21, సెప్టెంబర్ 2020, సోమవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

వేదన..స్వాంతన..


"స్వామివారి మందిరానికి రావాలని అనుకుంటున్నాము..ఎలా రావాలో తెలుపుతారా?.." అంటూ చెన్నై నుంచి మధుసూదనరావు గారు అడిగారు..ఆయన వయసు డెబ్భై ఏళ్ళు..రైల్లో ఎక్కడ దిగాలో చెప్పి..అక్కడనుంచి మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి ఆశ్రమానికి బస్ లో రావడానికి మార్గాన్ని వివరంగా తెలిపాను..ఆ తరువాత శని ఆదివారాల్లో మందిరానికి వస్తానని చెప్పారు..అనుకున్న ప్రకారమే మధుసూదనరావు గారు శనివారం ఉదయం తొమ్మిదిన్నర కల్లా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..గది కి వెళ్లి, స్నానాదికాలు ముగించుకొని, మందిరం లోకి వచ్చి..శ్రీ స్వామివారి విగ్రహానికి నమస్కారం చేసుకొని...నావద్దకు వచ్చి.."ఇక్కడికి మాలకొండ దగ్గరే కదా..అక్కడికి వెళ్ళడానికి ఆటో లు ఉన్నాయా?.." అన్నారు..ఒక గంట ఆగితే బస్ వస్తుందని..అందులో వెళ్ళమని సలహా ఇచ్చాను..సరే అన్నారు..మాలకొండకు వెళ్లి, శ్రీ లక్ష్మీ నరసింహుడి దర్శనం చేసుకొని సాయంత్రానికి తిరిగి మందిరానికి వచ్చారు..


ఆరోజు సాయంత్రం పల్లకీ సేవ వద్ద పూజ చేయించుకొని..తిరిగి నా వద్దకు వచ్చి.."ప్రతి శనివారం నాడు ఇంతమంది భక్తులు ఉంటారా?..వీళ్ళందరికీ అన్నదానం చేస్తున్నారా?.."అన్నారు..అవును అన్నాను..ఓ ఐదు నిమిషాల పాటు మౌనంగా వున్నారు..ఆ తరువాత.."శనివారం నాటి సాయంత్రం అన్నదానం చేయించడానికి సుమారుగా ఖర్చు చెప్పండి..వచ్చే వారానికి నేను భరిస్తాను.." అన్నారు..వివరంగా చెప్పాను..అంతా విని.."బాబూ..నేను రేపు సాయంత్రం తిరిగి చెన్నై వెళ్లాలని టికెట్ బుక్ చేసుకున్నాను..కానీ ఇందాకటి నుంచీ ఈ కోలాహలం చూసిన తరువాత..ఈ వారమంతా ఇక్కడే వుండి.. స్వామివారి సేవ చేసుకొని..శనివారం నాడు అన్నదానం చేసి..ఆదివారం నాటి సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను..నాకు కేటాయించిన గదిని ఈ వారమంతా నాకే ఉంచండి.."అన్నారు..సరే అన్నాను..


ఆరోజు గడిచిపోయింది..ప్రక్కరోజు ఆదివారం ఉదయం ప్రభాత పూజ, సమాధికి అభిషేకం, విశేష హారతులు అన్నీ దగ్గరుండి చూసారు..మధ్యాహ్నం అన్నదాన సత్రానికి వెళ్లి భోజనం చేసి వచ్చారు..

"నువ్వు నాకన్నా చిన్నవాడివి..బాబూ అని ఏకవచనం తో పిలుస్తున్నాను.. ఏమీ అనుకోకు..నీతో కొంచెం సేపు మాట్లాడాలి.." అన్నారు..దగ్గరకు జరిగి కూర్చున్నాను..


"నాకు ఇద్దరు కుమారులు..ఇద్దరూ ఇంజినీర్లే.. పెద్దవాడికి వివాహం చేసాను..రెండో వాడికి సంబంధాలు చూస్తున్నాము..పోయిన సంవత్సరం చాలా గడ్డుకాలం నా జీవితం లో..నలభై ఐదు ఏళ్ల పాటు నాతో సంసారం చేసిన నా భార్యకు కాన్సర్ సోకి..మేము గ్రహించేసరికి ఆలస్యం జరిగి..ఆవిడ కాలం చేసింది..బాగా కృంగిపోయాను..ఈ వయసులో తోడు లేకుండా పోయింది..మరో మూడు నెలలు గడిచేసరికి.. రెండో వాడు ప్రమాదంలో చనిపోయాడు..దెబ్బ మీద దెబ్బ..పెద్ద కొడుకు వద్ద ఉంటున్నాను..మానసికంగా కోలుకోలేని పరిస్థితి..ఒంటరితనం పీడించసాగింది.. మా కాలనీకి దగ్గరగా ఉన్న గుడికి వెళ్ళసాగాను.. అక్కడ సత్సంగం లో ఈ స్వామివారి గురించి..ఈ మందిరం గురించి విన్నాను..ఎందుకో తెలీదు..ఒక్కసారి వెళ్లి చూసిరావాలని బలంగా అనిపించింది..ఆలస్యం చేయకుండా వచ్చాను..ఇన్ని రోజుల తరువాత ఈరోజు నాకు మనసు ప్రశాంతంగా ఉంది..ఒక వారం పాటు ఇక్కడే వుంటాను..నువ్వు కాస్త సహకరించాలి.." అన్నారు...చాలా బాధగా అనిపించింది.."సరే..వారం పాటు వుండండి..భోజనం ఏర్పాటు కూడావుంది.." అని చెప్పాను..


ఆ వారం లో సోమవారం నుండీ శుక్రవారం వరకూ శ్రీ స్వామివారి మందిర మంటపం లో ఎక్కువ సేపు ధ్యానం చేసుకుంటూ వున్నారు మధుసూదనరావు గారు..శనివారం సాయంత్రం పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆరాత్రి అన్నదానం వద్ద తాను కూడా పాల్గొని..వడ్డన కూడా చేశారు..ఆదివారం నాడు శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, నమస్కారం చేసుకొని వచ్చారు..


"బాబూ..మళ్లీ కొన్నాళ్ళు ఆగి వస్తాను..ఇక్కడ నా మనసుకు స్వాంతన దొరికింది..నైరాశ్యం తొలిగింది..తప్పకుండా మళ్లీ వస్తాను..అక్కడికి వెళ్లిన తరువాత కూడా ఊరికే కూర్చోకుండా..నాకు చేతనైన సేవ చేస్తాను..సాటివాళ్లకు సేవ చేస్తే, నీ మనోవేదన తీరుతుంది అని శ్రీ స్వామివారు ఆదేశించినట్లు అనిపించింది.. అంతా ఈ స్వామివారి దయ!.." అన్నారు..ఈ వయసులో మధుసూదనరావు గారికి ఏది ముఖ్యమో దానినే స్వామివారు అనుగ్రహించారు..వారి సమస్యకు ఉపయుక్తమైన పరిష్కారం చూపారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: