*✍.... నేటి చిట్టికథ*
ఓ దొంగ ఓ రోజు పట్టపగలు రాజభవనంలో కాపలాదారుల కళ్ళు కప్పి దొంగతనం చేసేడు.
ఏదో అలికిడి అయి అప్రమత్తమైన కాపలాదార్లు పారిపోతున్న దొంగను చూసి వెంబడించేరు.
ఆ దొంగ పరిగెడుతూ ఇక వాళ్ళ నుండి తప్పించుకోవడం కష్టమని తెలిసి ఆ దొంగిలించిన సొత్తును వాళ్ళ కంట పడకుండా విసిరేసి పోతూ ఊరి చివర స్మశానంలో ఉన్న బూడిదను వంటి నిండా పూసుకుని ఓ చెట్టుక్రింద సాధువేషంలో కూర్చున్నాడు.
రాజభటులు వచ్చి దొంగ ఎక్కడా కనబడక పోయేసరికి తప్పించుకుని పారిపోయి ఉంటాడని అనుకుని అక్కడ చెట్టు క్రింద ఉన్న సాధువును చూసి ధ్యానమగ్నుడై ఉన్నాడని తలచి అతనికి మ్రొక్కేరు.
ఈ వార్త ఊరంతా ప్రాకి ఊరిబయట ఓ సాధు పుంగవుడు ఉన్నాడని తెలిసి జనం అంతా తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని మ్రొక్కుతూ ఫలపుష్పాదులు సమర్పించుకోసాగేరు.
అప్పుడా దొంగ .. “ఆహా..! నేను సాధువు వేషంలో ఉంటేనే ప్రజలు నన్ను ఇంతగా ఆరాధిస్తున్నారు. అలాంటిది నేను నిజంగా సాధువునైతే భగవంతుడి కృప నాకు లభిస్తుంది.” అని అనుకుని ఆ నాటినుండీ ఆ దొంగ నిజమైన సాధువుగా మారిపోయేడు.
చూసేరా..! వేషధారణ ఎంత మార్పు తీసుకువచ్చిందో. జీవన వాసనా ప్రభావం అటువంటిది.....
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
అందుకే..శంకర భగవత్పాదులు తమ భజగోవిందం లో ఇలా అంటున్నారు....
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలత్వం
నిశ్చలతత్త్వై జీవన్ముక్తిః
సత్సాంగత్యం వల్ల అసంగత్వం ఏర్పడి మోహం, భ్రాంతి తొలగిపోతాయి. అప్పుడే మనసు నిశ్చలమై ముక్తి లభిస్తుంది.
భగవశ్చింతనవల్ల సద్భక్తుల సహవాసం లభించింది. ఆ సహవాసం ముక్తికి సోపానమై, జన్మ చరితార్ధమవుతుంది. సత్కర్మాచరణ, సత్యనిష్ఠ, సాధుసత్పురుషుల సాంగత్యం వల్ల మోహం నశించి ఆత్మ నిరంతరం చైతన్యాత్మలో సంగమిస్తుంది. పెడదారి పట్టిన మనస్సును సరిదిద్దే గొప్ప అవకాశం సత్సంగత్వం. సత్సాంగత్వం వల్ల మోహం, భ్రాంతి నశిస్తాయి. మనస్సు నిర్మోహమై, నిశ్చలమవుతుంది. అంతఃకరణ శుద్ధమై, పరమాత్మకు నిలయమవుతుంది. అప్పుడే జీవన్ముక్తి.
ఇనుముకు మట్టి అంటితే తుప్పు పడుతుంది. అదే ఇనుము నిప్పులలో కాలిస్తే తిరిగి మెరుస్తుంది. సత్ సహవాసం నిప్పులాంటిది. మనలోని మాలిన్యాలను ప్రక్షాళనం చేసి మనస్సును, చిత్తాన్ని, అంతరంగాన్ని పరిశుద్ధం చేస్తుంది. క్రమేపి ఆత్మతత్త్వాన్ని అర్ధం చేసుకొని, అద్వైతానందానుభూతిని పొందవచ్చు.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి