21, సెప్టెంబర్ 2020, సోమవారం

*ధార్మికగీత - 27*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          

                                        *****

           *శ్లో:- ధనాని భూమౌ, పశవశ్చ గోష్ఠే ౹*

                  *నారీ గృహద్వారి, జనా శ్శ్మశానే ౹*

                  *దేహా శ్చితాయాం, పరలోక మార్గే ౹*

                  *ధర్మానుగో గచ్ఛతి జీవ ఏకః ౹౹*

                                        *****

*భా:- "జాతస్య హి ధృవో మృత్యు:" అంటోంది గీత. పుట్టినవాడు గిట్టక తప్పదు. మరి పరలోకానికి మనతో పాటు వచ్చేవి ఏవి? ఒకింత పరిశీలిద్దాము. 1."ధనము":- మనం గడించిన "డబ్బు, నగలు" బ్యాంకుల్లోను , "స్థలాలు, పొలాలు" , ప్లాట్ లు, ఫ్లాట్ లు భూమిపైన ఉండిపోతాయి. 2. "పశువులు":- గేదెలు, ఆవులు పశువులపాకలోను, "పెంపుడు జంతు జాలాలు" ఇంటి ఆవరణలోను ఉండిపోతాయి. 3 "నారీ":- మూడుముళ్లు, ఏడడుగుల అనుబంధముతో ఏరి, కోరి వచ్చిన "భార్యామణి" గృహము యొక్క సింహద్వారము వద్ద ఆగి, కన్నీటి నివాళి నర్పిస్తుంది.4."బంధువులు":- "హితులు,సన్నిహితులు,ఆప్తులు,ఆత్మీయులు" శ్మశాన వాటిక వరకు వచ్చి, బాధతో కడసారి వీడ్కోలు పలుకుతారు. 5. "దేహము":- ధర్మనిర్వహణకు తొలి ఉపకరణమైన మన " కాయము " చితి మీద పేర్చబడి దహనమవుతుంది. 6."ధర్మము":- ఇక చివరగా మనం చేసుకున్న పాపపుణ్యకర్మఫలసమాహారమైన "ధర్మము" ఒక్కటే జీవాత్మను అనుసరిస్తుంది. ధర్మరాజు చివరిగా స్వర్గానికి వెళ్ళేటప్పుడు, కుక్క రూపంలో అనుసరించింది "ధర్మదేవతే" అని గుర్తించాలి. మనతో ఏవి రావో, వాటికోసం అనుక్షణం తాపత్రయం పడుతుంటాము.మనల్ని వెన్నంటి వచ్చి , రక్షించే "ధర్మం" కోసం ఏ మాత్రం ఆలోచించము. కాన ధర్మకార్యాలకోసం నిరంతరం ఆరాటపడాలి. ఆచరణ చేపట్టాలి. "ధర్మో రక్షతి రక్షితః" . ధర్మాన్ని మనం కాపాడితే, అది మనలను, మన ముందు తరాలవారిని కంటికి రెప్పలా కాపాడుతుంది*.

                                     ***** 

                       *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: