21, సెప్టెంబర్ 2020, సోమవారం

**మహాభారతము**

 **దశిక రాము**




నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


89 - అరణ్యపర్వం.


భీమసేనుని రక్షించడానికి, అజగరరూపం లో వున్న నహుషుని ప్రశ్నలకు, ధర్మరాజు సమాధానం యివ్వడానికి ముందుకువచ్చాడు కదా ! నహుషుడు మొదటి ప్రశ్న సంధించాడు.

1 . ధర్మజా ! బ్రాహ్మణుడు అనగా యెవరు ? అతడు పొందవలసిన విద్య యేది ?

సర్పరాజా! సత్యము, దానగుణము, క్షమాగుణము, సచ్చీలము, సాధుస్వభావము, తపోకాంక్ష, దయ మొదలైన దైవప్రేరిత గుణాలు వున్నవాడే బ్రాహ్మణుడు.


2 . నీవు చెప్పిన గుణాలు శూద్రుని యందు కూడా వుండే అవకాశం వుంది కదా ? 

ఆ గుణాలు శూద్రుని యందు వున్నచో అతడు కూడా బ్రాహ్మణుడు అని పిలువబడతాడు. ఆగుణాలు లోపించిన బ్రాహ్మణుడు కూడా శూద్రుడే. 


3 బ్రాహ్మణత్వానికీ గుణాలకూ సంబంధం వున్నప్పుడు ప్రత్యేక బ్రాహ్మణజాతి వుండుట వ్యర్ధమేకదా ? వర్ణవ్యవస్థ యెలా నిలబడుతుంది ? 

గుణం చూసి కుల నిర్ణయం చెయ్యవలెననిన అట్టివారిని గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థ వుండటం సాధ్యం కాదు. అన్నికులాలలో వర్ణసంకరము అనివార్యంగా వున్నది. అందువలన, బ్రాహ్మణకులంలో పుట్టినా గుణసంపద లేని వానిని వర్ణ సంకరునిగానే పరిగణించాలి. అన్ని సద్గుణాలు వున్న శూద్రుని, బ్రాహ్మణునిగా గుర్తించవచ్చు. 


పై సమాధానాలు ధర్మజునుండి వినగానే, ' నీలాంటి ధర్మవర్తనులు, సాధుమనస్కులు, చాలా అరుదు. నీలాంటి వాని తమ్ముని భక్షించుట సముచితం కాదు. నీ సత్యభాషణ వలన నాకు శాపవిమోచనం అయింది. నీమేలు మరువరానిది. ' అన్నాడు నహుషుడు, సర్పరూపంలో వుండి.


ధర్మరాజు సర్పరాజుని ' సర్పరాజా ! మీరు విద్యాకోవిదులు. మానవులు ఆచరించ వలసిన ఉత్తమకర్మలు మీ వాక్కు ద్వారా వినాలనివుంది. శలవివ్వండి. ' అని అడుగగా, ' ధర్మజా ! సత్యము, ఇంద్రియనిగ్రహము, తపస్సు, దానము, అహింస, ధర్మజీవనము, ఇవే మానవులకు సద్గతులు కలుగజేస్తాయి. జాతి, కుల భేదాలు సద్గతి కలుగజేయవు. ' అని సమాధానం చెప్పాడు.


మరుక్షణంలో నహుషుని అజగరరూపం కరిగిపోసాగింది. దివ్యదేహంతో నహుషుడు దర్శనమిచ్చాడు. చూస్తూ వుండగానే, దేవతలవిమానం వచ్చి నహుషుని ముందు నిలిచింది. భీముడు స్పృహలోకి వచ్చి నహుషునికి, ధర్మజునికీ, ధౌమ్యునికీ నమస్కరించాడు. నహుషుడు విమానం అధిరోహించి, స్వర్గానికి వెళ్ళిపోయాడు. 


భీమసేనుని వెంటబెట్టుకుని ధర్మరాజు ఆశ్రమానికి వచ్చాడు. భీముడు తనకే యిలా యెందుకు జరిగిందని కుమిలిపోతుండగా, ధర్మజుడు ఓదార్చాడు. అతి సాహసంతో అడవులలో తిరగడం, ప్రకృతిని కల్లోలం చెయ్యడం మంచిదికాదని , హితవు చెప్పాడు. 


పాండవులు ద్వైతవనంలో,ఆనందంగా గడుపుతుండగా, వర్షాకాలం, ఆతరువాత శరత్కాలం వచ్చింది. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ హాయిగా కాలం గడపసాగారు పాండవులు. కార్తీక మాసంలోపౌర్ణమి కూడా అయిపోయిన తరువాత, పాండవులు తిరిగి కామ్యకవనం చేరుకున్నారు. 


కామ్యకవనం లో పాండవులు సేదదీరుతుండగా, ఒకనాడు సత్యభామా సమేతుడై శ్రీకృష్ణుడు కామ్యకవనం అరుదెంచాడు. కుశల ప్రశ్నలు, స్వాగత సత్కారాలు అయిన తరువాత, శ్రీకృష్ణుడు ధర్మరాజుతో యిలా అన్నాడు : ' ధర్మరాజా ! నీవు లౌకికజీవితం గడుపుతున్నజ్ఞానివి. అర్ధకామములందు నీకు కాంక్ష లేదు. ధర్మమూ, మోక్షం మీద నీకున్న అనురాగం నిన్ను ధర్మరాజుని చేశాయి.'


' నిండుసభలో ద్రౌపదిని అవమానించినా కూడా, కౌరవుల యెడ సహనం ప్రదర్శించావు. మీకష్టాలు తీరేసమయం వస్తుంది త్వరలో. ఆసమయం యెప్పుడు వస్తుందో, మేము మా వంతు సహకారం ఎప్పుడు అందిస్తామో అని యెదురుచూస్తున్నాము. '


' ద్రౌపదీ ! నీవు పొందిన అవమానాలకు, అనుభవిస్తున్న కష్ఠాలకు తెరబడే రోజు వస్తుంది. నీ భర్త అర్జునుడు అసమానతేజంతో అమరావతి నుండి అనేక అస్త్రశస్త్రాలతో తిరిగి వచ్చాడు. నీ బిడ్డలు ప్రద్యుమ్నునివద్ద, అభిమన్యునివద్ద, చక్కని శిక్షణలో వున్నారు. సుభద్రా రుక్మిణీలు, వారిని సదాచారసంపన్నులుగా తీర్చి దిద్దుతున్నారు.'


శ్రీ కృష్ణుని అమృతవాక్కులు ధర్మరాజు హృదయాన్ని ద్రవింపజేశాయి. తాము ధర్మం తప్పకుండా ఉండేటట్లు, శ్రీకృష్ణుని కృప యెప్పుడూ యిలాగే వుండేటట్లు చెయ్యమని వినయంగా పలికాడు ధర్మరాజు.


వారు యిలాంటి ప్రియ సంభాషణలలో మునిగితేలుతుండగా, మార్కండేయమహర్షి వేంచేశారు, వీరున్న చోటికి. 


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: