21, సెప్టెంబర్ 2020, సోమవారం

**శ్రీమద్భాగవతము**

 **దశిక రాము**




 తృతీయ స్కంధం -25


హిరణ్యకశిప,హిరణ్యాక్షులజన్మ 


తన కుమారులు దేవతలను బాధిస్తారని దితి తలపోయసాగింది. నూరు సంవత్సరాలు గడిచాయి. అప్పుడు దితి సకల లోకకంటకులైన కుమారులను కన్నది. ఆ సమయంలో...భూమి కంపించింది. కులపర్వతాలు వణికాయి. సముద్రాలు కలతపడ్డాయి. నక్షత్రాలు నేల రాలాయి. ఆకాశం బ్రద్దలైంది. అష్టదిగ్గజాలు ఊగిపోయాయి. దిక్కులనిండా అగ్నికణాలు ఎగిసిపడ్డాయి. భూమిమీద పిడుగులు పడ్డాయి. హోమగుండాలలోని అగ్నులకు పొగలు క్రమ్మాయి. ఎదురుగాలుగు బలంగా వీచాయి. అంతటా చెట్లు తలక్రిందులుగా విరిగి పడ్డాయి. గ్రహాలు, నక్షత్రాలు వెలవెలబోయాయి. మేఘాలు రక్తవర్షాన్ని కురిపించాయి. దిక్కులలో మెరుపులు మిరుమిట్లు గొలిపాయి. గ్రహణసమయం కాకుండానే రాహువు సూర్యుణ్ణి పట్టుకున్నాడు. చిమ్మచీకట్లు అంతటా వ్యాపించాయి. కుక్కలు మోరలెత్తి మొరిగాయి. పట్టపగలే నక్కలు కూసాయి. పక్షులు బాధతో ధ్వనులు చేశాయి. దేవతావిగ్రహాలు కన్నుల్లో బాష్పబిందువులు కమ్ముకోగా పక్కకు ఒరిగాయి.ఆవులు రక్తాన్నీ చీమును పిదికాయి. గాడిదలు భయంకరంగా ఓండ్రపెట్టాయి. ఏనుగుల గండస్థలాలమీది మదజలం ఎండిపోయింది. గుఱ్ఱాల తోకలు నిప్పులు చెరిగాయి. సహింపరాని తేజస్సుతో దితి కుమారులు పుట్టిన సమయంలో గుహలు ప్రతిధ్వనించాయి. పాపగ్రహాల మైత్రితో పుణ్యగ్రహాలు వక్రమార్గంలో వర్తించాయి. ఆ విధంగా భయంకరంగా తోచిన అపశకునాలను చూసి ప్రళయకాలం వచ్చిందని అనుకున్నారే కాని, క్రూరంగా సాధుజనులను సంహరించే రాక్షసుల పుట్టుక వల్ల సంభవించిన కల్లోలంగా తెలిసికొనక సనకాది యోగులు తప్ప సమస్త ప్రాణికోటి తల్లడిల్లింది. ఆ విధంగా దితికి కుమారులు పుట్టిన తర్వాత...ఆ రాక్షసులు కులపర్వతాలవంటి శరీరాలతో, భయంకరమైన భుజబలంతో ఒప్పుతున్నారు. వారి పాదాల తాకిడికి భూమి చలించిపోతున్నది. రత్నాలు చెక్కిన బంగారు భుజకీర్తులు, మకరకుండలాలు, మొలనూళ్ళు, కంకణాలు, ఉంగరాలు, కిరీటాలు, కాలి అందెలు స్వచ్ఛమైన కాంతులు వెదజల్లుతుండగా తమ శరీరకాంతులతో సూర్యకాంతిని సైతం హీనపరుస్తూ....

ఉన్న సమయంలో కశ్యపుడు తన కుమారులను చూడాలనుకొని దితి మందిరానికి వచ్చి పుత్రులను చూచి, వారికి నామకరణం చేయాలనుకొని....దితి గర్భంలో తాను మొదట పెట్టినట్టి తేజస్సువల్ల పుట్టి అద్భుతంగా వెలిగేవానికి ‘హిరణ్యకశిపుడు’ అనీ, కానుపు సమయంలో దితికి మొదటగా పుట్టి సూర్యతేజస్సుతో వెలిగేవానికి ‘హిరణ్యాక్షుడు’ అని మంచి మనస్సుతో పేర్లు పెట్టి కశ్యపుడు తన ప్రవిత్రమైన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.


 హిరణ్యాక్షుని దిగ్విజయము 


అప్పుడు సాటిలేని తేజస్సుతో విరాజిల్లుతున్న హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని వల్ల వరాలు పొందిన గర్వంతోను, వారింపరాని శత్రువుల ఉక్కడగించే అవక్రపరాక్రమం యొక్క అతిశయంతోను సమస్త లోకపాలకులను జయించి తనవశం చేసుకొని తన కెక్కడా మృత్యుభయం లేక నిర్భయుడై సుఖంగా ఉన్నాడు. అతని సోదరుడైన హిరణ్యాక్షుడు ప్రతిరోజూ మదపుటేనుగు తొండంవంటి తన భుజాదండం మీద గదాదండాన్ని ధరించి తనను ఎదిరించి యుద్ధం చేయగలిగిన శత్రువీరుడు ఎక్కడా కనిపించక భూలోకమంతా తిరిగి స్వర్గంపై దండెత్తి అక్కడ యుద్ధచేయడానికి ఇష్టపడని దేవతలను చూచాడు. హితులు చెలరేగగా, శత్రువులు కలతపడగా అందమైన వైజయంతీమాలను ధరించి, కాలి గండపెండేరాలు మ్రోగుతుండగా, తన దేహకాంతి నాలుగుదిక్కుల్లో పిక్కటిల్లగా వస్తున్న హిరణ్యాక్షుని చూచి దేవతలు బ్రహ్మ వరాన్ని గుర్తుకు తెచ్చుకొని భయపడి గరుత్మంతుని చూచి పారిపోయే పాములవలె తమ మందిరాలను జిల్లేళ్ళకు, ఉమ్మెత్తలకు నివాసాలుగా చేసి ఎక్కడెక్కడికో పారిపోయారు. “పౌరుషం పోగొట్టుకొని, తమ ఆయుధాలను విడిచిపెట్టి దేవతలు భయపడి కర్తవ్యాన్ని విస్మరించి పారిపోయారు కదా” అని సింహగర్జన చేసి మేరుపర్వతం వంటి స్థైర్యం కలిగిన హిరణ్యాక్షుడు గొప్ప భుజబలంతో, విజృంభించిన గర్వాతిశయంతో సముద్రంలో ప్రవేశించాడు. ఈ విధంగా ప్రవేశించగా...వరుణదేవుని సైనికులు హిరణ్యాక్షుని తేజాన్ని తేరిపార చూడలేక, పౌరుషం కోల్పోయి సముద్రం మధ్యభాగంలో ఎక్కడికో పారిపోయారు. 

హిరణ్యాక్షుడు తన నిట్టూర్పులవల్ల పుట్టిన సముద్రకల్లోలాన్ని తన గదాదండంతో దృఢమైన శక్తితో అణచివేశాడు. ఇంకా ఆ పైన ఆ రాక్షసేశ్వరుడు ఆ మహాసముద్రంలోపల శత్రురాజులను చీల్చిచెండాడి అనేక సంవత్సరాలు విహరించాడు. పరిపూర్ణ ప్రభావంతో అక్కడ ఉన్న వరుణుని పట్టణం అయిన ఆ చక్కటి విభావరి నగరానికి వెళ్ళి . . .జలచర సమూహాలకు రాజై పాతాళ లోకాన్ని పాలిస్తున్న వరుణుని చూచి హిరణ్యాక్షుడు పరిహసిస్తూ “ఈ విశ్వంలో సమస్త లోకపాలకులలో పేరెన్నిక గల మహాబలవంతుడవని లోకం నిన్ను పొగడుతున్నది కదా! ఇప్పుడు నీ పౌరుషాన్ని ప్రదర్శిస్తూ యుద్ధంలో నన్ను ఎదిరించి చూడు. నీ బాహుబలాన్ని, పేరు ప్రతిష్ఠలను అణచివేస్తాను” అని పలుకగా విని సముద్రరాజైన వరుణుడు శత్రువుయొక్క విజయాలను, అభివృద్ధిని, శక్తిని, తన బలాన్ని అంచనా వేసికొని ఆ రాక్షసునితో యుద్ధానికి....సమయం కాదనుకొని తన మనస్సులోని కోపాగ్నిని సహనం అనే నీళ్ళతో చల్లార్చుకొంటూ ఆ హిరణ్యాక్షునితో ప్రశాంతవాక్కులతో ఈ విధంగా అన్నాడు. “నేను ప్రశాంతమైన మనస్సుతో యుద్ధం చేయకూడదనే నియమంతో ఉన్నాను. ఇప్పుడు యుద్ధం చేయలేను. నీ భుజబలం యొక్క ఆటోపాన్ని జయింపగల ప్రతివీరులు ఎక్కడా లేరు, ఒక్క విష్ణువు తప్ప. ఆ మహాత్ముడు వైకుంఠంలో ఉన్నాడు. ఎన్నోసార్లు యుద్ధరంగంలో శత్రువులను ఓడించి శక్తి సామర్థ్యాలలో పేరుమోసిన వీరుడని భూజనులంతా పొగడుతారు. వెంటనే ఆ వైకుంఠానికి వెళ్ళు. అప్పుడు ఆ హరి నీతో యుద్ధం చేసి నీ కోరిక తీరుస్తాడు.నిందకు లొంగి యుద్ధరంగంలో నిల్వలేక పారిపోయే పిరికిపందలను వెంటాడడం మగతనమా? బుద్ధిహీనుడా! అందరూ శరణు కోరే గోవిందుడు నీ పని పడతాడు. పోగలిగితే అక్కడికి వెళ్ళు. ఆ హరి ఎప్పుడూ రాక్షసులతో పోరాడుతూ జయిస్తూ ఉంటాడు. అంతేకాక...పురుషోత్తముడూ, మునులు పూజించే పాదపద్మాలు గలవాడూ అయిన విష్ణువు ప్రతియుగంలోనూ పురుషరూపంతో భూమిమీద అవతరించి పరాక్రమవంతులూ దుష్టులూ ఐన రాక్షసులను సంహరిస్తాడు. కనుక ఓ రాక్షసరాజా! కయ్యమో దయ్యమో ఏదో ఆ హరికే చెప్పుకో" అని హేళనగా అంటూ "నీ భుజబలం తరిగి నేల కూలుతావు. కుక్కలు నిన్ను చుట్టుముట్టుతాయి. ఇప్పుడే అక్కడికి వెళ్ళినట్లైతే నీ బలం, సామర్థ్యాలు బయటపడతాయి. తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము” అని వరుణుడు చెప్పగా హిరణ్యాక్షుడు కోపించి, తన మనస్సులో ఏమాత్రం భయం లేనివాడై “ఈరోజే దేవతల మిత్రుడూ, రాక్షసుల శత్రువూ అయిన ఆ జనార్దనుని యుద్ధభూమిలో ఎదిరిస్తాను” అంటూ వైకుంఠ నగర మార్గం పట్టి....వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చి “ఓ రాక్షసరాజా! ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగిన నారదునితో హిరణ్యాక్షుడు ఇలా అన్నాడు. “పద్మనాభుడూ, శ్రీపతీ, అనంతుడూ అయిన హరిని ఎదుర్కొని యుద్ధంలో అతణ్ణి అంతం చేసి మొత్తం రాక్షసజాతికి సంతోషం కలిగించాలనే పట్టుదలతో వైకుంఠం దారి పట్టాను”. ఆ మాట విని నారదుడు ఇలా అన్నాడు. "గొప్ప భుజబలం కల ఆ మహాత్ముడు ఇప్పుడు వైకుంఠంలో లేడు. భూభారాన్ని వహించడానికి ఆదివరాహ రూపాన్ని ధరించి రసాతలంలో ఉన్నాడు. నీవు అక్కడికి వెళ్ళగలిగితే వెళ్ళు. అక్కడ నీకు విష్ణువుకు యుద్ధం తప్పక జరుగుతుంది.”

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: