21, సెప్టెంబర్ 2020, సోమవారం

పోత‌న త‌ల‌పులో...59

 


ద్వారకాపుర పౌరులు కృష్ణ‌య్య‌కు స్వాగ‌తం ప‌లికి, కానుకలు సమర్పించి ఇలా అంటున్నారు....

"నీపాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా, నీ సేవ సంసార సం

తాపధ్వంసినియౌఁ గదా, సకలభద్రశ్రేణులం బ్రీతితో

నాపాదింతు గదా ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని

ర్వ్యాపారంబు గదయ్య చాలరు నినున్ వర్ణింప బ్రహ్మాదులున్.

  ****

స్వామీ! నీ పాదపద్మాలు బ్రహ్మపూజ్యాలు; నీ చరణ సేవ, సంతాపమయ మైన సంసార సముద్రాన్ని దాటించే నావ; నీవు ఆశ్రితులకు సకలసౌభాగ్యాలను సంతోషంగా ప్రసాదించే కరుణామూర్తివి; కాలస్వరూపుడవు; కాలానికి అధీశ్వరుడవు; బ్రహ్మాది దేవతలు కూడా నీ లీల‌లు వ‌ర్ణింప‌లేరు గ‌దా స్వామీ...

       **

 ఉన్నారము సౌఖ్యంబున,

విన్నారము నీ ప్రతాప విక్రమకథలన్,

మన్నారము ధనికులమై,

కన్నారము తావకాంఘ్రికమలములు హరీ!.

      **

కృష్ణయ్యా! నీ దయవల్ల మేమంతా సుఖంగా ఉన్నాం. నీ శౌర్యప్రతాపాల గురించిన విశేషాలు వింటున్నాం, సంతోషిస్తున్నాం. మాకు ఇన్నాళ్ళకి మళ్ళా నీ పాదపద్మాల దర్శనం అయింది. భాగ్యవంతులమై విలసిల్లుతున్నాం.

 **

ఆరాటము మది నెఱుఁగము,

పోరాటము లిండ్లకడలఁ బుట్టవు, పురిలోఁ

జోరాటన మెగయదు, నీ

దూరాటన మోర్వలేము తోయజనేత్రా!

కమలాల వంటి కన్నులున్న కన్నయ్య! మా మనసులలో ఆరాటా లన్నవి లేవు. ఇళ్ళల్లో కలహా లన్నవి లేవు. నగరంలో చోర భయాలు లేనే లేవు. అయినా కూడ నీవు దూరప్రాంతాలకు వెళ్ళి నప్పుడు నీ వియోగాన్ని సహించలేమయ్యా. అని కృష్ణ‌య్య‌ను త‌నివితీరా చూస్తూ వేనోళ్ల కొనియాడుతున్నారు.


   🏵️పోత‌న ప‌ద్యం🏵️

🏵️శ్రీకృష్ణ లీలామృతం🏵️

కామెంట్‌లు లేవు: