గుణత్రయవిభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - తాను సాక్షాత్ పరబ్రహ్మమేయని శ్రీకృష్ణమూర్తి తెలుపుచున్నారు -
బ్రహ్మణో హి ప్రతిష్ఠాఽహం అమృతస్యావ్యయస్య చ |
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ ||
తాత్పర్యము:- ఏలయనగా, నేను నాశరహితమును, నిర్వికారమును, శాశ్వత ధర్మస్వరూపమును, (దుఃఖమిశ్రితముకాని) నిరతిశయ (అచంచల) ఆనందస్వరూపమును అగుబ్రహ్మమునకు ఆశ్రయమును (అనగా బ్రహ్మముయొక్క స్వరూపమును) అయియున్నాను.
వ్యాఖ్య:- 'అచంచల భక్తితో నన్ను సేవించువాడు త్రిగుణములను దాటి బ్రహ్మమును బొందు’నని పైశ్లోకమునందు శ్రీకృష్ణమూర్తి తెలియజేసి, తాను వాస్తవముగ నెవరో తన యథార్థస్వరూపమెట్టిదో ఈశ్లోకమున వెనువెంటనే విశదీకరించుచున్నారు. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాడు. సాక్షాత్ పరమాత్మయే, పరబ్రహ్మమే. ఆ సత్యమే యిచట తెలియజేయబడినది. ఆతడు యశోదాతనయుడు మాత్రమేకాదు; నాశరహితమై, శాశ్వతధర్మస్వరూపమై, నిరతిశయ ఆనందరూపమైనట్టి బ్రహ్మమే తానని శ్రీకృష్ణమూర్తి తెలియజేసిరి. ఇక్కారణమున వారిని అచంచలభక్తితో ధ్యానించువారు భ్రమరకీటకన్యాయము ననుసరించి వారియందే అనగా బ్రహ్మమునందే లయించి బ్రహ్మస్వరూపులే యగుదురు. ధ్యాత ధ్యేయాకారముగనే పరిణమించును. ఆ పరబ్రహ్మముయొక్క స్వరూపమెట్టిదో ఇచట విశదముగ తెలుపబడినది. అది (1) అమృతము, అవ్యయము - అనగా మరణరహితమైనది, వికారవర్జితమైనది - ఈ పదములద్వారా బ్రహ్మముయొక్క 'సత్' అంశము నిరూపితమైనది. మఱియు అది (2) శాశ్వత ధర్మస్వరూపము - ఈ పదముద్వారా బ్రహ్మముయొక్క ‘చిత్' అంశము నిరూపింపబడినది. (3) నిరతిశయానందరూపము - ఈ పదముద్వారా ‘ఆనంద’ అంశము నిరూపితమైనది. ఈ ప్రకారముగ సత్, చిత్, ఆనందమగు పరబ్రహ్మమే తానని శ్రీకృష్ణభగవానుడు తెలియజేసిరి. ఉపాసనాసౌలభ్యముకొఱకు ప్రారంభమున శ్రీకృష్ణుని యశోదాతనయుని రూపమునను, శ్రీరాముని కౌసల్యాతనయుని రూపమునను ధ్యానించినను, వాస్తవముగ వారిరువురును, నిర్గుణ, నిరాకార, సచ్చిదానంద పరబ్రహ్మరూపులేయని ఎప్పటికైనను తెలిసికొనవలసి యుండును. ఈ శ్లోకముచే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతముల మూడిటియొక్క లక్ష్యము యథార్థముగ ఒకటేయగుచున్నదని స్పష్టమగుచున్నది. ఏలయనిన ద్వైత, విశిష్టాద్వైతులు ఏ భగవద్రూపమును అర్చించుచున్నారో ఆ రూపము వాస్తవముగ సచ్చిదానందమే అయియున్నదని ఇట తేలిపోయినది. భక్తియోగము, జ్ఞానయోగము ఈ శ్లోకమున పరస్పరము కౌగిలించుకొనుచున్నవి. కావున ఇక ఆయా సంప్రదాయములవారు పరస్పరము విమర్శించుకొనక అందఱు ధ్యానించునది ఒకే పరబ్రహ్మమనియే నిశ్చయించి వారి వారి సంస్కారమున కనుగుణ్యమైన ఉపాసనాపద్ధతిని, ధ్యేయాకారమును ఏర్పాటుచేసికొని కట్టకడకు అందఱును ఆ పరబ్రహ్మమునే చేరవచ్చును.
ప్రశ్న:- శ్రీకృష్ణమూర్తి వాస్తవముగ నెట్టివారు?
ఉత్తరము:- పరబ్రహ్మస్వరూపుడు.
ప్రశ్న:- పరబ్రహ్మమెట్టిది?
ఉత్తరము:- (1) నాశరహితమైనది, నిర్వికారమైనది (సత్) (2) శాశ్వతధర్మస్వరూపమైనది (చిత్) (3) నిరతిశయ ఆనందరూపమైనది (ఆనందము).
ఓమ్
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే గుణత్రయవిభాగయోగోనామ
చతుర్దశోఽధ్యాయః
ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును,
శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు గుణత్రయ విభాగయోగమను
పదునాల్గవ అధ్యాయము
ఓమ్ తత్ సత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి