీవితంలో కీలకదశ. సమాజ జీవితానికి కేంద్రం గృహస్థాశ్రమం. దాని ఆధారంగానే మిగిలిన జీవన శాఖలు పెరిగి వృద్ధి చెందుతాయి. అందరూ ఆ కల్పవృక్షాన్ని ఆశ్రయించి బతుకును కొనసాగిస్తారు. గృహస్థ ధర్మానికి మూలం కుటుంబం. కుటుంబ ధర్మానికి మూలాధారం దాంపత్య ధర్మం. కాలగతిలో ఎన్ని పరిణామాలు ఎదురవుతున్నా ఈ ధర్మమే పరంపరను నిలబెట్టింది.
🌹బ్రహ్మచారులకు, భిక్షువులకు, సాధు సన్యాసులకు, అంగవికలురకు పోషణ స్థానం గృహస్థుడే. | గృహస్థుడి వల్లనే మిగిలిన ఆశ్రమాలవారికి సుఖజీవనం సాధ్యమవుతోంది. గృహస్థుడు తన ధర్మాన్ని ఏమాత్రం అలక్ష్యం చేసినా సమాజ జీవనం అస్తవ్యస్తమవుతుంది. వైదిక సంస్కృతి గృహస్థుడికి అగ్ని ఉపాసన నిత్యవిధిగా పేర్కొంది. అతడు పంచయజ్ఞాలు నిర్వహించవలసి ఉంది. తన ఉనికికి, మనుగడకు కారణమవుతూ దృశ్యంగా, అదృశ్యంగా ఉన్నవాటన్నింటికీ మనిషి కృతజ్ఞత ప్రకటించడమే ఈ యజ్ఞాల లక్ష్యం.
🌹అవి దేవ, పితృ, భూత, మనుష్య, బ్రహ్మ యజ్ఞాలు. దేవతల పట్ల కృతజ్ఞత ప్రకటించడం దేవయజ్ఞం. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతా ప్రకటనం పితృయజ్ఞం. ఇది తర్పణ శ్రాద్ధాదుల ద్వారా జరుగుతుంది. తల్లిదండ్రుల స్థానం దేవతలతో | సమానమైనదిగా ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతిలో మనతోపాటు పెరుగుతున్న ప్రాణులు మన జీవనానికి సహకరిస్తున్నాయి. ఆ జీవకోటికి ఆహారం అందించడాన్ని 'బలిహరణం' అంటారు. మనుష్య యజ్ఞమంటే అతిథి సత్కారం. బ్రహ్మయజ్ఞం అంటే వేదాధ్యయనం.
కాలంతోపాటు ఎన్నో వికృతులు ప్రవేశించి కుటుంబ జీవితం పూర్వపు ఉన్నతిని కోల్పోతోంది. ధర్మశాస్త్రానుసారం గృహస్థాశ్రమం నిర్వహించగలిగినప్పుడు సమాజంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అదే భారతీయ చింతన.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి