.....
నిత్యము మంగళవాయిద్య ధ్వనులతో మారుమ్రోగే రాజభవనము నేడు ఏడుపులు పెడబొబ్బలతో దద్దరిల్లిపోతున్నది.
.
రాముడు భార్యా,సోదరసమేతుడై తల్లికౌసల్యకు ప్రదక్షిణము చేసి నమస్కరించి అదేవిధముగా తక్కిన మూడువందలయాభైమంది తల్లులవద్దకూడా అనుమతి తీసుకొని తాను ఇదివరకెన్నడైనా అపరాధములు తెలియక చేసి ఉంటే మన్నించమని ప్రార్ధించి తండ్రికి కూడా ప్రదక్షిణనమస్కారములాచరించి అక్కడే ఉన్న సుమిత్రామాత వద్దకు వచ్చినారు .
.
తనకు నమస్కరిస్తున్న తనకుమారుడు లక్ష్మణుని చూసి ,నాయనా భగవంతుడు నిన్ను వనవాసము కొరకే సృష్టించినట్లున్నది ! ఏమాత్రము ఏమరుపాటులేకుండా రాముడిని రక్షిస్తూ ఉండు. నాన్నా ఈ రాముడే నీకు దిక్కు అతను కష్టాలలో ఉండనీ ఐశ్వర్యవంతుడుగా ఉండనీ గాక.
నీ పెద్దన్నను నీవు ఎల్లప్పుడూ అనుసరించి ఉండు అది ధర్మము!.
.
నీ వొదిన సీతమ్మను కన్నతల్లి అనుకో
నీ అన్న రామయ్యను కన్నతండ్రి అనుకో
నీ వుండే అడవి ఉన్న ఊరు అయోధ్య అనుకో!
హాయిగా సుఖంగా వెళ్ళిరా నాన్నా! అని కొడుకు తలనిమురుతూ పలికింది సుమిత్ర !
.
రామం దశరధం విద్ధి మాంవిద్ధి జనకాత్మజామ్
అయోధ్యాం అటవీం విద్ధి గచ్ఛతాత యధాసుఖమ్.
.
రాముడు దశరధుడని,సీత నేనేనని,అడవే అయోధ్య అని భావించుతూ సుఖంగా వెళ్ళిరా నాయనా!
.
NB
.
సుమిత్రామాత నోట వాల్మీకి మహర్షి పలికించిన ఆ మాటలకు కొన్ని విశేష అర్ధములు చెప్పారు కొందరు వ్యాఖ్యాతలు.
రాముని...... దశరధమ్ అనగా పక్షి రధముగాగల విష్ణువుగాను సీతను ...మామ్ అనగా లక్ష్మీదేవిగానూ ,అడవిని ...అయోధ్యామ్ అ యోధ్యామ్ అనగా యుద్ధము చేయటానికి శక్యముగాని వైకుంఠము గా భావించుము అని వారివారి భావన!
రాముడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు .సీత లక్ష్మి ,
రాముడు నివసించే అడవి వైకుంఠము.
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి