**దశిక రాము**
**ఆది శంకరాచార్యుల వారి**
63 జగద్విలక్షణం బ్రహ్మ
బ్రహ్మణో 2 న్యన్న కించన
బ్రహ్మాన్యద్భాతి చేన్మిథ్యా
యథా మరుమరీచికా || 63
ú‡Áx¤¦¦¦ø = బ్రహ్మం, జగత్=ప్రపంచానికి, విలక్షణం = సామాన్యలక్షణాలతో పరిశీలించటానికి వీలుకానిది, బ్రహ్మణః = బ్రహ్మానికి, అన్యత్=వేరుగా, కించన=కొద్దిగా కూడా ఏమీ, న=లేదు, బ్రహ్మాన్యత్=బ్రహ్మానికి వేరుగా, భాతి=గోచరించేది, చేత్=అయినట్లయితే, మరు మరీచికా=ఎండమావిలో నీరు, యథా=వలె, మిథ్యా=అసత్యమైంది.
తా|| బ్రహ్మాన్ని ప్రపంచంలో ఉన్న సామాన్య లక్షణాలతో పరిశీలించటానికి వీలుకాకుండా విలక్షణంగా ఉంది. బ్రహ్మం స్పర్శలేకుండా ఈ ప్రపంచంలో ఏదీ లేదు. బ్రహ్మాని కంటే వేరుగా ఈ ప్రపంచంలో ఏదైనా గోచరించినట్లయితే అది ఎండమావిలో నీటి వలె అసత్యమైందే!
వివరణ :- జగత్స్పర్శ తగలకుండా బ్రహ్మం తానుగా ఉందా? బ్రహ్మ స్పర్శ తగలకుండా ప్రపంచం తానుగా ఉందా? అంటే రెండూ కూడా ఒకదానితో ఒకటి కూడి ఉన్నట్లుగా ఉన్నాయి. బ్రహ్మానికి దేనితోనూ సంబంధం లేకుండా ఏదీ అంటకుండా ఉంటుంది కాని బ్రహ్మం అంటకుండా ఈ భూలోకంలో ఏ వస్తువూలేదు. నామ, రూప, వస్తు భేదాలతో రకరకాలుగా కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా స్వశక్తితో కూడి ఉంది అని భావిస్తే అది ఎండమావిలో నీరు ఎట్లా లేదో అట్లాగే ఈ లోకంలో కనిపించే వాటన్నిటిలో స్వతస్సిద్ధంగా శక్తి అనేది దేనికీ కూడా లేదు. లోకంలో చూసే వన్నీ భ్రమ చేత, దృష్టి భేదం చేత బహునామరూపాలుగా దృశ్యమానమవుతున్నాయే కాని మరొకటి కాదు. సాధకునికి భ్రమ తొలగగానే, సాధనలో విక్షేపాలు తొలగి బ్రహ్మం అనంతమైన బ్రహ్మంగా అనుభూతిని ఇస్తుంది. అందువల్లబ్రహ్మం కంటే అన్యంగా ఈ భూప్రపంచంలో ఇంకొక వస్తువేదీ లేదు. అన్నీ బ్రహ్మంతోనే కూడి ఉన్నాయి. కావున తేలిన సారాంశం ఏమిటంటే ''సర్వం ఖల్విదం బ్రహ్మ'' అంటే సర్వమూ బ్రహ్మమే. బ్రహ్మం కానిది ఏదీ లేదు. అయినా ఇంద్రియాలకు, మనస్సుకు, బ్రహ్మం గోచరంకావటం లేదు. శరీరం, మనస్సు, ఇంద్రియాలు అన్నీకూడా సాధనలో ఆత్మలో లీనమయినప్పుడే ఆత్మానుభూతి ఆత్మానందం కలుగుతున్నాయి. అందువల్లనే బ్రహ్మాన్ని ఎవరూ తెలుసుకోలేరని, ఎవరైనా నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నాను అంటే అది వట్టి అబద్ధమే అవుతుంది అని భాగవతి రామమోహనరావుగారు ఆత్మబోధలో చెప్పారు. ఈ ప్రపంచంలో చూస్తూ తెలుసుకొంటున్న వాటి తెలివి కంటే ఆ బ్రహ్మం నిశ్చయంగా విలక్షణమైంది. అంతేకాకుండా తెలియబడకుండా, అవ్యక్తంగా ఉండే దాని కంటే కూడా ఆ బ్రహ్మం అతీతమైంది అని కేనోపనిషత్తు వివరించింది. కాన బ్రహ్మం ప్రపంచంలో ఉన్న సామాన్య లక్షణాలతో పరిశీలించటానికి వీలయింది కాదు. బ్రహ్మాన్ని సామాన్య లక్షణాలతో చూశానని చెబితే ఎండమావిలో నీటిని తాగానని చెప్పినట్లే అవుతుంది. అది భ్రాంతి జనితమే కాని మరొకటి కాదు. ఈ భ్రాంతికి లోకంలో మరు మరీచికా భ్రాంతి-ఎండమావిని చూసి నీరనుకోవటం, శుక్త రజత భ్రాంతి-ముత్యపు చిప్పను చూసి వెండి అనుకోవటం, స్థాణుపురుషభ్రాంతి-చెట్టుమోడును చూసి మనిషి అనుకోవటం, సర్పరజ్జు భ్రాంతి-తాడును చూసి పామనుకోవటం వంటి వాటిని ఉదాహరిస్తుంటారు.
ఎడారిలో నీరు లభించదు కదా? ఒయాసిస్సును విని ఉండటం వల్ల ఎండలో కాంతి కిరణాలు నీటి చాలులా భ్రమకొల్పటం వల్ల దాహార్తిని పొందిన మానవుడు దానిని నీరని భ్రమపడి దానివెంటపడి పరుగుతీసి ఇంకా ఎక్కువగా అలసిపోయి, చివరికి సూర్యరశ్మిలో కనిపించిన నీటి భ్రమను గ్రహించుకొంటాడు. అదే విధంగా ఈ ప్రపంచంలో ఆనందంగా భావించే వాటి వెంట పడి అలసిపోయిన మానవుడు, ఇవి అన్నీ భ్రమలే అని తెలుసుకొని, నిజమైన ఆనందంకోసం గురువును ఆశ్రయించి బ్రహ్మానందాన్ని లోపలే అనుభవించగలుగుతాడు.
బ్రహ్మానందం బయట వెతికితే దొరకదని, బయట దొరికేది ద్వైతమేనని, లోపలికి ఇంద్రియాలను మరలించి భగవంతుని చేరినప్పుడే అద్వైతానందం లభిస్తుందని, అజ్ఞానం నుంచి జ్ఞానానికి మళ్ళిన తర్వాత మాత్రమే మానవుడు తెలుసుకోగలుగుతున్నాడు. దీనినే పరమ భక్తుడైన ఆంజనేయుడు రామునితో చక్కగా వివరించాడు అని గురుమహారాజ్‌జీ చెపుతూ ఉంటారు. ''(1) ప్రభూ నేను శరీర తాదాత్మ్యంతో ఉన్నప్పుడు నీదాసుణ్ణి (2) మనో బుద్ధులతో తాదాత్మ్యం చెంది జీవుడుగా జీవించినప్పుడు నేను నీలో ఒక భాగాన్ని (3) నా స్వరూపంలో నిలిచినప్పుడు నీవే నేను'' అని తన తాదాత్మ్యాన్ని మూడు విధాలుగా విభజించాడు ఆంజనేయుడు (1) శరీర స్థాయినుంచి చూసినప్పుడు దాసుడయ్యాడు. (2) మానసిక స్థాయినుంచి చూసినప్పుడు భగవంతునిలో ఒక భాగం అయ్యాడు (3) ఆత్మ స్థాయి నుంచి చూసినప్పుడు బ్రహ్మంగా రూపొందాడు. సాధకుడైనా కూడా (1) తాను వాతావరణాన్ని తట్టుకోలేనప్పుడు, బాధల్ని భరించలేనప్పుడు ద్వైతంగా జీవిస్తాడు. భగవంతుడికి భక్తుడిగానే భావిస్తూ, ప్రార్థిస్తూ రక్షించమని దాసుడుగానే వేడుకొంటాడు (2) సాధకుడు ఏదైనా కార్యాన్ని, కవిత్వాన్ని జ్ఞాన తత్త్వాన్ని స్వయంగా సాధించినట్లు భావించినప్పుడు తన శక్తిని, తన వివేకాన్ని తలచుకొని ఉప్పొంగిపోయి తనను భగవంతునిలో ఒక భాగంగా భావిస్తాడు. (3) సాథకుడు సాధనలో శాంతి సౌఖ్యాలను పొంది, ఆత్మానందంతో జీవిస్తూ గడుపుతున్నప్పుడు తానే పరమాత్మనని, తానే బ్రహ్మాన్నని బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. కావున సాధకుడు ద్వైత భావన నుండి విశిష్టాద్వైతానికి విశిష్టాద్వైతం నుండి అద్వైతానికి చేరుతూ అద్వైత భావంతో జీవించగలుగుతాడు. అద్వైత భావంతో లోక కార్యాల్లో జీవిస్తూ సాక్షి మాత్రంగా జీవనాన్ని కొనసాగిస్తూ, మనస్సుకూ, శరీరానికీ కలిగే కోరికలు మొదలైనవన్నీ తనవికావని, అవి వాటి వాసనా ఫలితంగా అవి అనుభవిస్తున్నాయని భావిస్తూ బ్రహ్మంగా జీవించగలుగుతాడు. అప్పుడు జీవుడే పరబ్రహ్మ స్వరూపంగా జీవించగలుగుతాడు.
(1) గురుమహారాజ్‌జీ శిష్యులైన ప్రేమీలు, మహాత్మాలు సంఘ సభ్యులందరికీ లేక జిజ్ఞాసువులకు సేవ చేస్తున్నప్పుడు ద్వైతభావంతోనే వారి సేవ కొనసాగుతుంది. అయినప్పటికీ వారందరూ భగవంతుని భక్తులే అనే భావనతో కూడి దాసులుగా సేవచేయటం వల్ల సేవాభావంలో తాదాత్మ్యం చెంది వారు ఆనందించటం జరుగుతుంది. (2) గురుకార్యాలను కాని, జిజ్ఞాసువుల కార్యాలను కాని తమ నేర్పుతో నెరవేరుస్తున్నామని వారికి భావన కలిగినప్పుడు ప్రేమీలు, మహాత్మాలు విశిష్టాద్వైతంతో భావంతో గడుపుతుండటం కనిపిస్తుంటుంది. (3) ప్రేమీలు, మహాత్మాలు సాధనలో పొందిన అద్వైత భావాన్ని బయటలోకంలో జీవిస్తున్నప్పుడు కూడా మౌనంగా అనుభవించగలిగినప్పుడు అద్వైతానుభూతితో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ బ్రహ్మంగా జీవించగలుగుతారు. కాని అది దీర్ఘకాలం వారిలో నిలవటం లేదు. దానిని శాశ్వతంగా నిలిచేటట్లు నిరంతరం సాధన చేయగలిగిన నాడు సర్వం బ్రహ్మంగా నిరంతరం దర్శనభాగ్యం పొందగలుగుతారు. జీవన విధానం మూడుగా కనిపిస్తున్నా సాధకుడు అద్వైతమే సచ్చిదానంద నిలయమని తెలిసి జీవించాలి - దాన్నే ప్రబోధించాలి.
సాధకుడు జీవన విధానంలో భగవంతుని నాటకరంగంలో తాను కూడా ఒక పాత్రనే కాని మరొకటి కాదు అని, ఫలితం కూడా నాది కాదు అని, నాకు వచ్చిన ఆలోచన - చేసిన పని - వచ్చిన ఫలితం అన్నీ ఆ భగవంతునివే అని భావన చేయగలిగిననాడు, అన్నీ ఆ పరబ్రహ్మానికి ఆత్మార్పణ చేసుకొన్ననాడు ఇక సాధకునిలో తనదీ అని చెప్పుకోదగింది ఏదీ మిగలకుండా పోతుంది. కనుక సాధకుడు బ్రహ్మంగా రూపొందగలుగుతాడు. సాధకుడు నిలబడినప్పుడు ఆతని నీడ ఆతని అంత ఎత్తు ఉంటుంది. ఆతడు వంగినప్పుడు ఆతని నీడ సగమవుతుంది. ఆతడు ఆత్మార్పణ చేసుకొని ఆ పరబ్రహ్మం ముందు మోకరిల్లినప్పుడు, సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు నీడ అనేదే లేకుండా పోతుంది. కాన సాధకుడు ఆ విధంగా ద్వైతంనుండి విశిష్టాద్వైతానికి మరలుతున్నప్పుడు గ్రహించుకొని అద్వైతానికి అనుకూలంగా జీవితాన్ని కొనసాగించటానికి అలవరచుకోవాలి. అప్పుడు సాధకుడు బ్రహ్మంగానే జీవించగలుగుతాడు. సాధకునిలో అహంకారం అనేది సర్వం కరిగిపోవటంతో సాధకుడే బ్రహ్మంగా, బ్రహ్మమే సాధకుడుగా కనిపిస్తారు. సాధకుడు ఆ విధంగా జీవించగలిగిన నాడు ఆతనిలో మానవత్వం మూర్తీభవించి, చుట్టూ ఉన్న వారికి ఆదర్శవంతంగా కనిపిస్తాడు. ఆతని చుట్టూ ఉన్న వారు తాము కూడా ఆ విధంగా మారాలని భావించటానికి వీలుకుదురుతుంది. ఇక్కడ సాధకుడు గమనించవలసిన విషయం ఒక్కటుంది. అదేమిటంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడూ .ఒకేలా ఉన్నప్పటికీ, ఆత్మమార్గం తనకు నిబ్బరాన్ని, స్థైర్యాన్ని, నిర్భయత్వాన్ని, సత్యభావాన్ని, ధర్మనిరతిని, నీతి నైర్మల్యాన్ని చేకూర్చ గలిగిందని గ్రహించాలి. అవి అన్నీ కలిసి సాధకుని లక్ష్యానికి చేరువగా ఉండేటట్లు నిరంతరం సహకరిస్తుంటాయి. అటువంటి ఆత్మజ్ఞాని ప్రాపంచిక విషయాల్లో అందరిలా ప్రతిస్పందించడు. ఆతని ఇంద్రియాలు సంయమనంతో నడుస్తాయి. వాటి ప్రతిస్పందన శరీరానందానికి, ఇంద్రియానందా లకు కాక ఆత్మానందానికి అనుకూలంగా జరుగుతుంది. కావున మానవులు బ్రహ్మజ్ఞానాన్ని గురువునుంచి పొంది, మనస్సును నిగ్రహించటం నేర్చుకొని, మనస్సుకు తగిన శిక్షణనిస్తే సుఖశాంతులతో మనగలుగుతారు. ఆ విధంగా ఉన్నవాడు భూతకాలపు భూతంతోగాని, భవిష్యత్ కాలపు ఆకాశహర్మ్యాలతో గాని గడపకుండా వర్తమానంతోనే జీవించగలుగుతాడు. భూత కాలంలో జరిగిన అనుభవాల జ్ఞాపకాల సమూహమే నేను అనే అహంకారంగా నిలుస్తుంది. ఆ నేనులో భవిష్యత్కాలపు ఆశలు చోటు చేసుకొని వర్తమానంలో అహంకారంతో జీవించేటట్లు చేస్తుంటాయి. గతాన్ని, భవిష్యత్తుని సమాధిచేసి వర్తమానంతో ఉత్సాహంగా జీవించగలిగితే అహంకారాన్ని తుదముట్టించటానికి వీలవుతుంది. దాని కొరకు సాధకుడు ఆ పరబ్రహ్మానికి ఆత్మార్పణ చేసుకొంటే బ్రహ్మంగా నిలుస్తాడు. అప్పుడు సాధకుడు తనలో ఉన్న మహోత్తమమైన పరమ పదార్థం తన నిజస్వరూపమేనని అపరోక్షానుభూతినొంది పరిపూర్ణుడవుతాడు.
నీ కులం ఏమిటి అంటే మానవ కులం అని, నీ మతం ఏమిటి అంటే ఆత్మ మతమని, నీ జాతి ఏమిటి అంటే అద్వైత జాతి అని సాధకుడు జీవించ గలిగిన నాడు తాను బ్రహ్మ స్వరూపంగా సర్వకాల సర్వావస్థలలోనూ నిలవగలుగుతాడు.
🙏🙏🙏
సేకరణ
*ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి