21, సెప్టెంబర్ 2020, సోమవారం

కర్ణుడి జన్మవృత్తాంతం

 ఆదిపర్వము – 26




ధృతరాష్ట్రుని తమ్ముడు పాండు రాజు కూడా సకల విద్యలలో ఆరితేరాడు. వేదాలు, శాస్త్రాలు, ఆయుధ విద్యలను నేర్చుకున్నాడు. పాండు రాజుకు వివాహం చెయ్య సంకల్పించాడు భీష్ముడు.


ఇదిలా ఉండగా – శూరుడు అనే యాదవ రాజు ఉండేవాడు. ఆయన పెద్ద కూతురు పేరు పృధ. శూరుడు తన కూతురు పృధను తన మేనత్త కుమారుడైన కుంతి భోజునకు సంతానం లేని కారణంగా, పెంచుకోవడానికి ఇచ్చాడు. పృధ కుంతి భోజుని ఇంటిలొ పెరుగుతూ ఉంది.


ఒకరోజు మహాముని దుర్వాసుడు కుంతిభోజుని భవనానికి వచ్చాడు. పృధ చేసిన సత్కారాలకు సంతుష్టుడయ్యాడు.


ఆమెను చూసి “కుమారీ, నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతను ఆరాధిస్తావో, ఆ దేవతలు నీకు నీవు కోరిన కొడుకులను ప్రసాదిస్తారు” అని చెప్పాడు.


ఒకరోజు పృధ ఒంటరిగా గంగా నది ఒడ్డుకు వెళ్లి, స్నానం చేసి, సూర్యుడికి అర్ఘ్యం విడిచింది. అప్పుడు ఒక ఆలోచన వచ్హి, బాల్య చాపల్యంతో దుర్వాసుడు ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలని అనుకుంది. వెంటనే మంత్రాన్ని జపించి “దేవా, నాకు నీ వంటి కొడుకును ఇమ్ము” అని సూర్యదేవుడిని ప్రార్థించింది.


వెంటనే సూర్యుడు ప్రత్యక్షం అయ్యాడు. సూర్య భగవానుని చూసి పృధ వణికి పోయింది. సూర్యుడు ఆమెను చూసి “బాలా భయపడకు, నువ్వు కోరిన వరం ఇవ్వాడానికి వచ్చాను” అని చెప్పాడు.


“దేవా, నేను కన్యను. బాల్య చాపల్యంతో అడిగాను. నన్ను క్షమించు” అని వేడుకొంది.


“బాలా, నా దర్శనం వృధా పోదు. నీకు కొడుకు పుడతాడు” అని అన్నాడు.


“దేవా, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు నాకు గర్భం వస్తే నా తల్లి తండ్రుల మొహం ఎలా చూడను” అని అడిగింది.


“నీ కన్యత్వం చెడకుండా నీకు పుత్రుని ప్రసాదిస్తాను” అని చెప్పాడు.


వెంటనే ఆమెకు సహజ కవచ కుండలాలతో కర్ణుడు పుట్టాడు. సూర్యుడు వెళ్లి పోయాడు. చేతిలో బిడ్డతో పృధ నిలబడిపోయింది. ఏమి చెయ్యాలో తోచలేదు.


“ఆ ముని ఏల రావలె, వచ్చినా మంత్రము ఏల ఉపడేశించవలె. ఉపడేశించినా నేను ఏల వరము కోరవలె. నేను బుధ్ధిలేక కోరినా సూర్యుడు ఏల పుత్రుని ప్రసాదించవలె. అంతా విధిలీల. ఇప్పుడు ఈ లోకాపవాదము ఏల తప్పుతుంది. ఈ బాలుని ఇంటికి తీసుకొని వెళ్లితే నన్ను అందరూ తిడతారు. అలా అని ఈ బిడ్డను వదలబుధ్ధి కావడంలేదు. ఏమి చెయ్యాలో తోచడం లేదు” అని చింతిస్తూ ఉంది.


ఇంతలో అమూల్యమైన బంగారము, రత్నములు, మణులుగల ఒక పెట్టె నదిలో తేలుతూ వచ్చింది. కుంతి వెంటనే ఆ బిడ్డను ఆ పెట్టెలో పెట్టి నదిలో విదిచిపెట్టింది. ఆ పెట్టె అలా నదిలో తేలుతూ పోతూ ఉంటే, ఒకసూతుడు దానిని చూసాడు. పెట్టెను ఒడ్డుకు తీసుకొని వచ్చి తెరిచాడు. పెట్టెలో బంగారము, రత్నములు, మణులతో సహా బిడ్డ కనిపించాడు. వెంటనే ఆ బిడ్డను తీసుకొని వెళ్లి తన భార్య రాధకు ఇచ్చాడు, రాధ ఎంతో సంతోషించింది. బంగారము, మణులతో దొర్కడం వల్ల ఆ బిడ్డకు “వసుషేణుడు” అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

కామెంట్‌లు లేవు: