21, సెప్టెంబర్ 2020, సోమవారం

రామాయణ విందుభోజనం

 

...

మరల ఇదేల రామాయణమ్ ? అని జనం ప్రశ్నించారు విశ్వనాధ వారిని ! లోకంలో ఇప్పటికే వందలకొద్దీ రామాయణాలు పుట్టుకొచ్చాయి మళ్ళా నువ్వు రాయకపోతే ఏం ? అన్నట్లుగా అడిగారు ఆయన్ని ! 

.

జనం ఎప్పటినుండో అనగా కోట్ల సంవత్సరాలనుండీ అన్నమే తింటున్నారు ! మళ్ళా ఇప్పుడు కూడా అన్నమే ఎందుకు తినాలి ? అని ఎదురు ప్రశ్నించారాయన !

.

నిజమే కదా ! రోజూ తినే అన్నమే మరలమరల తింటున్నాము కదా విసుగు పుట్టడం లేదు కదా ! 

.

మన శరీరాన్ని కాపాడుకోవడం కోసం అన్నం తింటాం 

అలాగే మన సమాజాన్ని కాపాడుకోవడం కోసం రామాయణం వింటాం !

.

అన్నం రుచిచూసేది నాలుక 

రామనామామృత రుచి తెలిసేది చెవులకు ,మనస్సుకు,మన మేధస్సుకు ! 

.

ఒక్కొక్కరి రుచి ఒక్కొక్కరిది !

.

ఒక్కొక్క వంటవాడు ఒక్కో విధంగా వంటలు చేస్తాడు . వండించుకునే వాడి స్థాయిని బట్టి విందుభోజనంలోకి పదార్ధాలు తయారు అవుతాయి ! 

.

సాహితీసంపదలో విశ్వనాధవారు అపర కుబేరుడు ! ఆయన ఇచ్చే సాహితీ విందుభోజనానికి సాటి వచ్చేది ఎక్కడా దొరకదు ! 

.

మరి నేను కూడా విందు ఇవ్వాలి అనుకుంటున్నాను ,కానీ నేను కడు పేదవాడిని నా శక్తికొలదీ విందుభోజనం పెడుతున్నాను ! 

.

అసలు అంతకు ముందు రామాయణం విందు ఇచ్చిన అందరికంటే నా శక్తి చాలా తక్కువ ! 

.

ఏదైనా లోపముంటే అది నాది ! 

.

ఎప్పుడూ విందుభోజనం మాత్రం పెట్టే శక్తిని ఇవ్వమని ఆ శ్రీరామచంద్రపరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ !


****************************************


రామాయణమ్.88

..

భరతుడిని తీసుకురావటానికి బయలుదేరిన దూతలు అతి వేగంగా ప్రయాణం చేస్తున్నారు. వారు ముందుగా అపరతాల పర్వత దక్షిణభాగం దాటారు . 

.

ఆ తరువాత అపరతాల ,ప్రలంబ పర్వతాల మధ్య ప్రవహించే మాలినీ నది వెంట ఉత్తరంగా ప్రయాణం చేసి మరల పడమరవైపు తిరిగారు. 

.

వారు అలా హస్తినాపురం చేరి అక్కడ గంగ దాటి మరల పడమరగా ప్రయాణం చేసి కురుజాంగల మధ్యదేశము మీదుగా పాంచాలము చేరి అక్కడ నుండి ప్రయాణం చేసి శరదండా నదిని దాటి ఇంకా వేగంగా ప్రయాణం చేశారు.ఆ నదీ తీరం మీదున్న సత్యొపయాచన అనే దివ్యవృక్షానికి ప్రదక్షిణము చేసి కులింగా నది దాటారు. 

.

ఎక్కడా ఆగటంలేదు ,అలసట లక్ష్యపెట్టకుండా అక్కడనుండి అభికాల అనే గ్రామం చేరి అక్కడ ఇక్షుమతీ నదిని దాటి ,అక్కడ నుండి బాహ్లికదేశం మీదుగా సుదామ పర్వతం చేరారు.అక్కడ నుండి ఇంకా వేగంగా ప్రయాణించి నాల్గవ రోజు రాత్రికి కేకెయ రాజధాని గిరివ్రజపురం చేరారు.

.

ఆ రాత్రి నిదురించిన భరతుడికి తెల్లవారుఝామున ఒక పీడకల వచ్చింది .వెంటనే లేచి కూర్చున్న ఆయన మనసులో చాలా దుఃఖించి పరితపించసాగాడు.

.

ఆయన పరితాపము గ్రహించిన స్నేహితులు ఆయనకు రకరకాల కధలు చెపుతూ మనసులో కలిగిన ఆ ఖేదాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.అయినా ఆయన మనస్సెందుకో కుదుటపడటంలేదు. అప్పుడు ఉండబట్టలేక కొందరు మిత్రులు కారణమడిగారు. అందుకు ఆయన తనకు వచ్చిన కల ఎట్లాంటిదో చెప్పాడు.

.

నా తండ్రి మట్టికొట్టుకుపోయిన శరీరంతో జుట్టు విరబోసుకుని పర్వతశిఖరము మీదనుండి ఆవుపేడ తో నిండిన గోతిలో పడిపోయినట్లు అందులోనే మునిగితేలుతూ మాటిమాటికీ పిచ్చివాని వలే నవ్వుతూ దోసిళ్ళతో నూనె తాగుతున్నట్లగా ఉండి నువ్వులు కలిపిన అన్నం తింటూ మాటిమాటికీ తల వాలుస్తూ నూనెలో మునిగిపోయినాడు.

.

నా తండ్రి ఎర్రటి మాలలు ధరించినట్లుగా ఎర్రటి గంధము వంటికి పూసుకొన్నట్లుగా గాడిద నెక్కి దక్షిణదిక్కుగా ఒక రాక్షసి లాక్కొని పోతున్నట్లగా కనపడినాడు.

.

ఇంకా సంద్రము ఎండిపోయినట్లు,చంద్రుడు ఆకాశంనుండి రాలి పడిపోయినట్లు,భద్రగజముల దంతములు విరిగిపోయినట్లు,మండే మండే అగ్ని హఠాత్తుగా ఆరిపోయినట్లు ,భూమి బ్రద్దలైనట్లు భూమి అంతా పొగ ఆవరించి చెట్లు ఎండిపోయినట్లు కనపడ్డది.

.

ఏమో మా అయిదుగురిలో ఎవరో ఒకరికి మరణము సంభవించవచ్చునేమో ! నా గొంతు ఎండిపోతున్నది ఏదో తెలియని భయం మనస్సును పట్టి పీడిస్తున్నది అని భరతుడు తన స్నేహితులతో పలుకుతూ ఉండగనే అయోధ్య నుండి వచ్చిన దూతలు సభలో ప్రవేశించారు.


రామాయణమ్..89

...

అయోధ్య నుండి వచ్చిన దూతలు కేకయ రాజు అశ్వపతికి,యువరాజు యుధాజిత్తునకు నమస్కరించి నిలుచొని ,భరతుని వంక చూసి మన రాజపురోహితులు,మంత్రులు నిన్ను శీఘ్రముగా తిరిగి రమ్మని కోరినారు .నీతో చాలా తొందరపని ఉన్నదట! అని పలికి వారు తెచ్చిన విలువైన కానుకలను భరతుడి ద్వారా కేకెయ రాజుకు అందించారు.

.

అప్పటికే తనకు వచ్చిన కలతో దిగులుగా ఉన్న భరతుడు వారి నుద్దేశించి , మా తండ్రిగారు క్షేమమేనా ? మా రాముడు ,మహాత్ముడైన లక్ష్మణుడు వీరికి కుశలమే కదా?

.

పూజ్యురాలు ధర్మమునందే ఆసక్తిగలదీ ,ధర్మము నెరిగినదీ ,ధర్మమునే చూచేటటువంటిది ధీమంతుడైన రాముని తల్లి కౌసల్యామాత క్షేమమే కదా!

.

ధర్మములు తెలిసినది,లక్ష్మణ,శత్రుఘ్నుల కన్నతల్లి,మా మధ్యమాంబ సుమిత్రామాత కుశలమే కదా!.

.

తన సుఖమునే కోరుకునేది (ఆత్మ కామా),ఎల్లప్పుడూ తీవ్రముగా ప్రవర్తించేదీ( సదా చణ్డీ), కోపస్వభావము కలదీ (క్రోధనా),తానే బుద్ధిమంతురాలు అనే గర్వము కలది(ప్రాజ్ఞమానినీ) ,అయిన నా తల్లి కైక ఏ రోగము లేకుండా ఉన్నది కదా ఆవిడకు కుశలమే కదా ! 

.

భరతుడు పలికిన మాటలు విన్న దూతలు ! ఓ నరశ్రేష్ఢా నీవు ఎవరి క్షేమము కోరుచున్నావో వారందరూ క్షేమమే నిన్ను ఐశ్వర్యము,లక్ష్మి వరించుచున్నవి శీఘ్రముగా రధముపై కూర్చొని ప్రయాణించవయ్యా! .

.

వీరి మాటలు విన్న భరతుడు తాతగారి వైపు తిరిగి నన్ను దూతలు తొందరపెడుతున్నారు మరల మీరెప్పుడు రమ్మనమనిన అప్పుడు వస్తాను అని శెలవు తీసుకొని ఆయన ఇచ్చిన కానుకలు స్వీకరించి వాటిని నెమ్మదిగా వెనుక తీసుకు రమ్మని చెప్పి తాను శత్రుఘ్నునితో కలిసి బయలుదేరి ఏడవ నాటికి అయోధ్యా నగర పొలిమేరలకు చేరుకున్నాడు.

.

ఎప్పుడూ సందడిగా కావ్యగోష్ఠులు,గీత వాయిద్యాలతో,భేరీ మృదంగ,వీణాధ్వనితో, నృత్యప్రదర్శనలతో కోలాహలంగా ఉండే అయోధ్య ఏ విధమైన జన సంచారములేని వీధులతో శ్మశాన నిశ్శబ్దంతో అడుగుపెట్టగానే వళ్ళు గగుర్పొడిచే వాతావరణంతో కనపడ్డది భరతుడికి.ఆనందశూన్య అయోధ్య ఆయనకు గోచరమయ్యింది. ఆయన మనసు ఈ వారంరోజులూ కీడు శంకిస్తూనే ఉన్నది ఈ వాతావరణం చూడగనే అది బలపడ్డది. 

‌.

తన రధ సారధితో ,సారధీ రాజు మరణించినప్పుడు ఏ వాతావరణం ఉంటుందో అది నాకు కనపడుతున్నది. అయోధ్యలోని భవనములన్నీ కళావిహీనము,శోభావిహీనమై కనపడుతున్నాయి.

.

దేవాలయాలలో నిత్యపూజలు జరుగుతున్నట్లుగా లేదు మాలికల శోభలేదు. అయోధ్య అంతా ఒక నిశ్శబ్దం ఆవరించి ఉన్నది ఇది నేనెరిగిన అయోధ్యకాదు ! అని అనుకుంటూ సంతోష హీనుడై తండ్రిగృహంలో ప్రవేశించాడు.

.

తనను చూడగనే ఎదురు వచ్చి దుమ్మకొట్టుకు పోయిఉన్నాసరే తన శరీరాన్ని ప్రేమతో నిమిరి తన శిరస్సు వాసన చూసి గాఢంగా కౌగలించుకొనే ప్రేమమూర్తి తన తండ్రి అచటలేడు!

.

తన తల్లి ఇంట్లో ఉన్నాడేమో అని కైక ఇంట అడుగు పెట్టాడు.

.

కొడుకును చూడగనే ఎగిరి గంతేసి ఆసనమునుండి లేచింది కైక.

.

NB

.

మహర్షి వాల్మీకి కైక గురించి వాడిన విశేషణాలు గమనించండి!

.

ఆత్మ కామా : తన సుఖాన్నే కోరుకునేది

.

సదా చణ్డీ : ఎల్లప్పుడూ తీవ్రంగా ప్రవర్తించేది

.

క్రోధనా : ఎప్పుడూ కోపంగా ఉండేది

.

ప్రాజ్ఞమానినీ : తానే బుద్ధిమంతురాలిని అనే గర్వము కలిగినటువంటిది.

.

మనుషుల స్వభావం గూర్చి మహర్షి వాడే విశేషణాలు రామాయణంలో కోకొల్లలు ! వాటిని విశ్లేషిస్తే చాలు ! అపారమైన మానవ మనస్తత్వ శాస్త్రం మనకు కరతలామలకమవుతుంది.

కామెంట్‌లు లేవు: