Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 4 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
పూర్వకాలములో దక్షిణభారతదేశములో విశ్వామిత్ర గోత్రోద్భవుడైన గంభీర రాయలవారు ఉండేవారు. ఆయన భార్య పేరు కోనాంబ. వారు భాగ్యనగరములో ఉండేవారు. వారికి ఒక పిల్లవాడు జన్మించాడు ఆయనకు బాలభాస్కరరాయలు అని పేరు పెట్టారు. గంభీరరాయలవారు అమ్మవారి ఉపాసకులు అవడము వలన చిన్నతనములోనే వాగ్దేవతామంత్రమును ఆయనకు ఉపదేశము చేసారు. ఆ పిల్లవాడు మిక్కిలి భక్తిశ్రద్ధలతో అనుష్ఠానము చేసి అపారమైన వాగ్వైభవమును పొందాడు. వేద వేదాంగములను చదువుకుని మంచిజ్ఞాని అయ్యాడు. మంత్రశక్తి అనుభవైక్యవేద్యము తప్ప ప్రకటనలకు అందదు. గురుమండలరూపిణి అమ్మవారు నృసింహయజ్వ అన్న చక్కని గురువుని కూడా అందించింది. ఆయన దగ్గర విద్యాభ్యాసము చేసి అన్నివిద్యలు తెలుసుకున్నారు. ప్రకాశానందనాధ అన్న దీక్షా నామము కలిగిన శివదత్తశుక్ల అన్న ఒక మహాపురుషుడు దీక్షాస్వీకారము చేయించారు.
ఉత్తర భారతములో మహారాష్ట్రలో ఆయనకు ఎందరో శిష్యులు ఉండేవారు. ఆయన ఎప్పుడూ దక్షిణ భారతదేశములో కావేరీ వరకు ప్రయాణము చేస్తుండేవారు. ఆయన కర్ణాటక దేశములో కృష్ణానది ప్రవహిస్తున్న తీరములో సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యడానికి వెళ్ళారు. అప్పుడు విశేషమైన ఎండాకాలము. నదికి దూరముగా ఒక పర్ణశాల నిర్మించుకుని ప్రతిరోజూ నియమబద్ధముగా అర్ఘ్యప్రదానము చేస్తూ సూర్యుని ఉపాసన చేసేవారు. ఒక రోజు నదికి నడచి వెళ్ళి వచ్చి పడుకుని ఉండగా, శిష్యులు కాళ్ళు ఒత్తుతూ పాదముల వంక చూస్తే బొబ్బలు ఎక్కి ఉన్నాయి. వాళ్ళు గురువుగారు! పర్ణశాల నది ఒడ్డున వేసుకుందాము అంటే, ఆయన మన పర్ణశాల అక్కడ వేసుకుందామని అన్నారు కానీ, కృష్ణానదిని పర్ణశాల వద్దకు తీసుకుని వద్దామని ఎందుకు అనలేదు? మీరు బెంగ పెట్టుకున్నారు కనక రేపటి నుంచి నదికి వెళ్ళను. నదినే ఇక్కడకు పిలుస్తాను. అంటే శిష్యులు తెల్లపోయి అదేమిటి? నది పర్ణశాల వద్దకు ఎలా వస్తుందని అనలేదు. వారికి గురువుగారి మీద ఉన్న నమ్మకము అటువంటిది. ఉదయము లేచి సంధ్యావందనము చేసి సూర్యనారాయణమూర్తిని పిలిచారు. పిలిస్తే వచ్చి ఎదురుగా నిలబడి ఏమి కావాలి? అని అడిగితే భాస్కరరాయలవారు కృష్ణానదిని దారి మళ్ళించి ఇటు పంపు అన్నారు. సూర్యనారాయణమూర్తి సృష్టి ప్రారంభములో నదీనదములు ఎలా ప్రవహించాలన్నది చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయము చేస్తారు. అవి అలాగే వెడతాయి దారి మళ్ళించడము మహాపాపము నేను ఆ పనిని చేయనని చెప్పాడు. భాస్కరరాయలవారు వెంటనే నేను ఉపాసన చేసి పిలిస్తే వచ్చి నిలబడి నా కోరిక తీర్చకపోతే, లోకములో నీకు ఆరాధన లేకుండా నిన్ను శపించి నీ ఉపాసనా శాస్త్రములన్నిటినీ కూడా నశించి పోయేట్టుగా చేస్తాను అన్నారు. ఇదీ భక్తుల గొప్పదనము. సనాతనధర్మ వైభవము. లోకములంతటికీ వెలుగు ఇచ్చే సూర్యనారాయణమూర్తికి చెమటలు పోసి భాస్కరరాయలవారి వంక చూసి తప్పకుండా కృష్ణానదిని దారి మళ్ళిస్తాను. కానీ అది శాశ్వతముగా అలా ఉండకూడదు. మీరు శరీరముతో ఉన్నంత కాలము నది మీ పర్ణశాల ముందునుంచి వెడుతుంది.లోకములో ఎవరైనా శరీరము వదిలి పెట్టవలసిందే. మీరు శరీరము వదిలిన తరవాత నది యథాప్రకారముగా ప్రవహిస్తుంది అని అనుమతి ఇచ్చాడు.
లలితాసహస్ర నామ స్తోత్రమునకు వ్యాఖ్యానము వ్రాసే విషయములో లోకములో ఒక చిత్రమైన విషయము ప్రచారములో ఉన్నది. భాస్కరరాయలవారికి ఎవరి దగ్గరో కొంత బాకీ ఉండేదనీ అమ్మవారే ఆయన్ని స్తోత్రమునకు వ్యాఖ్యానము వ్రాయమని నిర్దేశిస్తే ‘అమ్మా ! ఋణగ్రస్తుడు అయినవాడు వ్యాఖ్యానము ఎలా చేస్తాడని నాకు ఋణము ఉన్నదని అన్నారని – మరునాడు సంధ్యావందనము చేసుకోవడానికి వారు వెళ్ళి వచ్చేప్పటికి అమ్మవారు ఋణము తీర్చేసి ఆ రాసిచ్చిన కాగితములు అక్కడ పెట్టేసిందని అప్పుడు స్తోత్ర వ్యాఖ్యానము ప్రారంభము చేసారని చెపుతారు.
https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి