21, సెప్టెంబర్ 2020, సోమవారం

**సౌందర్య లహరి**

 **దశిక రాము**




**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఆరవ శ్లోకం - మొదటి భాగం


ధనుఃపౌష్పం మౌర్వీ మధుకర మయీ పంచవిశిఖాః

వసంతస్సామంతో మలయమరుదాయోధన రథః

తథాऽప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపికృపాం

అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే!!


ఈ శ్లోకం పూర్తిగా మన్మథునికై కేటాయించబడింది. ద్వైత ప్రపంచం అద్వైత స్థితి నుండి కామం కారణంగా జనిస్తోంది. ఆ ద్వైత ప్రపంచం మళ్ళీ అంబిక దయ చేతనే అద్వైతమవుతోంది. ఈ లీలలో అంబికదే ప్రధానపాత్ర. కామం యొక్క మూర్తిత్వమయిన మన్మథునికి ఇక్కడ ప్రాముఖ్యత ఉన్నది. మన్మథునకు కాముడని పేరు. అంబికకు కూడా కామేశ్వరి, కామాక్షి అన్న పేర్లున్నాయి. 


ఏ మాత్రమూ పటుత్వంలేని ఆయుధాలతో మన్మథుడు ప్రపంచాన్నతటినీ జయిస్తాడు. ఆయనకంతటి శక్తినిచ్చేదేమిటి? అమ్మక్రీగంటిచూపు, ఇదీ ఈ శ్లోక భావం.


ఈ మన్మథుని ఆయుధాలేవి? మొదటిది “ధనుః పౌష్పం”- పూలతో చేయబడిన విల్లు. మన్మథుడసలు యుద్ధానికెందుకు వెళతాడు? ఈ ప్రపంచంలో జీవజాలాన్నతటినీ జయించి వానిని కామవశులను చెయ్యాలని రథమెక్కి విల్లు బాణాలు. చేబూని మిత్రులతోనూ, అనుచరులతోనూ బయలుదేరతాడట. ఈ రథమేమిటో తెలుసుకొంటే మనకు వింత తోస్తుంది.


సరి! మన్మథుని విల్లు చెరుకుగడ అనికదా ప్రసిద్ధి. యోద్ధలందరికి ఇనుముతో చేసిన విల్లులుంటాయి. ఈయనది చెఱుకు విల్లు. గట్టిగా వంచితే విరిగిపోతుంది. అయితే ఆచార్యులవారు అయనది ఇంకా సున్నితమైన పూలవిల్లు అంటున్నారు. ఇనుముతో ఘనంగా లేకపోయినా చెఱుకుగడతో కొడితే తలైనా పగులుతుంది. మరీ ఈ పూలవిల్లుతో ఏమి ప్రయోజనం?


ఆచార్యులవారు ఈ విధంగా మన్మథుని విల్లుని మార్చివేయడం న్యాయంగా ఉందా? ప్రతిదేవతకు ఆయుధాలు వారి అలంకరణలో భాగంగా ఉంటాయి. పూజలోనో హోమంలోనో సాంగంగా సాయుధంగా దేవతను ఆహ్వానిస్తాం కదా! మొదట్లో నెను “పౌండ్రం” అనేమాట పొరపాటున్ “పౌష్పం”గా వ్రాయబడిందా అనుకున్నాను. పుండ్రేక్షు అనేపదం పౌండ్రంగా వ్యవహరించబడి ఉండవచ్చు కదా! కానీ అమరకోశంలో మన్మథుని పేర్లలో “పుష్పధన్వా రతిపతిర్మకరధ్వజ ఆత్మభౌ” అని చెప్పబడ్డాయి. పుష్పధన్వా అన్నమాటని ఆచార్యులవారు ధనుఃపౌష్పం అని వాడారు. చెఱుకువిల్లు ఊసేలేదు.


సుబ్రహ్మణ్యునకు రెండు నెమలి వాహనాలున్నాయి. ఒకటి చిన్నతనం నుండి ఆయన ఉపయోగిస్తూ ఉన్నది. సూరపద్ముణ్ణి ఖండించి అతనినొక నెమలిగా చేసి వాహనంగా ఉపయోగిస్తున్నాడు. కొన్ని దేవాలయాలలో ఎడమవైపు తల, కుడివైపు పించ్ఛమున్న నెమలి వాహనంగా కనిపిస్తుంది. అతడు సూరపద్ముడు. చాలా గుళ్ళలో కుడివైపు తల ఎడమవైపు పుచ్ఛమున్న నెమళ్ళే ఉంటాయి. అది దేవతా నెమలి. మొదటనుండి ఉన్న వాహనం. ఆ రకంగా మన్మథునికి కూడా రెండు ధనస్సులున్నాయనుకుంటాను. 


ఆయన బాణములు కూడా పూలే! అమరకోశంలో ఆయనకు “కుసుమేషుడు” అన్న పేరు కూడా ఉంది. పూలు బాణములుగా కలవాడని అర్థం. ఈ శ్లోకంలో “పంచవిశిఖా” అని మాత్రం చెప్పబడింది. అంటే అయిదు బాణాలు అర్థం. ఈ బాణాలు ఏ పదార్థంతో చేయబడినవో చెప్పబడలేదు. యోధులు తమ అమ్ములపొదిలో అనేక బాణాలు కలిగి ఉంటారు. మన్మథునికి మాత్రం అయిదే బాణాలు. అవి కూడా కోమలమైన కుసుమాలు. ఆ అయిదు పుష్పాలు – అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం.


గట్టితనమే లేని విల్లు. అయిదే బాణాలు. మనం సామాన్యంగా ఏదైనా వస్తువు బాణంలా చొచ్చుకొనిపోతుంది అంటాం. ఈ మన్మథుని బాణాలు వ్యతిరిక్తమైన స్వభావంగలవి. అవి గుచ్చుకోవడం మాట అలా ఉంచి వాటిని చూడగానే మన శరీరంలో అతి సున్నిత భాగమైన కనులకు ఒత్తుకోవాలనిపిస్తుంది. “మౌర్వీ మధుకరమయీ” ఇక అల్లెతాడు తేనెటీగలతో చేయబడినదట. తేనెటీగలు భయంకలిగించే మాటవాస్తవమే. అవి కుడితే చాలాసేపు నొప్పి ఉంటుంది. అయితే వాటిని ఆయన బాణాలుగా ఉపయోగించలేదు. అలా చేస్తే అసలు విల్లేలా ఎక్కుపెడతాడు? మరెందుకున్నాయి ? ఆయన దగ్గరున్న పూలవిల్లుకి, పూలబాణాలకు ఆకర్షితమై వచ్చాయన్నమాట. ఆనందంతో ఝంకారం చేస్తున్నయి.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: