24, సెప్టెంబర్ 2024, మంగళవారం

కవితా మాధుర్యం

 


భావ  కవితా  మాధుర్యం !


            చ: "  అలరుచు మల్లికా పరిణయంబని  వచ్చిరి  పువ్వుఁబోండ్లు ,  కో


                    యిల  సవరించె  గొంతు ,  తమయేలికకై  విరి తేనె పానకం 


                    బళి తతి గూర్చె , పుప్పొడుల  నత్తరులన్  బవనుండు  చేర్చె, కో


                      మల  జలజాత  పత్రముల   మాటున   నేటికి   దాగినాఁడవో ?


                              

                             ప్రకృతికి  ప్రణయాన్ని  అనుసంధానం చేయటమే  భావకవితా తత్వం. సర్వ ప్రకృతియు  భావకవులకు  ప్రణయమూర్తిగానే  దర్శనమిస్తుంది. అందుకే  ప్రకృతితో  కలసిపోవాలని  వారియారాటం. కృష్ణశాస్త్రి  స్వభావ కవియైనను,

భావకవిగా స్థిరపడినాడు. కలంకదలించి ప్రకృతిలోని  రమణీయమైన ప్రణయ తత్వాన్ని  తనకవితలో ఆవిష్కరించాడు  కవితా చిత్రాలుగా. అందులో  ఒక అక్షర చిత్రం  పై పద్యం.


                           గాలికి తలలూపే పూలబాలలు, విలాసంగా,కులాసాగా పచారులుచేసే తుమ్మెదలూ, కొమ్మపై గొంతుసారించే  కోయిలలు. గాలికి రేగే పరాగాలు. సరాగమాడుతూ ఉంటే,

ఆసుందర ప్రకృతి యంతా వారికి  పెళ్ళిపందిరిగా  ఊహాలోకంలో  తళుక్కున మెఱసింది. అంతే  పైపద్యం అవతరించింది  కవితా

చిత్రాంగా .


              భావము: మల్లికకు పెళ్ళియని సంతోషపడుతూ  పూలన్నీ పేరంటాళ్ళై  విచ్చేశాయి. కోకిల గొంతు సవరించి సన్నాయి వాయి

స్తోంది. తమదొరకోసం తేనెటీగలు  పానకం సిధ్ధంచేశాయి. అత్తరు ,గంధము మొ:నవి సమీరుడు ,సమీకరించి తెచ్చాడు. అన్నీ సిధ్ధం చేసి కొన్నాం ఓపెళ్ళికొడుకుగారూ( తుమ్మెదరాజా!)  మీరెందుకండీ  లేత తామర ల చాటున దాగినారు.  రండి రండి ,యని పెండ్లికొమరుని 

యాహ్వానిస్తున్నారు కవిగారు.


            పెళ్ళి యేర్పాట్లు  చక్కగా వర్ణించారు శాస్త్రి గారు. మల్లిక పెళ్ళికూతురు, తుమ్మెదరాజు పెండ్లికొమరుడు. పూలన్నీ పెళ్ళికి పేరంటాండ్రు .కోకిల కూతలు సన్నాయిలు. తేనె పానకం  పూలపుప్పొడుల గంధాలు. ఇలా యెదురు సన్నాహానికి కావలసిన వన్నీ సర్దుబాటు చేశారు. పెళ్ళిళ్ళలో  వరుడు అలగటం దాగుకోవటంకూడా ఒక భాగమే  దానిని కూడా  శాస్త్రిగారు విడిచి పెట్టలేదు.


                            ఈవిధంగా  ఒక  చంపక  మాలతో  మనోజ్ఙంగా  మల్లికకు తుమ్మెద వరునితో  వివాహం 


                                           జరిపించేశారు. ఎంత  ముచ్చటగా ఉందీపద్యం! 


                                                ఇదండీ భావ  కవితా  మాధుర్యం!


                                                         స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: