21, సెప్టెంబర్ 2020, సోమవారం

*పురుష సూక్తం*



హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పురుష సూక్తం రుగ్వేదంలోనిది. పద్దెనిమిది మంత్రాల పురుష సూక్తం శుక్ల యజుర్వేద సంహితలోను, అధర్వణ వేద సంహితలోను కనిపిస్తుంది. పురుషుడంటే ఒక్క భగవంతుడే అన్నది శిష్టాచార సంప్రదాయ భావన. ఆయన మహిమను కీర్తించే వైభవోపేత మంత్రరాజం పురుష సూక్తం. అన్ని వైదిక కర్మల్లో, పుణ్య కార్యాల్లో వేదమూర్తులైన విప్రులు ఈ మహిమాన్విత మంత్రాన్ని పఠిస్తారు.


భగవంతుడి గుణరూప వైభవాలను వర్ణించే ఈ సూక్తం ఆయన లోకాలను సృజించడంలో, ప్రపంచాన్ని ఆవిష్కృతం చేయడంలో ఎలా తనను తాను త్యాగం చేసుకున్నాడో తెలియజేస్తుంది. భగవంతుడు వేలాదిగా శిరస్సులు, కన్నులు, పాదాలు గలవాడిగా సూక్తం కీర్తిస్తుంది. వేలాదిగా అనడంలోని అంతరార్థం ఈ భూమిపైన, సమస్త లోకాలలో సమస్త జీవులకు చెందిన కన్నులు, శిరస్సులు, పాదాలని వివరిస్తారు పండితులు. సమస్త ప్రాణులూ భగవదంశేనని, వాటన్నింటిలో ఆయన దాగిఉండి సాక్షీభూతుడిగా అలరారుతున్నాడంటాయి శాస్త్రాలు. ప్రతి ప్రాణీ భగవంతుడి ప్రతిరూపమే అన్నది వేదోక్త భావన. దైవం ప్రాణుల హృదయాకాశంలో పది అంగుళాల పరిమాణంలో ప్రకాశిస్తుంటాడంటుంది సూక్తం. మన కన్నులకు అగుపించే దృశ్య జగత్తులో భగవంతుడు పావు భాగమని, మిగిలిన ముప్పాతిక భాగం ఏ మార్పునకూ లోనుకానిది ఆకాశమని తెలియజేస్తుంది పురుష సూక్తం.


భగవంతుడి నుంచి మనం త్యాగ గుణం నేర్చుకుంటాం. త్యాగం, దానం నుంచి ఆవిర్భవిస్తుంది. విశ్వంలో పరివ్యాప్తమై ఉన్న గాలిని ప్రాణవాయువుగా స్వీకరించి ప్రాణులు బొగ్గుపులుసు వాయువును విసర్జిస్తాయి. ఆహారంగా అన్నాన్ని తిని మలం విసర్జిస్తాయి. నీటితో దాహం తీర్చుకొని మూత్ర రూపంలో విడిచి పెడతాయి. అలా విడిచి పెట్టడంలో దేహావసరాలు తీరి ఆనందం లభ్యమవుతుంది. త్యాగం వల్ల అమృత సమానమైన మనసు మనిషికి సిద్ధిస్తుంది.


వ్యక్త ప్రపంచంలో గాలి, నీరు, ఇతర భూతాలతోపాటు సర్వమూ భగవంతుడే! తనను తాను ప్రాణులకు ఆహారంగా మలచుకొని పెంచి, పోషించేదీ అతడే అన్నది పురుషసూక్త భాష్యం. అన్న రూపం ధరించి దైవం జీవుల ఆకలి తీరుస్తాడు గనుక అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భాసిస్తుంది. ఈ సమస్త క్రతువు యజ్ఞరూపంగా ప్రకాశిస్తుంది. సూర్య చంద్రుల ఆగమనం, నిష్క్రమణ, రుతువుల మార్పు, ప్రాణుల చావు పుట్టుకలు... ఓ చక్ర భ్రమణంలా జరుగుతాయి.


సమస్త జీవ నిర్జీవ పదార్థాలలోనూ దైవం ప్రవేశించి పరివ్యాప్తమై ఉన్నాడంటుంది పురుషసూక్త మంత్రం.


జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, నాలుగు అంతఃకరణాలు వీటితోపాటు 21 తత్త్వాలు ప్రాణుల లోపలి ప్రకృతిని నిర్మిస్తాయి. బ్రహ్మాండాలకు అధినాయకుడైన పరబ్రహ్మమే జరుగుతుండే లోకయజ్ఞానికి సమిధలుగా, బలిపశువుగా, యజ్ఞాన్ని నిర్వహించే రుషులుగా, యజ్ఞ మంత్రాలుగా, సమస్తంగా అలరారుతున్నాడంటాయి పురుషసూక్త మంత్రాలు.


అన్ని విధాలుగా ప్రాణుల ఉనికికి కారకుడై, మనసున్న మనిషి మాత్రమే తెలుసుకోగల భగవంతుడికి మనిషి అర్పించగల కృతజ్ఞత- ఆయనను తెలుసుకొని ఆరాధించడమే. అలా తెలుసుకున్న నాడు మనిషి భవబంధాల చెరనుంచి విముక్తుడవుతాడు. దైవం త్యాగగుణాన్ని పట్టుకొని జీవజగత్తు అంతటికీ మానవుడు సేవాగుణంతో రక్షకుడుగా వ్యవహరించవలసి ఉంది. సమస్త ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కోసం హృదయ పూర్వకంగా తన వంతు కృషి చేయడం మనిషి నిజమైన దైవారాధన అవుతుందంటారు పెద్దలు. అదే మానవుడు భగవంతుడికి అర్పించగల అసలైన నీరాజనం, కైమోడ్పు!

కామెంట్‌లు లేవు: