16, జులై 2021, శుక్రవారం

అల్లసాని పెద్దన -- కవితా కుసుమాల పరిమళం

మన తెలుగు సాహిత్యంలో కొన్ని పద్యాలూ చిరస్మరణీయాలుగా మిగిలి పోయాయి అందులో పెద్దన వారి 30 పాదాల ఉత్పల మాలిక మనకు తెలుసు ఉత్పల మాల పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.  కానీ నాలుగు కన్నా ఎక్కువ పాదాలు వున్నా దానిని మాలిక అంటారు. కవిత్వం మీద కవిత్వం చెప్పటమే గొప్ప అంటే సభాసదికులందరిని రాజు రాయాలను మెప్పించి రాయలు చేత రాయలుగా (ఆంగ్ల పదం) గండపెండేరం దక్షణగా దక్షణ పాదానికి తొడిగించుకున్న అల్లసాని పెద్దన్న నిజంగా మేటి కవి. 

కవిత యెట్లా ఉంటే మంచిగా ఉంటుంది అని ఒకపరి నేను అలోచించి ఈ క్రింది కవిత చెప్పను 


మనసు పరవళ్లు త్రొక్కవలెను 

హృదయ మానంద డోలికల నుగవలెను 

బుద్ది పరిపక్వత చెంది వికసింపవలెను 

కవిత లల్లిన నీ రీతిగ నుండవలెను భార్గవ 


నా దృష్టిలో కవిత రసజ్ఞుల మనస్సుకు ఉత్సాహాన్ని కలిగించాలి, హృదయానికి ఆనందం కలిగించాలి బుద్దివికసించాలి అని నా భావన పెద్దన గారి కవితా ఝరి నా భావనకు వెయ్యి రేట్ల సుందర మనోహరంగా శ్రవణానంద కరంగా మధురంగా రసజ్ఞుల హృదయాలను దోచే విధంగా ఉన్నదనటానికి ఏ మాత్రము సందేహం లేదు. 


అల్లసాని పెద్దన కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో మొట్టమొదటి వాడు. చొక్కయామాత్యుని పుత్రుడు. ఆంధ్రకవితాపితామహుడు. ఒక రోజు కృష్ణ దేవరాయల వారు ఒక బంగరు పళ్ళెం తెచ్చి దానిలో గండ పెండేరాన్ని ఉంచి ఆస్థాన కవులను జూచి "మీలో ఎవరైనా సంస్కృతాంధ్ర భాషలలో సమానంగా కవిత్వం చెప్పిన యెడల వారికి గండ పెండేరం యిస్తాను" అని చెప్పారు. ఎవ్వరూ ముందుకు రాలేదుఅప్పుడు కృష్ణ దేవరాయల వారు

 

:   ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగా

నొద్దిక నాకోసంగు మనియొక్కరు గోరగలేరు లేరొకో

 

అనే పద్యం ప్రారంభించారుఅల్లసాని వారు లేచి పద్యాన్ని

 

పెద్దన బోలుపండితులు పృథ్విని లేరని నీవెఱుంగవే

పెద్దన కీ దలంచినను పేర్మిని నాకిడు కృష్ణ రాణృపా

 

అని పూరించారు. పైన ముప్పది పాదాల ఉత్పలమాలికను సగం పాదాలు అచ్చ తెన్గులో సగం సంస్కృతంలో  ఆశువుగా చెప్పారు. ఇక్కడ మనం గ్రహించ వలసింది ఏమిటంటే అన్ని పాదాలలో ప్రాస ఉండాలి, ఎతిభంగం కాకూడదు.  అంత పెద్ద పద్య మల్లికను రాయలు అడిగిన వెను వెంటనే ఆశువుగా చెప్పగలగటం సామాన్యులకు ఎట్టి పరిస్థితుల్లో సాద్య పడదు.  అది ఆతులుండ ఇందు సగం అచ్చతెలుగులో మరియు మిగిలిన సాగ భాగం సంస్కృతంలో చెప్పటం. అల్లసాని పెద్దన గారి మేధస్సు యెంత గొప్పదో ఆలోచించండి. 


ఇక ఆలకించండి ఆ పద్య మాలిక్ సొగసుని 


:   పూత మెఱుంగులుం బసరు పూప బెడంగులు జూపునట్టి వా

కైతలు? జగ్గు నిగ్గు నెనగావలె గమ్మన గమ్మనన్వలెన్

రాతిరియున్ బవల్ మఱపురానిహొయల్ చెలి యారజంపు ని

ద్దాతరితీపులో యనగ దారసిలన్వలె లో దలంచినన్

బాతిగ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ

కూత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్

జేతికొలంది గౌగిటనుజేర్చినకన్నియ చిన్నిపొన్ని మే

ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె బట్టి జూచినన్

డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ

వాతెఱ దొండపండువలె వాచవిగావలె బంటనూదినన్

గాతల దమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు

న్మే తెలియబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగబ్బిగుబ్బపొం

బూతలనున్నకాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం

గాతపు సన్నతంతి బయకారపు గన్నడగౌళపంతుకా

సాతతతానతానలపసన్ దివుటాడెడు గోటమీటుబల్

మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చ తెన్గు లీ

రీతిగ, సంస్కృతంబు పచరించెడుపట్టున భారతీవధూ

టీతపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ

భౌతికనాటక ప్రకరభారతభారతసమ్మతప్రభా

శీత నగాత్మజా గిరిజ శేఖర శీతమయూఖ రేఖికా

పాతసుధా ప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ

జాతకతాళయుగ్మ లయసంగతి చుంచువిపంచికామృదం

గాతతతేహితత్తహితహాధితధంధణుధాణుధింధిమి

వ్రాతనయానుకూలపదవారకుహూద్వహహారికింకిణీ

నూతన ఘల్ఘలాచరణనూపురఝాళఝళీమరందసం

ఘాతవియధ్ధునీ చకచకద్వికచోత్పలసారసంగ్రహా

యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై

చేతము చల్లజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర

ద్యోతకగోస్తనీఫలమధుద్రవగోఘృతపాయస ప్రసా

రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్

 

విధంగా పెద్దన గారు చెప్పిన మరు క్షణమే రాయల వారు ఆంధ్ర కవితా పితామహుడైన పెద్దన గారి వామ పాదానికి గండ పెండేరాన్ని తొడిగారు.

మన తెలుగులో అటువంటి కవి పండిత శ్రేష్ఠులు  ఉండటం మన అదృష్టం.  వారి కవితా కుసుమాల పరిమళం ఆస్వాదించటం మినహా మనం యెంత వరకు వారి స్థాయిని చేరగలం అనేది సందేహాత్మకమే తప్ప వేరు కాదు. 


ఇట్లు 

సుజన విధేయుడు 

భార్గవ శర్మ 

 



కామెంట్‌లు లేవు: